కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Facovid' Written By Sita Mandalika
రచన: సీత మండలీక
అన్నిట్లో ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి.
ఆఖరికి మందుల్లో కూడా.
మరి కోవిడ్ లో ఎందుకు రాకూడదు?
ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించిన ఫేకోవిడ్ 19 కథలో మీకు సమాధానం
దొరుకుతుంది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
సుధీర్ పెళ్లి సుజాత తో ఘనంగా జరిగింది.
అంటే మొత్తం అతిథులు 50.
మావయ్యలందరూ లాటరి చీట్లు వేసి ఒక మూడు జంటలని ఎన్నుకున్నారు.
అలాగే పిన్నులందరు మరొక మూడు జంటలని ఎన్నుకున్నారు. నాన్న గారి తరఫున ముగ్గురు తమ్ముళ్లు భార్యల తో సహా పెళ్ళికి వచ్చేరు. ఇక సుధీర్ స్నేహితులు సుజాత స్నేహితులు ఇద్దరి ఆఫీస్ వాళ్ళు కలిసి మొత్తం 51 మంది అతిథులయ్యేరు.
పెళ్లి గ్రాండ్ గా జరగడానికి తక్కువ మంది గెస్ట్ లు రావడం కొంత కారణం. మంది తక్కువైతే మజ్జిగ పెరుగైనట్లు, పెళ్లి పందిరి అలంకారాలు, వసతులు, భోజనాలు అన్నీ 5 స్టార్ లెవెల్ లో జరిగేయ్.
పెళ్లి సందడి పూర్తయి, ఎవరిళ్ళకి వాళ్లు తమ తమ ఊర్లకి బయలు దేరేరు.
బయటనించి వచ్చిన వారందరూ దూరప్రయాణాలు చేసి కార్లలో వచ్చేరు. ట్రైన్ ల లోను బస్సు ల లోను రావడం ప్రమాదం కదా ఈ కోవిడ్ రోజుల్లో.
సుజాత ని దగ్గరకు తీసుకుని నాన్న సుబ్బారావు గారు, అమ్మ విశాలాక్షి వదలలేక వదలలేక సుధీర్ కి, రామకృష్ణ అనూరాధ దంపతులకి అప్ప చెప్పి బయలు దేరేరు.
ఇంక సుధీర్ ఇంట్లో కోవిడ్ బిహేవియర్ మొదలయింది. కూరగాయలు, ప్రొవిజన్స్ అన్నీ అమెజాన్ , బిగ్ బాస్కెట్ ద్వారా గుమ్మం దగ్గిర పడేసి బెల్లు కొట్టి వెళ్లే వారు.పాల వాడు 5 ప్యాకెట్లు తలుపు అవతల పడేసి పోయేవాడు.చేతికి శానిటైజర్ రాసుకుని ప్యాకెట్లన్నీ సబ్బుతో కడిగి తుడిచి ఫ్రిజ్ లో పెట్టేవారు.ఉదయాన్నే అందరూ వీలయినంత దూరంగా కూర్చుని విశాలాక్షి గారు కలిపిన వేడి కాఫీ తో రోజు ప్రారంభించే వారు.తరవాత అందరూ తమ తమ వర్క్ ఫ్రం హోమ్ లో పడిపోయేరు.
సుధీర్ కి ఏమీ తోచడం లేదు పెళ్ళికని 3 వారాలు సెలవు పెట్టేడు. పెళ్లయ్యాక హనీమూన్ కి వెళదామనుకున్నాడు.ఈ కోవిడ్ కొత్త స్ట్రెయిన్ వచ్చి అడ్డుపడుతోంది. ఎలాగేనా ప్రయత్నించి ఒక వారం బయటకి భార్య తో వెళ్ళాలి.కానీ ఎలా?
మర్నాడు సుధీర్ అమ్మ తో అన్నాడు "అమ్మా! ఒక వారం రోజులు బయటకి
వెళ్లి వస్తాము. ఇంకా నా సెలవ ఉంది కదా"
"ఒరేయ్, ఒద్దురా బయట బాగులేదు. కోవిడ్ చాలా వేగం గా
వ్యాపిస్తోంది. రెండు మూడు నెలలో తగ్గుతుందంటున్నారు. తరవాత హాయిగా ఏదేనా మంచి ప్రదేశానికి వెళ్ళచ్చు" అని తేల్చేసేరు అనూరాధ గారు. సుధీర్, సుజాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండి పోయేరు.
