top of page
Original.png

చెదిరిన గూడు

39 minutes ago
8 min read

“చెదిరిన గూడు” కథలో కుటుంబ బాధ్యతలు మోస్తున్న రమ, అనారోగ్యంతో ఉన్న అన్నయ్య, చదువుకుంటున్న చెల్లి, విషాదంలో నానమ్మ మరియు కుటుంబాన్ని నాశనం చేసిన మద్యపానం ప్రతిబింబించే దృశ్యం

Chedirina Goodu - Telugu Social Story | Madhupatra Sailaja Uppaluri

చెదిరిన గూడు - తెలుగు సామాజిక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 05/10/2026


“చెదిరిన గూడు” ఒక హృదయస్పర్శి తెలుగు సామాజిక కథ.

మద్యపానం, పేదరికం, కుటుంబ కలహాలు ఒక కుటుంబాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో రమ, కుమారి జీవితాల ద్వారా ఈ కథ చూపిస్తుంది.


రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందినంతగా మరే నగరం అభివృద్ధి కాలేదని చెప్పవచ్చు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు అయ్యాక, రాష్ట్ర రాజధానిగా పలు రంగాలలో ముందంజ వేసింది. చిన్నచిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా రోజుకి వెయ్యి రూపాయల సంపాదన కళ్ళ చూస్తున్నారు.


అలా ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, చిన్నచిన్న వృత్తుల కోసమో, మరేదైనా ఉపాధి కోసమో హైదరాబాద్ నగరానికి దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా వలసలు రావటం ప్రారంభమయ్యింది. ఆ కారణాలతోనే నగర జనాభా బాగా పెరిగింది.


హైటెక్ సిటీ నిర్మాణంతో సాంకేతికతలో మరో అడుగు ముందుకేసింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు చాలా వచ్చాయి. రోజురోజుకీ పెరుగుతున్న కుటుంబ ఖర్చులను తట్టుకోవడానికి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది.


ఇంట్లోని పెద్దలను, చంటిపిల్లలను చూసుకోవడానికి ‘సహాయకులు’ అవసరమవుతున్నారు. నాలుగైదు సంవత్సరాల నుండి ఆ సహాయకులను అవసరమైన కుటుంబాలకు చేరువ చేసే సంస్థలు కూడా ఎక్కువైనాయి.


అలాంటి సంస్థే “లక్ష్మి సేవా సంస్థ”. దాని మేనేజర్ రాజ్యలక్ష్మి. ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆఫీసు రూంలో తన కోసం ఎదురుచూస్తున్న కొందరు ఆడపిల్లలను కలవటానికి వచ్చింది. వారంతా రెండు రాష్ట్రాలలోని పల్లెటూర్ల నుండి వచ్చిన వారే.


అందరిలోనూ బాగా చిన్న వయస్సుగా కనిపిస్తున్న రమని “ఏమ్మా? నీది ఏ ఊరు? నీ వయస్సెంత? మా సంస్థ గురించి తెలుసుకునే వచ్చావా?” అంటూ ప్రశ్నించింది.


“అమ్మా! నమస్కారం. మా పిన్ని కూడా మీ దగ్గరే గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఆమె ద్వారానే ఈ సంస్థ గురించి తెలుసుకున్నాను. మాది రాజమండ్రి దగ్గరలో ఉన్న గోకవరం గ్రామం” అంటూ జవాబిచ్చింది రమ.


“వంటపనులు, పసిపిల్లలను సాకటం, పెద్దవాళ్ళను నిరంతరం కనిపెట్టుకుని ఉండటం వంటి పనులను ఇక్కడి నుండి మేము పంపే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. బెడ్‌పేషెంట్స్ ఉన్నట్లయితే కాస్త జీతం ఎక్కువ వస్తుంది. నీ భోజనాదులన్నీ ఆ ఇంటివారే చూసుకుంటారు.


నిజాయతీగా, శుభ్రంగా అక్కడి వారిని ప్రేమగా చూస్తూ నీ పనులను చేసుకోవాల్సి ఉంటుంది. మేం వాళ్ళ నుండి తీసుకున్న సొమ్ములో కొంత మన ఆఫీస్ గురించి మినహాయించుకుని మిగతా డబ్బు నీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం.


