top of page
Original.png

అత్తగారి కథలు -23: హీరోనా? జీరోనా?

హీరోనా జీరోనా, అత్తగారి కథలు, తెలుగు కథ, హాస్య కథ, కుటుంబ కథ, దాంపత్య కథ, శ్రీలంక హనీమూన్, సరదా కథ, కామెడీ కథ, భర్త భార్య, తెలుగు సాహిత్యం, వినోద కథ, కుటుంబ హాస్యం

శ్రీలంక హనీమూన్‌లో స్విమ్మింగ్ పూల్‌లో హీరోగా నిరూపించుకోవాలని ప్రయత్నించి, గ్లాస్ బోట్‌లో భయపడిపోయిన భర్తను చూసి నవ్వుతున్న భార్యను చూపించే హాస్యభరిత దృశ్యం.
శ్రీలంక హనీమూన్‌లో స్విమ్మింగ్ పూల్‌లో హీరోగా నిరూపించుకోవాలని ప్రయత్నించి, గ్లాస్ బోట్‌లో భయపడిపోయిన భర్తను చూసి నవ్వుతున్న భార్యను చూపించే హాస్యభరిత దృశ్యం.

Atthagari Kathalu - 23: herona Zerona - Telugu Emotional Family Story | L. V. Jaya

అత్తగారి కథలు -23: హీరోనా? జీరోనా? - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | L. V. జయ

Published in manatelugukathalu.com on 24/07/2026 


రాధ దృష్టిలో తన కొడుకు సమర్థ్ కి మించిన అందగాడు, మంచివాడు, చదువుకున్నవాడు లేడు. సమర్థ్ కి జాగృతితో పెళ్ళై, కోడలు ఇంటికి వచ్చినప్పటినుండి, ప్రతిరోజూ సమర్థ్ గురించి గొప్పలు జాగృతికి చెప్పింది రాధ.  


"మా వాడు కాలేజీ లో చదువుకునేటప్పుడు ఎంతమంది అమ్మాయిలు వాడి వెనకపడేవారో. స్విమ్మింగ్ లో, క్రికెట్ లో మా వాడు ఛాంపియన్. వాడు స్విమ్ చేస్తుంటే, వాడి బాడీ ని చూడడానికి అమ్మాయిలందరూ పూల్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు వాడి మెత్తటి, ఒత్తైన జుట్టు అలా, అలా ఎగిరిపడుతుంటే, అమ్మాయిల హృదయాలు కూడా అలా, అలా ఎగిరిపడేవి తెలుసా." అంది సమర్థ్ ని చూసి మురిసిపోతూ.  


లావుగా, పొట్టిగా, పొట్ట బయటకి వచ్చి ఉన్న సమర్థ్ ని చూసి, 'ఈయన స్విమ్మింగ్ లో, క్రికెట్ లో ఛాంపియనా? అవన్నీ చెయ్యడం మానేసి ఇలా అయిపోయారా? అత్తగారు చెప్పినట్టు నిజంగా ఈయన వెనక అంతమంది ఆడవాళ్లు పడేవాళ్లా? లేక ఈవిడ తన కొడుకుని హీరోలా ఊహించుకుంటోందా? ఎంతైనా కాకి పిల్ల కాకికి ముద్దు కదా.' అనుకుంది జాగృతి.   


*******************************


పెళ్ళైన వారం తరువాత సమర్థ్, జాగృతి హనీమూన్ కి శ్రీలంకకు వెళ్లారు. కొలంబో ఎయిర్పోర్ట్ లో దిగి, కారు ఎక్కి, రిసార్ట్ కి వెళ్లే దారిలో, "నీకు స్విమ్మింగ్ వచ్చా?" అని జాగృతిని అడిగాడు సమర్థ్. రాదని చెప్పింది జాగృతి. 


"నీకు స్విమ్మింగ్ రాదా!! నాలాంటి అథ్లెట్ కి నువ్వెలా దొరికావొ? ఇదేదో ముందే తెలిసుంటే, మనం శ్రీలంక వచ్చేవాళ్ళమే కాదు కదా. ఇక్కడ బీచెస్ లో చక్కగా ఇద్దరం ఎంజాయ్ చెయ్యచ్చు అనుకున్నాను." అన్నాడు సమర్థ్ తలపట్టుకుంటూ. 


'ఎంతసేపు మీ గురించి మీ అమ్మ చెప్పే గొప్పలు వినడం తప్ప, నా గురించి చెప్పే అవకాశం నాకెక్కడ ఇచ్చారు?' అనుకుంది జాగృతి. 


