ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు!
- Nallabati Raghavendra Rao
- Aug 31, 2022
- 11 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Ee Manishi Repair Cheyabaddaadu' New Telugu Story
Written By Nallabati Raghavendra Rao
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ఆనందరావు తన కొడుకును చదువు నిమిత్తం చెన్నై హాస్టల్ లో ఉంచడానికి వచ్చి, తగిన ఏర్పాట్లు చేసి... తను తిరిగి తన ఊరు కాకినాడ వెళ్ళిపోతూ.. కొడుకుకు చాలా విష యాలు చెప్పడం ఆరంభించాడు... ఆ ప్లాట్ ఫారం మీద.
ఇది రమారమి మూడు సంవత్సరాల క్రితం సంఘటన......
***
జనవరి, 2020... "కోవిడ్".. ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమయమది.
"ఒరేయ్.. రవీ.. నిన్ను ఈ చెన్నై లో ఉంచటం నాకసలు ఇష్టం లేదురా. ఏదో.. నీ ఫ్రెండ్స్ ఇక్కడే చదువుతున్నా రన్నావని 'సరే'... అన్నాను.
నాకసలు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి… అదేరా.. మీ బాబాయ్ వెధవ.. ఇక్కడే ఉంటున్న విషయం నీకూ తెలుసుగా... ఇక్కడకుదగ్గరే... అదే........
అది... అది... " చెట్టియార్ స్ట్రీట్ ".. ఏదో అను కుంటాను... అక్కడ ఏడుస్తున్నాడట.
వాడు నాకు పరమశత్రువు. ఇరవైఏళ్ల క్రితం మాట.... నీకు అప్పుడు ఐదేళ్లు ఉండొచ్చు. విషయాలు నీకు గుర్తుండి వుండవులే.
ఆస్తి పంపకాల్లో అప్పట్లో మాకు- మాకు, చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోయాం. ఆ వెధవ పోలీస్ స్టేషన్, కోర్టు ల వరకు నన్ను తిప్పాడు. తిట్టాలని కాదుగాని... వాడు దుర్మార్గుడు.. నీచుడు.. పాపాత్ముడు.
సమయం వచ్చినప్పుడు వాడు.. రాక్షసుడిలా ఎలా ప్రవర్తించాడో నీకు చెప్తాను.. వాడి మీద కసి, పగ... నేను కాకపోయినా... నువ్వైనా.... తీర్చుకొని.. మగాడినని పించుకోవాలిరా. నీ మీద ఆ నమ్మకం నాకుంది.. నా దృష్టిలో వాడు ఆ రోజే చచ్చిపోయినట్టురా. వాడి అవసరం మనకు లేదు.. రాదు.. ఉండదు. మన అవసరం కూడా వాడికి లేదులే.
ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఈ రైల్వే ప్లాట్ ఫామ్ మీద నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ చెన్నై లో ఉండి చదువుకున్నన్నాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు.. ఆ... స్ట్రీట్.. ఏది ఆ చెట్టియార్ స్ట్రీట్ కు వెళ్ళడానికి వీలులేదు.
వాడికో కొడుకున్నాడు.. వాడు కూడా మా తమ్ముడు వెధవ లాగే పెద్ద వెధవన్నర వెధవ అయ్యుంటాడు. ఆ వెధవలు ఇద్దరి దృష్టి లోనూ నువ్వు పడటం నాకసలు సుతారాము ఇష్టంలేదు. రక్త సంబంధీకుల మైనప్పటికీ మన సంప్రదాయం వేరే.... వాళ్ల సాంప్రదాయం వేరే.
