ఏలికా... నా పిలుపు విను ఇక!

Elika Na Pilupu Vinu Ika - Telugu Emotional Story | Routhu Srinivasa rao
ఏలికా... నా పిలుపు విను ఇక! - తెలుగు భావోద్వేగ కథ | రౌతు శ్రీనివాసరావు
Publishes in manatelugukathalu.com on 01/10/2026
“ఏలికా... నా పిలుపు విను ఇక!” రౌతు శ్రీనివాసరావు రచించిన ఆలోచనాత్మక, మానవతా సందేశాత్మక తెలుగు కథ. మనకు నీడనిచ్చిన చెట్టు నుంచి దేశానికి సేవ చేసిన మహనీయుల వరకు—మేలు చేసిన వారిని గుర్తుంచుకునే కృతజ్ఞత మనలో ఎందుకు తగ్గిపోతోందని ఈ రచన ప్రశ్నిస్తుంది. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవత్వం, దయ, బాధ్యత ఎటు వెళ్తున్నాయో ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది.
చిన్నప్పటి నుంచీ నాకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. మనుషులు చేసిన మేలును మాత్రమే కాదు, మనిషికి మేలు చేసిన వస్తువులను కూడా గొప్పగా గౌరవిస్తాను. ఎందుకో తెలియదు… అవి నాకు వస్తువులుగా కనిపించవు,,, ఎవరో ఒకరి రూపంలో నిలిచిపోయిన మంచితనంగా కనిపిస్తాయి.
మా ఊరి రైల్వే స్టేషన్ పక్కన, నా చిన్నతనంలో ఒక చిన్న బస్ షెల్టర్ ఉండేది. లయన్స్ గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ఆ షెల్టర్ చాలా సాదాసీదాగా ఉండేది—మధ్యలో ఒక అరుగు, పక్కకు మరో అరుగు, పైన ఒక కప్పు. కానీ దాని విలువ నాకు తెలుసు.
ఆ రోజుల్లో ఇప్పటిలా హోటళ్లు, లాడ్జీలు, వసతి సౌకర్యాలు ఉండేవి కావు. రాత్రి పది గంటలకు బొగ్గు పొగలు కక్కుకుంటూ ఒక ప్యాసింజర్ రైలు వచ్చేది. మళ్లీ తెల్లవారుజామున మూడు గంటలకు ఇంకో రైలు. దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు, ఆ చీకట్లో ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక, ఆ చిన్న షెల్టర్‌లోనే రాత్రిని సురక్షితంగా గడిపేవారు.
ఆ రోజులు చాలా గొప్పవి. ఆ మనుషులు గొప్పవారు.అది ఒక బస్ షెల్టర్ కాదు,,, అది ఒక మహానుభావుని మరో రూపం.
ఎందుకంటే అది ఎన్నో అలసిన ప్రాణాలకు ఆ రాత్రి నీడ ఇచ్చింది. ఎన్నో అపరిచితులకు ఆత్మీయత ఇచ్చింది. ఎన్నో కుటుంబాలకు తెలియకుండానే ఒక చిన్న భద్రత ఇచ్చింది.
దాని పక్కనే ఎవరో ఒక మహానుభావుడు ఒక బావి తవ్వించాడు. ఆ బావి నీరు… అబ్బా! ఎంత తియ్యగా ఉండేదో!
తెల్లవారుజామున అక్కడే ముఖం కడుక్కుని, చెట్టు పుల్లతో పళ్లు తోముకుని, ఆ బావి నీటితో స్నానం చేసి, పక్కనే ఉన్న చిన్న టీ కొట్టులో టీ తాగి, ఆరు గంటల ఫస్ట్ బస్సు ఎక్కి తమ తమ ఊళ్లకు వెళ్లిపోయేవారు.
ఆ బావి ఎవరిదో తెలియదు. ఆ షెల్టర్ ఎవరి ఆలోచనో తెలియదు. కానీ వారు చేసిన మేలు మాత్రం తెలుసు.