మన ఆఫీసులో పనిచేసే వారే నిన్ను ఆ ఇంటి దగ్గర దింపి వస్తారు. నువ్వు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మన ఆఫీసులో నాకు కనిపించిన తరువాతనే వెళ్ళాలి. కనీసం మూడు నెలల దాకా సెలవులడగకూడదు.


ఎంత అత్యవసరమైనా మేం వేరే మనిషిని నీ దగ్గరకి పంపేదాకా ఎదురుచూడాలి. నీ ప్రవర్తన ఓ మంచి అమ్మాయిని పంపామని ఆ ఇంటివారు మెచ్చుకునేలా ఉండాలి.


పై కండిషన్స్ నీకు నచ్చితే రేపు నిన్ను ఓ ఇంటికి పంపిస్తాను. నీవు ఇలాంటి పనులు ఇదివరకెప్పుడూ చేయలేదని తెలిసింది. మరి జాగ్రత్తగా చెప్పిన పనులు చేయగలవా? రాత్రంతా బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు” అంటూ తన ఫోను నెంబర్ రమకి ఇచ్చింది రాజ్యలక్ష్మి.


ఇంకా కుమారి, లీలలు కూడా “తమకి పని ఎప్పుడు దొరుకుతుందా?” అని ఎదురుచూస్తున్నారు. వాళ్ళు కొద్దికాలంగా వివిధ ఇళ్ళలో పని చేసి సెలవుపై తమ ఊళ్ళకి వెళ్ళి తిరిగి పని కోసం వచ్చారు.


రాత్రి భోజనాలయ్యాక అయిదారుగురు ఆడపిల్లలు ఆఫీసు గది నానుకుని ఉన్న హాలులో చాపలు పరచుకుని నిద్రకుపక్రమించారు.


రమ, కుమారీలకు స్నేహం కుదిరింది. “అక్కా! నువ్వు ఎప్పటి నుండి ఇక్కడ పని చేస్తున్నావు?” అని అడిగింది రమ.


ఆమె మాటలకి నవ్వుతూ “రెండేళ్ళ నుండి ఇక్కడే పనిచేస్తున్నాను. నా భర్త తాగుడికి అలవాటుపడి గుండెపోటుతో చనిపోవటంతో ఉన్న అప్పులను తీర్చడానికి ఇద్దరు చిన్న పిల్లలను అమ్మ దగ్గర వదిలేసి ఇలా పనికి రావాల్సి వచ్చింది.


మా ఊళ్ళో ఉన్నప్పుడు కూలిపనికి పోయేదాన్ని. కానీ అక్కడ ప్రతిరోజూ పని దొరకదు. అంతేకాక ఇక్కడ చేసే పనికి మనం పెద్దగా శ్రమ పడవలసిన అవసరం ఉండదు. డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. మనం కాస్త ఓపిక వహించి పనిని సర్దుబాటు చేసుకుంటే విశ్రాంతి కూడా దొరుకుతుంది. అంతా మంచిగానే ఉంటుంది. నువ్వేమీ భయపడవలసిన పని లేదు” అని చెప్పింది కుమారి.


ఆమె మాటలు విన్న రమ కళ్ళు ఆశ్చర్యంతో కలువల్లా విచ్చుకున్నాయి. “ఏంటక్కా! నీకు పెళ్ళవటం, ఇద్దరు పిల్లలు పుట్టటం, భర్త చనిపోవటం కూడా జరిగిందా? నీకెంత వయస్సుందని? ఇది కలా? నిజమా? నేనింకా నువ్వు పెళ్ళికాని పిల్లవనే అనుకుంటున్నాను” అంది రమ.


“కొన్ని జీవితాలు అంతే రమ. నాకు 15 ఏళ్ళకే పెళ్ళయ్యింది. అతను తాగుబోతు అని తెలియక మా వాళ్ళు అయిన సంబంధమని చేశారు. అతణ్ణి మార్చడానికి ప్రయత్నించే కొద్దీ తాగుడు మరీ ఎక్కువై ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు.


