top of page
Original.png

అత్తగారి కథలు - 26: 'అట'

10 hours ago
4 min read

అత్తగారి కథలు 26 అట – పెళ్లికి ముందు ఊహించిన పచ్చని ప్రశాంతమైన అత్తగారింటికి భిన్నంగా, పెళ్లి తరువాత ఎదురైన వాస్తవాలను చూసి ఆశ్చర్యపోతున్న జాగృతి – ఎల్. వి. జయ తెలుగు కుటుంబ కథ.

Atthagari Kathalu - 26: Ata - Telugu Emotional Family Story | L. V. Jaya

అత్తగారి కథలు -26: అట! - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | L. V. జయ

Published in manatelugukathalu.com on 08/10/2026 


అత్తగారి కథలు - 26: 'అట' (ఎక్స్పెక్టేషన్ వెర్సెస్ రియాలిటీ)


"నీకో సంబంధం వచ్చింది. వాళ్లది రాజమండ్రి దగ్గరలోనున్న ఊరు. ఊరంతా పచ్చటి పొలాలతో ఉంటుందిట. అక్కడ వాళ్లకి పెద్ద ఇల్లు ఉందిట. ఇంటి చుట్టూ మొక్కలు, ఇంటి ఎదురుగా గోదావరి కాలువ, ఇంటికి దగ్గరలోనే దుర్గగుడి ఉంటాయట." అని జాగృతికి చెప్పింది లత.


"ఊరి గురించి, ఇంటి గురించి సరేనమ్మా! అబ్బాయి గురించి చెప్పండి" అంది జాగృతి.


"అబ్బాయి ఐఐఎం ఢిల్లీలో ఎంబీఏ చేశాడట. ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు" అంది లత.

 

"ఢిల్లీలో ఐఐఎం లేదు. ఇంకేదో ఐఐఎంలో చదివి ఉంటాడు. సరిగ్గా కనుక్కోవచ్చు కదా! ఇంట్లో మనుషులు ఎలాంటివాళ్లు? అది కదా ముఖ్యం! వాళ్ల గురించి చెప్పండి" అని అడిగింది జాగృతి.


"సమర్థ్ వాళ్ల నాన్నగారు మాణిక్యాలరావుగారు. నార్త్‌లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి, రిటైర్మెంట్ తరువాత సొంతూరులో స్థిరపడాలనుకున్నారుట. సమర్థ్ తాతగారు పిల్లలందరికీ పక్కపక్కనే స్థలాలు ఇస్తే, అందరూ అన్నదమ్ములు అక్కడే ఇల్లు కట్టించుకుని ఉంటున్నారట. ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ, అభిమానాలున్నాయిట. సమర్థ్ వాళ్ల అమ్మ రాధగారు హౌస్‌వైఫ్. చక్కగా ఇంటిపట్టున ఉంటారుట. ఆవిడకి భక్తి ఎక్కువట. ఆవిడ తిరగని పుణ్యక్షేత్రం లేదుట. సమర్థ్ వాళ్ల అక్క పావనికి పెళ్లై, ఇద్దరు పిల్లలతో చక్కగా కాపురం చేసుకుంటోందిట. రాధగారి వైపు వాళ్లందరూ వేదపండితులు. మాణిక్యాలరావుగారి వైపు వాళ్లందరూ చదువుకున్నవాళ్లు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లు. ఇంత మంచి సంబంధం నీకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది" అంది లత.


"అన్నింటికీ 'అట' అంటున్నారు!! మీకీ విషయాలన్నీ ఎవరు చెప్పారు?" అని అడిగింది జాగృతి.


"ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? రాధగారే చెప్పారు" అంది లత.


"సరిపోయింది! ఆవిడ చెప్తే నమ్మేస్తారా!! ఇంకెవరినైనా కనుక్కోవాలి లేదా ఒక్కసారి వెళ్లే చూసుకోవాలి. అప్పుడు కదా ఆలోచిస్తాం" అంది జాగృతి కోపంగా.


"నీకన్నీ అనుమానాలే. నీ ఇంజనీరింగ్ చదువుకు తగ్గట్టు ఎంబీఏ అబ్బాయి దొరికాడు. నీలాగే ఐటీలో ఉద్యోగం చేస్తున్నాడు. సిటీలో పెరిగిన నీకు పల్లెటూర్లో, స్వచ్ఛమైన వాతావరణంలో, పచ్చని పంటపొలాల మధ్యలోనున్న అత్తగారిల్లు, భక్తులు, ప్రశాంతమైన జీవితం గడుపుతున్న మంచి మనుషులు దొరికారు. ఇంకేం కావాలి? ఎక్కువ ఆలోచించకుండా ఒప్పుకో" అంది లత బతిమాలుతూ.


*********************************************************


జాగృతి, సమర్థ్‌తో పెళ్లి తరువాత అత్తగారింటికి వెళ్లేంది.