అందుకే అవి నాకు చుట్టాలకంటే చుట్టాలు, బంధువులకంటే బంధువులు.
కాలం గడిచింది. రోడ్లు మారాయి. వాహనాలు పెరిగాయి. కొత్త భవనాలు వచ్చాయి. ఆ షెల్టర్ కనిపించలేదు. ఆ బావి కూడా కాలగర్భంలో కలిసిపోయింది.మా పొలానికి వెళ్లే దారిలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఎంత గుబురుగా ఉండేదో! ఎండలో ప్రయాణించే వాళ్లు దాని నీడలో కాసేపు కూర్చునేవారు. ఎవరైనా మామిడి పచ్చికాయను కోసుకుని, ఆ చెట్టు నీడను బడలిక తీసుకుని తమ దారిన వెళ్లిపోయేవారు.
ఒకరోజు ఆ చెట్టు కొమ్మలు ఎండిపోయాయి. మనకు నీడనిచ్చిన చెట్టును మనమే నరికేశాం. కొయ్యలుగా పేర్చేశాం.
అక్కడే నా మనసులో ఒక ప్రశ్న పుట్టింది—
“మేలు చేసినది ఏదైనా, పనికిరానప్పుడు, దాన్ని మర్చిపోవడమేనా మనిషి తత్వం? వస్తువుల విషయంలోనే కాదు… మనుషుల విషయంలో కూడా ఇదే కదా!”
స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే అర్పించిన మహాత్మా గాంధీని తీసుకోండి. దేశం కోసం పోరాడిన ఆయనను కాలం గడిచేకొద్దీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తున్నారు, ఎవరో ఒకరు విమర్శిస్తున్నారు.
అబ్దుల్ కలాం గారిని చూడండి. చిన్న స్థాయి నుంచి ఎదిగి దేశ అత్యున్నత స్థానాన్ని అలంకరించినా, తన చివరి శ్వాస వరకూ పిల్లలతో, యువతతో, ప్రజలతోనే మాట్లాడారు. ప్రసంగిస్తూనే, బోధిస్తూనే, కలలు కనమని చెబుతూనే ఆయన కన్నుమూశారు.
అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రవీంద్రనాథ్ ఠాగూర్… ఎంతో మంది మహానుభావులు!
కొంతమంది స్వేచ్ఛను ఇచ్చారు. కొంతమంది జ్ఞానాన్ని ఇచ్చారు. కొంతమంది ధైర్యాన్ని ఇచ్చారు. కొంతమంది సాహిత్యాన్ని ఇచ్చారు. కొంతమంది ఆలోచనను ఇచ్చారు. తమ జీవితాన్ని సమాజానికి ఇచ్చి వెళ్లిపోయారు.
మరి మనం? వారి జీవితాలను గుర్తు చేసుకోవడానికి కొంత సమయం కూడా లేకుండా పోయిందా?ఒకప్పుడు పుస్తకం తెరిస్తే మహానుభావుల చిత్రాలు కనిపించేవి. వారి జీవిత చరిత్రలు కనిపించేవి. ఇప్పుడు మన చేతిలో పుస్తకం కంటే ఇంటర్నెట్ ఎక్కువ.మనిషి యంత్రాలను తయారు చేశాడు. కానీ ఆ యంత్రాల మధ్యలో తానే మరమనిషిగా మారుతున్నాడేమో!ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. జ్ఞానం పెరిగింది. వేగం పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి.
కానీ…
మానవత్వం పెరిగిందా?
కరుణ ఎక్కడ? దయ ఎక్కడ? ఆత్మీయత ఎక్కడ? బాధ్యత ఎక్కడ? మనకోసం ఏదో చేసినవారిని గుర్తుంచుకునే కృతజ్ఞత ఎక్కడ? వాళ్లు చూపించే సంస్కారం ఎక్కడ?
“ఇదే నా సందేహం, స్వామీ!”
“అందుకే నిన్నడుగుతున్నాను—
ఏలికా… నా పిలుపు విను ఇక… ఈ సంఘాన్ని సరిచేయ రావిక!”
