top of page
Original.png

బర్త్‌డే కేక్


మనవడి పుట్టినరోజులో తొలిసారి అందమైన బర్త్‌డే కేక్‌ను చూసిన తర్వాత లీలా మనసులో ఒక చిన్న కోరిక పుట్టింది—“నా బర్త్‌డేకి కూడా ఒక్కసారి కేక్ కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది?”

Birthday Cake- Telugu Emotional Family Story | Sritha

బర్త్‌డే కేక్ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 05/09/2026


మన కోసం ఎన్నో కోరికలను వదులుకున్న పెద్దవాళ్ల మనసులో కూడా చిన్న చిన్న ఆశలు మిగిలే ఉంటాయి. కేక్ కట్ చేయాలనే లీలా, కిషన్‌ల చిన్న కోరిక ఎన్నో సంవత్సరాల తర్వాత ఎలా తీరిందో చెప్పే మధురమైన కుటుంబ కథ.



లీలా, కిషన్‌ దంపతులకు వయసు మీద పడింది. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. ఎవరి చదువులు, ఎవరి ఉద్యోగాలు అంటూ పిల్లలంతా హైదరాబాద్‌, ఢిల్లీ, బాంబే అంటూ ఒక్కొక్కరు ఒక్కో ఊరికి వెళ్లిపోయారు. చివరికి ఆ పెద్ద ఇంట్లో మిగిలింది లీలా, కిషన్‌ ఇద్దరే.


వాళ్ల కాలంలో పుట్టినరోజు అంటే పెద్ద హంగామా ఏమీ ఉండేది కాదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్లడం, ఇంటికి వచ్చి పాయసం చేసుకోవడం, దేవుడికి పెట్టి అందరూ తినడం—అంతే!


కేక్‌లు, బలూన్లు, క్యాండిల్స్‌ లాంటి వాటి గురించి వాళ్లకు పెద్దగా పరిచయం లేదు.


ఒకసారి లీలా, కిషన్‌ తమ కూతురి ఇంటికి వెళ్లారు. ఆ రోజు వాళ్ల మనవడి పుట్టినరోజు.


మనవడు తాతయ్య దగ్గరకు వచ్చి,

“తాతయ్యా! ఈరోజు నా బర్త్‌డే. సాయంత్రం అందరినీ కేక్‌ కటింగ్‌కి పిలుస్తున్నాను!” అన్నాడు.


“అలాగా! సరే బాబూ,” అన్నారు కిషన్‌గారు.


లీలా మనవడిని ముద్దు పెట్టుకుని, తన దగ్గరున్న డబ్బులు బహుమతిగా ఇచ్చింది.


అప్పట్లో పిల్లల పుట్టినరోజంటే పెద్దవాళ్లు డబ్బులు ఇచ్చి,

“నీకు నచ్చింది కొనుక్కో!”

అనేవారు. లేదంటే వాళ్లకు నచ్చిన బట్టలు కొనుక్కొచ్చి పెట్టేవారు.


సాయంత్రానికి ఇల్లు సందడిగా మారిపోయింది. పిల్లలు, స్నేహితులు అందరూ వచ్చారు. గుమ్మానికి బలూన్లు కట్టారు. ఇంట్లో నవ్వులు, కేరింతలు మొదలయ్యాయి.

లీలా, కిషన్‌ ఇద్దరూ ఒక మూల కూర్చుని ఆ సందడిని చూస్తున్నారు.


ఇంతలో కిషన్‌గారి దృష్టి ఒక పెద్ద డబ్బాపై పడింది.

“ఏమిటో ఈ డబ్బా?” అని లీలను మెల్లగా అడిగారు.


“ఏమో! అడిగితే మనకే తెలియదని అనుకుంటారేమో. కాసేపు చూద్దాం,” అంది లీలా.


అంతలో అల్లుడు ఫోన్‌లో ఎవరికో చెబుతున్నాడు.

