top of page

ఆవులమందలో పులి ఉంది.. జాగ్రత్త!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Avulamandalo Puli Undi Jagrattha' New Telugu Story Written By Nallabati Raghavendra Rao


రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


మాధవరావుగారు నిలువెత్తుమనిషి. శివాలయం ఎదురుగా ఉన్నసందులో పార్కు ని ఆనుకొని అతిపెద్ద పాలరాతి భవనం అధిపతి మాధవరావుగారు! దాని విలువ రెండు కోట్ల పైమాటే! అంతేకాదు ఆ టౌన్ లో...లీడింగ్ లాయర్ ఒకప్పుడు.


అమెరికాలో ఉన్న కొడుకు ఆనంద్ తన దగ్గరకు తీసుకెళ్లిపోదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు. హైదరాబాదులో ఉన్న కొడుకు కూడా వచ్చేయమని చాలాసార్లు అడిగి చూశాడు. ఒప్పుకోలేదు మాధవరావు గారు. 'వచ్చే టైంలో వస్తానులే".. అనేవాడు.


ఉపోద్ఘాతం నుండి తిరిగి అసలు కథలోకి వచ్చేస్తే..

అడుగో వస్తున్నాడు.. అతడి పేరే సుబ్రామయ్య. అతని చంకలో బిందె ఏమిటి అనుకుంటున్నారా.. అదిగో అక్కడే అసలు కథ మొదలైంది. అతడే ఈ కథకి సరిగ్గా సూటయ్యే హీరో. నిరుపేద అనలేము.. మధ్య తరగతి అనలేం.. దానికి దీనికి మధ్యరకం అతను.

ఈ మధ్యనే తనకు ఉన్న అతిబుల్లి బంగాళా పెంకుటిల్లు పడగొట్టి అతి చిన్న డాబా వేసుకుంటున్నాడు. అలా వేసుకున్నంత మాత్రాన ఏమి పర్వా లేదు. అతను ఉంటున్నది లాయర్ మాధవరావు గారి ఇంటి ఎదురుగా. అదిగదిగో.. అదే పెద్దతప్పు అయింది. ఇద్దరిదీ ఒకే కులం అయినా మాధవ రావుగారికి సుబ్రామయ్యని చూస్తే తన కళ్ళల్లో ఎవరో గునపాలతో పొడుస్తున్నట్లు ఉంటుంది.

సుబ్రామయ్య ఖాళీ బిందెతో మాధవరావు గారి ఇంటి గేటు తీసుకుని లోపలికి వచ్చి ఇలా అన్నాడు " సార్.. సార్.. మా నీటిపైపు రిపేర్ వచ్చింది. ఒక బిందెడునీళ్ళు… మీ గేటులోపల పక్కనే ఉన్న పైపు కొట్టి .. పట్టుకువెళ్తాను. తాపీ మేస్త్రీ లు పనిచేయకుండా ఆగిపోయారు" అంటూ భయపడుతూ అడిగాడు.


మేడ పై నుండి మాధవరావు గారు అరుస్తూ

" ఆగాగు..నీళ్ళు కావలసి ఉంటే గేటు బయట నుంచి అడగాలి కానీ అలా గేటు తీసుకుని సరాసరి లోపలికి వచ్చేయడమే..? నీకు నీళ్ళు కొట్టి ఇవ్వడానికి మాపనిమనిషి రాలేదు. ఇంకెవరినైనా అడుగు." అంటూ చిరాకుగా అన్నాడు.


"అదేమిటి సార్ ఎదురింటి వాడిని. పైపు నేను తోడుకుంటాను.. ఒకబిందెడు నీళ్లే కదా!" వినయ విధేయ పూర్వకంగా అడిగాడు సుబ్రామయ్య


" నీకు అలాగే ఉంటుంది..నా కుళాయి రిపేర్ వస్తే.. నువ్వుబాగు చేస్తావా.. నేనా బయటికి వెళ్ల లేను. మాపిల్లలు ఎక్కడో దూరంగాఉన్నారు.వెళ్ళు బాబు వెళ్ళు.. వెళ్లెళ్ళు... వెళ్ళవయ్యా బాబు వెళ్ళు... ఈ దేశంలో మా ఇల్లే దొరికిందా నీకు" అంటూ మళ్లీ అరిచాడు మాధవరావుగారు..