జాగృతి అత్తగారిల్లు ఒక పల్లెటూరి సెంటర్లో, హైవే పక్కనే ఉంది. రోడ్డు మీద వచ్చిపోయే వాహనాల హార్న్ శబ్దాలు, ధూళితో పాటు, సెంటర్లోనున్న బజారుకి వచ్చిపోయే జనాలతో గోలగోలగా ఉంది. గుడి దగ్గర లౌడ్ స్పీకర్లలో పెట్టిన పాటలు ఇంట్లోకి వినపడుతున్నాయి. ఇంట్లోవాళ్లు కూడా మేమేం తక్కువకాదన్నట్టు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఇంత శబ్దాలు, గోల అలవాటులేని జాగృతి, 'వీళ్ల ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు!! ఇంత గోలగోలగా ఉందేంటి? దీనికన్నా సిటీలోనున్న మా ఇల్లే ప్రశాంతంగా ఉంటుంది కదా' అనుకుంది.


ఇంటిచుట్టూ పచ్చదనం ఉంటుందన్నారని బయటకి వచ్చి చూసింది. కొన్ని పూలమొక్కలు, రెండు కొబ్బరిచెట్లు ఉన్నాయి. ఇంటి ఎదురుగానున్న కాలువ చెత్త, నురగతో నిండిపోయింది. జాగృతి ముక్కు మూసుకుని, 'బాబోయ్, ఈ కంపు భరించలేకపోతున్నాను. ఇంటి చుట్టూ పంటపొలాలు, ఇంటి ఎదురుగా కాలువ అంటే ఇదా? ఇంటి పరిస్థితి ఇలా ఉంటే, ఇక ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో?' అనుకుంటుండగా ఇంట్లోనుంచి జాగృతి అత్తగారు రాధ అరుపులు వినిపించడంతో ఏమైయుంటుందాని ఇంట్లోకి వెళ్లి చూసింది.


"మీ తమ్ముడి భార్యకి పనీపాటా లేవా? నా ఇంట్లోకే చూస్తోంది. నా కోడలు ఎలా ఉంటోందోనన్న కుతూహలం. మీరు వెళ్లి, నా విషయాల్లో తలదూర్చొద్దని గట్టిగా చెప్పండి" అని మాణిక్యాలరావు మీద రాధ అరుస్తోంది.


"ఆడవాళ్లు మీరు చూసుకోండి ఇలాంటివన్నీ. నన్ను ఇలాంటివాటిల్లోకి లాగొద్దు" అని కోపంగా అరుస్తూ వెళ్లిపోయాడు మాణిక్యాలరావు.


'భార్యాభర్తలు ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారేమిటి?' అనుకుంది జాగృతి.


"వీళ్ల తమ్ముడు పక్కింట్లోనే ఉంటాడు. మీ చిన్నత్తగారిని పెళ్లిలో చూశావు కదా. ఆవిడ కళ్లన్నీ ఎప్పుడూ నా మీదే. ఆవిడ అంత మంచిది కాదు. బయటెక్కడైనా కనపడినా మాట్లాడకు ఆవిడతో" అని జాగృతికి చెప్పింది రాధ. సరేనంది జాగృతి.


"ఇంక ఇటుపక్క అన్నయ్య ఉంటారు. ముసలివాళ్లు అయిపోయారు; పైగా మీకందరూ ఆడపిల్లలే కదా, మీ ఇల్లు మాకు అమ్మేసి కూతుళ్ల దగ్గరికి వెళ్లిపోండి అని నేను వాళ్లకి నెమ్మదిగా చెప్తే, నా మీద కోపం వచ్చింది వాళ్లకి. నేనేమైనా తప్పు అన్నానా? మాకు చెప్పకుండా ఎవరికో ఇల్లు అమ్మేశారు. అందుకే నేను వాళ్లతో మాట్లాడడం మానేశాను. మీ పెళ్లికి కూడా వాళ్లని పిలవలేదు నేను. నువ్వు వాళ్లతో కూడా మాట్లాడకు. అయినా ఇంకొన్ని రోజుల్లో పెద్దకూతురి దగ్గరికి వెళ్లిపోతారన్నారులే" అని చెప్పింది రాధ.


'పెద్దవాళ్లతో అలా చెప్పేశారేమిటి ఈవిడ? ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయన్నారు!!' అని ఆశ్చర్యపోయింది జాగృతి.


సమర్థ్ అప్పుడే అక్కడికి వచ్చాడు. "నీకు వాళ్లతో పడకపోతే జాగృతిని ఎందుకు వాళ్లతో మాట్లాడొద్దని చెప్పడం?" అన్నాడు చిరాకు మొహంతో.


"వీడికేమీ తెలియదు. అలాగే అంటాడులే గానీ మీరిద్దరూ ఒకసారి మా వియ్యపురాలి ఇంటికి వెళ్లి రండి. నాకు ఆవిడకి పడదు. మీ పెళ్లికి పిలిచినా రాలేదావిడ. కానీ నేను ఎలాంటి కోడల్ని తెచ్చుకున్నానో అని నా కూతుర్ని రోజూ తినేస్తోంది. ఇప్పుడే వెళ్లండి" అని చెప్పింది రాధ. సరేనని జాగృతి, సమర్థ్ బయలుదేరుతుండగా రాధ స్నేహితురాలు భాగ్యం వచ్చింది.


