top of page
Original.png

దేవీ భాగవతము

1 hour ago
7 min read

దేవీ భాగవతము – ఆదిపరాశక్తి దివ్య స్వరూపం, దేవీ నవరాత్రుల అవతార వైభవం
సకల జగత్తుకు మూలశక్తి ఆదిపరాశక్తి – అమ్మవారి దివ్య అవతార వైభవం


Devi Bhagavathamu - Telugu Devotional Poetry | Seeda Nagaraju

దేవీ భాగవతము - తెలుగు ఆధ్యాత్మిక వచన కవిత | సీదా నాగరాజు

Published in manatelugukathalu.com on 24/11/2026


దేవీ భాగవతము ద్వారా దేవీ నవరాత్రుల విశిష్టత, ఆదిపరాశక్తి అవతారాలు, మహిషాసుర మర్దనం, భ్రమరాంబ మహిమలను తెలుసుకోండి. సీదా నాగరాజు భక్తి రచన.


ఆశ్వీయుజ మాసం

శుద్ధ పాడ్యమి విశేషం

దేవీ నవరాత్రులు ప్రారంభం

ఆదిపరాశక్తి ఆరాధనలు ఆరంభం.


అంబ పరమేశ్వరి,

ఆ అఖిలాండేశ్వరి,

శ్రీ భువనేశ్వరి,

మన రాజరాజేశ్వరి.

జగన్మాత దేవీ పురాణం,

ఆదిశక్తి అవతార రహస్యం

తెలుసుకుందాం,

భక్తితో మసలుకుందాం.


త్రిమూర్తులు

సృష్టి, స్థితి, లయ కారకులు

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

అమ్మవారికి అనుచరులు.


సరస్వతి, లక్ష్మి, పార్వతులు

ఆదిపరాశక్తి ప్రతిరూపాలు.


అమ్మలగన్నయమ్మ ఆ తల్లి,

అందరినీ కరుణించే కల్పవల్లి.


సమస్త విశ్వం సాగరమయమైనప్పుడు,

మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు,

ఆయన చెవి గులిమి నుండి పుట్టారు

మధుకైటభులనే రాక్షసులు ఇద్దరు.


మహా తపస్సుతో అమ్మను మెప్పించారు,

స్వచ్ఛంద మరణం వరము కోరుకున్నారు.

కన్నూ మిన్నూ కానక...

దారి తెన్నూ తెలియక...

మహావిష్ణువు నాభిని చేరారు,

బ్రహ్మదేవునితో కయ్యం కోరారు.

వేల సంవత్సరాలు విష్ణువుతో పోరాడారు.


ఒకరి తరువాత మరొకరు,

కాదంటే ఇద్దరూ పోరాడారు.

అలుపు లేదు,

గెలుపు లేదు.

అంతటి శ్రీహరి డస్సి పోయాడు,

కొంచెం విరామం కోరుకున్నాడు.


దిక్కు తోచని బ్రహ్మ, విష్ణువులు

ఆది పరాశక్తిని వేడుకొన్నారు,

తరుణోపాయం చెప్పమన్నారు.


నభోవీధిలో జగన్మాత సాక్షాత్కారం,

మధుకైటభుల లో పుట్టింది వికారం.

వరం కోరుకొమ్మన్న విష్ణువుకే

తమను వధించేందుకు వరమిచ్చారు.


అంతకంతకూ పెంచబడిన వారి శరీరాలు

విస్తారమైన శ్రీహరి తొడలపై నశించాయి.

నవరాత్రులలో రెండో రోజు విదియ,

కావాలి అందరికీ అమ్మ దయ.


సకల పాప హరణం,

గాయత్రీ దేవిగా అమ్మ దర్శనం.


చేస్తూ అమ్మ నామస్మరణం,

తెలుసుకుందాం వ్యాస జననం.


జాలరులు దాశరాజుకి ఇచ్చారు మత్స్యం,

అందులో వచ్చింది మత్స్యగంధి అనే ముత్యం.


ఆవిడే...

పరాశర మహర్షి మరులుగొన్న పడతి,

వ్యాసునికి జన్మనిచ్చిన గొప్ప సుదతి,

శంతనుడు మనువాడిన ప్రియసతి,

కస్తూరి పరిమళాలు వెదజల్లే ఇంతి.


ఆ శంతన తనయుడే దేవవ్రతుడు,

గంగా శంతనుల గారాల పుత్రుడు,

వీరుడు, ధీరుడు, పరాక్రమవంతుడు,

తండ్రి కోసం త్యాగం చేసిన భీష్ముడు.