“స్ట్రాబెర్రీ వద్దు… రెడ్‌ అండ్‌ వైట్‌ కావాలి… అది వద్దు… ఇది కావాలి…”


కిషన్‌గారు లీల వైపు చూశారు.

“అమ్మో! కేక్‌కి కూడా ఇన్ని రకాలున్నాయా?”

లీలా నవ్వుతూ,

“మన కాలంలో రవ్వ లడ్డూ, బూందీ లడ్డూ, బేసన్‌ లడ్డూ… కొబ్బరి ఉండలు. అంతే కదా! ఇప్పుడు లడ్డూలకే పోటీగా కేక్‌లు వచ్చాయేమో!”

అంది.


అంతలో ఆ పెద్ద డబ్బా ఇంటికి వచ్చింది.

కిషన్‌గారు దాన్ని ఎత్తుకుని ఆశ్చర్యపోయారు.

“ఇంత పెద్ద డబ్బా… కానీ బరువు మాత్రం ఏమీ లేదే!”

అంటూ లోపలికి తీసుకెళ్లారు.


“ఫ్రిజ్‌లో పెట్టాలి నాన్నా,” అంది కూతురు.


“అదా?”

అని ఆశ్చర్యపోయి ఫ్రిజ్‌లో పెట్టేశారు.


కానీ ఇద్దరికీ ఆ డబ్బాలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది.

అడిగితే ఏమనుకుంటారో అని మౌనంగా ఉండిపోయారు.


ఇంతలో మనవడు వాళ్ల దగ్గరికి వచ్చి,

“ఈరోజు నా హ్యాపీ బర్త్‌డే! కేక్‌ మీద హ్యాపీ బర్త్‌డే రాస్తాను!” అన్నాడు.


కిషన్‌గారు లీల వైపు చూసి,

“కేక్‌ మీద కూడా రాస్తారా?”

అన్నట్టు చూశారు.


లీలా కూడా,

“ఏమో!” అన్నట్టు తల ఊపింది.


సాయంత్రం అయింది.

కూతురు, అల్లుడు కొత్త బట్టలు తీసుకొచ్చారు. మనవడికి తొడిగారు. లీలా, కిషన్‌ కూడా కొత్త బట్టలు వేసుకున్నారు. వాళ్లు కూడా మనవడికి బహుమతిగా డబ్బులు ఇచ్చారు.


చివరికి ఆ పెద్ద డబ్బా తెరిచారు.

అందులోంచి బయటికి వచ్చిన కేక్‌ను చూసి లీలా కళ్లు పెద్దవయ్యాయి.

అంత అందంగా అలంకరించిన కేక్‌ను చూసి,

“అయ్యో! దీన్ని ఎలా కోస్తారు? ఇంత అందంగా ఉంది కదా!” అంది.


కేక్‌ మీద క్రీమ్‌తో పూలు, రంగురంగుల అలంకరణలు, మధ్యలో Happy Birthday అని రాసి ఉంది.


కిషన్‌గారు దగ్గరికి వెళ్లి,

“ఇంత అందంగా ఉందంటే… దీన్ని కోయడం పాపం కాదా?”

అన్నారు.


అందరూ నవ్వారు.

మనవడు కేక్‌ కట్‌ చేశాడు.

మొదటి ముక్క తీసుకుని పరుగెత్తుకుంటూ తాతయ్య, అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు.

“అమ్మమ్మా… తాతయ్యా…”

అంటూ వాళ్లిద్దరికీ కేక్‌ పెట్టాడు.


లీలా చిన్న ముక్క రుచి చూసింది.

“అరే! ఇది చాలా బాగుందే!”


కిషన్‌గారు కూడా రుచి చూసి,

“మెత్తగా ఉంది. మన వయసులో పళ్లకు కూడా ఇబ్బంది ఉండదు!” అన్నారు.


అందరూ నవ్వారు.

కేక్‌ అందరికీ పంచారు. పుట్టినరోజు వేడుక చాలా సందడిగా జరిగింది.

కొద్దిసేపటి తర్వాత లీలా కూతురిని మెల్లగా అడిగింది,

“అమ్మా… దీనిని ఏమంటారు?”


