top of page

అశ్వ మేధం ఎపిసోడ్ 7


Written By Gannavarapu Narasimha Murthy

'అశ్వ మేధం - ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ..

చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది.


ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.


సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.


చరణ్ ఉన్న ఊరు వస్తుంది సౌదామిని. చరణ్ ఇంట్లో విహారి ఫోటో చూస్తుంది. అతడు తన స్నేహితురాలు దీపను మోసం చేసాడని చెబుతుంది.


విహరితో తన పరిచయం గురించి సౌదామినికి వివరిస్తాడు.

ఆమె ఊరికి వెళ్ళాక విహారి దగ్గరకు వెళతాడు. అతని కోరికపై బాక్సయిట్ తవ్వకాలు నిలిపివేయాలని కోర్టులో కేస్ వేస్తాడు చరణ్. తవ్వకాలు తాత్కాలికంగా ఆగుతాయి.


సౌదామినిని తాను పనిచేసే కంపెనీ లో చేరమంటాడు చరణ్. అలాగే చేరుతుంది సౌదామిని.


జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీని ఎవరో హత్య చేస్తారు.

ఆ సంఘటనను చూసిన దీప ను కూడా చంపాలని ప్రయత్నిస్తారు.


ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 7 చదవండి..


పదిరోజులు గడిచాయి. ఒకరోజు ఉదయాన్నే ఊళ్లో ఉన్నపుడు విహారి, దీప, సౌదామిని ముగ్గురు వశిష్ఠపురం వచ్చారు.

సౌదామిని ముందుగా చెప్పడం వల్లనో ఏమో దీపకు ఆ ఊరు బాగా నచ్చింది. కొండపక్కన ఏరు, పచ్చటి పొలాలు, ఆ ఇంటి డాబా, కొబ్బరిచెట్లు, వెన్నెల, పొలంలో బోరింగ్ షెడ్డు, చెరువు.. ఇలా అన్ని రెండు రోజులు సౌదామిని ఆమెకు చూపించింది.


ఆ రోజు రాత్రి డాబామీద నలుగురు మాట్లాడు కుంటున్నప్పుడు చరణ్ సౌదామిని తో ఆర్టు గేలరీ గురించి అడిగాడు. సౌదామిని చిత్రకారిణి; అప్పుడప్పుడు బొమ్మలు గీస్తుంటుంది ; ఢిల్లీలో జరిగే ఆర్టు గేలరీలో ఆ బొమ్మలను ప్రదర్శిస్తుంది. వచ్చే నెలలో ఆమె బొమ్మలు విజ్ఞాన్ భవన్ లో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు అవకాశం వచ్చింది.


"కనీసం 15 చిత్రాలు ప్రదర్శనకి పెట్టాలి. ఇంకా నాలుగు చిత్రాలు తుదిదశలో ఉన్నాయి” అంది సౌదామిని.


"ఓహో! సౌదామిని గారు కూడా బొమ్మలు గీస్తారా? దీప మంచి చిత్రకారిణి. ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో ఆమె చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. అపుడప్పుడు హిందూలో కూడా వస్తుంటాయి” అన్నాడు విహారి.


“దీప గారూ! అయితే ఈసారి నేను తప్పక మీ ఎగ్జిబిషన్కి వస్తాను.. ఎన్నేళ్ళ నుంచి మీరు గీస్తున్నారు?” అని అడిగింది సౌదామిని.


ఇంతలో సడెన్ గా చరణ్ “దీపగారూ! మీరు హంతకులను దగ్గరగా చూసానన్నారు కదా! వాళ్ళ చిత్రాలు గీయకూడదూ; ఆ తరువాత వారి కోసం ప్రయత్నించవచ్చు" అన్నాడు.


"చాలా మంచి ఆలోచన మీది. తప్పకుండా ప్రయత్నిస్తాను” అంది దీప..