ఆ శంతనుడే ఒకప్పటి మహాభిషుడు,

సహస్ర అశ్వమేధాలు చేసిన వీరుడు,

స్వర్గానికి వెళ్లి వచ్చిన ఇక్ష్వాకు వంశజుడు,

సత్యలోకంలో బ్రహ్మసభకు హాజరైన ఘనుడు.


అక్కడకు విచ్చేసింది అందాల గంగా,

అనుకోకుండా ఆవిడ పైట తొలగంగా.

అందరూ తలలు దించుకున్నా,

సృష్టికర్త బ్రహ్మ అక్కడే ఉన్నా,

కళ్ళార్పకుండా చూశాడు మహాభిషుడు.

గంగను సైతం ఆకర్షించాడు ఆ ఘనుడు.


బ్రహ్మకు వచ్చెను కోపం,

ఇచ్చెను వారిరువురికి శాపం.

వారి సంతానమే గాంగేయుడు,

తండ్రికి పెళ్లి చేసిన మన భీష్ముడు.


ఇవన్నీ అమ్మ లీలావిలాసాలే,

అమ్మకి మనవన్నీ విన్నపాలే.


మూడవ రోజు ఆశ్వీయుజ శుద్ధ తదియ,

జగజ్జనని సొంతం అంతులేని దయ.


కోసలదేశం రాజు ధ్రువసింధువు,

ప్రజలందరికీ ఆయన ఆత్మబంధువు.

ఆయన భార్యలే మనోరమ, లీలావతి.

పెద్దవాడు సుదర్శనుడు మందమతి,

చిన్నవాడు శత్రుజిత్ మహావీరుడు.

అతని తాత యుధాజిత్ గొప్ప ధీరుడు.


అకస్మాత్తుగా మహారాజ మరణం,

ఆధిపత్యం కోసం జరిగింది రణం.

పోరులో సుదర్శనుడి తాత అస్తమయం,

తల్లీ కొడుకులకి తప్పలేదు పలాయనం.


శరణార్థులై చేరారు భరద్వాజుని ఆశ్రమం,

అక్కడే వసించక తప్పలేదు చాలాకాలం.

అక్కడే 'క్లీం' అనే అమ్మ బీజాక్షరం పలికాడు,

పదేపదే ఆ బీజాక్షరం ఉచ్చరిస్తూ గడిపాడు.


అప్పుడు...

అమ్మ చూపింది అంతులేని దయ,

చేసి చూపించింది అంతుచిక్కని మాయ.


కాశీరాజ కుమారి శశికళకు స్వప్నం,

స్వప్నంలో జగజ్జనని సాక్షాత్కారం,

సుదర్శనుని పెళ్లిచేసుకోమని ఉపదేశం.


స్వయంవరానికి ఆహ్వానం అందిన వైనం,

శత్రుజిత్, యుధాజిత్‌ల మహా సంహారం,

తన రాజ్యమైన కోసల రాజ్య స్వాధీనం.

దేవీ పూజలతో ప్రశస్తమైన కోసల దేశం.


అమ్మ లోకపావని,

మనల్ని నడిపించే జగజ్జనని.

అమ్మను నమ్ముకుందాం,

భక్తి ప్రపత్తులతో బ్రతుకుదాం.


అద్భుతమైన ఆశ్వీయుజ శుద్ధ చవితి,

నవరాత్రుల వైభవం చెప్పాలని ఎంతో ప్రీతి.

సృష్టికర్త బ్రహ్మకు ఆరాధ్య దేవత,

స్థితికర్త విష్ణుమూర్తికి స్ఫూర్తి ప్రదాత,

ప్రళయకర్త రుద్రునికి ఆది పరాదేవత,

ముక్కోటి దేవతలకు ముక్తి ప్రదాత.


అమ్మ! ముగురమ్మల మూలపుటమ్మ,

చాలా పెద్దమ్మ! అమ్మలగన్న అమ్మ, విద్యా వినయములు ప్రసాదించే సరస్వతి,

విజయం, ఐశ్వర్యం అందించే విష్ణుసతి,

అందలం, ఆరోగ్యాలు ప్రసాదించే పార్వతి,

ఈ ముగురమ్మల ఏకరూపమే పరాప్రకృతి.


ఆ పరాశక్తే మహామాయా స్వరూపిణి,

మణిద్వీప నివాసిని,

శ్రీ చక్ర స్వరూపిణి.


అమ్మ వలననే కదా!

