top of page
Original.png

ఎమోజీల ప్రేమ


వృద్ధ తండ్రికి ఎమోజీలతో ప్రేమ చూపించే పెద్ద కొడుకు, చేతల్లో ప్రేమ చూపించే చిన్న కొడుకు

Emojila Prema - Telugu Emotional Family Story | G. S. S. Kalyani

ఎమోజీల ప్రేమ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ |G. S. S. కళ్యాణి

Published in manatelugukathalu.com on 04/08/2026


ఎమోజీల ప్రేమ నిజమైన ప్రేమేనా? విదేశాల్లో ఉన్న కొడుకు పంపే ❤️❤️, 😭😭 మెసేజ్‌ల వెనుక ఉన్న అనుబంధం గొప్పదా... లేక పక్కనే ఉండి అవసరమైన సమయంలో అండగా నిలిచే కొడుకి ప్రేమ గొప్పదా? హృదయాన్ని కదిలించే ఈ తెలుగు కుటుంబ కథలో రిటైర్డ్ టీచర్ సీతాపతి జీవితంలో జరిగిన సంఘటనలు, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, వృద్ధాప్యంలో తోడు ఎంత ముఖ్యమో ఎంతో హృద్యంగా చూపించబడింది. ప్రతి కుటుంబం తప్పకుండా చూడాల్సిన ఈ భావోద్వేగ తెలుగు కథ మీ హృదయాన్ని తాకకుండా ఉండదు.



ఒక చిన్న పల్లెటూరిలోని గవర్నమెంటు స్కూల్లో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న సీతాపతికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు అభిరాం చిన్నవాడు బలరాం. బలరాంను కన్న రెండేళ్ళకే సీతాపతి భార్య తీవ్రమైన అనారోగ్యంతో కన్నుమూసింది. దాంతో పిల్లలిద్దరికీ అన్నీ తానై వారిని పెంచి పెద్ద చేశాడు సీతాపతి.


అభిరాం, బలరాంలు తండ్రి చూపిన మార్గంలో ఉన్నత చదువులు చదివి, మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. అభిరాంకి అమెరికాలోనూ, బలరాంకి పట్నంలోనూ ఉద్యోగాలొచ్చాయ్. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని జీవితంలో స్ఠిరపడ్డారు. కొంతకాలానికి సీతాపతి పదవీవిరమణ పొందాడు. 


"రిటైరైపోయారు కదా! ఇక మీ పిల్లల దగ్గరకు వెళ్ళిపోతారా?", సీతాపతిని అడిగాడు స్కూల్లో పని చేస్తున్న ఒక టీచర్. 


"నాకు మన ఊరిని విడిచి వెళ్ళాలని లేదండీ! అయినా పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నేను వెళ్ళి వాళ్ళ జీవితాల్లో జోక్యం చేసుకుంటే లేనిపోని ఇబ్బందులు రావచ్చు. ఓపికున్నంత కాలం ఇక్కడే ఉంటాను", అన్నాడు సీతాపతి. 


రోజులు గడుస్తున్నాయి. అభిరాం అప్పుడప్పుడూ సీతాపతికి ఫోను చేసి కుశలం కనుక్కుంటూ ఉండేవాడు. బలరాం పదిహేను రోజులకోసారి, సాధారణంగా వారాంతాల్లో సీతాపతి దగ్గరకు వచ్చి, కాసేపు సీతాపతితో గడిపి వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే కొద్దినెలల క్రితం బలరాంకి ఉద్యోగంలో ప్రమోషన్ రావడంచేత అతనికి ఆఫీసులో బాధ్యత పెరిగింది. దాంతో సీతాపతి వద్దకు నెలకోసారి రావడం మొదలుపెట్టాడు బలరాం. సీతాపతికి పోనుపోనూ ఒంటరితనం ఎక్కువైపోయింది. 


ఓసారి బలరాం తన దగ్గరకు వచ్చినప్పుడు, "ఒరేయ్ బలరాం! ఇంకొక్కరోజు నా దగ్గర ఉండొచ్చు కదరా!", అన్నాడు సీతాపతి. 


"లేదు నాన్నా! నాకు రేపు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉంది. నేను వెళ్ళిపోవాలి. నువ్వు నా మాట విని నాతో పట్నం వచ్చెయ్. నీ కోడలు శ్రీప్రద నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పి పంపించింది", అన్నాడు బలరాం. 


"నాకు ఇక్కడ బానే ఉందిలేరా! ఈ ఊరొదిలి రావడం నావల్ల కాదు! నేనిక్కడే ఉంటాను", అన్నాడు సీతాపతి. 


చేసేదిలేక బలరాం, "సరే! నీ ఇష్టం నాన్నా", అని పట్నం వెళ్ళిపోయాడు. 