"విహారి! ఈసారి కోర్టుగానీ స్టేయిస్తే మన పని సులువవుతుంది. ఈ హత్యకేసులో నిజాలు తెలిస్తే, శాశ్వతంగా ఈ గనుల్ని మూయించవచ్చు ; అందుకనీ ఈ రాఘవన్ కేసు మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. దీప గారి సాక్ష్యం ఇందులో చాలా కీలకం. ఆసలు ఆ వ్యక్తుల్ని పట్టుకుంటే కేసుకి ఓ పెద్ద మలుపవుతుంది. ” అన్నాడు చరణ్.

ఆమర్నాడే దీప, విహారి వెళ్ళిపోయారు.

నాలుగురోజుల తరువాత దీప ఫోన్చేసి చరణ్ ని హాస్టల్ కి రమ్మంది. సౌదామిని తో కలిసి అతను యూనివర్సిటీ హాస్టలు కి వెళ్ళాడు. ఉదయం 11 గంటలు కావడంతో హాస్టల్ అంతా ఖాళీగా ఉంది. వాళ్ళిద్దర్నీ చూడగానే దీప బయటకువచ్చి తన రూమ్ లోనికి తీసికెళ్ళి ఇద్దరికీ కాఫీ లిచ్చింది. కొద్దిసేపటి తరువాత స్టేండుపై ఉన్న రెండు చిత్రాలను తీసి చరణ్ కి చూపించింది. ఆచిత్రాలు రంగులతో బాగా గీయబడ్డాయి.


వాటిని కాసేపు పరిశీలించి సౌదామిని కిచ్చాడు చరణ్ ; సౌదామిని వాటిని తన మొబైల్ కెమెరాలతో స్కాన్ చేసింది.


“దీపగారూ! మీ మేధో సంపత్తికి జోహారు.. కొద్దిక్షణాలు అది కూడా ఒక భయానికమైన దృశ్యాన్ని చూసే క్షణాలు.. ఆ సమయంలో చూసిన ఇద్దర్నీ మెదడులో నిక్షిప్తం చేసుకొని అదీ 20 రోజుల తరువాత వాళ్ళని చిత్రీకరించడం అన్నది చాలా గొప్పపని.. మనం ఈఫోటోల్ని పోలీసులకిచ్చి వీళ్లెవరో కూపీలాగుదాం.. అపుడు ఈకేసులో అసలు వ్యక్తులు బయటకు వస్తారు. ” అన్నాడు చరణ్.

ఆ మర్నాడు దీప, సౌదామిని తో కలిసి మొదట కంప్లెంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు చరణ్. రాజారాం గారు అదృష్టవశాత్తూ అక్కడే వున్నారు. కొద్ది సేపు కేసు విషయాలు మాట్లాడిన తరువాత దీప గీసిన అనుమానితుల చిత్రాలను అతనికి చూపించాడు.


“సార్! దీప ఆరోజు ఆ హంతకుల్ని దగ్గరగా చూసింది. కాబట్టి వాళ్ళ రూపాలను నిక్షిప్తం చేసుకొనీ చాలా కష్టపడి గీసిన చిత్రాలు.. వీటిని చూస్తే బహుశా మీకు వాళ్లని గుర్తుపట్టే అవకాశం ఉంటుందనుకుంటాను; ” అన్నాడు చరణ్.


అతను ఆచిత్రాలను రెండు మూడు సార్లు నిశితంగా పరిశీలించి తన కెదురుగా ఉన్న కంప్యూటర్ని ఓపెన్ చేసాడు. అందులో చాలా మంది క్రిమినల్స్ ఫోటోలతో వాటిని సరిపోల్చి చూసాడు.


చాలా సేపు అలా చూసిన తరువాత "చరణ్! ఈ ఫోటోలు మాదగ్గర ఉన్న క్రిమినల్స్ ఫోటోలతో సరిపోలటం లేదు.. బహుశా వీళ్ళు అంతర్రాష్ట్ర క్రిమినల్స్ అయి ఉంటారు. ఈకేసులో ఇప్పటికి నేను చాలా మందిని విచారించాను. అనుమానితులను అరెస్ట్ కూడా చేసాను. అయినా ఇంటరాగేషన్లో వాళ్ళకెవరికీ ఈ కేసులో సంబంధంలేదు. అందుకే కోర్టులో ఎఫ్. ఐ. ఆర్. దాఖలు చేయలేకపోతున్నాము. మీరు ఓపని చెయ్యండి. నేను మీకొక నెంబరు ఇస్తాను. అతను మా డేటా ఎంట్రీ ఆపరేటర్.