ఒకవేళ తేడా వచ్చింది అనుకో.... నీ చదువు మానిపించేస్తాను. బాగా అర్థమైందా. అదిగో ట్రైను వస్తున్నట్టుంది, నే వెళ్తాను. జాగ్రత్తగా అందరితో పాటు హాస్టల్లోనే ఉండు"
అంటూ కొడుకు రవికి ఇంకా మిగిలిన విషయాలు
కూడా చెప్పి.. వచ్చి ఆగిన తను ఎక్కవలసిన ట్రైన్ గబగబా ఎక్కి తన రిజర్వేషన్ లో కూర్చొని కొడుకుని హాస్టల్ కు వెళ్లి పొమ్మని చెప్పి పంపించేశాడు ఆనంద రావు.
***
ట్రైన్ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది... కాకినాడ వైపు
ఆనందరావు బుర్రలో అంతకన్నా స్పీడుగా గతం తిరిగేస్తుంది.
అతని కొడుకు రవికి అప్పుడు ఐదేళ్లు. అంటే.. 20 సంవత్సరాల క్రితం విషయం గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతున్నాడు కసితో ఆనందరావు. తన కొడుకు రవిని తప్పని పరిస్థితులలో తన శత్రువైన తమ్ముడు ఉండే చెన్నై లోనే చదివించ రావలసి కావడంతో ఈ సమస్య ఏర్పడింది అతనికి.
రెండు దశాబ్దాల క్రితం.....
తన తమ్ముడు... మూర్ఖుడు.. పద్మాకర్ తో గొడవలు.. తగువులు....... కొట్లాటలు...... పెద్ద మనుషులు... పోలీసులు... లాయర్లు.... అలా అలా బుర్రలో గిర్రున జోరీగల తిరిగేస్తున్నాయి... అంతేనా.. విజృంభిస్తున్నాయి... బోగి లో కూర్చొని కళ్ళు మూసుకున్న ఆనందరావుకి.
ఈ 20 ఏళ్లలో పద్మాకర్ చాలా చోట్ల,.. ఫంక్షన్లలో కూడా కన పడ్డాడు ఆనందరావుకు. మాట్లాడ ప్రయత్నించ మనస్కరించలేదు.... ఆనందరావుకి. పద్మాకర్ కాస్త తెగువ చూపించినా... ఆనందరావు చీదరించుకునే వాడు. మరి తన మనసుకు మానకుండా తగిలిన "గాయం "...... అలాంటిది..!!!
నరకయాతన అనుభవించలేక చిరాకు వచ్చి, చివరికి తమ్ముడికి కొంత భాగం ఆస్తి ఎక్కువైతే అయ్యిందని ఆనందరావు సర్దుబాటు చేసు కున్నాడు.... అతి కష్టం మీద.
అప్పట్లో.. ఆ గొడవలలో... తనపై పద్మాకర్ గునపంతో హత్యాప్రయత్నం చేయటం... ఇంకా మర్చిపోలేక పోతున్నాడు ఆనందరావు. అదంతా తమ్ముడు దుర్మార్గత్వం, దుష్టత్వం. అందుకని వాడిని ఒక వెధవ గా జమ చేసి తన కుటుంబం లోంచే వెలివేసినట్టు..... నిర్ణయం చేసుకున్నాడు అప్పుడే.. ఆనందరావు!
అప్పట్లోనే తమ్ముడు పద్మాకర్.. అతని ఆస్తి మొత్తం అమ్మేసుకుని... భార్య బిడ్డలతో చెన్నై పోయి బిజినెస్ లో బాగా సంపాదించినట్లు తన బంధువులు చెప్తుంటే వినేవాడు ఆనందరావు.
అలా కొంత కాలం గడిచి పోయాక ఈమధ్యనాలుగేళ్ల క్రితం...
తమ్ముడు పద్మాకర్ కొడుకు రాజారామ్ తను బాల్యంలో గడిపిన కాకినాడ వీధులు చూడా లని , అతను పెరిగిన ఆనాటి తన తాతగారి ఆ పాత ఇల్లు చూడాలని.. తన పెదనాన్న కు తన రాక ఇష్టం ఉండకపోవచ్చు కనుక కనీసం దూరంనుండి అయినా చూడాలనే... ఉద్దేశ్యంతో పండగ సెలవులకు సరదాగా కాకినాడ వచ్చాడు.