“కేక్‌ అంటారు అమ్మా. ఇది బర్త్‌డే కేక్‌. పుట్టినరోజున కట్‌ చేస్తాం.”


“పుట్టినరోజుకేనా?”


“సాధారణంగా పుట్టినరోజుకే. కానీ ఎప్పుడైనా కట్‌ చేసుకోవచ్చు.”


ఆ మాట లీలా మనసులో ఎక్కడో నిలిచిపోయింది.

“ఎప్పుడైనా కట్‌ చేసుకోవచ్చు…”


ఆమెకు ఒక్కసారిగా ఒక చిన్న కోరిక పుట్టింది.

“నా బర్త్‌డేకి కూడా ఒక కేక్‌ కట్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది?”


కానీ ఆ మాట బయటకు రాలేదు.

ఆ వయసులో మనసులోని కోరికలను బయట చెప్పడం అంత సులభం కాదు.

బర్త్‌డే హంగామా అయిపోయింది.

లీలా, కిషన్‌ దంపతులు తమ సొంత ఊరికి తిరిగి వెళ్లిపోయారు.


కానీ వాళ్ల మనసుల్లో మాత్రం ఒక కొత్త విషయం చేరిపోయింది.

కేక్!


మనవడి బర్త్‌డే రోజు తిన్న ఆ మెత్తటి కేక్‌ లీలాకు బాగా నచ్చింది. ముఖ్యంగా తన బర్త్‌డేకి కూడా ఒక కేక్‌ కట్‌ చేసుకోవాలన్న కోరిక మనసులో బలంగా నాటుకుపోయింది.


కొద్ది రోజులకు లీలా పుట్టినరోజు వచ్చింది.

ఉదయం గుడికి వెళ్లారు. ఇంటికి వచ్చి పాయసం చేసుకున్నారు. స్వీట్‌ ప్యాకెట్‌ తెచ్చుకున్నారు.

అంతే!


కానీ లీలా మనసులో మాత్రం—

“కేక్‌ ఎక్కడ?”


కిషన్‌గారికి అది అర్థమైంది.

“నీకు కేక్‌ తినాలనుంది కదా?” అని అడిగారు.


లీలా ఏమీ అనలేదు. కానీ ఆమె ముఖమే సమాధానం చెప్పింది.

“సరే! నేను వెళ్లి కేక్‌ తీసుకొస్తాను.”

అంటూ కిషన్‌గారు బయలుదేరారు.


అది పెద్ద పట్టణం కాదు. చిన్న ఊరు. హైదరాబాద్‌లా ఎక్కడ చూసినా బేకరీలు, పెద్ద పెద్ద కేక్‌ షాపులు ఉండేవి కాదు. అప్పట్లో స్విగ్గీ, జొమాటో అనే పేర్లు కూడా ఎవరికీ తెలియవు.


ఒక చిన్న బేకరీ కనిపించింది.

కిషన్‌గారు లోపలికి వెళ్లారు.

“కేక్‌ ఉందా?”


“ఉంది సార్‌.”


అని ఒక చిన్న గుండ్రటి కేక్‌ చూపించాడు షాపువాడు.

కిషన్‌గారు దాన్ని చూసి,

“ఇదేనా కేక్‌?”


“అవును సార్‌.”


“ఒక్కటేనా?”


“ఇంకోటి కూడా ఉంది.”


“అది?”


“అదీ కేకే!”


కిషన్‌గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

మనవడి బర్త్‌డే రోజు చూసిన కేక్‌ గుర్తొచ్చింది.

అది ఎంత అందంగా ఉందో!


ఇక్కడ మాత్రం ఒక గుండ్రటి కేక్‌, దాని మీద కొంచెం క్రీమ్‌!

“ఇదే తీసుకెళ్తే లీలా ఏమనుకుంటుందో?”

అనుకున్నారు.


చివరికి కేక్‌ కొనకుండా ఒక స్వీట్‌ ప్యాకెట్‌ తీసుకుని ఇంటికి వచ్చేశారు.