ఖాళీబిందెతో వెను తిరిగాడు సుబ్రామయ్య.

***

చాలా రోజులు గడిచింది


మాధవరావుగారు నీరసంగా తన ఇంటిపక్కనే ఉన్న పార్కులో సిమెంట్ బల్ల మీద కూర్చొని ఓ రెండు మసాలాగారెలు కొనుక్కొని తింటున్నాడు.


" సార్ మీరు ఇలాంటి చిరుతిళ్ళకు కొంచెం దూరంగా ఉండాలి"... అన్నదో సుపరిచిత కంఠం వెనుకనుండి.


" ఎవరు? "కసక్కన వెనుకకు తిరిగి చూశాడు..

మాధవరావు గారు.. ఇంకెవరు..అప్పుడే వచ్చిన సుబ్రామయ్య.


"అవునుసార్ మొన్న నేను బిందెడునీళ్లకు వచ్చినప్పుడే మీరు ఆయాసపడుతూ కనిపించారు. మీ ఇంటి ఎదురుగానే ఉంటున్నాను....

మీరు బాగా ఉండాలని నాకోరిక.. మీరు ఆరోగ్య సూత్రాలు పాటించాలి సార్."... ఆర్డర్ చేసినట్టు చెప్పాడు సుబ్రామయ్య.


మాధవరావుగారు వింటున్నాడు... మసాలా గారెలు తింటున్నాడు. కానీ తాను కూర్చున్న బల్ల మొత్తం ఖాళీగా ఉన్నప్పటికీ సుబ్రామయ్యను పక్కగా వచ్చి కూర్చో మనలేదు. సుబ్రామయ్య నిలబడే ఇంకా చెప్పుకు పోతున్నాడు.

"అవును సార్! మెడిసన్ కన్నా ఆహార నియమాలు కొంచెం మార్చుకుంటే.. ఆరోగ్యం చాలా బాగుంటుందిసార్" అంటూ చేతులు కట్టుకొని విన్నవించుకున్నాడు మాధవరావుగారికి.


మాధవరావుగారు ముక్కు చీదుకుంటూ ఇంకా మసాలాగారెలు చప్పరిస్తూనే ఉన్నాడు.


అదే ఫోజులో సుబ్రామయ్య తన సుదీర్ఘ ప్రసంగం ఇలా మొదలు పెట్టాడు “ఉదయం ఆరు గంటలకే వేడినీళ్లలో ఉప్పు వేసి పుక్కిలి పట్టాలి. అలాచేస్తున్నారా? "


తలకాయ తలతిక్కగా తిప్పాడు మాధవ రావుగారు


"ఆ తర్వాత వేడి నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి తాగాలి...చేస్తున్నారా? "


"ఇప్పుడు రాత్రినానపెట్టిన నాలుగు బాదం, రెండుఎండుద్రాక్ష తినాలి అలాచేస్తున్నారా?" కనురెప్పలు పైకెత్తి అడిగాడు సుబ్రామయ్య


లేదు అన్నట్టు కింది పెదవి కిరుక్కున్న మెలి తిప్పాడు.. మాధవరావుగారు


ఈసారి జేబులోంచి పెద్దలిస్టు రాసి ఉన్న పేపర్ తీశాడు సుబ్రామయ్య..


'' సార్, వినండి.. ఎనిమిది గంటలకు చోడిపిండి జొన్నపిండి సజ్జపిండి లతో ఏదో రకమైన టిఫిన్.. ఒక కప్పు మిరియాల టీ. 9 గంటలకు జామ కాయ కానీ బత్తాయికాయ గాని.. 10 గంటలకు ఏదో ఒక కషాయం..11 గంటలకు కొద్దిగా జ్యూస్..ఒంటి గంటకు భోజనం... భోజనంలో పప్పుకూర, ఆకుకూర, కొద్దిగా నెయ్యి,ముఖ్యంగా బ్రౌన్రైస్, కరివేపాకుపొడి ,అవిసెపొడి, నువ్వుల పొడి...