అతను పోయేసరికి 5 ఏళ్ళ పిల్ల, 2 ఏళ్ళ కొడుకులతో పాటు దాదాపుగా లక్ష రూపాయల అప్పులు నాకు మిగిలాయి. అప్పు తీర్చుకోవడానికి మరో దారి లేక పిల్లల్ని ముసలివాళ్ళ దగ్గర వదిలి ఈ పనికి వచ్చాను. వాళ్ళని బాగా చదివించుకోవాలంటే నేను కష్టపడకుంటే జరగదు.


ఈ సెల్‌ఫోన్లు వచ్చి నాలాంటి వారికి కొంత మేలు చేస్తున్నాయి. నా పిల్లాణ్ణి రోజు చూసుకోవడానికి వీలవుతోంది. అప్పుడప్పుడు వాడు ఫోనులో ‘తొందరగా వచ్చేయమ్మా’ అంటూ పిలుస్తూంటే ఇక్కడి పని వదిలి వెళ్ళిపోవాలి అనిపిస్తూంటుంది.


కానీ ఇంత దూరం వచ్చింది ఎంతోకొంత సంపాదించుకోవడానికేగా? నాలాగా వాళ్ళ జీవితాలు కాకూడదంటే ఈ బాధ భరించక తప్పదు” అని దృఢనిశ్చయంతో అంటున్న కుమారి ఆత్మవిశ్వాసానికి అచ్చెరువొందింది రమ.


“అక్కా! ఈ తాగుడుంది చూశావు? కొంపల్ని సర్వనాశనం చేసేస్తోంది. బంగారంలాంటి కుటుంబ బంధాలను దూరం చేస్తోంది” అంటూ దుఃఖం అడ్డుకోగా మాటలాపేసింది రమ.



“ఏమిటి? నీ జీవితం కూడా తాగుడుతోనే ముడిపడి ఉందా? అంతగా బాధపడుతున్నావు?” అంది కుమారి.


“ఔనక్కా! నాదింకో విషాద గాథ. దాంట్లో ఓ చక్కని పొదరిల్లులాంటి ఇల్లు.


అమ్మ, నాన్న, అన్న, నేను, చెల్లి, నానమ్మలతో కలసి హాయిగా ఉంటున్న కుటుంబం మాది. కానీ నాన్న తాగుడుతో అంతా చెల్లాచెదురైపోయింది. పెళ్ళికి ముందే మా అమ్మ పదవ తరగతి పాసయ్యింది. కాలేజీలో చేరతానని తాతతో గొడవపడిందట.


కానీ ‘బాగా చదువుకున్న పిల్లగాళ్ళు మన కుటుంబాలలో ఎక్కువ కట్నకానుకలు అడుగుతారు’ అని, అందుకే చదివిన చదువు చాలు. నా స్నేహితుడి కొడుకు పెళ్ళికున్నాడు. మేస్త్రీ పని చేసుకుంటున్నాడు. హాయిగా వాణ్ణి పెళ్ళిచేసుకుని సుఖంగా కాపురం చేసుకో అని చెప్పి అమ్మ పదహారవ ఏటనే పెళ్ళి చేసేశాడు మా తాత.


అమ్మ చాలా అందంగా ఉండేది. పైగా నాన్న కన్నా ఎక్కువగా చదువుకుంది. అమ్మ అందం, కొద్దోగొప్పో మాట్లాడే ఇంగ్లీష్ మాటలు నాన్నని కలవరపెట్టాయి. అన్నయ్య పుట్టేదాకా అవన్నీ మనసులో పెట్టుకుని ఉన్న నాన్న క్రమంగా తనలోని అనుమాన భూతాన్ని వెలుపలకి తీసుకొచ్చాడు.


అన్నయ్యకి 4 ఏళ్ళ వయస్సులో “పక్కనే ఉన్న టౌన్‌లోని కాన్వెంట్‌లో చదివిద్దాం. పిల్లవాడికి బంగారు భవిష్యత్తుని అందిద్దాం.


