అత్తగారి కథలు - 25: కోడలి గృహప్రవేశం
- LV Jaya

- 3 minutes ago
- 4 min read

Atthagari Kathalu - 25: Kodali Gruhapravesam - Telugu Emotional Family Story | L. V. Jaya
అత్తగారి కథలు -25: కోడలి గృహప్రవేశం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | L. V. జయ
Published in manatelugukathalu.com on 02/09/2026
అత్త–కోడళ్ల మధ్య అపార్థాలు, అభిప్రాయ భేదాలు మన కుటుంబ కథల్లో ఎప్పుడూ ఆసక్తిని కలిగించే అంశాలే.‘అత్తగారి కథలు -25: కోడలి గృహప్రవేశం’లో కూడా అలాంటి సంఘటనే కనిపిస్తుంది. కొడుకు సమర్థ్ తన భార్య జాగృతిని ఎంతో ప్రేమగా స్వాగతించాలనుకుంటాడు. కానీ అత్త రాధ మాత్రం కొత్తగా వచ్చిన కోడలిని మొదటి రోజే ఇంటి పనులతో పరీక్షించాలని నిర్ణయించుకుంటుంది.
మహిళ చదువుకుని ఉద్యోగం చేస్తే ఇంటిని చూసుకోలేదనే అపోహ ఎంత తప్పో చమత్కారంగా చెప్పే కథే ‘కోడలి గృహప్రవేశం’.
రాధ తన కోడలు జాగృతి చేత కొత్త కాపురం పెట్టించడానికి జాగృతితో సహా బెంగుళూరు బయలుదేరింది.
ట్రైన్ ఎక్కి, సమర్థ్ కి ఫోన్ చేసి, "నేను, మీ ఆవిడ ఇప్పుడే బయలుదేరాం. రేపు ఉదయానికి బెంగుళూరు చేరుకుంటాం. రాగానే మీ ఆవిడ చేత పాలు పొంగించాలి. ఇంట్లో పాలు, కూరలు ఉన్నాయా? లేకపోతే కొని ఫ్రిడ్జిలో పెట్టు." అని చెప్పింది. జాగృతి వస్తోందన్న ఆనందంలో రాధ చెప్పిన మిగతా మాటలేమి సమర్థ్ కి వినపడలేదు.
మర్నాడు ఉదయానికి రాధ, జాగృతి బెంగుళూరు చేరారు. జాగృతి వచ్చినప్పటినుండి సమర్థ్ ఆనందానికి హద్దులు లేవు. జాగృతితో ఎప్పుడు మాట్లాడదామా, తనని ఎప్పుడు హత్తుకుందామా అని ఎదురుచూశాడు. కానీ రాధ వాళ్ళిద్దరినీ ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలకుండా, జాగృతి చేత ఇల్లంతా శుభ్రం చేయించింది.
లక్ష్మీదేవిలా ఇంట్లోకి అడుగుపెట్టిన జాగృతికి, మొదటిరోజే రాధ ఇలాంటి పనులు చెప్పడం చూసి సమర్థ్ బాధపడ్డాడు. "పనిమనిషి వచ్చాక ఈ పనులన్నీ చేస్తుందిలే. జాగృతి చేత చేయించడమెందుకమ్మా?" అన్నాడు రాధతో.
"ఈ ఇంటికి పనిమనిషి ఇంక రాదు. రావద్దని నేనే ఫోన్ చేసి చెప్పేసాను. ఇవన్నీ మీ ఆవిడ చేస్తుందిలే. తన ఇంటిపని తను చేసుకోలేదా ఏం?" అంది రాధ జాగృతిని చూస్తూ.
సమర్థ్ రాధతో ఏదో చెప్దామనుకునేలోగా, "రాగానే మీ ఆవిడ చేత పాలు పొంగిద్దామనుకున్నాను. కానీ నేను తీసుకురమ్మని చెప్పినవేవీ నువ్వు తేలేదు. అప్పుడే దాని మాయలో పడిపోయావ్. దాని వెనక తిరిగింది చాలు. వెంటనే వెళ్లి పాలు, కూరలు, నూనె తీసుకురా." అని సమర్థ్ మీద అరిచింది. సమర్థ్ వెంటనే వెళ్ళి రాధ చెప్పినవి తీసుకొచ్చాడు.