ఆనందరావు తన వీధి అరుగుమీద అప్పటికే కూర్చుని ఉన్నాడు. దూరంనుండి.. అతనే తన పెదనాన్న అని ఎవరి ద్వారానో తెలుసుకున్న రాజారాం.. తనను చూసి ప్రేమగా నవ్వడం గమనించాడు.. ఆనందరావు. కానీ.. ఆ కుర్రోడు పద్మాకర్ కొడుకని గ్రహించలేకపోయాడు.
అదే వీధిలోంచి తనను దాటుకుంటూ వెళ్తున్న తన బంధువు.....
" ఇదిగో ఆనందరావూ... దూరంగా జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక కుర్రోడు కనిపిస్తున్నాడు చూడు.. అదే ఆ కిళ్ళీ కొట్టు పక్కన.... వాడు మీ తమ్ముడి కొడుకట! పండగ సెలవులు కదా.. ఇక్కడ మనందరినీ చూద్దామని వచ్చాడట... నీతో మాట్లాడటానికి భయపడు తున్నాడు. పిలువమంటావా ఏంటి?... "... అని అడిగాడు.
ఉలిక్కిపడి పైకి లేచాడు ఆనందరావు.
" ఇదిగో.. వాడు అడిగితే మా ఇంటికి పంపించకు. వాళ్లంతా ఎప్పుడో చచ్చిపోయారుకదా.. నీకు తెలుసు కదా.. మేమంతాకూడా చచ్చిపోయాము... అని చెప్పు... వచ్చిన దారినే వెళ్ళమని చెప్పు.. మళ్లీ ఎప్పుడైనా కాకినాడ రావద్దని చెప్పు... వచ్చిన.. ఈ రామారావుపేట రావద్దని చెప్పు.. "
అంటూ... పెద్ద అడుగులతో ఇంటి లోపలకు వెళ్ళిపోయి చెక్కలు విరిగిపోయేలా తలుపు వేసుకున్నాడు ఆనందరావు..
ట్రైన్ జర్క్ ఇచ్చిన కుదుపు తో 20 సంవ త్సరాల క్రిందటి గత జ్ఞాపకాలన్నీ చెల్లాచెదురై పోయి... పరాయి లోకం నుండి ఈ లోకానికి వచ్చిన అనుభూతి పొందాడు... ఆనందరావు..
మొత్తానికి ఆ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ తన ఇంటికి చేరాడు ఆనందరావు.
***
ఆనందరావు కొడుకు రవిని చెన్నై హాస్టల్ లో ఉంచి అప్పుడప్పుడు చూసి వస్తుండేవాడు తన భార్యతో.. అలా అలా కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా రవి చదువు ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది
రెండో సంవత్సరం...
చెన్నై హాస్టల్, మే.. మొదటి వారం.. 2021,
" కోవిడ్ రెండవ దశ "..... విజృంభణ.... విలయతాండవం చేస్తుంది!!! ఆక్సిజన్ దొరక్క ప్రజలు అల్లాడిపోతున్న సమయమది. నిండు ప్రాణాలు పిట్టల్లా గాల్లో కలిసిపోతున్నాయి. ఓ పక్క కోవిడ్ నిర్ధారణ పరీక్షలు లక్షల్లో జరుగు తున్నాయి.. ప్రతిరాష్ట్రం వేల సంఖ్యలో పోజిటివ్ కేసులు వస్తున్నాయి. దేశం మొత్తం మీద 24 గంటల్లో నాలుగు లక్షల పాజిటివ్ కేసులు!!!! ప్రపంచ దేశాల దృష్టంతా భారత్ మీదే ఉంది.
మరోపక్క వ్యాక్సినేషన్.