బ్రహ్మ శారదతో కూడి సృష్టి చేయుట,

విష్ణువు రమాసహితుడై పాలించుట,

పార్వతితో కూడి శంభుడు సంహరించుట,

ముక్కోటి దేవతలు మనుగడ సాగించుట.


శరణమమ్మ శరణు,

కనికరించమ్మా మమ్ము.

తదుపరి ఆశ్వీయుజ శుద్ధ పంచమి,

అమ్మ అందరికీ ఇవ్వాలి కలిమి.


ఆది పరాశక్తి,

త్రిమూర్తులకు సృష్టి, స్థితి, సంహార శక్తి,

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి,

సరస్వతి, లక్ష్మి, పార్వతులకు అధినాయకి.


నేడు మహా చండీ దేవిగా ఇస్తారు దర్శనం,

రూపం సమ్మోహనం, సకల పాప హరణం.


ధనువు తనయులు రంభ, కరంభులనే రాక్షస గణం,

అందు రంభుడు పంచాగ్నుల మధ్యమున చేసెను తపం

త్రిలోక విజయుడైన పుత్రుని పొందు నిమిత్తం.


అగ్ని ప్రత్యక్షమై కామించిన ఆమె వశవర్తిని అగునని ఇచ్చెను వరం.

వరశక్తికి మురిసిన రంభుడు కామించినది ఒక మహిషం,

మరో మహిషం వెంట పడగా అడ్డుపడిన రంభుడు అయ్యాడు హతం.


వారిరువురి పుత్రుడే మహిషాసురుడు,

కొడుకు కొరకు పుట్టిన రంభుడే రక్తబీజుడు.

ఘోర తపం చేసి పొందాడు బ్రహ్మదేవుని సాక్షాత్కారం,

కోరుకున్నాడు అబల చేతిలో మాత్రమే మరణించే వరం.


వరగర్వంతో స్వర్గంపై దండెత్తాడు,

ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు పరుగెత్తాడు.


బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలసికట్టుగా పోరాడినా,

పట్టువిడవకుండా వంద సంవత్సరాలు

యుద్ధం చేసినా,

మహిషాసురుని మదమణచలేకపోయారు.


అందరూ శ్రీహరి దరి చేరి మార్గాన్ని అన్వేషించనారంభించారు.

దేవతలందరూ ధ్యానమగ్నులు కాగా...

అందరి నుండి ఒక్కొక్క తేజం గగనం చేరగా...

సర్వదేవతా స్వరూపమైన తేజోరాశి ప్రభవించింది.


సహస్ర భుజయుక్తురాలుగా అసుర నాశక

విశ్వమూర్తిగా వెలసింది,

అరివీర భయంకర స్వరూపిణిగా శ్రీదేవి అవతరించింది.


మహా శక్తి స్వరూపిణి అమ్మ పరాక్రమానికి...

బాష్కలుడు బలయ్యాడు,

దుర్ముఖుడు నేలకొరిగాడు,

తామ్రుడు, అసిలోముడు, బిడాలుడు

అందరూ అంతే వేగంగా అంతమొందారు.


పొందు కోరి వచ్చిన మహామాయా స్వరూపుడు

మహిషాసురుడు భయానకంగా మర్దించబడ్డాడు.


ఈ కథ పారాయణ చేసిన వారికి సర్వాపదలు తొలగి, సుఖ సంతోషముల ఆనందమూర్తులై అంత్యమున శ్రీదేవి సాన్నిధ్యమొందగలరు.


మరుసటి రోజు ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి,

లోకం సమస్తం అమ్మ భువనేశ్వరి సృష్టి.

శారదా దేవిగా అమ్మ సాక్షాత్కారం,

సర్వ మానవాళికి శుభకరం, శ్రేయస్కరం.


దేవతోత్తముడు, మహా తపస్వి త్వష్ట ప్రజాపతి

ఇంద్రునిపై కోపంతో తపస్సు చేసిన అధిపతి.


పొందాడు మూడు తలల త్రిశిరుడిని కుమారుడుగా,

ఆ కారణ జన్ముడే విఖ్యాతి చెందాడు విశ్వరూపుడుగా.

భోగేచ్ఛ లేని నిత్య తపోమూర్తి,

మూడు కార్యాలూ ఒకేమారు సలుపు పుణ్యమూర్తి.


ప్రశాంత వాతావరణంలో తపోజీవనం సాగిస్తున్నాడు,

పదవి పోతుందేమోనని ఇంద్రుడు త్రిశిరుని సంహరించాడు.