అందుకయ్యే ఖర్చుల నిమిత్తం నేను కూడా ఏదైనా పన్లో చేరతాను” అన్న అమ్మతో గొడవలకి దిగాడు నాన్న. “ఇంట్లో కూర్చుని మాకు వండిపెట్టు. నిన్ను ఏ పనులకీ పంపేది లేదు. నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు, సరుకులు తేవడానికి అంగడికెళ్ళేటప్పుడు చూస్తున్న నా స్నేహితులు నీ అందాన్ని నా ముందు పొగుడుతూంటే నా మనసు కుతకుతలాడిపోతోంది.

ఇక నువ్వు పనుల్లోకి కూడా వెళ్ళావంటే నా పని ఆ సారా కొట్టుకే అంకితం కావాల్సివస్తుంది” అంటూ అమ్మని ఇంటిలోనే బందీ చేసేశాడు నాన్న.


కనీసం వీధిలో ముగ్గు పెట్టాలన్నా, దొడ్లో బట్టలుతకాలన్నా చీకటి వేళప్పుడు మాత్రమే చేయమనేవాడు నాన్న. పెళ్ళయిన అయిదేళ్ళకే ముగ్గురు పిల్లలం పుట్టాం. నాన్న కట్టుబాట్లతో నలిగిపోతున్న జీవితం అమ్మకి నచ్చలేదు. మనసులో కుంగిపోసాగింది.


చదువంటే ఇష్టమున్న అమ్మ అన్నయ్య కాస్త పెద్దవాడయ్యాక ఊరి గ్రంథాలయం నుండి పుస్తకాలను తెప్పించుకుని, నాన్న పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన సమయంలో ఆయన కంటపడకుండా చదువుకునేది. కానీ ఆ దాపరికం ఎక్కువ కాలం సాగలేదు. అమ్మ పుస్తకాలను చదువుతోందనే విషయం తెలుసుకున్న నాన్న పెద్ద గొడవ చేశాడు.


నాన్నలాగానే అన్నయ్యకి కూడా చదువు మీద శ్రద్ధ తక్కువ. బాగా చదవటంలేదని స్కూలులో ఎప్పుడుచూసినా దెబ్బలు తినేవాడు. ఎట్లాగో తంటాలుపడుతూ, వానాకాలం చదువులు చదువుతూ, అయిదవ తరగతి అయ్యిందనిపించాడు.


దాంతో అమ్మ చెపుతున్నా వినకుండా వాణ్ణి స్కూలు మానిపించి తన వెంట పనులకి తిప్పేవాడు నాన్న. అదేమంటే ‘పనులు నేర్చుకుంటే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు కదా’ అంటూ వితండ వాదనకి దిగేవాడు.


నాన్న ఒంటిచేతి సంపాదన ఇంట్లో తిండికే సరిపోయేది కాదు. దాంతో నాన్న ఎక్కువ పనులు చేయాల్సివచ్చేది. ఆ పనుల వల్ల బక్కప్రాణంగా ఉండే నాన్నకి వచ్చే నీరసం కోపంలోకి మారేది. మనిషికి మంచి అలవాట్లు రావాలంటే కష్టంగానీ, చెడు లక్షణాలు మాత్రం క్షణాలలో అబ్బుతాయి.


నాన్న పగలు సంపాదించిన డబ్బులో చాలా భాగం సాయంత్రం కల్లు దుకాణానికే పోయేది.

“పండుగల సమయంలోనైనా ఆడపిల్లలకి బట్టలు తీసుకోవాలి కదా. ఎందుకిలా తాగుడికి ఖర్చుచేసి అనారోగ్యం కొని తెచ్చుకోవటం” అంటూ నానమ్మా, అమ్మలు శతవిధాల నచ్చచెప్పినా నాన్న ప్రవర్తనలో మార్పు రాలేదు. కొద్దిరోజులకే నాన్న మంచం పట్టాడు. అమ్మ తన పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం అమ్మి వైద్యం చేయించింది.


అనారోగ్యం తరవాత నాన్న ఎక్కువగా పనులకి వెళ్ళలేక పోయేవాడు. నానమ్మ, అమ్మలు కూలీకి వెడతామంటే ఒప్పుకోకపోగా పంచాయితీ పెట్టి తిట్టిపోశాడు. అమ్మకి రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. “భగవంతుడా! నాకు ఇద్దరాడపిల్లలనిచ్చావు.