మొదటి దశ... రెండవ దశ...
ఇంకా కొత్త కొత్త మందులు వస్తున్నాయి. అకాల మరణాలు
తండ్రి చస్తే కొడుకు రాడు.. కూతురు చస్తే తల్లి రాదు... ప్రజా జీవన విధానం... దుర్భరం.. మహాదుర్భరం!!!
ఇక్కడ...
కాకినాడ రామారావు పేట నుండి తండ్రి ఆనందరావు ఫోన్ లో..... తన కొడుకు రవి తో ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు....
" ఒరేయ్ రవి... ఫోన్లో సరిగా వినపడు తుందా. పదిహేనురోజుల నుండి నేను రోజూ ఫోన్ చేస్తుంటే చెన్నై హాస్టల్లోనే జాగ్రత్తగా ఉన్నా నని అబద్ధం మాటలు చెప్తున్నావ్ ఏంటి?.. "... కోపంగా అరిచాడు ఆనందరావు.
" అంటే... నాన్న... "రవి తడబడుతూ ఏదో చెప్పబోయాడు తన తండ్రికి.
" నోర్ముయ్.. మీ కొలీగ్ వాళ్లనాన్న మార్కెట్లో ఇప్పుడే కనబడి చెప్పాడు. మీ హాస్టల్ లో ముగ్గురు కుర్రాళ్ళకి "కరోనా పాజిటివ్"... వస్తే..... క్వారంటైన్లో.... పెట్టారటగా... భయ పడిన మిగిలిన అందరూ తలో చోటికి వెళ్లి పోయారటగా. హాస్టల్ ని పదిహేను రోజుల క్రితమే లాక్ చేసేసారట కదా?!... నాకెందుకు ఇన్నాళ్లు అబద్దం చెప్పావు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు. "..
గర్జిస్తూ అడిగాడు కొడుకు రవి ని ఆనందరావు.
కొడుకు భయపడి తన తండ్రికి ఇలా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
" నాన్నా.. నిజమే.. పదిహేను రోజుల క్రితం భయంతో.. చెట్టుకొకరు పుట్టకొకరుగా హాస్టల్ నుండి బయటకు వచ్చేసాము. బస్సులు, ట్రైన్ లు లేవు. కొందరు కుర్రాళ్ళు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి పోయారు. నాకేం చెయ్యాలో తోచలేదు....
ఆ రాత్రి నేను...
ఓ మూల సందులో అరుగుమీద ఎలాగోలా రాత్రంతా గడపాలని ఎవరికీ కనబడకుండా బిక్కుబిక్కుమంటూ పడుకొని ఉంటే... ఎవరో ఒకాయన వీధివీధి తిరుగుతూ అన్నం పొట్లాలు పంచుతూ నా దగ్గరకు వచ్చి నాకు ఇచ్చి నేనెవరో ఎక్కడ నుండి వచ్చానో... నా వాళ్ళు ఎవరో చాలా వివరంగా అడిగి తెలుసుకుని వెంటనే తను వచ్చిన ఆటోలోనే తన ఇంటికి తీసుకెళ్ళి పోయాడు.... ఇదంతా జరిగింది పదిహేను రోజుల క్రితం నాన్నా…” అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు తండ్రికి.
ఆనందరావు కు తన కొడుకు విషయం అంతా దాచి పెట్టినందుకు కోపం నషాళానికి అంటింది.
వెంటనే ఇలా అరిచాడు....
" చాలా తతంగం నడిపావు. రోజూ ఫోన్ చేస్తున్నాఇదంతా నాకెందుకు తెలియనివ్వ లేదు. ఏమిట్రా.. నీ డ్రామా. తండ్రంటే అసలు లెక్కలేదా నీకు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితు ల్లోనా నీ నాటకాలు. ఇప్పుడే ఇన్ని వేషాలు వేస్తే ఇకముందు ఎన్ని వేషాలు అయినా వేస్తావు. అసలు ఎవడువాడు... ?.. తీసుకెళ్లి పోయి నిన్ను ఓ గదిలో పెట్టి ఈ పదిహేను రోజులు కుక్కని చూసినట్టు చూశాడు కదూ..