త్వష్టప్రజాపతి ఆగ్రహోదగ్రుడే అయ్యాడు,

తపోబలంతో అథర్వణ మంత్రాల హోమం చేశాడు,

భీకర ఆకృతితో కాలమృత్యువు వలె వృత్రుడు ఉదయించాడు.


తండ్రి యానతి మేర ఇంద్రుని ఓడించి,

స్వర్గాన్ని జయించాడు,

ఇంద్రుని పట్టుకొని తన నోటిలో వేసుకొన్నాడు.

మింగేలోగా బయటపడిన ఇంద్రుడు

తక్షణమే పలాయనం చిత్తగించాడు.


త్రిమూర్తులు సహా అందరూ అమ్మని ప్రార్థించారు,

వృత్రుని వశవర్తిని చేసుకొని కార్యం సానుకూలం చేయమని అర్థించారు.

మహామాయ చేసింది వాగ్దానం,

వృత్రునిపై మొదలయ్యింది ప్రభావం.


ఇంద్రుని నమ్మాడు, స్నేహం చేశాడు,

విశ్వాసఘాతకుడు ఇంద్రుడు

నమ్మించి మరీ వృత్రుని సంహరించాడు.


ఖేదం పొందిన త్వష్ట ఇంద్రుని శపించాడు,

తత్ఫలితంగా దేవేంద్రుడు మానసోత్తరం వెళ్లాడు.

పద్మనాళంలో దాగి అజ్ఞాతవాసం చేశాడు,

అజ్ఞాతవాస దీక్షతో తన పాప ప్రక్షాళనకు పూనుకున్నాడు.


అప్పుడు...

దేవతలు నహుషుడు అనే రాజుని ఇంద్రుని చేశారు,

సురలోక పాలనం చేయమని కోరారు.


శచీదేవిని తన భార్యగా ఉండమన్నాడు ఆ నహుషుడు.

ఏమీ పాలుపోని శచీదేవి భువనేశ్వరిని ఆరాధించింది,

కరుణించిన తల్లి శచీదేవిని పతివద్దకు చేర్చింది.


ఉపాయం చెప్పాడు ఇంద్రుడు; సప్తఋషులు మోస్తుండగా పల్లకిలో రమ్మని కబురు పంపింది.

అలాగేనని కామాతురతో వచ్చిన నహుషుడు సర్పమయ్యాడు.


ఇంద్రుడి ఉపాయం ఫలించింది,

శచీదేవికి అపాయం తప్పిపోయింది.

అంతా అమ్మ భువనేశ్వరి లీలావిలాసం,

ఇంద్రుడికి తప్పింది అజ్ఞాతవాసం.


తదుపరి రోజు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి,

అమ్మలగన్న అమ్మకు శిరసా నమామి.


జగజ్జనని అమ్మ...

దుర్గముడు అనే రాక్షసుడ్ని సంహరించారు,

దుర్గమ్మగా భక్తుల పూజలందుకొన్నారు.

మహిషాసురుడిని మర్దించారు,

మహిషాసురమర్దినిగా స్తుతించబడ్డారు.


ఒకానొకప్పుడు...

శర్యాతి అనే రాజు వన విహారానికి వెళ్లాడు,

వెంట తన కుమార్తె సుకన్యను తీసుకు

వెళ్లాడు.


ఆ వనంలో...

చ్యవనుడు శ్రీదేవి పద ధ్యాన తత్పరుడై,

సర్వము త్యజించి జితేంద్రియుడై

తపస్సు చేసుకుంటున్నాడు.


చాలా వృద్ధుడై పోయాడు,

చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి,

కళ్లు మాత్రమే జ్యోతుల్లా వెలుగుతున్నాయి.


ఇవేమీ తెలియని సుకన్య...

పుట్ట వద్దకు చేరింది,

ఆకతాయితనంతో ముళ్ళు తీసుకుంది,

ఆ రెండు జ్యోతులను పొడిచింది.


ముళ్ళు వెంట రక్తం బయటికి వచ్చింది,

సుకన్య వణికిపోయింది.

విషయం శర్యాతికి తెలిసింది,

సుకన్యను మందలించాడు,

చ్యవనుని శరణు కోరాడు,

ప్రాయశ్చిత్తం చెప్పమని వేడుకొన్నాడు. 


చ్యవనుడు సుకన్యని భార్యగా ఉంచమన్నాడు.

సరేనని ఒప్పుకుంది సుకన్య,

చ్యవనుని సతి అయ్యింది ఆ కన్య.