అతను కూడా ఒక ఎస్సై! పేరు బలరాం.. అతను క్రిమినల్స్ యొక్క వేలి ముద్రలు, ముఖం, అనుమానం ఉన్న ఏదిచ్చినా వాళ్ళ వివరాలు మీకు చెప్పగలడు. వీలైతే రేపు నేను కూడా వస్తాను. కానీ ఈచిత్రాలు ఇంకెవరికీ చూపకండి. చాలా గోప్యంగా ఉంచాలి. ఇవి కేసులో చాలా కీలకం కావచ్చు" అన్నాడు.


"సార్! రాఘవన్ గారి పోస్టుమార్టెమ్ రిపోర్ట్ వచ్చిందా?” అడిగాడు చరణ్.


“వచ్చింది చరణ్! దాంట్లో అతను కత్తిపోట్ల వల్లే చనిపోయాడనీ, రోడ్డు ప్రమాదం వల్ల కాదనీ డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అందుకే ఆ క్రిమినల్స్ కోసం వెతుకుతున్నాం. ఆరోజు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా పనిచెయ్యలేదు. లేకపోతే ఈపాటికి వాళ్ళని పట్టుకునే వాళ్ళం; ” అన్నాడు. ఆతరువాత వాళ్ళు హాస్టలుకి వచ్చేసారు.


ఆ మర్నాడు బలరాం దగ్గరికి దీపని తీసుకొని వెళ్లాడు చరణ్. బలరాం అప్పటికే తన పని మొదలు పెట్టాడు.


"సార్! రాజారాం గారు చెప్పారు. ఈ చిత్రాలు ఎవరు గీసారు?” అని అడిగాడతను.


"ఈవిడే; మిస్ దీప " అంటూ దీపని పరిచయం చేసాడు చరణ్.


మేడం.. మీరు వీళ్ళని దగ్గరగా చూసారా? " అని అడిగాడు బలరాం.

“చూసాను.. అప్పుడు నేను ఆటోలో ఉన్నాను. నా ఆటోని చూసే వాళ్ళు అతన్ని పొడిచిన వెంటనే పారిపోయారు” అంది దీప..


"మేడం.. మీరు ఇటొచ్చి ఈకంప్యూటర్లో ఉన్న వాళ్ళ ఫోటోలు చూడండి. వీళ్లు వివిధ రాష్ట్రల్లోని ఇటువంటి హత్యలకు పాల్పడేవాళ్ళు. వీళ్ళలో ఎవరైనా మీరు చూసిన వాళ్ళలో ఉన్నారా పోలిస్తే చెప్పండి” అన్నాడు.


ఆమె వెంటనే అటువైపు వెళ్ళి స్టూల్ మీద కూర్చొని మౌస్ ని స్క్రోల్ చేస్తూ ఓపదిహేను నిముషాలపాటు అందులో ఉన్న సుమారు 300 మందిని చూసింది. మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయి మళ్లీ చూసింది. ఓపది హేను నిముషాల తరువాత ఓరెండు ఫోటోలను అతనికి చూపించి 'వీళ్ళే' అంది.


అతను కూడా తాను సెలెక్ట్ చేసిన వాటితో పోల్చి చూసి నా అంచనా మీ అంచనా ఒక్కటే.. వీళ్లే.. వీళ్ళు బీహారుకి చెందిన ఠాకూర్ గ్యాంగ్ క్రిమినల్స్! ఒకడు విక్రంసింగ్.. ఇంకొకడు 'రాంసింగ్; నేను రాజారాం గారికి ఈవివరాలు పంపిస్తాను. మీరెళ్ళండి" అన్నాడతను.