తర్వాత ఏం జరిగిందో త్వరగాచెప్ప"
మళ్లీ గర్జించినట్లే అడిగాడు ఆనందరావు.
" లేదు నాన్నా నాకు పరీక్ష చేయించి కోవిడ్ పాజిటివ్ లేదని నిర్ధారించుకుని తనింట్లోనే వాళ్ళతో.... సమానంగానే చూశాడు. " అన్నాడు రవి ప్రశాంతంగా.
" ఇంకేం జరిగింది.. ఇంకా ఏదైనా అడిగాడా?" అదే కోపంలో అడిగాడు ఆనందరావు.
" నా గురించి తరచూ ఇంకేమీ అడగలేదు. ఎందుకో..... వాళ్ల పేర్లు కూడా నాకు తెలియ నివ్వలేదు నాన్నా........ చూడ్డానికి వాళ్లంతా చాలా మంచి మనుషులుగా కనిపించారు. నిజం డాడీ. ".. సరదాగా చెప్పినట్టు చెప్పాడు రవి.
ఆనందరావుకి ఇంకా తన శరీరం మీద తేళ్ళు జెర్రులు పాకుతున్నట్టు గానే ఉంది....
" నోటితో కాకుండా ముక్కుతో ఏడ్చినట్టు ఉంది నీ వ్యవహారం. అసలు పేర్లు కూడా తెలుసుకోకుండా పదిహేను రోజులు ఒకరి ఇంట్లో ఎలా గడిపావు రా. వాళ్లు తెలుగు వాళ్లేనా??".. అరిచాడు ఫోన్ బద్దలు అయ్యేట్టు
ఆనందరావు.
దానికి కొడుకు రవి ఇలా చెప్పాడు.
" ఆ.. ఆయన.. ఇంకా మరో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ కాని కుర్రాళ్ళని తీసుకువచ్చి నాకన్నా ముందే తన ఇంట్లో పెట్టుకున్నాడు. అతని బంధువుల పిల్లలట. మేమంతా కలసి వాళ్ళ అబ్బాయి తో సహా మొత్తం నలుగురం. ప్రపంచ మంతా కోవిడ్ తో భయపడుతున్నా.. మేం మాత్రం భలే హ్యాపీ గా ఎంజాయ్ చేసాం. అందరూ కలసి వాళ్ళ కిచెన్ లో భోజనాలు చేసే వాళ్ళం. దూరం దూరంగా కూర్చొని.. ఒకే గదిలో..... దూరం దూరంగా.. పడుకునే వాళ్ళం. "
" ఏడ్చావు.. బోడి హ్యాపీ , బోడి ఎంజాయ్.. వాడు మన శత్రువు ఏమోనని నాకు అనుమానంగా ఉంది. కాదుగదా.!!!..
అయినా.. గతం అంతా మరచిపోయివాడు. నిన్ను... ఎందుకు అలా నెత్తి మీద పెట్టుకుంటాడు? వాడు ఏమైనా దేవుడా? మా తమ్ముడు వెధవ కి మరీ ఇంత గొప్ప మనసు లేదులే... అవును.. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ల ఆల్బంబుక్స్ ఏమైనా చూసావా? అందులో నీకు తెలిసిన వాళ్ళ బొమ్మలు ఏమైనా కనిపించాయా?".. లాజిక్కుగా అడిగాడు కొడుకుని ఆనందరావు.. సెల్ ఫోన్ లో.
" చూడలేదు నాన్న.. వాళ్లు కూడా చూపించ లేదు. "
" అది సరే.. నిన్ను తీసుకెళ్లినాయన పెళ్ళాం.. నీతో ఏమైనా మాట్లాడుతూ ఉండేదా?"..