“ఇదిగో!”

అని లీలకు ఇచ్చారు.

లీలా స్వీట్‌ ప్యాకెట్‌ చూసి నవ్వింది.

కానీ ఆ నవ్వులో కొంచెం నిరాశ ఉంది.

“పర్లేదులే,” అంది.


బర్త్‌డే అయిపోయింది.

మరుసటి రోజు పెద్ద మనవడు వాళ్లను చూడటానికి వచ్చాడు.


“ఏమైంది తాతయ్య? అమ్మమ్మ బర్త్‌డే ఎలా జరిపారు?”


కిషన్‌గారు నిట్టూర్చారు.

“ఏం జరపాలి రా! అమ్మమ్మకు కేక్‌ కొనాలని అనుకున్నాను. కానీ మన ఊర్లో నాకు నచ్చిన కేక్‌ దొరకలేదు.”


“అయ్యో తాతయ్యా! ఆ మాట నాకు ముందే చెప్పాల్సింది కదా! నేను ఏదో ఒకటి పంపించేవాడిని.”

అన్నాడు మనవడు.


ఆ రోజు మనవడు ఇంట్లోనే మంచి బిర్యానీ వండించాడు.

అందరూ కలిసి కూర్చుని తిన్నారు.

నవ్వులు, కబుర్లు, సరదాలతో ఇల్లు సందడిగా మారిపోయింది.

కానీ లీలా మనసులో మాత్రం ఒక చిన్న కోరిక అలాగే మిగిలిపోయింది.

“ఒక్కసారి అయినా నా కేక్‌ కట్‌ చేసుకోవాలి…”


కొంతకాలానికి వాళ్ల పెళ్లిరోజు వచ్చింది.

కిషన్‌గారికి ఒక్కసారిగా ఆలోచన వచ్చింది.


“బర్త్‌డేకే కేక్‌ కట్‌ చేయాలా? పెళ్లిరోజుకి కూడా కేక్‌ కట్‌ చేస్తారు కదా!”


అదే సమయంలో వాళ్లు ముంబైకి వెళ్లే అవకాశం వచ్చింది. టూరిస్టుల బృందంతో కలిసి ముంబై చూడటానికి బయలుదేరారు.


ముంబై చేరుకున్నాక కిషన్‌గారికి మరో ఆలోచన వచ్చింది.


“ఇక్కడ కేక్‌ దొరకడం కష్టమేమీ కాదు. లీలకు సర్ప్రైజ్‌ ఇద్దాం!”


అలా ఒక రోజు ఎవరికీ చెప్పకుండా కిషన్‌గారు ఒక పెద్ద బేకరీలోకి వెళ్లారు.

లోపలికి అడుగు పెట్టగానే…

కిషన్‌గారికి తల తిరిగినంత పనైంది!

అది బేకరీనా?

లేక కేకుల రాజ్యమా?


ఒక కేక్‌ పెళ్లికూతురిలా ఉంది.


మరో కేక్‌ కారులా ఉంది.


ఇంకొకటి కార్టూన్‌ బొమ్మలా ఉంది.


మరోటి స్పైడర్‌మ్యాన్‌లా ఉంది.


ఒక కేక్‌ మీద పూలే పూలు.


మరో కేక్‌ నగల పెట్టెలా ఉంది.


“అయ్యో! ఇవన్నీ కేకులేనా?”

అని కిషన్‌గారు ఆశ్చర్యపోయారు.


షాపువాడు వచ్చి,

“సార్‌, రెడ్‌ వెల్వెట్‌ కావాలా?”

అన్నాడు.


కిషన్‌గారు,

“వద్దులే బాబూ! రెడ్‌ వెల్వెట్‌ ఎందుకు? ఇంట్లో కూర్చుని ఎర్రటి వెల్వెట్‌ దుప్పటి కప్పుకోవాలా?”

అన్నారు.


“బ్లాక్‌ ఫారెస్ట్‌ ఉంది సార్‌.”