జాగృతి పాలు పొంగించి, పరమాన్నం చేసి, దేవుడికి నైవేద్యం పెట్టి, రాధకి, సమర్థ్ కి ఇచ్చింది. సమర్థ్ తిని చాలా బాగుందని చెప్పాడు. కానీ రాధ అసహ్యంగా మొహంపెట్టి, "ఇంతకీ నీకు వచ్చా? కనీసం ఒక పది మందికి వండగలవా?" అని అడిగింది.
"పదిమందికా? అంతమందికి నేనెప్పుడూ వండలేదండి. ఒకళ్లిద్దరికైతే వండగలను." అంది జాగృతి భయపడుతూ.
"ఏమిటీ!! పట్టున పదిమందికి కూడా వండలేవా? ఇంకెందుకు పనికొస్తావ్? అందుకే చదువుకున్నదాన్ని నాకు కోడలిగా తేవద్దురా అని చెప్పను వీడితో. వీడు వినలేదు. ఏం ఉద్దరించడానికో, ఎవరిని ఉద్దరించడానికో ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తున్న నిన్ను పెళ్లి చేసుకుని, నా నెత్తి మీద పెట్టాడు. నేనేం చేసుకోను దీని ఇంజినీరింగ్ సర్టిఫికెట్ ని? నాలిక గీసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు నాకది. మాకసలే చుట్టాలెక్కువ. వాళ్ళందరూ వస్తే ఏం వండి పెడుతుంది వాళ్ళకిది?" అంది రాధ కోపంగా.
"అంతమంది చుట్టాలు ఇక్కడికెందుకొస్తారమ్మా? ఇక్కడుండేది మేమిద్దరమే కదా. ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాంలే." అన్నాడు సమర్థ్ జాగృతిని సమర్థిస్తూ.
"మేమిద్దరం అంటున్నావేమిటి? నన్ను పంపించెయ్యమని చెప్పిందా అది నీతో? అప్పుడే దాని మైకంలో పడిపోయావ్. అమ్మ అల్లం, పెళ్ళాం బెల్లం అయిపోయింది. అంతా నా ఖర్మ." అంది రాధ. రాధ మాటలకి ఆశ్చర్యపోయింది జాగృతి.
"అనవసరంగా తననేమి అనకు. వచ్చినప్పటినుండి జాగృతి ఏదో ఒక పని చేస్తూనే ఉంది. నేను తనతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు ఇప్పటివరకు." అన్నాడు సమర్థ్ బాధగా.
"అలాగే సమర్థించు. నన్ను పంపించేసాక, అది నీకు వంట చేసి పెడుతుందనుకుంటున్నావేమో!! నీ చేత వండించుకుని తిని, టింగురంగా అని ఆఫీసుకి వెళ్ళిపోతుంది. దీనికి, వీళ్ళ అమ్మకి ఉద్యోగాలే ముఖ్యం. శుభ్రంగా ఇంటిపట్టున కూర్చోలేరు. నేను చూడు, ఎంత కష్టపడి నాన్నని, నిన్ను, మీ అక్కని చూసుకున్నాను. నాలాంటి పతివ్రతా లక్షణాలు వీళ్ళకెక్కడ!! ఇలాంటిదాన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు భగవంతుడు. అంతా నా ఖర్మ." అంది రాధ తలబాదుకుంటూ.
రాధ మాటలకి జాగృతికి కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. 'చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలనుకుని సమర్థ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను. ఇద్దరం కలిసి అన్ని బాధ్యతలు పంచుకుంటూ, సంతోషంగా ఉండాలనుకున్నాము. కానీ ఈవిడకి నేనంటే మొదటినుండి ఇష్టంలేదన్నమాట. ఏవేవో ఊహించుకుని, నన్ను, మా అమ్మని తిడుతూ, లేనిపోని తగువులు పెట్టాలని చూస్తోంది.' అనుకుంది.
"అమ్మా! అనవసరంగా మాట్లాడకు. జాగృతి ఇప్పుడే కదా వచ్చింది. వంట అలవాటు అయ్యాక, కొన్నాళ్లలో నీలాగ పతివ్రతలా వండుతుందిలే." అన్నాడు సమర్థ్ మళ్ళీ జాగృతిని సమర్థిస్తూ.