భర్త వృద్ధుడని భావించలేదు,

తన యౌవనం వృథా అనుకోలేదు,

చ్యవనుని దైవమిచ్చిన భర్తగా భావించింది,

పతియే ప్రత్యక్ష దైవమని నమ్మింది,

మనస్ఫూర్తిగా పతికి సేవలు చేసింది,

పతివ్రతా శిరోమణిగా శుశ్రూష చేసింది.


అంతలో....

అశ్వినీ దేవతలు అగుపించారు,

తమతో సంతోషంగా సుఖించమన్నారు.

పరులెవరైననూ తనకు సోదరులేనంది,

తన భర్తయే తనకు సర్వస్వమని చెప్పింది.


పట్టువిడువని అశ్వినీ దేవతలు పందెం కాశారు,

చ్యవనుని కూడా తమను పోలి ఉండేలా మార్చారు,

మువ్వురిలో తన భర్తను కనిపెట్టమన్నారు.


సుకన్య అమ్మవారిని ప్రార్థించింది,

తన భర్తను సులువుగా కనిపెట్టింది.

అశ్వినీ దేవతలు సంతోషించారు,

తమ వైద్యంతో చ్యవనుని యువకుడ్ని చేశారు.


చ్యవనుడు వారి కోర్కెను మన్నించారు,

హోమం చేసి సోమపాన అర్హత వారికి కల్పించారు.


అమ్మను నమ్ముకుంటే....

మన నమ్మకం వమ్ము కాదు,

మనకి జరగని పని ఉండదు,

అంతా మంచే జరుగుతుంది,

అమ్మ ఆయురారోగ్యాలు ఇస్తుంది,

అమ్మ సిరిసంపదలు ప్రసాదిస్తుంది.


లోకాః సమస్తాః సుఖినోభవంతు.

అందరికీ వందనం.


నేడు ఆశ్వీయుజ శుద్ధ అష్టమి,

జగదీశ్వరి అమ్మ అందరికీ బలిమి.

పంచభూతాలు అమ్మ అవతారాలు,

పంచ శక్తులు అమ్మ అద్భుత రూపాలు.


శ్రీ గణేశ జనని పార్వతి,

చదువుల తల్లి సరస్వతి

అమ్మవారి శక్తి రూపాలే,

అమ్మవారి అవతారాలే.

ఐశ్వర్య ప్రదాత్రి లక్ష్మి కూడా అమ్మవారి రూపమే,

దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే దుర్గాదేవి అమ్మ అవతారమే,

శ్రీకృష్ణుని ప్రేమ దేవత రాధ కూడా పంచ శక్తులలో మరో రూపమే,

ఇవన్నీ శ్రీ జగన్మాత అద్భుత లీలావిలాసమే.


ఆమే మన ప్రకృతి,

ఈ లోకమే ఆమె ఆకృతి.

ఆ శక్తి...

శివ స్వరూపిణి,

నారాయణి,

పూర్ణ బ్రహ్మ స్వరూపిణి,

తేజో స్వరూపిణి,

సర్వ సంపత్స్వరూపిణి,

భక్తానుగ్రహ కారిణి,

సర్వేశ్వరి,

జగదీశ్వరి,

లోకేశ్వరి,

భువనేశ్వరి.


రాజ్యములో రాజ్యలక్ష్మి,

స్వర్గములో స్వర్గలక్ష్మి,

వైకుంఠమున మహాలక్ష్మి,

ద్రవ్యంలో శోభాలక్ష్మి,

కైలాసంలో పార్వతి,

సత్యలోకములో సరస్వతి,

పవిత్ర శక్తి అయిన గాయత్రి,

సర్వశక్తి పరాయణ సావిత్రి.


ఐశ్వర్య ప్రదాత,

ఆరోగ్య ప్రదాత,

అన్నీ అమ్మే.


అమ్మ మనసా వాచా సదా స్మరామి,

ఆమె పాదారవిందాలకు శిరసా నమామి.


తరువాత రోజు ఆశ్వీయుజ నవమి,

మనందరం ఆయుధపూజ చేసే మహర్నవమి.


మధ్యాహ్నానికి వచ్చింది దశమి,

మనందరం జరుపుకొనే విజయదశమి.

ఈ శుభ సందర్భంలో...

తెలుసుకుందాం అమ్మ విజయ గాథ,

తలచుకుందాం అమ్మ కరుణ గాథ.