సాంబారు, పలుచనిమజ్జిగ.. చివర ఒక అరటి పండు....... అర్థ గంటకు ఫ్రూట్ సలాడ్.. మల్టీ విటమిన్ టాబ్లెట్.... నాలుగుగంటల వరకు నిద్ర. ఆ తర్వాత మళ్లీ కొద్దిగా కషాయం..


6:30 కు రెండు మూడు పళ్ళు... కొద్దిగా కొబ్బరి బొండంనీరు, పడుకునేటప్పుడు మళ్ళీ కొద్దిగా వేడి మిరియాల పాలు.. సాల్టువద్దు ...సైంధవ లవణం మాత్రమే!... 70 గ్రాములు నెలకు... ఆయిల్ మాత్రం సన్ఫ్లవర్, రైస్బ్రాన్, గ్రౌండ్నట్.. నెలకు ఏడువందలగ్రాములు. రాత్రి త్వరగా

పడుకోవడం. ఈరకంగా పాటించండి సార్... ఒక నెలచాలు..ఆ తర్వాత బీపీ ,షుగర్, కీళ్లనొప్పు లకు టాబ్లెట్ వేసుకోనవసరం లేదు. ఇదంతా

నేను "ఆరోగ్యానికిడాక్టర్గారి సలహాలు" అనే టీవీ కార్యక్రమంలో విని మీకు చెబుదామని నోట్ చేసు కున్నాను సార్.." చెప్పడం ఆపాడు సుబ్రామయ్య

చదివి వినిపించిన కాగితాన్ని జేబులోపెట్టుకుంట.


మాధవరావుగారు పేలవంగా ఉండే నవ్వు ఒకటి నవ్వి... " ఇవన్నీ తెచ్చి నా ఇంటి దగ్గర పెట్టు..నేను తినిపెడతాను.. "..అన్నట్టు చూస్తూ..

ఫాంట్ పైకి ఎగదోసుకొని వెళ్ళిపోయాడు.


***


నాలుగు రోజులు గడిచింది

ఇదిగో ఇప్పుడే రసవత్తరమైన పాత్ర ప్రవేశం.

వస్తున్నాడు... అడుగో వచ్చేస్తున్నాడు...


దూరంగా చూస్తే ఐదు అడుగులకి గుప్పుడు

తక్కువ మనిషి ఒకడు వస్తున్నాడు చూడండి.... బానపొట్ట.. బట్టతల గుండు... అతని పేరే..కెంపు రావు.... అలాగని....' కంపురావు' అసలే కాదండోయ్ బాబు. ఖచ్చితంగా ' కెంపురావే' అతని పేరు. ఏంటి ఇతని స్పెషాలిటీ.. కెంపులు వజ్రాలు వైడూర్యాలు అవుతున్నాడా.. అనుకుంటున్నారా.


అబ్బే అబ్బే అదేం కాదండీ బాబు.. కానీ.. ఖచ్చి తంగా చెప్పాలంటే.. ఇప్పుడు స్పెషల్ అంతా ఇతనే....


ఇతగాడు...అరువది ఐదు సంవత్సరాల మన నిలువెత్తుమనిషి. మాధవరావుగారు ఇంటికి 40 అడుగుల వెనుక ఉండే రెండంతస్తుల బిల్డింగ్ యజమాని. ఐదేళ్ల క్రితం మాధవరావుగారి భార్యా మణి కరుణమ్మ ఖాళీ బాల్చీ తన్నేసి గడప మీద పడిపోయి మళ్లీ పైకి లెగలేకపోయింది. ఆవిడ శవం గడప దాటడానికి ఆలస్యం అవుతుంటే.. ఆ కంపు భరించలేక మనకెంపురావు కొంచెం ప్రయత్నం చేసి శవాన్ని... గడప కాదు.. ఊరు కూడా దాటించాడు. అదిగో అప్పటినుండి మాధవరావుగారి ఆరోప్రాణం కెంపురావే..!