జాగృతి కూడా తనంత పతివ్రత అని సమర్థ్ అన్నందుకు, రాధకి ఒళ్ళు మండిపోయింది. "మీ ఆవిడ ఎంత పతివ్రతో ఇప్పుడే తేల్చేస్తాను. ఈ రోజు వంట మీ ఆవిడనే చేయమను. ఎలా చేస్తుందో నేనూ చూస్తాను." అని కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది.
రాధ మాటతీరు జాగృతికి నచ్చలేదు. 'ఈవిడ నా గురించి మాట్లాడుతున్నవి తప్పని నిరూపిద్దాం' అనుకుని, గబగబా వంటగదిలోకి వెళ్లి, బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి, కూరలు తరిగి, స్టవ్ మీద గిన్నె పెట్టి, నూనె కోసం వెతికింది. ఎంత వెతికినా నూనె కనపడలేదు. సమర్థ్ ని పిలిచి, "నూనె ఎక్కడుందో కనపడటం లేదు. ఒక్కసారి వచ్చి, చెప్తారా?" అని అడిగింది.
"ఉంటే కదా కనపడడానికి!! నీ మాయలో పడి, అమ్మ చెప్పిన మాటలు వినపడలేదు వాడికి. బాగానే బుట్టలో వేసుకున్నావ్." అంది రాధ మూతితిప్పుతూ.
"నూనె తేవడం మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే తీసుకువస్తానుండు." అని బయటకి వెళ్తున్న సమర్థ్ ని రాధ ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్ళక్కరలేదు. మీ ఆవిడ పతివ్రత అన్నావ్ కదా. నిరూపించామను. నూనె లేకుండా వంట చెయ్యమను. చూస్తాను ఎలా చేస్తుందో?" అంది.
'ఇలాంటి టెస్ట్ పెట్టిందేమిటి ఈవిడ? నూనె లేకుండా వంట ఎలా చెయ్యడం? ఇప్పుడేం చెయ్యాలి?' అనుకుంటూ, వంటిట్లోకి వెళ్ళింది జాగృతి.
'జాగృతి ఏం వండుతుంది? ఎలా వండుతుంది?' అన్న కుతూహలంతో రాధ వంటింట్లోకి చూస్తూ కూర్చుంది. కొంతసేపట్లో జాగృతి వండిన పదార్థాలతో బయటకి వచ్చి, కూర, అన్నం, పప్పు కంచాలలో వడ్డించి, తినడానికి రమ్మని రాధని, సమర్థ్ ని పిలిచింది.
సమర్థ్ వచ్చి కూర్చుని, వండిన పదార్ధాలని రుచి చూసి, "చాలా బాగుంది. హోటల్ లో చేసే లాంటి రుచి వచ్చింది. నువ్వు రామ్మా" అని రాధని పిలిచాడు.
"ఏ పిచ్చి హోటల్ లో చేసినట్టుందో? నాకది తినేంత ధైర్యం లేదు. నువ్వు తిను." అంది రాధ మూతితిప్పుతూ.
సమర్థ్ అడిగి అడిగి వడ్డించుకుని తిని, "ఇంతకీ వంట ఎలా చేసావ్?" అని జాగృతిని అడిగాడు.
జాగృతి నవ్వుతూ, "నూనె లేదుకదా అందుకని నీళ్ళతో వంట చెయ్యాల్సివచ్చింది." అని చెప్పింది.
సమర్థ్ నవ్వుతూ, "నీళ్లతో దీపాలు వెలిగించారని విన్నాను కానీ, వంట కూడా చెయ్యచ్చన్నమాట." అని, రాధని చూస్తూ, "ఇప్పటికైనా ఒప్పుకుంటావా జాగృతి పతివ్రతని." అన్నాడు. రాధకి ఆశ్చర్యంతో నోట్లోంచి మాట రాలేదు.
చదువుకుని, ఉద్యోగం చేసే ఆడవాళ్ళని చిన్నచూపు చూస్తూ, వాళ్ళు పతివ్రతలు కారనుకునే రాధకి బుద్ధి చెప్పింది జాగృతి. కోడలి గృహప్రవేశం జరిగిన రోజు సాయంత్రమే అత్తగారు తిరుగు ప్రయాణం పట్టింది.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya/profile
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు





Comments