“బ్లాక్‌ ఫారెస్ట్‌?”

కిషన్‌గారు కళ్లు పెద్దవి చేశారు.

“అది నల్ల అడవా? లేక కేకా?”


“కేక్‌ సార్‌!”


“అయితే అడవి పేరెందుకు పెట్టారు?”


షాపువాడు నవ్వు ఆపుకోలేకపోయాడు.

“వైట్‌ ఫారెస్ట్‌ కూడా ఉంది సార్‌.”


“అదేమిటి? తెల్ల అడవా?”


“ఫ్రూట్‌ కేక్‌ ఉంది సార్‌.”


“అది మాత్రం అర్థమైంది. పండ్లు ఉంటాయిగా!”

అన్నారు కిషన్‌గారు ఊపిరి పీల్చుకుంటూ.


“ఇది థీమ్‌ కేక్‌.”


“నాకు థీమ్‌ ఏమీ వద్దు. నాకు కేక్‌ కావాలి. తినడానికి!”

అన్నారు.


చివరికి కేకులన్నీ చూసి చూసి ఆయనకు తల తిరిగిపోయింది.

“లీలకు ఏది నచ్చుతుందో దేవుడికే తెలుసు!”

అని చేతులెత్తేశారు.


కేక్‌ కొనకుండా బయటికి వచ్చారు.

దారిలో ఒక మంచి హల్వా కనిపించింది.

“ఇదే బాగుంది. మనకు తెలిసినది… మన నాలుకకు తెలిసినది!”

అని హల్వా తీసుకున్నారు.


ఆ రోజు పెళ్లిరోజు సందర్భంగా అందరూ లీలా, కిషన్‌లను విష్‌ చేశారు.

హల్వా తిన్నారు.

నవ్వుకున్నారు.

పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

రోజంతా ఎంతో ఆనందంగా గడిచింది.

కానీ లీలా మనసులో మాత్రం…

“ఒక్క చిన్న కేక్‌ అయినా కట్‌ చేసి ఉంటే బాగుండేది…”

అనే బాధ మిగిలిపోయింది.


వయసు పెరుగుతూనే ఉంది.

కానీ లీలా మనసులో కేక్‌ కట్‌ చేయాలనే ఆశ మాత్రం తగ్గలేదు.

అసలు కేక్‌ ఎలా కొనాలి? ఎలా కట్‌ చేయాలి? ఎలా తినాలి? అన్నది కిషన్‌గారికి కూడా సరిగ్గా తోచలేదు.


“ఇలా కాదు. మనమే కేక్‌ ఎలా చేయాలో నేర్చుకుందాం!”

అని ఒకరోజు ఇద్దరూ బేకింగ్‌ క్లాస్‌కి వెళ్లారు.


అక్కడ మేడమ్‌ మొదలుపెట్టింది—

“ఫస్ట్‌ టేక్‌ ద ఫ్లోర్‌, యాడ్‌ ద బట్టర్‌, బీట్‌ ద ఎగ్స్‌, ప్రీహీట్‌ ద ఓవెన్‌…”


కిషన్‌గారు లీల వైపు చూశారు.

లీలా కిషన్‌గారి వైపు చూసింది.

ఇద్దరి కళ్లలో ఒకటే ప్రశ్న—

“ఆమె మన భాషలో మాట్లాడుతుందా?”


మేడమ్‌ ఇంకా ఏవేవో చెబుతూనే ఉంది.

చివరికి కిషన్‌గారు,

“అమ్మా! మాకు కేక్‌ తినాలనుంది. కేక్‌ తయారు చేయడం ఇంత పెద్ద పరీక్ష అయితే మేము పాస్‌ అవ్వం!”

అని చెప్పి క్లాస్‌ నుంచి బయటికి వచ్చేశారు.


కాలం మాత్రం ఆగలేదు.

పిల్లలు పెద్దయ్యారు.

మనవడు పెద్దయ్యాడు.

ఒకరోజు అతని పెళ్లి కూడా అయిపోయింది.