ఈసారి మరింత లాజిక్కు గా అడిగాడు ఆనందరావు.
" లేదు నాన్నా.. నావైపు చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉండేది... అంతే.. నేను భోజనం చేస్తున్నప్పుడు మాత్రం అమ్మ లాగే కొసరి వడ్డించుతూ ఉండేది".
"ఏరా... వాళ్ళు చాలా బాగా నీకు నచ్చినట్టు ఉన్నారు. గొప్ప ఏం కాదు గాని.. ఎవరైనా అలాగే వడ్డిస్తారు. అవును.. వాళ్లకు ఓ అబ్బాయి ఉన్నాడని అన్నావుగా... రేయ్.. నిన్నే.. ఫోన్ లో వినపడుతుందా సరిగా. అదే వాళ్ళ అబ్బాయిని ' రాజారాం '.. అంటూ పిలిచే వారా.. వాళ్లు?"... ఈసారి అనుమానం బలపడి అడిగాడు కొడుకుని.
" వినబడుతోంది నాన్నా.. వాళ్ళ అబ్బాయిని 'బాబు'.. అనే పిలిచేవారు......! నాన్నా.. ఒక విషయం చెప్పమంటావా ఆయన ఒకసారి.. ఫోన్ లో ఎవరితోనో చాలా బాగా మాట్లా డారు నాన్నా. అది.. గుర్తుండి పోయింది.. అది.. ఏంటంటే...
' తప్పులు అందరం చేస్తాం సార్. నేను కూడా చాలా తప్పులు చేశాను.. అయితే ఆ తప్పులు దిద్దుకునే అవకాశం కలిగినప్పుడు... దిద్దు కోవాలి.. అన్న స్పృహ కలిగించుకొని ముందుకు సాగాలి. గతంగతః.... అన్నట్టు అందరూ బ్రతికితే బాగుంటుంది సార్. '... అన్నారు నాన్నా.
అదేంటో ఆ డైలాగులు నాకు చాలా బాగా నచ్చాయి. చిత్రంగానూ, చాలా గొప్ప గాను కూడా అనిపించాయి. "
ఫోన్ లో రవి చాలా ఆర్తిగా చెప్పుకు పోతున్నాడు.
అవతల వాళ్లు గురించి.. కొడుకు చెప్పే విధానం ఆనందరావు కు నచ్చక.. అతడి శరీరం మీద ఎవరో మరిగే నీళ్ళు పోసినట్లు ఉంది...
" సర్లే ఆపు.. ఈ విషయాలన్నీ నాకు ఫోన్ లో చెప్పాలని నీకు ఎప్పుడూ అసలు అనిపించ లేదా?". నిష్టూరంగా అడిగినట్టు అడిగాడు ఆనందరావు.
" సారీ నాన్న.. నేను చాలాసార్లు ప్రయత్నించా. కానీ ఆయన ఎవరిని ఫోన్ చెయ్యనివ్వలేదు.
“ఈ విషయం తెలిస్తే దూరంగా ఉన్న మీ వాళ్ళందరూ కంగారు పడతారు. అయినా ఇక్కడకు రాలేరు. పెద్ద వాళ్లను బాధ పెట్టడం వద్దు. ఇప్పటి కోవిడ్ భయానక పరిస్థితుల్లో మీరు చేస్తున్నది ఎంతమాత్రం తప్పు కాదు.
నా మాట వినండి. ఇక్కడి పరిస్థితులు కొంచెం చక్కబడ్డాక నేనే మిమ్మల్ని హాస్టల్ లో దిగపెడ తాను. ఆ తర్వాత వీలు చూసుకుని నెమ్మదిగా...... చెప్పండి”...
అంటూ మమ్మల్ని ఆపేవారు. మీ పెద్దలు హడా వుడిగా మీ గురించి ఆలోచిస్తూ... ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుంటారని కూడా.. చెబుతుండే వారు.
