బామ్మ - ఆకాశంలో అద్భుతం
- Munipalle Vasundhara Rani
- 6 minutes ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #BammaMattiloManikyam, #బామ్మమట్టిలోమాణిక్యం, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

బామ్మ కథలు - 7
Bamma - Akasamlo Adbhutham - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published In manatelugukathalu.com On 02/01/2026
బామ్మ - ఆకాశంలో అద్భుతం - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
ఆ రోజు రాత్రి ఊరిలో ఒక్కసారిగా కరెంటు పోయింది. అమెరికాలో అస్సలు కరెంటు పోవడం ఎరగని విశ్వకి ఇది చాలా వింతగా, కాస్త భయంగా అనిపించింది. అంతా చిమ్మచీకటి. చేతిలో సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేద్దామనుకునేలోపు బామ్మ వచ్చి, ఒరేయ్ విశ్వా, చింటూ! రండిరా మేడ మీదకు వెళ్దాం, చల్లని గాలి వస్తుంది అని పిలిచింది. ముగ్గురూ కలిసి మేడ మీదకు వెళ్ళి అక్కడ ఉన్న మంచం మీద కూర్చున్నారు. చుట్టూ ఉన్న చెట్ల నుంచి కీచురాళ్ల శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు.
విశ్వా, పైకి చూడు! ఆకాశం ఎంత బాగుందో అని బామ్మ అంటుంటే, విశ్వ తలెత్తి చూశాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
అమెరికాలో సిటీ వెలుగుల్లో ఎప్పుడూ ఇన్ని నక్షత్రాలు అతనికి కనిపించలేదు. బామ్మా! ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు! అటు పక్కన ఏడు నక్షత్రాలు ఒక చిన్న చెంచా లాగా ఉన్నాయి అని ఉత్సాహంగా అరిచాడు. అవును నాన్న, దాన్ని సప్తర్షి మండలం అంటారు. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక ప్రశ్న గుర్తులా కనిపిస్తుంది. పూర్వకాలంలో మాకు గడియారాలు ఉండేవి కావు, గూగుల్ మ్యాప్స్ అస్సలు లేవు. కానీ ఆ నక్షత్రాలను చూసి మేము సమయం ఎంతో, ఏ దిక్కు ఎటో చెప్పేవాళ్ళం అని బామ్మ మొదలుపెట్టింది.
విశ్వా, ఆ చెంచా లాంటి ఆకారంలో చివరన ఉన్న రెండు నక్షత్రాలను కలిపి ఒక గీతలా ఊహించుకో, ఆ గీత వెళ్లే దారిలో ఒక మెరిసే చుక్క కనిపిస్తుంది చూడు, అదే ధ్రువ నక్షత్రం అని బామ్మ వేలితో చూపిస్తూ చెప్పింది. ఆ నక్షత్రం ఎప్పుడూ ఉత్తర దిశలోనే ఉంటుంది. సముద్రంలో ప్రయాణించే నావికులు, దట్టమైన అడవిలో దారి తప్పిన వాళ్ళు ఆ నక్షత్రాన్నే దిక్సూచిగా వాడుకుంటారు అని బామ్మ వివరించింది. బామ్మ చెప్పిన ఆ 'దిక్సూచి' అనే పదం వినగానే విశ్వ అర్థం కానట్లు మొహం పెట్టాడు. అది చూసి చింటూ వెంటనే, ఒరేయ్ విశ్వా! అదేరా కంపాస్! మన ఫోన్లలో ఉంటుంది కదా, ఇక్కడ ఈ నక్షత్రమే ఆ పని చేస్తుంది అన్నమాట అన్నాడు. బామ్మ నవ్వుతూ, అవును నాన్న! మన దగ్గర కంపాస్ లేనప్పుడు ఆ నక్షత్రమే మనకు దారి చూపిస్తుంది అంది.