"నేను బీచెస్ లో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే, నువ్వు నాకు ఫోటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చెయ్యి." అని వెక్కిరించాడు. 'జాగృతికి స్విమ్మింగ్ రాకపోవడమే మంచిదయ్యింది. నా టాలెంట్ అంతా ఇప్పుడు జాగృతికి చూపించచ్చు.' అనుకున్నాడు. 


********************************************


సమర్థ్, జాగృతిలు ఉన్న రిసార్ట్ బీచ్ పక్కనే ఉంది. ఒక పక్క సముద్రం, ఇంకో పక్క చెట్లతో రిసార్ట్ చాలా అందంగా ఉంది. సర్ఫింగ్, కైటింగ్, రాఫ్టింగ్, స్కీయింగ్, డైవింగ్ చేస్తున్న వాళ్ళతో ఒక పక్క ఆహ్లాదంగా ఉంటే, ఇంకో పక్క ఇసుకలోనున్న బెంచెస్ మీద, చెట్ల మధ్యలోనున్న హమ్మోక్ ల మీద విశ్రాంతి తీసుకొంటున్నవాళ్ళతో ప్రశాంతంగా ఉంది.  


సమర్థ్ నీళ్ళని చూస్తూ, "నాకు ఇప్పుడే ఈ వాటర్ స్పోర్ట్స్ అన్నీ చెయ్యాలని ఉంది" అన్నాడు ఉత్సాహంగా.  జాగృతి కూడా సమర్థ్ వెనకే నడుస్తుంటే, "నీకు నీళ్లంటే భయం కదా. నేను ఒక్కడినే వెళ్లి, వాటి గురించి తెలుసుకుని వస్తా." అన్నాడు జాగృతిని ఏడిపిస్తూ.  


"నాకు నీళ్లంటే భయంలేదు. స్విమ్మింగ్ రాదు అంతే." అంది జాగృతి కోపంగా.  


"సరే చూద్దాం కానీ, నేను కనుక్కుని వస్తా. అప్పటివరకు నువ్వు ఇక్కడ కూర్చోని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉండు." అని వెళ్ళాడు సమర్థ్. 


జాగృతి చెట్ల మధ్యలోనున్న హమ్మోక్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో, అరవై ఏళ్ళు పైబడిన ఆడవాళ్లు గుంపుగా గుంపుగా ఆడుకుంటున్నారు. 


జాగృతి తన హ్యాండీక్యామ్ లో, రిసార్ట్ కి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా, దూరం నుండి సమర్థ్ కనపడ్డాడు. జాగృతి తనకి వీడియో తీయడాన్ని, పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ ని చూసిన సమర్థ్, 'జాగృతికి నా టాలెంట్ ఏంటో ఇప్పుడే చూపిస్తా' అనుకుని, వేసుకున్న షర్ట్, ప్యాంటు విప్పి పరిగెత్తాడు. సమర్థ్ ఏం చెయ్యబోతున్నాడో అర్ధంకాని జాగృతి చేతిలోనున్న హ్యాండీక్యామ్ ను పక్కన పడేసి లేచింది.


పరిగెడుతూ వచ్చిన సమర్థ్, పెద్ద శబ్దంతో స్విమ్మింగ్ పూల్లోకి దూకాడు. పూల్లోని నీళ్లు పెద్ద కెరటంలా పైకి ఎగిరిపడ్డాయి. అంతవరకూ ప్రశాంతంగా స్విమ్మింగ్ చేసుకుంటున్న ఆడవాళ్లు భయపడి, అరుస్తూ, నీళ్లలోంచి బయటకి వచ్చి, ఆశ్చర్యంగా చుట్టూ చూసారు. వాళ్లకి ఆ శబ్దం ఎందుకు వచ్చిందో అర్ధంకాలేదు. అప్పుడే సమర్థ్ స్విమ్ చేసుకుంటూ ఒడ్డుకు చేరి, హీరోలా ఫోజులు ఇస్తూ, నెమ్మదిగా జుట్టు సరిచేసుకుంటూ, నీళ్లలోంచి బయటకి వచ్చాడు. ఆడవాళ్లు కోపంతో సమర్థ్ ని తిట్టడం మొదలుపెట్టారు. మిగతావాళ్లందరూ సమర్థ్ ని చూసి నవ్వారు. 


"వీళ్ళ తిట్లు భరించలేకపోతున్నాను. ఈ ముసలోళ్ల మధ్యలోకా నేను దూకింది!!" అన్నాడు  తలకొట్టుకుంటూ. 