ఆ తర్వాత మునిమనవడు కూడా వచ్చేశాడు.

ఇన్ని సంవత్సరాలు గడిచినా…

లీలా కేక్‌ మాత్రం కట్‌ కాలేదు!


పెద్దవాళ్లకు కూడా కోరికలు ఉంటాయి.

కానీ వాళ్లు వాటిని మనతో చెప్పరు.

“ఇది అడిగితే పిల్లలు ఏమనుకుంటారో?”


“మన వయసులో ఇవన్నీ ఎందుకు?”


“ఇంత చిన్న కోరిక కోసం చెప్పడం బాగుంటుందా?”

అని వాళ్లే తమ కోరికలను మనసులో దాచుకుంటారు.


నిజానికి మనం వాళ్లను గమనించి తెలుసుకోవాలి.

వాళ్ల చిన్న చిన్న కోరికలు తీర్చినప్పుడు…

మనకు ఎవరెస్ట్‌ ఎక్కినంత ఆనందంగా ఉంటుంది!

ఎందుకంటే చిన్న ఆశలు జీవితానికి పెద్ద బలాన్ని ఇస్తాయి.


మరికొన్ని సంవత్సరాలు గడిచాయి.

మునిమనవడి ఫస్ట్‌ బర్త్‌డే వచ్చింది.

ఇంట్లో సందడి మొదలైంది.


ముందురోజే పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు, బంధువులు అందరూ ఇంటికి చేరిపోయారు.

కేక్‌ల ఆర్డర్లు వరుసగా రావడం మొదలైంది.

ఈ కాలంలో కేక్‌ ఆర్డర్‌ చేయడం కూడా ఒక ఫ్యాషన్‌!

ఒకటి ఫ్రూట్‌ కేక్‌.


ఒకటి చాక్లెట్‌.

మరోటి వైట్‌ క్రీమ్‌.

ఇంకొకటి ఏదో కొత్త పేరు.


లీలా, కిషన్‌ మాత్రం ఆ కేక్‌ డబ్బాలన్నింటినీ చూస్తూ కూర్చున్నారు.

వాళ్లకు కేక్‌ ఎలా కొనాలో తెలియదు.


కానీ…

కేక్‌ కట్‌ చేయాలనే కోరిక మాత్రం తెలుసు!

ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

“చెప్పుదామా?”

అన్నట్టుగా.


“వద్దులే… ఏమనుకుంటారు?”

అన్నట్టుగా.


అప్పుడప్పుడు సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన కోరికలకే తాళం పడిపోతుంది.

“ఈ వయసులో కేక్‌ కట్‌ చేయాలనుకుంటున్నారా?”

అని ఎవరైనా నవ్వితే?


అందుకే ఇద్దరూ నిశ్శబ్దంగా కేక్‌లను చూస్తూనే ఉన్నారు.

ఇంతలో మనవరాళ్ల గ్యాంగ్‌ వాళ్లను గమనించింది.

“తాతయ్యా! అమ్మమ్మా! ఏం చూస్తున్నారు?”


“ఏం లేదు!”

అన్నారు ఇద్దరూ ఒకేసారి.


“అయితే ఆ కేక్‌లనే ఎందుకు చూస్తున్నారు?”


కిషన్‌గారు చివరికి చెప్పేశారు.

“మీరు కేక్‌లను ఎంత అందంగా కట్‌ చేస్తారో చూస్తున్నాం. ఇంత అందంగా ఉన్నదాన్ని ఎలా కట్‌ చేస్తారో అనిపించింది.”


ఒక మనవరాలు నవ్వుతూ,

“అందుకేనా ఇంతసేపు చూస్తున్నారు?”


“అవును. మేమైతే కేక్‌ అంటే ఒక రొట్టెలా ఉంటుందని అనుకున్నాం. మీరేమో దాన్ని పూలతో, పండ్లతో, క్రీమ్‌తో అలంకరించి పెళ్లికూతుర్ని చేసినట్టు చేస్తున్నారు!”