చరణ్ అతనికి థ్యాంక్స్ చెప్పి అతను చెప్పిన వివరాలు నోట్ చేసుకొని బయటికి వచ్చాడు. అతని వెనకే దీప కూడా బయలుదేరింది.


కొంచెం దూరం వెళ్లినతరువాత బలరాం బయటకు వచ్చి “చరణ్ గారూ! ఒక్క క్షణం” అంటూ పిలిచాడు.


చరణ్ త్వరగా బలరాం దగ్గరికి వెళ్ళాడు.


"వీళ్ళని ట్రేస్ చేయ్యడం, పట్టుకోవడం పెద్ద పనికాదు మావాళ్ళకీ.. కానీ ఈకేసులో ఎవరిదో మావాళ్ళ అదృశ్య హస్తం ఉంది. లేకపోతే వీళ్ళు ఇక్కడకొచ్చి ఈ హత్య చెయ్యలేరు. అందుకనీ చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి.. అయినా రాజారాం గారు చాలా సీనియర్ ఆఫీసర్.. ఆయనకు వీళ్ళ గురించి బాగా తెలుసు; వీళ్ళను ఎలాగయినా బయటకు లాగుతాడు. అది చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. ఒక వేళ మావాళ్ళు వీళ్ళని పట్టుకోలేకపోతే మీరే వీళ్ళ పేర్లని కోర్టుకి దీప గారి ద్వారా చెప్పించండి. అప్పుడు కోర్ట్ డైరెక్షన్ ఇస్తుంది.. ఓకే.. మీరు లాయర్ గారనీ ఇవన్నీ చెప్పాను. ఉంటాను” అంటూ వెళ్లిపోయాడతను.


"థాంక్యూ వెరీమచ్ సర్ ఫర్ యువర్ హెల్ప్” అంటూ చరణ్ అతని దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు.


ఆరోజు ఆదివారం; అప్పటికి వారం రోజులునుంచి చరణ్ తన పల్లెకు రాలేదు. అందుకే ఆరోజు ఉదయాన్నే ఇంటికొచ్చి కాఫీ తాగి రైతులతో కాసేపు పొలం గురించి, పంటల గురించి మాట్లాడి పొలానికి బయలుదేరాడు. అది వరికోసే సమయం.. మొత్తం ఊరంతా ఆ పనిలో ఉంది.

చరణ్ రెండవ పంట వేసే పొలానికి బోరింగ్ షెడ్డు దగ్గరికి వెళ్ళి నీరు పెట్టసాగేడు. బోరింగ్ స్విచ్ వెయ్యగానే పాతాళ గంగ ఉప్పొంగినట్లు నీళ్ళు బట్టి ద్వారా పొలం వైపు పరిగెత్తడాన్ని అతను ఆనందంతో చూడసాగేడు.


ఆసమయంలో రైతు సోమన్న వచ్చి విహారి బాబు, ఇంకో అమ్మా అతనికోసం వచ్చారని చెప్పాడు.


అతను సోమన్నతో "నేనిపుడు రావడం కుదరదు. వాళ్లనే ఇక్కడకు తీసుకురా.. మా భోజనాలు కూడా క్యారెజీ లో పెట్టి ఇమ్మనీ అమ్మకి చెప్పు” అని చెప్పడంతో అతను వెళ్లిపోయాడు.


మరో గంట తరువాత విహారి, దీప ఇద్దరూ చరణ్ దగ్గరకు వచ్చారు. ఓ గంట కబుర్ల తరువాత దీప వాళ్ళకి భోజనాలు వడ్డించింది. ఆ బోరింగ్ షెడ్డులో ప్లేట్లు, ఫ్రిజ్, క్రాకరీ, డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి. చరణ్ కి అక్కడ భోజనం చెయ్యడం అలవాటు.