అమ్మను దృష్టిలో పెట్టుకొని.. అమ్మ కంగారు పడిపోతుందని.. నాక్కూడా అదే మంచిదని పించింది నాన్నా. సారీ.. తప్పయితే క్షమించు నాన్నా. ".... చాలా ప్రాధేయ పూర్వకంగా చెప్పాడు కొడుకు రవి.. తన తండ్రికి సెల్ ఫోన్ లో.
" అది సరే... ఇంతకీ ఎవడ్రా అతను.... ?".
" ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపిస్తే ‘విష్’ చేయి చాలు అంటూ ఈ పదిహేను రోజుల తర్వాత నన్ను ఇదిగో... ఇప్పుడే.. జాగ్రత్తగా హాస్టల్ లో దిగవిడిచి.. అదిగో వెళ్ళిపోతున్నారు. "
''నువ్వు చెప్పింది అంతా వింటుంటే.... ఆ వెధవ మా తమ్ముడు అని అనిపిస్తుంది రా.. అసలు నీకు వాళ్ళు ఎవరూ గుర్తు రాలేదా?.. చిన్నప్పుడు చూసావు కదా.. ''... ప్రశ్నించాడు ఆనంద రావు''
'' అదేమిటి నాన్న.. నాకు నాలుగు.. అయిదు ఏళ్ల వయసున్నప్పుడు... ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వాళ్లను చూసాను.... ఎలా పోల్చుకో గలను నువ్వే చెప్పు.. ''... అంటూ వివరణ ఇచ్చాడు.. రవి.
" ఆయన అసలు ఎలా ఉంటాడు? సెల్ లో ఫోటో తీసి నాకు పంపించలేకపోయావా ?"
" లేదు నాన్న.. ఇటువంటి పరిస్థితిలో పద్ధతిగా ఉండదని ఫోటోలు తీసుకోలేదు. ఆ... అదేమిటో కానీ నాన్న.. ఆయన కొంచెం అటు ఇటు గా 'నీలాగే'.... ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా అదేమిటో కొంచెం అటు ఇటు గా 'నాలాగే ' ఉంటాడు నాన్న. నిజం"...
ఈసారి మహదానందంగా చెప్పాడు రవి.
" ఆ.. చాల్లే.. సంబడం.. మనిషిని.. పోలిన మనుషులు ఉండరా ఏంటి? నీదో పెద్ద బడాయి. అన్నట్టు ఈ పదిహేను రోజులు ఏ స్ట్రీట్ లో ఉన్నావు... అదయినా.. తెలిసి ఏడిచిందా.. నీకు"
" ఆ.. తెలుసు నాన్న.. ఈ రోజే ఆయన ఇప్పుడే మా హాస్టల్ లో దిగవిడిచారు కదా... ఆయన ఇంటి దగ్గర నుంచి హాస్టల్కు వస్తూ చూశాను.. ఆ స్ట్రీట్.. పేరు.. ఆ... అది.. అది.. చిట్టి.. కాదు కాదు చెట్టి...... చెట్టి...... "
" ఏడ్చావు... కొంపతీసి "చెట్టియార్ స్ట్రీటా????"
" ఆ... అ.. ఖచ్చితంగా అదే నాన్న. "
అంతే.. ఆనందరావు చేతిలో సెల్ కిందపడి
ముక్కలు కాలేదు. ఎవరో అతని గుండెల మీదకు పెద్ద కొబ్బరి బొండం విసిరితే అది.. అది తన గుండెల మీదే పగిలిపోయి పదహారు ముక్క లుగా చితికిపోయిన భావన కలిగింది..!!!.
***
కాకినాడ.... రామారావు పేట,.. ఆనందరావు
తన ఇంట్లోనే ఉన్నాడు... అతను కొడుకు తో మాట్లాడి నెల రోజులు అవుతుంది...