"ఏమిటి భాగ్యం, ఇలా వచ్చావు? మా ఇంటికి నీకు దారి తెలిసిందా? పెళ్లికి పిలిస్తే రాలేదని ఇంక నీతో మాట్లాడడం మానేద్దామనుకున్నాను" అంది రాధ భాగ్యంతో.


"ఎప్పుడు కలుద్దామనుకున్నా నువ్వు ఉండడం లేదు. ముందు కాశీ వెళ్లావన్నారు. తరువాత నీ కొడుకు పెళ్లి నిశ్చయమయ్యిందని విన్నాను. నువ్వు నన్ను పెళ్లికి పిలవకపోయినా, నీకు మంచి కోడలువచ్చిందని అందరూ అంటుంటే విని ఒకసారి చూసి వెళదామని వచ్చాను" అంది భాగ్యం.


"మీ అందరిలా ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుని ఉంటాననుకున్నావా? నెల రోజులు కాశీలో ఉండొచ్చాను. నాలాంటి వాళ్ల కాళ్లకు దండం పెట్టాలి. పెట్టు" అని దబాయించింది రాధ.


"నువ్వు మారవు! పిల్ల నెమ్మదిదానిలా కనపడుతోంది, నీతో ఎలా వేగుతుందో ఏమో?" అని భాగ్యం తెచ్చిన గిఫ్ట్ జాగృతి చేతిలో పెట్టి వెళ్లిపోయింది.


"అందరూ నన్ననేవాళ్లే! నువ్వు వీళ్లని పట్టించుకోకు. సమర్థ్‌తో కలిసి మా వియ్యపురాలి ఇంటికి వెళ్లు" అంది రాధ.


జాగృతి, సమర్థ్‌తో కలిసి బయటకి వస్తుంటే, చిన్నత్తగారు కనపడి పలకరించారు. రాధ తననే గమనిస్తుండడం చూసిన జాగృతికి ఏంచెయ్యాలో అర్థం కాలేదు. నవ్వి అక్కడనుండి వెళ్లబోయింది. చిన్నత్తగారు జాగృతిని ఆపి, "అదేమిటి జాగృతి, మాట్లాడకుండా అలా వెళ్లిపోతున్నావు? మీ అత్తగారు మాట్లాడొద్దని చెప్పిందా? అవునులే, మాట్లాడితే ఆవిడ గుట్టంతా బయటపడుతుందని భయమేమో!! ఇదిగో, ఈవిడ మీ పెద్ద అత్తగారు" అంటూ పక్కనే ఉన్న ఆవిడని పరిచయం చేసింది. జాగృతి పెద్దత్తగారి కాళ్లకు దండం పెట్టింది.


దారిలో సమర్థ్‌తో, "పెళ్లికి ముందు మీ ఇంటి గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా విన్నాను" అంది జాగృతి.


"ఏమిటి, మా గురించి విన్నవన్నీ అబద్ధాలుగా అనిపిస్తున్నాయా?" అన్నాడు నవ్వుతూ.


"నవ్వుతారేమిటి? ఒక అమ్మాయికి ఇదంతా ఎంత ముఖ్యమో తెలుసా? ఎందుకు అన్ని అబద్ధాలు చెప్పారు?" అని అడిగింది జాగృతి.


"వెయ్యి అబద్ధాలు చెప్పెైనా పెళ్లి చేయాలని మా అమ్మ అంటూ ఉండేది. అయినా ఆ అబద్ధాలు నేను చెప్పలేదు, మా అమ్మ మీ అమ్మకి చెప్పింది. అందులో నా తప్పేముంది?" అని జాగృతిని అడిగాడు సమర్థ్.


జాగృతి ఆశ్చర్యపోతూ, "మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడగాలని ఉంది. మీరు ఏ ఐఐఎంలో ఎంబీఏ చేశారు?" అంది సమర్థ్‌తో.


"నేను ఎంబీఏ చేశాను. కానీ ఐఐఎంలో కాదు. అది కూడా మా అమ్మ చెప్పిన అబద్ధమే. దానికి నన్ను బాధ్యుణ్ణి చేయకు. మంచి ఉద్యోగం చేస్తున్నాను, నీకు ఏ లోటు రానివ్వను" అని జాగృతి చేతులు పట్టుకుని చెప్పాడు సమర్థ్.


జాగృతికి బుర్ర తిరిగిపోయింది. 'ఇన్ని అబద్ధాలు చెప్పినవాళ్లను అనాలా? లేక విని నమ్మినవాళ్లను అనాలో?' అర్థం కాలేదు జాగృతికి.


కళ్లతో చూసినవాటిని నమ్మాలి తప్ప, 'అట' అంటూ చెప్పింది విని, నమ్మి, తిరిగి చెప్పేవాళ్లు తల్లెైనా నమ్మకూడదని నిర్ణయించుకుంది.



***



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


L. V. Jaya

రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya/profile

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page