ఇదంతా చూసిన జాగృతికి నవ్వాగలేదు. "వాళ్ళందరూ పడచువాళ్ళనుకున్నారా?" అని అడిగింది నవ్వుతూ. 


"నన్నలా అందరూ తిడుతుంటే నీకు నవ్వెలా వస్తోంది?" అన్నాడు సమర్థ్ కోపంగా. 


"హానిమూన్ కి భార్యతో వచ్చి, ఆడవాళ్ళ ముందు హీరోలా ఫోజు కొట్టాలనుకున్నారు. పాపం. మీ హీరోయిజం అంతా వేస్ట్ అయిపొయింది." అంది నవ్వుకుంటూ. 


జాగృతికి తన ప్రతిభ చూపించాలన్న సమర్థ్, మొదటి ప్రయత్నంలో నవ్వులపాలయ్యాడు.


"ఇప్పుడు నన్ను చూసి నవ్వావ్ కదా. నాకు నిన్ను చూసి నవ్వే టైం వస్తుంది." అన్నాడు సమర్థ్ కోపంగా.


జాగృతి నవ్వాపుకుంటూ, "వాటర్ స్పోర్ట్స్ కి బుక్ చేసారా?" అని అడిగింది. 


"అవన్నీ రేపటికి దొరికాయి. ఈ రోజు సాయంత్రానికి బోట్ రైడ్ మాత్రమే దొరికింది. నువ్వు రాగలవా? దానికి కూడా భయపడతావా?" అని జాగృతిని వెక్కిరించాడు.


"నాకు స్విమ్మింగ్ రాదు. బోట్ లో రావడానికి, వాటర్ స్పోర్ట్స్ చెయ్యడానికి నాకేం భయంలేదు." అంది జాగృతి.   


************************************************


ఆ రోజు సాయంత్రం బోట్ రైడ్ వెళ్ళారిద్దరు. అక్కడ బోట్ డ్రైవర్ తప్ప ఇంకెవ్వరు లేరు. డ్రైవర్ జాగృతికి ముందు చెయ్యి అందించి ఎక్కించాడు.   


సమర్థ్ బోట్ ఎక్కకుండా, బోట్ లో కాళ్ళ కిందనున్న గ్లాస్ ని చూస్తూ, "ఈ గ్లాస్ గట్టిదేనా? మనం సముద్రం లోకి వెళ్ళాక విరిగిపోతుందా?" అని డ్రైవర్ ని అడిగాడు.


"చెప్పలేం. మీకు స్విమ్మింగ్ వస్తే పర్వాలేదు. లేకపోతేనే ప్రాబ్లెమ్." అన్నాడు డ్రైవర్ నవ్వుతూ.

   

"నాకు వచ్చు. మా ఆవిడకే రాదు." అన్నాడు సమర్థ్ జాగృతిని వెక్కిరిస్తూ. 

    

"అదేం విరగదు. ఒకవేళ విరిగినా, స్విమ్మింగ్ వచ్చిన మీరుండగా నాకేంటి భయం. నన్ను మీరు కాపాడతారు కదా." అంది జాగృతి నవ్వుతూ. 


డ్రైవర్ బోట్ స్టార్ చేసి, సముద్రం లోకి తీసుకువెళ్తున్నకొద్దీ, కిందనున్న గ్లాసులోంచి చిన్న చిన్న చేపలు, జెల్లీ ఫిష్ లు, స్టార్ ఫిష్ లు, నత్తలు కనపడ్డాయి. జాగృతి వాటిని చూస్తూ ఆనందిస్తూ వీడియోలు తీస్తుంటే, సమర్థ్ మాత్రం కళ్ళు మూసుకుని, పక్కనే ఉన్న హేండిల్ ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. 


నీళ్ళలోకి కొంత దూరం వెళ్ళాక, బోట్ ఇంజన్ ఆగిపోయింది. డ్రైవర్ ఇంజిన్ ని స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ, "ఆయిల్ అయిపోయినట్టు ఉంది." అన్నాడు.


సమర్థ్ భయంతో కళ్ళు విప్పి చుట్టూ చూసాడు. బోట్ తీరంనుండి చాలా దూరం వచ్చింది. "తొందరగా ఆయిల్ మార్చి, ఇంజిన్ స్టార్ట్ చెయ్యి." అన్నాడు.  


"నా దగ్గరున్న ఆయిల్ అంతా అయిపొయింది. ఎవరైనా వచ్చి ఇచ్చేంతవరకు ఇక్కడే ఉండాలి." అన్నాడు డ్రైవర్. 