వీళ్ళ చదువులు కూడా నా చదువులాగే అర్ధంతరంగా ఆగిపోవాలా? వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి?” అనే ఆలోచనలతో తిండి కూడా సయించక నానమ్మతో చెప్పి బాధపడేది.


అలాంటి పరిస్థితులలో ఒకరోజు అమ్మావాళ్ళ బాబాయిగారి కొడుకు కృష్ణ మా ఇంటికి వచ్చాడు. చెల్లెలు పుట్టినప్పుడు ఒకసారి వచ్చిన కృష్ణ మామయ్య మళ్ళీ ఇన్నాళ్ళకి వచ్చాడు. ఆ సమయానికి నాన్న ఇంట్లో లేడు. “మా కుటుంబ పరిస్థితిని విడమరచి చెప్పి ఏం చేయాలిరా? ఈ పిల్లల్ని ఎలా గట్టెక్కించాలి? మగపిల్లవాడు ఎలాగోలా బ్రతికేస్తాడు.


ఆడపిల్లల గురించే నా దిగులు. చదువుల సంగతి పక్కనపెట్టినా కనీసం బట్టలు, తిండి చూడాలి కదా” అంటూ వాపోయింది అమ్మ.


“మొన్న ఒకరోజు మీ బావ, నీ మేనల్లుడికి పని నేర్పించాలని పట్టుబట్టి పని నేర్పిస్తూంటే వాడి చిట్టిచేతులకి పుళ్ళుపడి అన్నం కలుపుకోలేక ‘అమ్మా! నాకు ముద్దలు చేసి నోట్లో పెట్టవా?’ అంటూ చేతులు చూపించి విలవిల్లాడి పోయాడు.


వాడి చేతులకి నూనె రాస్తూ ‘నీకు తల్లి ఉన్నా లేనట్లేరా. నీతో పనులు చేయిస్తూ కూర్చుని తింటున్నాను చూడు. ఈ అన్నం నాకు విషంతో సమానంగా అనిపిస్తోంది. పిల్లల ముందు బండరాయిలా పడున్నాను’ అంటూ ఏడ్చింది అమ్మ.


‘అక్కా! కష్టార్జితంతో బ్రతికేవారికి జీవితంలో ఎప్పటికీ తలదించుకునే పరిస్థితి రాదు.

బ్రతకడం తెలిసినవాడు ఎడారిలోనైనా, నడిసంద్రంలోనైనా సోమరితనానికి తలవంచడు. నేను చెప్పేదానికి బావ ఒప్పుకుంటే మీకిక ఏ కష్టాలూ ఉండవు’ అన్నాడు కృష్ణ.


‘ఏ విషయంలో మీ బావ ఒప్పుకోవాలిరా?’ అని ఆతృతతో అడిగింది అమ్మ.


‘నా స్నేహితుడొకడు, దుబాయ్, మస్కట్, ఖతర్ వంటి దేశాలలోని ధనికుల ఇళ్ళలో పనులు చేయడానికి మగవారిని, ఆడవారిని పంపే ఏజన్సీ నడుపుతున్నాడు.


అతను చాలా మంచివాడు అక్కా. ఆ విధంగా పంపినందుకు అతను కొంత డబ్బు తీసుకుంటాడు. అతని ద్వారా అలా విదేశాలకి వెళ్ళిన వారు చాలా బాగా సంపాదించుకుంటూ, తమ కుటుంబాలకు ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నారు.


నీవెందుకా పని చేయకూడదు? ఇప్పటి వరకు అతని ద్వారా వెళ్ళిన ఆడవారిలో చదువుకోనివారే ఎక్కువమంది. కానీ నువ్వు పదవ తరగతి వరకు చదువుకున్నావు. ఇంగ్లీష్ కూడా నీకు అర్థమవుతుంది. అనేక పుస్తకాలను చదివావు.


లోకజ్ఞానం కూడా బాగానే ఉంది. నీకు అక్కడ ఉద్యోగం చేయటం చాలా తేలిక అవుతుంది’ అంటూ వివరంగా చెప్పుకొచ్చాడు కృష్ణ. అతని మాటలను జాగ్రత్తగా వింది అమ్మ.