భోజనం చేస్తూ విహారి చెప్పడం మొదలు పెట్టాడు. “దీపకి వాళ్ళ నాన్నగారు ఓ అమెరికా సంబంధం చూసారు. అతను ఓపదిహేను రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు. ఆసమయంలో పెళ్ళి చేసెయ్యాలని ఆ అబ్బాయి తండ్రి తొందర పెడుతున్నాడట. క్రితం వారం దీపని పిలిచి వాళ్ళ నాన్నగారు ‘ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ పెళ్ళికి ఒప్పుకోవలసిందే.. మంచి సంబంధం’ అంటూ బలవంతం పెట్టారట. దీపకి ఏంచెయ్యాలో తోచక నా దగ్గరకు వచ్చింది. ఏంచెయ్యాలో అర్ధం కావట్లేదు" అన్నాడు.


"దీపా! మొన్న నేను హాస్టల్ కి వచ్చినపుడు నీ గదిలో ఒక ఫోటో చూసాను. అతను శ్రీహర్ష కదూ”అని అడిగాడు.


“నా క్లాస్ మేట్; మేం ఇద్దరం ఇంటర్ దాకా కలిసి చదువుకున్నాము. ఇప్పుడెక్కడున్నాడు?"


“ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. కానీ చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. ఇక్కడ ఎంబీఏ చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్ల తరువాత ఆ ఉద్యోగం మానేసి ఓ కంపెనీ పెట్టాడు. ఆసమయంలో మా నాన్నగారిని పాతిక లక్షలు కావాలని అడిగాడు. నాన్నగారు ఆఉద్యోగం మానివేసి మా ఊరు వచ్చేయ్యమని చెప్పారు. మాకు మాఊళ్లో 30 ఎకరాల పొలం, మామిడితోట అన్ని ఉండేవి. కానీ వాడు కోపంతో 4 నెలలు నాన్నగారితో మాట్లాడలేదు.


ఆతరువాత నాన్నగారు పొలం అమ్మి డబ్బిస్తానని చెబితే అప్పుడు వచ్చాడు. నాన్నగారు మామిడితోట, 10 ఎకరాల పొలం అమ్మి వాడికి పాతికలక్షలు ఇచ్చారు. దాంతో వాడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించాడు. అది రెండేళ్ళలో బాగా అభివృద్ధి చెందింది. 50 మంది దాకా ఉద్యోగస్థులు అందులో పనిచేస్తున్నారని ఓసారి నాకు ఫోన్ చేసి చెప్పాడు కూడా.


ఆకంపెనీలో మాధూలిక అనే మన ఇండియన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని వాడు ప్రేమించాడు. వాళ్ల ప్రేమ పెళ్లిదాకా వచ్చింది. నాన్న గారికి చెబితే ఆయన అమెరికా పిల్ల వద్దని చెప్పారు. కానీ వాడు నాన్నగారి మాట కాదని ఆ మధూలికని పెళ్లాడాడు. ఆ పెళ్ళి తరువాత సంవత్సరం దాకా వాడు మా ఊరు రాలేదు. ఈలోగా చాల సంఘటనలు జరిగిపోయాయి. పెళ్లి తరువాత ఆఅమ్మాయి వాడిని మోసం చేసింది. ఆ కంపెనీలో వాటాలు మార్పించుకొని ఆ కంపెనీ నుంచి మా అన్నయ్యని వెళ్ళగొట్టింది. ఆమెకు ఇదివరకే ఒక అమెరికన్ తో ఎఫైర్ ఉందట. అతనితో చేతులు కలిపి అన్నయని కంపెనీ నుంచి వెళ్ళ గొట్టింది.


దాంతో అన్నయ్య పిచ్చివాడైపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి సంవత్సరం తరువాత మాఊరు వచ్చాడు. వాణ్ణి చూసిన తరువాత మా అమ్మ నాన్నలిద్దరూ అనారోగ్యం పాలయ్యారు. నాన్నగారు వాడిని మాఊళ్లోనే ఉండిపోయి వ్యవసాయం చేసుకొమ్మన్నారు. అయినా వాడు వినకుండా కోర్టులో పోరాడుతానని చెప్పి మరో ఐదులక్షలు పట్టికెళ్లాడు.