ఇలా రోజులు గడుస్తున్నాయి సుధీర్ సుజాత ల హనీ మూన్ కోరిక తీరే మార్గం కనిపించడం లేదు. ఈ విలన్ కరోనా కొత్త కొత్త రూపాలతో విజృంభిస్తోంది . టీకాలు తీసుకున్న వారినీ, లేని వారినీ ఒకే రీతి గా చుట్ట పెట్టేస్తోంది.
కొత్త గా పెళ్లయి ఇంట్లో కూర్చోడం సుధీర్ కి ఇబ్బంది గా ఉంది. ఒక
సినిమా లేదు, ఒక పార్క్ లేదు . అసలు బయటికే వెళ్లడం కుదరడం లేదు.. ఏది ముట్టుకున్నా చేతికి శానిటైజర్ రాసుకోడమో సబ్బుతో చేతులు తోముకోడమో. అందరూ చుట్టూ ఉన్నా జైలు లో ఉన్నట్లుంది.
"ఇక లాభం లేదు ఎదో ఒకటి చెయ్యాలి" అన్నాడు సుధీర్ సుజాత తో
"మీ తొందర బాగానే ఉంది కానీ ఏం చేయగలం. కోవిడ్ టైం లో పెళ్లి చేసుకున్న వాళ్లందరికీ ఈ సమస్యే కదా" అని చిరునవ్వు తో సమాధానం ఇచ్చింది సుజాత.
"సుజాతా మనకి కోవిడ్ వచ్చిందంటే?"
"బాగుంది, మనల్ని రూమ్ లో బంధించి గంట గంటకి ఎవరో వచ్చి బ్రేక్
ఫాస్ట్ లంచ్ డిన్నర్ టీ అందిస్తూ ఉంటారు. ఇంట్లో మనిద్దరమే కాదు కదా"
సుధీర్ మనసు లో ఒక ఐడియా సడన్ గా వచ్చింది. ‘నన్ను ఆలోచించుకోనీ’ అని సుజాతకి చెప్పి అన్నసునీల్ రూమ్ కి వెళ్లి ఏదో రహస్యం గా మాట్లాడేడు. సునీల్ చిరు నవ్వుతో తన సమ్మతి తెలిపేడు.
సునీల్ తనకి తెలిసిన ఒక టెస్టింగ్ ల్యాబ్ తో మాట్లాడేడు.
తరవాత అందరికీ చెప్పేడు "ఈ కరోనాకి లక్షణాలు ఏమీ ఉండవుట. అందుకు అందరినీ టెస్ట్ చేయించుకోమని డాక్టర్ గారు చెప్తున్నారు. రేపు ఉదయం టెస్టింగ్ ల్యాబ్ నించి వచ్చి అందరికీ టెస్ట్ చేస్తారు" అని ప్రకటించేడు.
మర్నాడు ఉదయం టెక్నీషియన్ వచ్చి అందరికీ టెస్ట్ చేసి ఒక రెండు గంటల లో రిపోర్ట్ పంపించేడు. అందరికీ నెగిటివ్, సుధీర్ కి సుజాతకి తప్ప. వాళ్ళిద్దరికీ కూడా చాల తక్కువగా ఉంది .
అనూరాధ గారు కంగారు పడిపోయేరు పిల్లలిద్దరికీ ఇలా
రావడమేమిటని.