పూర్వం అరుణుడు అనే దానవుడు ఉండేవాడు,

వాడు మహా బలుడు, అంతకు మించి గొప్ప ఖలుడు,

దేవద్వేషి,

పాతాళవాసి,

దేవతలంటే కసి,

గాయత్రీ జప పరాయణుడైన తాపసి.


బ్రహ్మను గూర్చి చేశాడు తపం,

బ్రహ్మ గాయత్రీ సమేతుడై అయ్యాడు ప్రత్యక్షం.


అడిగాడు మృత్యువు లేని వరం,

కుదరదన్నాడు అపర పరబ్రహ్మం.


శస్త్రాలు, అస్త్రాలు, స్త్రీలు, పురుషులు, ద్విపాద, చతుష్పాద జంతువులు

ఇతరత్రా రాకూడదు మరణం,

అలా ఇవ్వండి నాకు అభయం

అని కోరుకున్నాడు ఆ అరుణుడు.


తథాస్తు అని బ్రహ్మ అంతర్ధానమయ్యాడు.

అంత అరుణుడు దేవతలపై మోగించాడు రణభేరి,

ఇంద్రుడు సంప్రదించాడు బ్రహ్మ, రుద్ర, హరి.


అరుణుడు గాయత్రీ జప పరాయణుడు,

తేలికగా నిర్జింప అనితర సాధ్యుడతడు.

అమ్మవారు మాత్రమే మార్గం చూపగలరు,

అందుకే 'అమ్మా' అంటూ దీక్ష వహించారు.


రాయబారిగా వెళ్లారు బృహస్పతి,

సాదరంగా ఆహ్వానించాడు దానవపతి.


మాటలతో రెచ్చగొట్టాడు బృహస్పతి,

ఆవేశపూరితుడు అవుతాడు దానవపతి.


మహామాయను ప్రయోగిస్తుంది జగదంబ,

గాయత్రి వలదంటాడు ఆవేశంతో గర్వంగా.


హమ్మయ్య అనుకుంటాడు బృహస్పతి,

వెళ్లిరండి అని దారి చూపుతాడు దానవపతి.


దేవతలు సంతోషంగా అమ్మను ఆరాధిస్తారు,

అమ్మ అనంత కోటి భ్రమరాలను సృష్టిస్తారు,

గుంపులు గుంపులుగా దానవులపై ప్రయోగిస్తారు.


దానవసేన కలవరపడింది,

కత్తులు దూయలేని స్థితికి గురయ్యింది.


ఝుమ్మని ఝుంకారంతో చెవుల రొద, మాట వినబడక చెప్పుకోలేని బాధ.

కోటాను కోట్ల భ్రమరాల తాకిడి,

చెవులకు చిల్లులు పడ్డట్లుగా రాపిడి.

రాక్షసులు క్షణాలలో మరణించారు,

అరుణుడు కూడా అంతమొందాడు.


భ్రమర రాణి భ్రమరి అయి పరమ పూజ్య అయింది,

ఆ అమ్మే శ్రీశైలంలో ఉన్న శాకంబరి అయిన భ్రమరాంబగా వెలసింది.


భక్తవత్సలి,

భయనివారణి,

అభయ ప్రదాయిని,

అమ్మకు వందనం,

పాదాభివందనం.


సంస్కారమే సురులు,

అహంకారమే అసురులు.

మంచీ చెడూ ఎంచక,

కన్నూ మిన్నూ కానక,

దౌర్జన్యం చేసేవాడే అసురుడు,

పరులను హింసించేవాడే రాక్షసుడు.


శిష్టజన రక్షణం,

అమ్మ కరుణాకటాక్ష వీక్షణం.

అమ్మ వీక్షణములో తీక్షణం,

దుష్టజన శిక్షణం.


అందుకే అమ్మ మహిషాసురమర్దిని,

శుంభ నిశుంభుల సంహారిణి,

అరుణాసురుని అంతమొందించిన అఖిలాండేశ్వరి,

చండ ముండాసురులను సంహరించిన

చాముండేశ్వరి,

మధుకైటభులను విష్ణువు చేత సంహరింపజేసిన జగదీశ్వరి,

రక్తబీజుడు, ధూమ్రలోచనుల

అంతం చూసిన పరమేశ్వరి,

భండాసురుని తునుమాడిన లలిత,

దుర్గమాసురుని దండించిన దుర్గామాత.


జయము జయము అమ్మ లలితకు,

శుభము శుభము అమ్మ భక్తులకు.


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 







మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పరిచయం

సీదా నాగరాజు

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page