అప్పుడే ఆకాశంలో ఒక నక్షత్రం వేగంగా రాలి కిందకు పడుతున్నట్లు అనిపించింది. బామ్మా! చూడు నక్షత్రం కింద పడిపోతోంది! అని చింటూ కంగారుగా కేక వేశాడు. విశ్వ ముఖం భయంతో పాలిపోయింది. ఆకాశం కూడా రాళ్లు భూమి మీదకు వేస్తుందా? మరి మనుషుల మీద పడితే ఎలా? అని కంగారుగా అడిగాడు. ఆ మాటలకు బామ్మ పకపకా నవ్వి, వాడిని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.
ఏం భయం లేదురా మనవడా! అవేమీ మన నెత్తిన పడవులే. మన భూమి చుట్టూరా ఒక గాలి పొర ఉంది చూశావా, అది మనల్ని ఒక పెద్ద రక్షణ కవచంలా కాపాడుతుంటుంది. ఆకాశం నుంచి ఆ రాళ్లు బుర్రున కిందకు వస్తున్నప్పుడు మన గాలితో ఒరుసుకుపోయి, ఆ రాపిడికి అక్కడే కాలి బుగ్గైపోతాయి. మనం చూసే ఆ వెలుగు గీత ఆ రాయి కాలిపోయేటప్పుడు వచ్చే మెరుపే! అది మన దగ్గరకు వచ్చేలోపే బూడిద అయిపోతుంది అని బామ్మ ఎంతో నమ్మకంగా చెప్పింది.
అయితే బామ్మా, ఒకవేళ ఆ రాయి చాలా పెద్దది అయితే ఏం జరుగుతుంది? అని అడిగాడు చింటూ కళ్ళు పెద్దవి చేసి. అప్పుడప్పుడు చాలా పెద్ద రాళ్లు వస్తుంటాయి నాన్న. అవి పూర్తిగా కాలిపోకుండా చిన్న ముక్కలుగా మిగిలి భూమి మీద, పడతాయి. వాటిని ఉల్కలు అంటారు. కానీ అవి మనుషులు ఉన్న చోట పడటం చాలా అరుదు. ఎక్కువగా సముద్రాల్లోనో లేదా మనుషులు లేని ఎడారుల్లోనో పడతాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఒక అతి పెద్ద రాయి భూమిని ఢీకొనడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని సైంటిస్టులు చెబుతుంటారు కదా, అలాంటివి మళ్ళీ జరగకుండా ఆ దేవుడు మన భూమి చుట్టూ ఈ గాలి పొరను ఒక రక్షణ కవచంలా పెట్టాడు అని బామ్మ చెప్పింది.
మరి బామ్మా, ఆ రాయి రాలిపోతున్నప్పుడు కోరిక కోరుకుంటే తీరుతుందంటావు కదా, మరి అది నిజంగానే జరుగుతుందా? అని చింటూ సందేహంగా అడిగాడు. బామ్మ గట్టిగా నవ్వి, అది మన నమ్మకం నాన్న! అంత దూరం నుంచి ఒక వెలుగు కనిపిస్తే మనసులో ఏదో ఒక ఆశ కలగడం సహజం. కోరిక కోరుకోవడం వల్ల ఆ రాయి మనకేం ఇవ్వదు కానీ, ఆ క్షణంలో నీ మనసులో ఏముందో నీకు తెలుస్తుంది. ఆ కోరికను నిజం చేసుకోవడానికి నువ్వు కష్టపడాలి కానీ నక్షత్రం మీద భారం వేయకూడదు అని సరిదిద్దింది.
కరెంటు వచ్చినా సరే, ఆ ముగ్గురు పక్కపక్కనే పడుకుని ఆకాశం వంక చూస్తూనే ఉన్నారు. ఆ గాలి పొర మనందరినీ ఒక తల్లిలా ఎలా కాపాడుతుందో ఆలోచిస్తూ విశ్వ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.
***
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.