నీవే సృష్టికర్తవట.సృష్టిని సృష్టించినవాడిని బ్రహ్మ అంటాం. సృష్టిని కాపాడేవాడిని విష్ణువు అంటాం. సృష్టిని లయపరచేవాడిని మహేశ్వరుడు అంటాం.సృష్టి… స్థితి… లయ…ఈ మూడు నిరంతరం సాగుతూనే ఉన్నాయి.
ప్రపంచం అనే ఈ మహాయంత్రం ఎక్కడైనా చెడిపోతే, నీవే ఏదో ఒక మహానుభావుడిని పంపిస్తావని మా పెద్దలు చెబుతారు. అతను వచ్చి ఏదో ఒక మార్పు చేస్తాడు. ఏదో ఒక వెలుగు చూపిస్తాడు. ఏదో ఒక మంచిని నాటుతాడు. తన పని పూర్తయిన తరువాత మళ్లీ నీలోనే కలిసిపోతాడు.
అయితే స్వామీ…“ఆ ముగ్గురినీ నడిపించే నీవెక్కడ?”“నీవెక్కడున్నావు?”
మహానుభావులను సృష్టించిన నీవు, మహానుభావులను మర్చిపోతున్న ఈ మనిషిని, మంచిని మరిచిపోతున్న ఈ సంఘాన్ని ఇలా ఎందుకు వదిలేస్తున్నావు?
కరుణను తగ్గించేది ఎవరు? దయను మరిపించేది ఎవరు? మానవత్వాన్ని మసకబార్చేది ఎవరు?
మనిషి నిన్ను మర్చిపోతున్నాడా? లేక… నీవే మనిషిని పరీక్షిస్తున్నావా?
నాకు తెలియదు స్వామీ. కానీ ఒక్కటి మాత్రం తెలుసు.
ఒక చిన్న బస్ షెల్టర్ కూడా మహానుభావుడిలా కొన్ని జీవితాలకు నీడనివ్వగలదు. ఒక బావి తన నీటితో వందల గొంతులు తడపగలదు. ఒక చెట్టు తన నీడతో ఎన్నో అలసటలను తీర్చగలదు. మనిషి తన జీవితాన్ని సమాజానికి అర్పించగలడు.
అయితే…
“ఇప్పుడు… మనిషి మనిషికి నీడగా ఎందుకు ఉండలేకపోతున్నాడు?”
“మేలు చేసినదాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం?”
“మహానుభావులను ఎందుకు కనుమరుగు చేస్తున్నాం?”
“స్వామీ… ఇది నా ప్రశ్న కాదు. ఇది ఒక మనిషి హృదయం నుంచి దైవాన్ని అడుగుతున్న ప్రశ్న.”
నీవు సర్వాంతర్యామివైతే, ఎక్కడో ఒక మూల ఇంకా మిగిలి ఉన్న మానవత్వాన్ని నీవు కాపాడుతున్నావా?
“ఒక్కసారి బయటికి రా స్వామీ… మా మధ్యలోకి రా.”
“మహానుభావుల రూపంలో రా. ఒక మంచి మనిషి రూపంలో రా. ఒక చిన్న బస్ షెల్టర్ రూపంలో రా. ఒక తియ్యని బావి నీటి రూపంలో రా. ఒక మామిడి చెట్టు నీడ రూపంలో రా.”
ఎందుకంటే—
“దైవత్వం అంటే ఆకాశంలో కనిపించేది కాదు;
మానవత్వంగా మన మధ్య నడిచేదే దైవత్వం.”
అందుకే చివరిసారిగా అడుగుతున్నాను—
“ఏలికా… నా పిలుపు వినవా?”
“మహానుభావులను మర్చిపోయిన ఈ మనుషుల మధ్య
మళ్లీ ఒకసారి మానవత్వాన్ని పుట్టించవా?”
అయితే, స్వామీ, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నీవే చెప్పాలి.
ఈ ఆటకు అంతం ఏమిటి, పరమాత్మా?
ఈ సృష్టికి మూలం ఏమిటి?
దాని మూలకారణం ఏది?