మూన్నాళ్ళు తిరక్కుండా మాధవరావుగారి ఇంటి, వంటి, వంటింటి, బయటింటి...పూర్తి విషయాలన్నీ మన కెంపురావు... అధీనంలోకి వచ్చేసాయి అంటే కెంపురావు పట్ల మాధవరావుగారి సదభిప్రాయం .. ఆహ్..ఓహో .. అనక తప్పదు!! ఎందుకు ఇంత గోల..పెద్దగోల... మాధవరావుగారు ఏ నిమిషానికి ఏ టాబ్లెట్ వేసుకోవాలో.. ఏ ఇంజక్షన్ చేయించు కోవాలో కెంపురావు కంటిచూపులోనే విడుదల వుతాయి. మాధవరావుగారు వేసే ప్రతి అడుగు కెంపురావు కెంపులు పొదిగి ఒదిగితేనే పడతాయి.


ఇప్పుడు చెప్పండి..ఆఫ్ట్రాల్ ఆ బిందెడునీళ్ళు సుబ్రామయ్య ఈ కథకి..హీరో అంటే...ఎలా..?


మనకెంపురావు ..మాధవరావుగారు పాలిటి అపూర్వమైన హితుడు కాదా?? అపురూపమైన హితుడుకాదా.??." అమ్మో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఎందుకంట?అసలు...కథ లో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండకూడదా ఏంటి??.


అదీ కెంపురావు కథ...


***


మళ్లీ పదిహేను రోజులు అలా అలా గడిచి పోయాయి.. ఇదో కాలచక్రం మరి... ఆయిల్ వెయ్యకపోయినా అలా తిరిగేస్తూ ఉంటుంది.


అదిగో ఆ వస్తున్న కెంపురావు వస్తూ వస్తూ సుబ్రామయ్య ఐస్క్రీం బండి దగ్గర ఆగి....


"హలో హాయ్... బాగున్నావ్రా సుబ్రామయ్య! మొన్న చేగోడీలు.. అంతకుముందు పల్లీలు.. అంతకుముందు ఇడ్లీలు.. దానంతకు ముందు

మిరపకాయ బజ్జీలు.. ఈ వేళ ఐస్ క్రీమ్.. గంట కో వేషం బలే వేస్తావ్ రా" అన్నాడు.


దాంతో సుబ్రామయ్యకు చిర్రెత్తింది....


" నీకేం బాబు జనాన్ని బుట్టలో తట్టలో బెట్టి నాలుగిళ్లు సంపాదించావు. మాకు మీ అంత సీన్ లేదు కదా"... అన్నాడు.


" నువ్వూ సంపాదించుకోరా వద్దన్నానా?..

ఎందుకు ఎదవ ఏడుపు ఏడుస్తావు.. సరే మంచి ఐస్ క్రీమ్ ఇవ్వరా ." అడిగాడు కెంపురావు.


"30 రూపాయలది ఇస్తానురా. బాగుంటుంది"


" ఎంతైనా పర్వాలేదు... మాధవరావు గారు డబ్బులు లేనోడా ఏంటి? ఆయనే తెమ్మన్నారు."

"ఆయనకా ఐస్ క్రీమ్… ముందే ఈమాట ఎందుకు చెప్పలేదు . మాధవరావుగారికి అయితే అసలు ఇవ్వను ... నా దగ్గర ఐస్ క్రీములు ఐపోయాయి రా..లేవు. ఐస్ క్రీమ్ తింటే ఆయన ఆరోగ్యం దెబ్బ తింటుంది ...ఇవ్వను. ఇవ్వను గాక ఇవ్వను..'' ఖరాఖండీగా ఖచ్చితంగా చెప్పేశాడు సుబ్రామయ్య


" నోరు ముయ్యిరా నీకెందుకు ఆయన గొడవ?” చిరాకు పడ్డాడు కెంపురావు.


"నువ్వు ఆయన ఇంటి వెనుక ఉంటున్నావు. నేను ఆయన ఇంటి ఎదురు ఉంటున్నాను. నాకూ బాధ్యత ఉంటుందోయ్."... వివరణ ఇచ్చాడు సుబ్రామయ్య.


“ఓస్.. ఓసోస్ .. పెద్ద అందగాడు బయలు దేరాడండి బాబు... బోడి బాధ్యత.. ఇస్తావాలేదా… ఒరేయ్.. ఐస్ క్రీం తింటే మనుషులు చచ్చి పోతారా?".. చిత్రంగా అడిగాడు కెంపురావు.