ఆగస్టు మొదటి వారం... 2021సంవత్సరం.. పూర్తి లాక్ డౌన్..... మినీ లాక్ డౌన్...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ పరిస్థితులు కొంచెం చక్కబడి చక్కబడనట్లు ఉన్నాయి. సర్దుకున్నట్టు కనిపించి విజృం భిస్తున్నాయి. అయినా.... ప్రజా అవసరం,
అభివృద్ధి కుంటుపడకుండా ఉండడం రీత్యా ముఖ్యమైన కొన్నిబస్సులు, ట్రైన్ లు తిరుగు తాయని... ఆన్ లైన్ బుకింగ్ మళ్లీ మొదల వుతుందని... టీవీన్యూస్ విన్నాడు ఆనంద రావు.
కొడుకు నుండి యధార్థ విషయం తెలుసుకొని నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులు దీక్షగా, తదేకంగా ఆలోచించిన ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చాడు.. అనే కన్నా "వచ్చేసాడు".. అనొచ్చు!!!
"" నా దృష్టిలో నా తమ్ముడు "వెధవ".!!.....
నా తమ్ముడు దృష్టిలో.. నేను.. " పెద్దవెధవ నేమో"!!!....
ఏ సమస్యనైనా ఎదుటివారి కోణంనుంచి ఆలోచించాలి అన్నారు పెద్దలు. నిజమే.. ఖచ్చితంగా నిజం!""
ఇదీ.. ప్రస్తుతం ఆనందరావు.. ఆలోచనా ధోరణి.
'"అవును.. తప్పులు అందరం చేస్తాం. అయితే ఆ తప్పులుదిద్దుకునే అవకాశం కలిగినప్పుడు
... ""దిద్దుకోవాలి""..... అన్న స్పృహ కలిగించు కొని ముందుకు సాగాలి.
గతం గతః... అన్నట్టు అందరూ బ్రతికితే బాగుంటుంది!!
రెండు దశాబ్దాలు.. 20 సంవత్సరాలు.. చాలా సుదీర్ఘం!
ఇరవై సంక్రాంతులు.. ఇరవై ఉగాదులు.. ఇరవై దీపావళిలు! ఎలా నిస్సత్తువుగా గడిచి పోయాయి.
గభాలున కుర్చీలోంచి లేచి.. 'సిస్టం' దగ్గర కూర్చున్నాడు ఆనందరావు.
రెండు టికెట్లు.. తనకు , తనభార్యకు.. అన్ లైన్ బుకింగ్ చేసుకున్నాడు... చెన్నై వెళ్లడానికి...!
చెన్నైలో తన కొడుకును చూడాలి.. అంతేనా.. అందరూ కలసి సర్ ప్రైజ్ చేసేలా
" చెట్టియార్ స్ట్రీట్ "
సడన్ గా వెళ్లి వారంరోజులు ఆనందంగా గడపాలి.... ఆ ఇంట్లో.. తమ్ముడు ఇంట్లో!!!!!!
తిరుగులేని తన నిర్ణయంతో.. మహమ్మారి కోవిడ్ ఈ భూప్రపంచం వదిలి పారిపోయినంతగా... ఇప్పుడు.. ఆనందరావు.... పరమానంద భరితుడైపోతున్నాడు.!!!
* సమాప్తం *
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం....
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Lavanya Kumari • 2 weeks ago చాలా బాగుంది కథ, గతం గతః అనుకొని మారిన వారితో కలిసిపోవటం మంచి మార్పే. మారిన వారితో కలిసిపోగలం కానీ మారినట్లుగా నటించే వారితో కలవడం చాలా కష్టం. అలాగే లోపల కుళ్ళు, బయట మంచివారిగా నటించేవారే ఎక్కువగా వుంటారు, వారిలాంటి వారితో మరీ కష్టం కలవాలంటే.REPLY0 replies