అన్నారు కిషన్‌గారు.


మరొక మనవరాలు,

“తాతయ్యా, రుచి కూడా చాలా బాగుంటుంది!”


“అవును. మెత్తగా ఉంటుంది. తియ్యగా ఉంటుంది. కానీ తింటూ పోతే డయాబెటీస్‌ కూడా వస్తుంది!”

అని లీలా వెంటనే జోడించింది.


అందరూ నవ్వారు.

“మీ జనరేషన్‌ వాళ్లు ఫుడ్‌ని కూడా ఇంత అందంగా మార్చేస్తారే!” అన్నారు కిషన్‌గారు.


పిల్లలు వాళ్లిద్దరి ముఖాలు చూసి నవ్వుకున్నారు.

“అమ్మమ్మా, మీరెప్పుడైనా కేక్‌ కట్‌ చేశారా?”

అని ఒక మనవరాలు అల్లరిగా అడిగింది.


లీలా సిగ్గుపడుతూ,

“లేదు…”

అంది.


“అయితే ఒకరోజు మేమే మీకు కేక్‌ కట్‌ చేయిస్తాం!”

అన్నారు పిల్లలు.


“అయ్యో! పోండి పోండి… చాలా రాత్రయింది. పడుకోండి!”

అని లీలా వాళ్లను పంపించింది.


పిల్లలు కూడా,

“సరే అమ్మమ్మా! గుడ్‌నైట్!”

అంటూ వెళ్లిపోయారు.


రాత్రి పన్నెండు గంటలకు ఇంకా రెండు నిమిషాలే ఉంది.

అంతలో—

తపతప! తపతప!

తలుపు కొట్టిన శబ్దం.

లీలా, కిషన్‌ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.

“ఈ రాత్రి ఎవరు?”


మళ్లీ—

తపతప! తపతప!

బయట నుంచి మనవరాళ్ల గొంతు.

“అమ్మమ్మా! తాతయ్యా! బయటికి రండి!”


కిషన్‌గారు లేచి,

“ఎవరొచ్చారు?”

అని అడిగారు.


“ఎవరో వచ్చారు. కత్తి కూడా పట్టుకుని వచ్చారు!”


కిషన్‌గారు ఒక్కసారిగా గంభీరంగా,

“కత్తా? అయితే నా గన్ను తీస్తాను!”


“తాతయ్యా! గన్ను అక్కర్లేదు. ముందు తలుపు తీయండి!”

అన్నారు పిల్లలు.

తలుపు తీశారు.

బయట మనవరాళ్లు ఒకవైపు, మనవళ్లు మరోవైపు నిలబడి ఉన్నారు.

మధ్యలో ఒక పెద్ద పెట్టె!

“ఇదేంటి?”

అని లీలా అడిగింది.


“ఓపెన్‌ చేయండి!”


పెట్టె తెరిచారు.

అందులో ఒక అందమైన తెల్లటి క్రీమ్‌ కేక్‌!


పైన పండ్లతో అందంగా అలంకరించి ఉంది.

మధ్యలో పెద్ద అక్షరాలతో—

HAPPY BIRTHDAY TO YOU

అని రాసి ఉంది.


లీలా, కిషన్‌ ఇద్దరూ మాటరాకుండా చూస్తున్నారు.

“ఇది… ఎవరి బర్త్‌డే?”

అని కిషన్‌గారు అడిగారు.


మనవరాళ్లు ఒకేసారి,

“మీదే!”

అన్నారు.


“మాదా?”


“అవును! మీరు మర్చిపోయారేమో. మీ బర్త్‌డే!”

అన్నారు.


లీలా కళ్లల్లో నీళ్లు మెరిశాయి.

“మా బర్త్‌డేకి కేక్‌?”


“అవును అమ్మమ్మా. ఇన్ని సంవత్సరాలుగా మీరు కేక్‌లను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడడం కాదు… కట్‌ చేయాలి!”

అన్నారు.