ఓసారి అమెరికాలో ఉంటున్న అభిరాం సీతాపతికి ఒక ఖరీదైన స్మార్ట్ ఫోనును కానుకగా పంపి, "నాన్నా! ప్రతిరోజూ నీతో మాట్లాడకపోతే నాకు అన్నీ ఉన్నా ఏదో మిస్సవుతున్నానని అనిపిస్తోంది. ఏం చెయ్యలా అని బాగా ఆలోచించి ఈ ఫోను కొన్నాను. ఈ ఫోన్లో సింకార్డు వేయించుకో. మా పగలు మీ రాత్రి కాబట్టి నేను మాట్లాడటానికి వీలుపడదు. నాకు నీతో ఎప్పుడు మాట్లాడాలని అనిపిస్తే అప్పుడు మెసేజీలు పెడతాను. నువ్వు వీలైనప్పుడు ఆ మెసేజీలు చదివి నాకు రిప్లై ఇవ్వచ్చు", అన్నాడు అభిరాం.   


తనపై పెద్ద కొడుకు చూపిస్తున్న ప్రేమకు సీతాపతి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. గర్వంగా ఊళ్ళో అందరికీ అభిరాం పంపిన ఫోనును చూపించాడు సీతాపతి. మెసేజీలతో అభిరాం పంపే ఎమోజీలు సీతాపతికి తెగ నచ్చేవి. ఒకరోజు గుడిలో పూజ జరుగుతూ ఉండగా ఉన్నట్లుండి సీతాపతి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ గుడి పూజారి సీతాపతిని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించి ఇంట్లో దిగబెట్టాడు. 


విషయం తెలుసుకున్న బలరాం కంగారుపడుతూ బయలుదేరి సీతాపతి దగ్గరకు వచ్చి, "నాన్నా! ఇంక నువ్వొక్కడివే ఇక్కడ ఉండద్దు. నాతో పట్నం వచ్చెయ్. నా మాట కాదనద్దు", అన్నాడు. 


"తొందరపడకురా! కాస్త ఆగు. ఆలోచించి నా నిర్ణయం చెప్తా", అన్నాడు సీతాపతి. 

బలరాం సీతాపతి సంగతి అభిరాం కు తెలియజేశాడు. 


అభిరాం వెంటనే, 'అయ్యో నాన్నా! పెద్దకొడుకునై ఉండీ నీకవసరమైనప్పుడు నేను అక్కడ లేనందుకు చాలా బాధగా ఉంది. నువ్వు నా దగ్గర ఉంటే నీకిలాంటి కష్టం వచ్చేది కాదు. ‘వి ఆల్ లవ్ యు అండ్ మిస్ యు నాన్నా!', అంటూ రెండు ఏడుస్తున్న ఎమోజీలూ, ఒక హృదయాకారపు ఎమోజీని జత చేసి సీతాపతికి మెసేజీ పంపించాడు. 


'ఈ నాన్నమీద నీకున్న ప్రేమ నాకు తెలుసురా!', అనుకున్నాడు సీతాపతి ఆ మెసేజీని చదివి.  మర్నాడు కాస్త కోలుకున్న సీతాపతి మళ్ళీ దేవుడి దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్ళాడు. 


పూజారి ప్రసాదం చేతిలో పెడుతూ, "ఏంటి సీతాపతి గారూ? మీ చిన్నబ్బాయి దగ్గరకు వెళ్ళిపోతున్నారా?", అని అడిగాడు. 


"లేదండీ! నేను అమెరికాలో ఉంటున్న నా పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళాలని అనుకుంటున్నాను. చిన్నవాడు బలరాంకి ఎప్పుడూ ఆఫీస్ పనుల హడావుడి. ఇక్కడికి వస్తాడే కానీ నాతో మాట్లాడే సమయం వాడికి ఉండదు. పెద్దవాడు అభిరాం అలా కాదు. నాతో ఏవేవో కబుర్లు చెప్పాలని ఆరాటపడుతూ ఉంటాడు. వాడి ప్రేమంతా వాడి మెసీజీల్లో కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మన భావాలు వ్యక్తం చెయ్యడానికి పదాలు దొరకవు. అందుకే ఈ ఎమోజీలను సృష్టించారని నాకనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో అమెరికాలో నాకు చాలా దూరంగా ఉంటున్నా ఆ అభిరాంగాడికి నేనంటే ఎంత ఇష్టమో! నేను వాడి దగ్గరకు వెళ్ళిపోతాను", అన్నాడు సీతాపతి. 


"సరేనండీ! శుభమస్తు!!", అన్నాడు పూజారి చిరునవ్వుతో. 