" చావరు బాబు.... ఆయన మొన్న డెంటల్ హాస్పిటల్ దగ్గర కనపడ్డారు. ఆయనకు పళ్ళ సమస్య ఉంది. ఐస్ క్రీం తింటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. పళ్ళు తీసేస్తే ఎలా నములుతారు.. అప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది.. ఇదన్నమాట అసలు విషయం. అందుకని ఐస్ క్రీం ఇవ్వను."

మొండిగా బండగా చెప్పేసాడు సుబ్రామయ్య


" ఓర్నీ.. ఆయన ఏదో నీ సొంత పెదనాన్నఅయినట్టు మాట్లాడుతున్నావు.. నువ్వు ఇలా అన్నావ్ అని ఆయనకు చెప్తా.. దగ్గరలో ఐస్ ఐస్ క్రీం పార్లర్ లు లేవు... నువ్వు ఇవ్వలేదని చెబితే నీ పని ఆయనే చూసుకుంటాడు."... అంటూ జవాబు కోసం చూడకుండా చరచరా వెళ్ళిపోయాడు కెంపు రావు ముందుకి .


** *** ****.


దాoతస్సదియ్య....మళ్లీ నెల రోజులు గడిచి పోయింది.

ఆరోజు...పార్కులో ఖాళీ బల్లమీద... ఎప్పటిలాగే వచ్చి కూర్చున్నాడు మాధవరావుగారు.. ఇటు చూడండి ఈ వెనుక నుంచి ఒక ఆయన వస్తు న్నాడు... అతను పేరు విని కిసుక్కున నవ్వు కోకండి.. అతని పేరు జీడిపిక్కల జగన్నాథం.. అవునండి.. ఖచ్చితంగా జీడిపిక్కల జగన్నాథమే అతని పేరు.


కోర్టులో మాధవరావు గార్కి కొలీగ్. ఈయన కూడా పెద్ద హీరో గారే ఈ కథకి.. మూడో హీరో గారు అన్న మాట!!! సరే ఎంత మంది హీరోలు ఉంటే అంత మంచిది!!


అతను వచ్చి మాధవరావు గారి పక్కన కూర్చుంటూ..

" బాగున్నారా..మాధవరావుగారు.. మీరు అమెరికా వెళ్తున్నట్లు తెలిసింది.. చాలా సంవత్స రాలు పడుతుందేమో మీరు వచ్చేసరికి. మరి వచ్చే వరకూ ఇల్లు పాడవకుండా ఏ జాగ్రత్త లు తీసుకుంటున్నారు?" అంటూ అడిగాడు సదరు జీడిపిక్కల జగన్నాథం.



మాధవరావు గారు ఏ మాత్రం ఆలోచించకుండా ఇలా అన్నాడు..." నీకు తెలుసు కదా! ‘కెంపురావు’.... ఆ దేవుడు నాకు ఇచ్చిన కోరని వరం!.. మా ఇంటితాళాలు అతనికి ఇచ్చి వెళ్తే నాకు చాలా హాయిగా నిద్రపడుతుంది. నేను మూడేళ్లకు తిరిగి వచ్చేసరికి పూచిక పుల్లతోసహా నాకు అప్పచెబుతాడు అన్న....పూర్తి ధైర్యం, నమ్మకం..నాకు ఉన్నాయి. అలాంటి నిఖార్సయిన మనిషి మన ఊర్లో ఇంకెవరూలేరు అన్నది నా ఉద్దేశం. ఐదేళ్లు నుండి అతను నా నమ్మినబంటు.. తప్పు.. తప్పు.. హితుడు..! అతను అత్యద్భుతమైన మనిషయ్యా బాబు!" ఆనందంగా చెప్తూ కొద్దిగా గాలివాన మొదలవడంతో పైకి లేచాడు మాధవరావుగారు.


"అవునా..నిజమా! చాలా విచిత్రంగా ఉందండి మాధవరావుగారు.. మీరు చెప్పే విషయం. ఆ బాన పొట్ట, బట్టతలగుండు..అదేనండి మీఇంటి వెనుక ఉన్న కంపురావు గురించేనా మీరు చెప్పేది."..