ఆతరువాత ఏంజరిగిందో తెలియదు. మాతో ఆరునెలలకో సారి మాట్లాడుతుంటాడు. అలా మా అన్నయ్య పెళ్ళి విషయంలో దెబ్బతిన్న నాన్నగారు నా పెళ్ళి అలా జరగకూడదనీ, తెలిసిన సంబంధంమే చేస్తాననీ, ప్రేమ పెళ్ళి ఒప్పుకోవటంలేదు" అంది అన్నాన్ని వడ్డిస్తూ.

'"అమెరికా సంబంధం అంటే ఇష్టంలేని మీనాన్నగారికి ఇప్పుడీ అమెరికా సంబంధం ఎలా నచ్చింది?”


“అతను నాన్నగారి బంధువులు అబ్బాయిట; నాలుగేళ్లనుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడట. ”

“నీ దగ్గర ఆ అబ్బాయి నెంబరు ఉంటే ఇవ్వగలవా? నేను అతనిలో ఒకసారి మాట్లాడతాను. మళ్ళీ ఆదివారం నేను మీ ఊరెళ్లి మీ నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడతాను. మీ అదృష్టం బాగుంటే ఆయన మీ పెళ్ళికి ఒప్పుకోవచ్చు. ఏం అంటావ్ విహారి" అన్నాడు చరణ్;


“అన్నయ్యా! ఆ అబ్బాయి పేరు రోహన్.. అతని నెంబరు నాదగ్గర ఉంది. నువ్వు అతనితో మాట్లాడి ఆ తరువాత నాన్న గారితో మాట్లాడితే మంచిది ” అంది దీప..


"ఇదే సమస్య సౌదామిని కి కూడా ఎదురైంది. వాళ్ల నాన్నగారు కూడా ఆమెకి సంబంధాలు చూస్తున్నారు" అన్నాడు చరణ్ ;


“అన్నయ్యా! చాలా రోజుల నుంచి అడుగుదా మను కుంటున్నాను. సౌదామినిది, నీది ఎటువంటి స్నేహం? " అనీ అడిగింది దీప ;


“అసలు సంవత్సరం క్రితం దాకా నాకు సౌదామిని ఎవరో తెలియదు. నేను ఢిల్లీ ఒక సెమినార్ కోసం వెళ్లినపుడు అక్కడ పరిచయమైంది. ఆమెకూడా లా చదవడం వల్ల మా స్నేహం పెరిగింది. ఆతరువాత ఆవిడ అనుకోకుండా వాళ్ళ కజిన్ పెళ్ళికోసం మాఊరు రావడం, ఆఅమ్మాయి మా మేనమామ కూతురు కావడంతో పరిచయం ఇంకాస్తా పెరిగింది.


ఆతరువాత ఆవిడని లీగల్ ఎడ్వైజర్ కంపెనీలోకి తీసుకున్నాను. ఆవిడ వచ్చినతరువాత చాలా వరకు పనులు పూర్తవుతున్నాయి. అంతే మా స్నేహం. మేం అంతకన్నా ఎక్కువుగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మా అమ్మకూడా ఆఅమ్మాయి నీకోసం ఎందుకు వస్తోందనీ ఎప్పుడూ అడగలేదు.


సౌదామిని గురించి వాళ్ళింట్లో చెప్పిందో లేదో నాకు తెలియదు. నేను ఎవరో ఏదో అనుకుంటారని పెద్దగా పట్టించుకోను. మనం పవిత్రంగా ఉంటే ఎవ్వరు ఏమ నుకున్నా పట్టించుకోనవసరం లేదు. వచ్చిన బాధ ఏంటంటే మనదేశంలో అమ్మాయి, అబ్బాయిల స్నేహం అంటే ఎవ్వరికీ సదభిప్రాయం లేదు; అదీ బాధ” అన్నాడు చరణ్ ;

ఆమర్నాడు విహారి, దీప వెళ్ళిపోయారు.

=================================================================================

ఇంకా వుంది...

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


22 views0 comments
bottom of page