మన జన్మకు, మా జీవితానికి పరమార్థం ఏమిటి?
వచ్చాం. నీవిచ్చిన పాత్రను పోషించాం. ఒకరోజు వెళ్లిపోతాం.
“కానీ ఆ తర్వాత ఏమిటి?”
“మేము ఎక్కడికి వెళ్తున్నాం?”
ఎరుకలేని ఈ జీవితాలను గడుపుతున్నాం. ఇతరుల ముందు గొప్పగా కనిపించాలని అనుకుంటాం. ఏదో ఒకటి నిరూపించాలని కోరుకుంటాం. కానీ ఏం నిరూపించాలో మాకే తెలియదు.
చెత్త సంస్కృతులు, దిశ లేని చదువులు, పస లేని జీవిత ప్రయాణాలు, బాధ్యత లేని బంధాలు.
నీవు సృష్టించిన పంచభూతాలనే మనుషులు వాటాలేసుకుంటున్నారు స్వామీ...
ఆకాశం — విస్తరించడానికి,
గాలి — బతకడానికి,
నీరు — జీవించడానికి,
భూమి — నిలబడడానికి,
అగ్ని — వెలుగునివ్వడానికి...
అన్నీ అందరి కోసం సృష్టించినవే కదా స్వామీ!
కానీ, ఇప్పుడు సాధారణుడి కంటికి కనిపించని వాటాలుగా మారిపోతున్నాయి.
సాధారణుడికి అందని భవనాలు,
సాధారణ రైతుకు అందని పరిజ్ఞానం,
సాధారణ మనిషికి అందని వైద్యసదుపాయాలు,
అందని వైద్యమహిమలు,
అందని ఆసుపత్రులు...
ప్రతి దానిలోనూ నీ సృష్టి స్వభావానికే విరుద్ధమైన మార్పులు వస్తున్నాయి స్వామీ!
గృహిణి — గృహిణిలా ఉండడం లేదు,
గృహస్థుడు — గృహస్థుడిలా ఉండడం లేదు,
పిల్లలు — పిల్లల్లా ఉండడం లేదు,
యువకులు — యువకుల్లా ఉండడం లేదు,
వృద్ధులు — వృద్ధుల్లా ఉండడం లేదు.
మనిషిలోనే వింతైన ఆలోచనలు, విపరీతమైన అనుభూతులు, విపరీతమైన భావాలు పెరుగుతున్నాయి స్వామీ!
“ఇవన్నీ ఎవరు మరమ్మత్తు చేయాలి?”
భూమిని మాత్రమే మరమ్మత్తు చేస్తావా?
సృష్టిని మాత్రమే చక్కదిద్దుతావా?
మరి, స్వామీ,
సృష్టిలో పుట్టి, అదే సృష్టిని ధ్వంసం చేస్తున్న మానవుడి మనసును ఎవరు మరమ్మత్తు చేస్తారు?
సృష్టికి జరిగిన నష్టాన్ని ఒక రోజు సరిచేయవచ్చు...
కానీ,
సృష్టిలో జీవించే మనుషుల హృదయాల్లో చెదిరిపోతున్న ప్రేమను,
తరిగిపోతున్న బాధ్యతను,
మరుగునపడుతున్న గౌరవాన్ని,
కనుమరుగవుతున్న మానవత్వాన్ని
ఎవరు తిరిగి నేర్పిస్తారు స్వామీ?
సృష్టి మారితే సరిపోదు స్వామీ,
సృష్టిలోని మనిషి కూడా మారాలి.
అందుకే...
“ఏలికా...
నా పిలుపు విను ఇక!”
***************************************
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
రౌతు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రౌతు శ్రీనివాసరావు
నా పేరు రౌతు శ్రీనివాసరావు. నేను భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కవితలు, కథలు చదవడం, రచించడం నా అభిరుచులు. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, నా మనోభావాలను చిన్న చిన్న కథానికలుగా, కవితలుగా మలచే ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలను చదివి మీ విలువైన అభిప్రాయాలు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏







Comments