సీతాపతి ఇంటికి వెళ్ళి సంతోషంగా తన ఫోను తీసుకుని, 'ఒరేయ్ అభిరాం! నేను అమెరికా వచ్చెయ్యాలని అనుకుంటున్నా. నీతో కొంత కాలం గడపాలని ఉంది. ఏర్పాట్లు చెయ్యి’, అని అభిరాంకి మెసేజ్ పెట్టాడు. 


అరగంట గడిచింది. మామూలుగా మెసేజీలకి వెంటనే సమాధానం ఇచ్చే అభిరాం ఎందుకో ఇంకా సీతాపతి పంపిన సందేశానికి బదులేమీ పెట్టలేదు. 


'వాళ్ళకిప్పుడు రాత్రి కదా! లేచాక నా మెసేజీ చూసుకుంటాడులే', అని అనుకున్నాడు సీతాపతి. ఒక రోజు గడిచింది. అయినా అభిరాం నుండీ సమాధానం రాలేదు.  


'వీడి ఆరోగ్యం బాగుందో లేదో! అభిరాం ఈపాటికి సమాధానం ఇవ్వాలి కదా! ఏమైందో ఏమిటో’, కాస్త దిగులు మొదలైంది సీతాపతి గుండెల్లో. 


మరొక రోజు గడిచేసరికి ఇక ఉండబట్టలేక అభిరాంకి ఫోను చేశాడు సీతాపతి. 

"ఏంటి నాన్నా? ఇంత రాత్రివేళ చేశావ్? చాలాసేపు ప్రయత్నించాక ఇప్పుడే పాప పడుకుంది. నువ్వు ఫోను చేసేసరికి అది మళ్ళీ లేచి కూర్చుంది. ఫోన్ పెట్టెయ్. నాకు వీలైనప్పుడు నేనే చేస్తా", అని విసుక్కుంటూ సమాధానం ఇచ్చి సీతాపతికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఫోను కట్ చేశాడు అభిరాం. 


అభిరాం మాటలకు సీతాపతి నొచ్చుకున్నాడు. 


‘నాదే తప్పు! వాడు ఫోను చెయ్యద్దనీ మెసేజీలు పెట్టుకుందామనీ నాకు ముందే చెప్పాడు. అయినా నేను వాడికి ఫోను చేశాను. ఆ మాత్రం కోపం రావడం సహజం. ఎప్పుడో వాడే చేస్తాడులే', అనుకుని తన మనసును కుదుటపెట్టుకున్నాడు సీతాపతి.  

మరో రెండు రోజులు గడిచాయి. అభిరాం ఫోను చెయ్యలేదు సరి కదా మెసేజీ కూడా పెట్టలేదు! 


'ఏరా అభిరాం! ఫోను చేసి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. నాకు టికెట్లు ఎప్పుడు బూక్ చేస్తావో చెప్తే నేను బట్టలు సద్దుకుంటాను. పిల్లలకు బట్టలూ, బొమ్మలూ తీసుకుని రావాలని అనుకుంటున్నాను. ఏ విషయం మెసేజీ పెట్టు’, అని అభిరాంకి మెసేజీ పంపించాడు సీతాపతి. 


అభిరాం గంట గడిచినా సమాధానం ఇవ్వలేదు. సీతాపతికి కంగారు మొదలైంది. 'చీటికీమాటికీ మెసేజీలు పెట్టే అభిరాం ఇప్పుడింత మౌనంగా అయిపోయాడేమిటీ?', అని సీతాపతి అనుకుంటూ ఉండగా అభిరాం నుండీ సీతాపతికి ఫోను వచ్చింది. 

క్షణం ఆలస్యం చెయ్యకుండా ఫోనెత్తి 'హలో!' అన్నాడు సీతాపతి. 


"నాన్నా! నువ్వు ఇక్కడికి వద్దామని అనుకుంటున్నట్లున్నావ్?", అడిగాడు అభిరాం. 


"అవునురా! నువ్వు నన్ను ఎన్నోసార్లు రమ్మని అన్నావుగా? ఇక్కడ బొత్తిగా ఒక్కడినైపోయాను. ఎప్పుడు రమ్మంటావ్?".


"నాన్నా! అమెరికాకి నిన్ను తీసుకురావడం అంత సులభం కాదు! ఇక్కడి చల్లటి వాతావరణం నువ్వు తట్టుకోలేవు", అన్నాడు అభిరాం. 


"నువ్వు ఊరికే నా గురించి కంగారు పడకురా! నేను కంబళి కప్పుకుని కూర్చుంటాలే!", అన్నాడు సీతాపతి నవ్వుతూ. 