"నీకు ఈ సముద్రం మధ్యలో ఆయిల్ ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడెలారా భగవంతుడా?" అన్నాడు సమర్థ్ భయపడుతూ. 


"కొంచెం దూరంలో ఒక చిన్న ఐలాండ్ ఉంది. అక్కడవరకు బోట్ వెళ్లగలిగితే ఎవరైనా వచ్చేంతవరకు అక్కడ ఉండచ్చు." అన్నాడు డ్రైవర్. 


"లేకపోతే?" భయపడుతూ అడిగాడు సమర్థ్. 


"మీకు స్విమ్మింగ్ వచ్చు కదా. స్విమ్ చేసుకుంటూ ఒడ్డుకి వెళ్ళచ్చు." అన్నాడు డ్రైవర్ నవ్వుతూ. 


డ్రైవర్ సరదాగా సమర్థ్ ని ఏడిపిస్తున్నాడన్న విషయం జాగృతికి అర్ధమయ్యింది. అది సమర్థ్ కి చెప్పేలోపే, "ఒరేయ్!! నాకు పెళ్లి అయ్యి వారం రోజులే అయ్యిందిరా. అప్పుడే చంపేస్తావా నన్ను!!" అంటూ తెలుగులో అరవడం మొదలుపెట్టాడు. 


సమర్థ్ ని ఊరుకోబెడుతూ, "డ్రైవర్ సరదాగా అలా అన్నాడు. నిజంగా బోట్ ఆగిపోలేదు." అని జాగృతి చెప్తున్నా వినకుండా, "నా బతుకు ఇక్కడే తెల్లారిపోతుంది. భగవంతుడా!! నేను ఇంత దూరం ఈ దేశానికి చచ్చిపోవడానికే వచ్చానా?" అంటూ అరిచాడు. 


'భయంలో తాను శ్రీలంకలో ఉన్నానని, డ్రైవర్ కి  తెలుగు అర్ధం అవ్వదన్న విషయాన్ని మర్చిపోయాడు.' అనుకుంది జాగృతి. డ్రైవర్ తో "బోట్ స్టార్ట్ ఇంక" అని గట్టిగా చెప్పింది.     


ఐలాండ్ వరకు తీసుకువెల్దామనుకున్న డ్రైవర్ సమర్థ్ భయాన్ని చూసి, ఇంజిన్ని స్టార్ట్ చేసి, వెనక్కి ఒడ్డుకు చేర్చాడు. 'స్విమ్మింగ్ ఛాంపియన్ ని అని చెప్పిన సమర్థ్ ఎందుకు అంతలా భయపడ్డాడో' జాగృతికి అర్ధంకాలేదు.  


రూమ్ కి చేరాక, సమర్థ్ కి భయంతగ్గి, శాంతపడ్డాడు. ఆ రోజు తీసుకున్న ఫొటోస్, వీడియోస్ చూసారిద్దరూ. స్విమ్మింగ్ పూల్లో ఆడవాళ్ళ మధ్యలో సమర్థ్ దూకడం, గ్లాస్ బోట్ లో భయంతో డ్రైవర్ మీద అరవడం అన్నీ రికార్డు అయ్యాయి. 


"ఈ వీడియోస్ లో మిమ్మల్ని చూస్తుంటే, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నారు." అంది జాగృతి నవ్వుతూ. సమర్థ్ కూడా తను చేసిన పని అర్ధమయ్యి, నవ్వుకున్నాడు.  


జాగృతికి సమర్థ్ గురించి రాధ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, 'మీరు స్విమ్మింగ్ లో, క్రికెట్ లో ఛాంపియన్ అని, అమ్మయిలందరూ మీ వెనకపడేవారని మీ అమ్మ చెప్పారు. ఈ వీడియోలు చూస్తే మీ అమ్మ ఏమనుకుంటారో పాపం." అంది సమర్థ్ ని ఏడిపిస్తూ. 


"హీరోలా పెంచుకున్న కొడుకుని, కోడలు వారం రోజుల్లోనే జీరోని చేసింది అనుకుంటుంది. కానీ కొడుకు హీరో కాదని ఒప్పుకోదు." అన్నాడు సమర్థ్ నవ్వుతూ.


ప్రతీ కొడుకు తన తల్లికి హీరోనే. ఒకవేళ అలా లేకపోతే, వచ్చిన కోడలు ని అంటారు తప్ప, కొడుకు హీరో కాదని ఒప్పుకోరు.


***

L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya/profile

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page