"అందరూ అక్కడే పొరబడుతున్నారు. అతని పేరు కంపురావు కాదు కెంపురావు!" నవ్వుతూ అన్నాడు మాధవరావుగారు.


గాలివాన పెద్దగా అందుకుంది. జీడిపిక్కల జగన్నాథం కూడా పైకి లేచి.. మాధవరావుగారి కూడా నడక మొదలుపెట్టాడు..


అతను మాధవరావుగారికి ఏదో చెబుతున్నాడు.. చాలా చెప్తున్నాడు.. చేతులు పైకీ కిందకీ ఊపుతూ తల అటూ ఇటూ ఆడిస్తూ... నడుస్తూ ఏదేదో చెప్తున్నాడు.....


మాధవరావు గారు ఒకింత ఆశ్చర్యంగా వింటున్నారు.


ఆయన చెప్పేది ఈయన వినేది ఏమై ఉంటుంది అబ్బా....???!!!


చుట్టుపక్కల ఎవరికీ వినబడటం లేదు... ఓ పక్క పెద్ద గాలి... మరోపక్క..రోడ్డు మీద దుమ్ము.. లేచి చెవుల్లోకి పోతుంది.... జీడిపిక్కల జగన్నాథం చెప్పేది మాత్రం మాధవరావుగారి కర్ణభేరిని కచ్చి తంగా తాకుతుంది... ఏమిటి ఆ విషయం...??


చూద్దాం ఊహించుకోవడం దేనికి...?? ఆయన చెప్పకుండా ఉంటాడా అప్పుడు అర్థం అవ్వకుండా పోతుందా....


అలా అలా చెప్పుకుంటూ..ఆ ఇద్దరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు పరుగులాంటి నడకతో, ఆ వాతావరణ ప్రభావంతో.


***

అదిగో... మళ్ళీ...

రెండు వారాలు గడిచింది. అమెరికాలో ఉన్న కొడుకు ఆనంద్ రావడం.. తండ్రిని అమెరికా తీసుకువెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిపోయాయి.


ఈ రోజే వాళ్ల ప్రయాణం. మరో గంటలో...

"డాడీ.. కావాల్సినవన్నీ బ్యాగుల్లో పెట్టేసాను.

ఓ గంటలో మనంబయలుదేరుతున్నాం.. వెళ్లి మీ

అత్యద్భుతమైనహితుడు.. అదే మీ ఆరోప్రాణం కెంపురావుగారిని తీసుకు వస్తాను. జాగ్రత్తగా విషయాలన్నీ చెప్పి మన ఇంటి ముఖ్యమైన మెయిన్ తాళాలు అతనికి ఇచ్చేస్తే మనం వెళ్ళి పోవచ్చు."

అన్నాడు కొడుకు ఆనంద్.


"కంగారుపడకు...కెంపురావు గురించి కొన్ని నిజాలు తెలుసాయి. నా కొలీగ్ జీడిపిక్కల జగన్నాథం తెలుసుగా.. అతను చెప్పినదే కాకుండా.. కొందరు బాధితులను అడిగి కూడా తెలుసుకున్నాను.... కెంపురావు.. ఎక్కువ వడ్డీకి ఇంటి దస్తావేజుల మీద తనఖా అని చెప్పి డబ్బులు ఇచ్చి నిరుపేదలను చక్రవడ్డీల మీద చక్రవడ్డీలు వేసి మోసంచేసి వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పి .. భయ పెట్టి … నాలుగుఇళ్లు సంపాదించటం.. అతని కేసులు తప్పుడు కేసులు అయినా తప్పక అవన్నీ వాదించి గెలిపించింది మన జీడిపిక్కల జగన్నాథం గారేనట.... ఆ కెంపురావు చాలాపెద్ద లిటిగేషన్ అట... సమయం వచ్చినప్పుడు తల్లి అని కూడా చూడకుండా... ప్రవర్తిస్తాడట..!...నిజం రా..