‘ఇక్కడిక్కడి పనులకి వెళ్ళటానికే ఇష్టపడని మీ బావ విదేశాలంటే నన్ను చంపినా చంపేస్తాడు. ఇది జరిగే పని కాదులేరా’ అంటూ అమ్మ గమ్మున ఉండిపోయింది.


కృష్ణ మామయ్య వెళ్ళేటప్పుడు ఆ స్నేహితుని ఫోను నెంబర్ అమ్మకి ఇచ్చి వెళ్ళాడు.


రాత్రి నాన్న వచ్చి భోజనం చేస్తూండగా నానమ్మ కృష్ణ మామయ్య వచ్చిన సంగతి చెపుతూ మామయ్య అమ్మకి చెప్పిన విషయాలనన్నింటినీ పొల్లుపోకుండా చెప్పి, ‘ఆ విదేశాలలో పనికి నీ భార్యని పంపించరా. మన కష్టాలన్నీ తీరిపోతాయట’ అని చెప్పింది.


అంతే, తాగిన మత్తులో ఊగిపోతూ కోపంతో అన్నం పళ్ళాన్ని విసిరిగొట్టి గబగబా బయటకెళ్ళి కానుగపుల్ల విరిచి తెచ్చి అమ్మని ఇష్టంవచ్చినట్లుగా కొట్టడం మొదలుపెట్టాడు.


చుట్టుపక్కలవాళ్ళు, నానమ్మ ఆయనకి అడ్డంవెళ్ళి ఒక గదిలో పెట్టి బయట తలుపులేసేశారు.

ఇంతలో అమ్మ ఎటో వెళ్ళిపోయింది. పిల్లలం నానమ్మని పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాం.


బిక్కుబిక్కుమంటూ అమ్మ కోసం రాత్రితెల్లవార్లూ ఎదురుచూస్తూనే ఉన్నాం. కానీ అమ్మ తిరిగి రాలేదు.


‘అమ్మ మీద నాన్నకి అలా చెప్పావెందుకు? ఇప్పుడు చూడు అమ్మ ఎన్ని దెబ్బలు తిందో? బయటకి వెళ్ళిన అమ్మ రాత్రంతా తిరిగి రాలేదు. ఇప్పుడేం చేద్దాం?’ అంటూ నానమ్మపై గట్టిగా అరిచాం. మరునాడు ఉదయమే..” చెపుతున్న రమ ఆగిపోయింది.


“ఏమయ్యింది రమా? మీ అమ్మ ఆరోజు తిరిగి వచ్చిందా?” అని అడిగింది కుమారి.


“ఊహూ! అలా జరిగితే నేను ఈ మహానగరానికి ఎందుకు వస్తాను? పనుల కోసం ఈ సంస్థలో ఎందుకు చేరతాను? నాన్న తన తప్పును తాను తెలుసుకునే అవకాశం వచ్చేలోగా అమ్మ మా అందరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది.


దాదాపుగా ఒక సంవత్సరం ఆమె జాడ మాకు తెలియలేదు. ఓరోజు కృష్ణ మామయ్య వచ్చి ఆరాత్రి ఇంటి గడప దాటిన అమ్మ, మస్కట్ వెళ్ళిపోయిందని, ఓ గొప్పింటిలో వంటమనిషిగా పనిచేస్తోందని చెప్పి మా చేతిలో కొంత డబ్బు పెట్టి వెళ్ళిపోయాడు.


అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న నాన్న ఆరోగ్యం, మరింతగా దిగజారి పూర్తిగా మంచానికే పరిమితమైపోయాడు. స్వయంకృతాపరాధం వల్లే అమ్మను దూరం చేసుకున్నాననే బాధతో ఒకరోజు రాత్రివేళ గుండెనొప్పి వచ్చి చనిపోయాడు. ముగ్గురం పిల్లలం అనాథలమైపోయాం.


అదుపులోపెట్టే పెద్దవాళ్ళు లేక అన్నయ్య చెడు సావాసాలు పట్టి పేకాటకి, తాగుడికి అలవాటుపడ్డాడు. మూడు నెలల క్రితం అన్నయ్య ఆసుపత్రి పాలయ్యాడు. తెలిసినవాళ్ళ దగ్గర అప్పుచేసి అన్నయ్యని కాపాడుకున్నాను. వాడికింకా పనులకి వెళ్ళే ఓపిక రాలేదు.