"కానీ నాన్నా! ఇక్కడి ఆహారం నువ్వు తినలేవు. పైగా మాకు రెండు పడక గదులు ఉన్నాయి. ఒకటి మాకూ మరొకటి మా పిల్లలకీ. నువ్వెక్కడ పడుకుంటావ్?", అడిగాడు అభిరాం కాస్త గంభీరంగా. 


"ఎక్కడో అక్కడ సద్దుకుంటాన్లేరా! నేనక్కడికొచ్చాక చూసుకుందాం", అన్నాడు సీతాపతి. 


"నాన్నా! నీకు అసలే ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు. వాతావరణం మార్పువల్ల నీకు ఇక్కడేదైనా సమస్య వస్తే నిన్ను చూసుకునేందుకు నేనొక్కడినైపోతా! అక్కడైతే నిన్ను చూసుకోవడానికి ఊరివాళ్ళతో పాటూ తమ్ముడు కూడా ఉంటాడు", అన్నాడు అభిరాం చిరాకు పడుతూ.


అభిరాం ఉద్దేశం సీతాపతికి అర్థమైపోయింది. 


"సరేరా! ఫోను మళ్ళీ చేస్తాలే", అని సీతాపతి అంటూ ఉండగానే వీధివాకిట్లో కారు ఆగిన చప్పుడైంది. 


"ఎవరూ?", అంటూ గేటు వద్దకు వచ్చిన సీతాపతికి బలరాం తన భార్యాపిల్లలతో కలిసి కారు దిగుతూ కనిపించాడు. 


"అదేవిట్రా? ఇవాళ వారాంతం కాదు కదా? ఆఫీసుకి సెలవు పెట్టావా?", ఆశ్చర్యంగా బలరాం ని అడిగాడు సీతాపతి. 


"అవును నాన్నా! నాకు అన్నిటికన్నా నువ్వే ముఖ్యం. అందుకే సెలవు పెట్టి నిన్ను మాతో తీసుకెళ్ళటానికి వచ్చేశా. నేనడిగితే నువ్వెలాగో రానని అంటావుగా. అందుకే నీ కోడల్నీ, మనవళ్ళనూ కూడా తెచ్చా", అన్నాడు బలరాం నవ్వుతూ. 


"మీరో మాతో వచ్చేయ్యండి మామయ్యగారూ! మీకు కావలసినవన్నీ మేం చూసుకుంటాం", అంది శ్రీప్రద ఆప్యాయంగా. 


"తాతా! మాతో రా! బోలెడు ఆటలు ఆడుకుందాం", ముద్దు ముద్దు మాటలతో చెరో చెయ్యీ పట్టుకుని అడిగారు పిల్లలు. 


"మీరంతా ఇంత బలవంతం చేస్తుంటే రాకుండా ఎలా ఉంటానూ? తప్పకుండా మీతో వస్తాను", ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో అన్నాడు సీతాపతి. 


సీతాపతి సూట్ కేసులు సద్దటంలో ఇంటిల్లుపాదీ తలా ఒక చెయ్యీ వేసి అంతా కలిసి కారులో పట్నం బయలుదేరారు. దారిలో గుడి దగ్గర కారు ఆపమన్నాడు సీతాపతి. బలరాం కారును ఆపగానే సీతాపతి గుడిలోకి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకున్నాడు. 


తీర్థమిచ్చి శఠగోపం పెడుతూ, "సీతాపతిగారూ? అమెరికాకేనా ప్రయాణం?", అడిగాడు పూజారి. 


"లేదండీ! మా చిన్నబ్బాయి దగ్గర ఉండటానికి నిర్ణయించుకున్నాను. మా పెద్దబ్బాయిది ఎమోజీల ప్రేమ అనీ మా చిన్నబ్బాయిది అసలైన ప్రేమ అనీ తెలుసుకున్నాను!”, అన్నాడు సీతాపతి.


అది విన్న పూజారి, “నిజానికి ఇది ఆ భగవంతుడి నిర్ణయమే అని నాకనిపిస్తోంది సీతాపతిగారూ! మీ చిన్నబ్బాయి దగ్గర ఉంటే అప్పుడప్పుడూ ఈ ఊరికి వచ్చిపోతూ ఉండచ్చు. అమెరికా వెళ్ళిపోతే ఇక ఈ ఊరికి రాలేరేమో కదా! ", అన్నాడు పూజారి సీతాపతి చేతిలో ప్రసాదం పెడుతూ. 


"మీరన్నది అక్షరాలా నిజం", పూజారి ఇచ్చిన ప్రసాదం కళ్లకద్దుకుంటూ అన్నాడు సీతాపతి.


*****

సమాప్తం. 


G. S. S. కళ్యాణి  గారి కొన్ని ఇతర రచనలు:


G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

G. S. S. కళ్యాణి

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page