సరే...అది అతని వ్యాపారం అనుకుందాం.. కెంపు రావు మన ఇంటి బీరువా తాళాల విషయం లో పడిన జాగ్రత్త.... మన రహస్యాలు లోటుపాట్లు మీద.. పెంచుకొన్నంత అవగాహన లక్షపాళ్లు అయితే అందులో ఒకవంతు కూడా నా ఆరోగ్యం పట్ల పెంచుకోలేక పోయాడురా"...అంటూ మాధవ రావుగారు కొడుక్కి సవివరంగా వివరించారు.


" అదేంటి డాడీ... కెంపురావు గురించి ప్రతి రోజు నాకు ఫోన్లో అంత గొప్పగా చెప్పేవారు. అత్యద్భుతమైన హితుడు అనేవారు."..ఆశ్చర్య చిత్రవిచిత్రంగా అడిగాడు కొడుకు ఆనంద్.


“అత్యద్భుతమైన హితుడేరా.. చెప్పానుగా అది మన ఆస్తిపాస్తుల రహస్యాలు గ్రహించడం పట్ల..... మనం... ఆదమరచి ఉంటే మన రెండు కోట్లు విలువైన బిల్డింగ్ కూడా అతని పరం కావచ్చు అన్న భయం పట్టుకుంది రా. "


" మరిప్పుడెలా ఎవరికి ఇద్దాం తాళాలు? ఇక్కడ ఉన్న మన బంధువులు ఎవరినైనా పిలుద్దామా."... అర్థం కాక అడిగాడు ఆనంద్ తండ్రిని.


“వద్దురా.. అందుకోసం ఒకడున్నాడు రా. నా ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించిన వాడు, నేను....ఐస్క్రీమ్ తింటే...చచ్చిపోతానేమో...

అన్నంత భయపడినవాడు...నాకు....నిజమైన "అత్యద్భుతమైన హితుడు!" ఒకడున్నాడు రా." ప్రశాంతంగా చెప్పారు మాధవరావు గారు.

“మరింకేం! అతని పేరు చెప్పండి. లేకుంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను వెళ్ళి తీసుకు వస్తాను" ఆతృతగా అడిగాడు కొడుకు ఆనంద్.


“వద్దురా ఆనంద్… ఎదురు ఇల్లే కదా! మనమే వెళ్లి అతన్నిక్కడకు తీసుకువద్దాం. పద ".


“డాడీ... ఎదురు ఇల్లేనా ..? అయితే ఇన్నాళ్ళు.... అసలు మనమే అక్కడకు వెళ్లి అతడ్ని ఇక్కడకు తీసుకు రావడం ఏమిటి?.... అదేమిటి..? మీరు అంటున్నది నాకు అర్థం కావడం లేదు...మనం??!!".... ఏదో తప్పు జరుగు తున్నట్టు చేయబోతున్నట్టు...ఆగలేక అనేశాడు ఆనంద్.


“అవున్రా! మనమే అక్కడకు వెళదాం... తప్పేముంది. ఇది నా మనసు తీసుకున్న నిర్ణయం. అతని గుణం గంగిగోవు లాంటి రా. అంతేకాదురా ఆనంద్… మన ఇంటి ముఖ్యమైన తాళాలు మాత్రమే కాదు. మన బీరువాల రహస్య తాళాలు అన్నీ కూడా అతనికి ఇచ్చేయొచ్చు.!!! నాతో రా

వెళదాం..'' మాధవరావుగారు కొడుకుని తీసుకుని బయలుదేరారు ...


మాధవరావుగారి వెనుకగా ఆయన కొడుకు ఆనంద్ నడుస్తున్నాడు.. మాట్లాడకుండా..ఎదు రింటి వైపు...!!!!


'' నమ్మకం పోయిన వ్యక్తి.. గోముఖ వ్యాఘ్రంలా కనిపిస్తాడురా..

నమ్మకం పెంచుకున్న వ్యక్తి.....గంగిగోవులా కనిపిస్తాడు.. ఇంకా వివరంగా తర్వాత చెప్తాలే...'' అంటూ..కొడుకుని తీసుకుని ఎదురింటి సుబ్రామయ్య ఇంటికి సమీపించేసారు మాధవరావుగారు.


* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు



48 views0 comments
bottom of page