అమ్మలాగే చెల్లికి కూడా చదువంటే బాగా ఇష్టం. అందుకే దానిని బాగా చదివించాలి అనుకుని దానిని బడికి పంపటం మాత్రం మానలేదు. హైస్కూలు వరకు దాని చదువు ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కానీ వచ్చే ఏడాది కాలేజిలో చేర్పించాలి. అందుకు డబ్బు కావాలి.


ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను. అన్నయ్యకి ఆరోగ్యం బాగుండనప్పుడు కృష్ణ మామయ్య గుర్తుకొచ్చి అమ్మ గురించిన విషయాలు తెలుస్తాయన్న ఆశతో ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడే అమ్మ గురించిన చేదు నిజం నాకు తెలిసింది.


మస్కట్ వెళ్ళిన అమ్మ మధ్య దళారుల చేతిలో మోసపోయిందట. ఇప్పుడు అమ్మను తిరిగి ఇండియాకి రప్పించుకోవాలంటే కూడా డబ్బు అవసరమవుతుందట.


మా పిన్ని ద్వారా ఈ సంస్థ గురించి తెలిసింది. కనీసం రెండేళ్ళు ఇక్కడ పనిచేస్తే వచ్చే డబ్బుతో మా కష్టాలు కొన్నయినా తీరతాయనే ఆశతో ఉన్నాను. ఇదక్కా నా కథ” అంది రమ.


“చిన్న వయస్సులోనే అన్ని కష్టాలను చవిచూసి తలకిమించిన బాధ్యతలని మీదవేసుకున్నావు. అన్నాచెల్లెళ్ళ గురించి ఎంతో చేయటానికి సిద్ధమయ్యావు.


ఈ పని నచ్చితే, నువ్వనుకున్నట్లుగా ఆ మిగిలే డబ్బుతో కొన్ని పనులైనా పూర్తవుతాయిలే” అంది కుమారి.


“ఆ ఆశతోనే ఇక్కడికి వచ్చానక్కా! అమ్మలాగా వేరే దేశం వెళ్ళలేదుగా. మూడు నెలలకొకసారైనా వెళ్ళి అన్నాచెల్లెళ్ళను చూసి వస్తాను. కొంతలోకొంత బెంగ తీరుతుందిగా” అంది రమ.


“నీ పరిస్థితి నాకన్నా దారుణంగా ఉంది. ధైర్యంగా ఉండు. అంతా బాగా జరుగుతుంది” అంది కుమారి.


“ఔనక్కా! చేతిలో పుస్తకాలను పట్టుకుని కాలేజీలకు వెళ్తున్న ఆడపిల్లలను చూస్తున్నప్పుడల్లా నాకు అమ్మ కోరిక గుర్తుకొస్తుంది. ఆమె కోరికను నేను తీర్చలేకపోయాను. అందుకే కనీసం చెల్లిని బాగా చదివిస్తే అమ్మ ఎక్కడున్నా ఆనందపడుతుంది” అంది రమ.


“శభాష్ రమ! ఇది మహానగరం. ఎటుచూసినా మాయగాళ్ళు ఉంటారు. చిన్నపిల్లవి. ఎవరి మోసపూరిత మాటలను నమ్మవద్దు.


ఇరవైలు దాటని వయస్సులో నీ ఆలోచనలు మంచి దిశగా సాగుతున్నాయి. జాడతెలియని అమ్మను వెతికి ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నావు. మీ అన్నని అమ్మలా మారి కాపాడుకున్నావు. చెల్లి చదువు గురించి ఆలోచించి అమ్మను మరిపిస్తున్నావు.


నీవు వెళ్ళబోయే ఇంట్లోని పెద్దామెను మీ నాయనమ్మలా భావించి సేవ చెయ్యి. ఆ కుటుంబ సభ్యులతో నీవు చక్కగా అనుకూలంగా మసలుకుని మంచి పిల్ల అని పేరు తెచ్చుకోవాలి. తద్వారా నీ కలలను నెరవేర్చుకోవాలి” అంటూ రమను అభినందించింది కుమారి.


***



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page