కిషన్‌గారు నవ్వుతూ,

“కానీ మాకు కేక్‌ కట్‌ చేయడం రాదు!”


“అందుకే మేమున్నాం కదా!”

అన్నారు మనవరాళ్లు.


మునిమనవళ్లు కూడా చిన్న చిన్న అడుగులతో అక్కడికి వచ్చారు.

“మేమూ కట్‌ చేస్తాం!”

అంటూ కేక్‌ దగ్గర నిలబడ్డారు.


కిషన్‌గారు కత్తి పట్టుకున్నారు.

లీలా పక్కన నిలబడింది.

“అమ్మమ్మా… రెడీ?”


“రెడీ!”


“తాతయ్యా… మీరు కూడా?”


“నేను ఎప్పుడో రెడీ!”

అన్నారు.


అందరూ కలిసి—

“త్రీ… టూ… వన్…”

అంటూ కేక్‌ కట్‌ చేశారు.


చప్పట్లు.

నవ్వులు.

కేరింతలు.

లీలా కళ్లల్లో ఆనందం.

కిషన్‌గారి ముఖంలో చిన్నపిల్లాడి నవ్వు.

లీలా కేక్‌ ముక్కను రుచి చూసి,

“ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది దీనికోసమేనా!”

అంది.


కిషన్‌గారు,

“కేక్‌ చిన్నదే… కానీ మన ఎదురుచూపు మాత్రం పెద్దదే!”

అన్నారు.


అందరూ నవ్వారు.

ఆ రాత్రి లీలా, కిషన్‌ ఇద్దరూ కేక్‌ తిన్నది మాత్రమే కాదు…

ఎన్నో సంవత్సరాలుగా మనసులో దాచుకున్న ఒక చిన్న కోరికను కూడా తియ్యగా తీర్చుకున్నారు.


పెద్దవాళ్లకు మనం పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు.

వాళ్లకు కావాల్సింది ఒక్కోసారి ఒక చిన్న మాట.

ఒక చిన్న శ్రద్ధ.

ఒక చిన్న కోరికను గమనించడం.


ఒకప్పుడు మన కోసం వాళ్లు ఎన్నో చిన్న చిన్న కోరికలను వదులుకున్నారు.

ఇప్పుడు వాళ్ల వంతు.

వాళ్లు అడగకపోయినా…

“మీకు ఏదైనా చేయాలనుందా?”

అని ఒక్కసారి అడిగి చూడండి.


ఎక్కడో ఒక మూలన వాళ్ల బాల్యం ఇంకా బతికే ఉంటుంది.

ఆ బాల్యాన్ని ఒక్కసారి బయటకు తీస్తే…

వాళ్ల ముఖంలో కనిపించే ఆనందం మనకు నిజంగానే ఎవరెస్ట్‌ ఎక్కినంత సంతోషాన్ని ఇస్తుంది.


ఎందుకంటే—

చిన్న ఆశలు జీవితానికి పెద్ద బలాన్ని ఇస్తాయి.

చిన్న కోరికలు జీవితంలో పెద్ద సంతోషాన్ని నింపుతాయి.


కాబట్టి మీ ఇంట్లో ఉన్న లీలా, కిషన్‌లాంటి పెద్దవాళ్లను ఒకసారి గమనించండి.


వాళ్లకు కూడా ఏదో ఒక చిన్న కోరిక ఉండొచ్చు.

బహుశా అది చాలా ఖరీదైనది కాకపోవచ్చు.

బహుశా వాళ్లు అడగడానికి కూడా సిగ్గుపడుతుండొచ్చు.

ఆ కోరిక ఏదైనా సరే… ఒకసారి తీర్చండి.


ఎందుకంటే వాళ్లకు మీరు ఇచ్చే ఆ చిన్న ఆనందం…

వాళ్ల జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

బర్త్‌డే కేక్‌ ఒక్కటే కావచ్చు…

కానీ దాన్ని కలిసి కట్‌ చేసిన బంధాలు మాత్రం ఎన్నో!


— Shrita


శుభం.


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page