సునీల్ అన్నాడు "అమ్మా! ఇది సులువు గా ఒకరినించి ఒకరికి వస్తుంది కానీ చాలా తక్కువగా వస్తుంది. నాకు తెలిసిన ఒక హోటల్ అరకు వేలీలో ఉంది. ఆ హోటల్
లో కోవిడ్ వచ్చిన వాళ్లనే తీసుకుంటున్నారు. అందరికీ వేరే గదుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. ఒక డాక్టర్ కూడా రోజూ అందరినీ చూస్తుంటారు. ఇది ఒక మానవ సేవ గా భావించి ఈ హోటల్ వాళ్ళు చేస్తున్నారు. సుధీర్, సుజాత అక్కడికి వెళ్లి ఒక వారం రోజులు జాగ్రత్త పడితే కోలుకుని తిరిగి వచ్చేస్తారు"
సుధీర్ నాన్న గారన్నారు "చాలా ఆశ్చర్యం గా ఉంది. ఇలాంటి సమాజ
సేవ చేసే హోటల్స్ కూడా ఉన్నాయా’
"అవును నాన్న గారు. ఇలాంటి హోటల్స్ ప్రభుత్వం ప్రోత్సాహం తో ఈ పాండమిక్ తగ్గే దాకా క్వారంటైన్ హోటల్ లాగా మార్చేరు. సుధీర్, సుజాత ఇంట్లో ఉండి అందరికీ కోవిడ్ రావడం కంటే అక్కడే ఉండి తగ్గగానే వస్తే మంచిది కదా"
"హోటల్ సేఫ్ గానే ఉంటుందా. అందరూ పేషేంట్లంటున్నావు?”
"లేదు నాన్న గారూ! వాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు స్నేహితులు నయమయి వచ్చేరు'
‘అవును. అదే మంచిది’ అని ఏక కంఠం తో అందరూ ప్రతిపాదనకు
సమ్మతి తెలిపేరు.
ఇంకేం.. సునీల్ రంగం లోకి దిగి, వెంటనే ఒక టాక్సీ, టీకాలు రెండు డోసులు తీసుకున్న డ్రైవర్ తో ఏర్పాటు చేసి సుధీర్ కి చెప్పేడు, ఒక చిరు నవ్వుతో
"సుధీర్! మీరు రెడీ గా ఉండండి. 3 గంటలకి టాక్సీ వస్తుంది. 7 గంటలకల్లా హోటల్
చేరుకుంటారు. నేను హోటల్ కి ఫోన్ చేసి డీలక్స్ రూమ్ బుక్ చేసేను"
సుధీర్, సుజాత హోటల్ చేరేసరికి రాత్రి 7.౩౦ అయ్యింది. డీలక్స్ రూమ్ లో ప్రవేశించి వెయిటర్ సామాను పెట్టగానే తలుపు వేసి, ‘కోవిడ్ పేషెంట్ గారు ఎలా ఉన్నారు’ అని నవ్వుతూ దగ్గరగా తీసుకున్నాడు సుజాతని.
ఒక వారం రోజులు ఎలా గడిచి పోయేయో వాళ్లకి
తెలియలేదు. సుధీర్ ఇంటికి టెలిఫోన్ చేసి నాన్నగారికి చెప్పేడు "నాన్న గారూ! ఇక్కడ చాలా బాగా చూసుకున్నారు.ఈవాళ టెస్ట్ లో ఇద్దరికీ నెగటివ్ వచ్చింది. కానీ డాక్టర్ గారు మరొక వారం క్వారంటైన్ లో ఉండి వెళ్ళమని సలహా ఇచ్చేరు”
"సరేలేరా! వీళ్ళకి కొంత బిజినెస్ దృక్పధం కూడా ఉంటుంది. అయినా డాక్టర్ గారు చెప్పేరు కనక మరొక వారం ఉండి రండి" అని చెప్పేరు సుధీర్
నాన్న గారు.
రెండు వారాల తరవాత సుధీర్ , సుజాత చిరునవ్వు తో తిరిగి
ఇంటికి వచ్చేరు. సునీల్ అడిగేడు "అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సుధీర్?” అని.
“చాల బాగున్నాయి అన్నా, థాంక్ యు” అని కన్ను గీటేడు సుధీర్.
గదిలోకి వెళ్లిన తరవాత సుధీర్ అన్నాడు "సుజాత గారూ! మన ఫేకోవిడ్ 19 ఎలా వుంది" అని.
సుజాత చిరునవ్వుతో, సిగ్గుతో తల వంచుకుంది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : సీత మండలీక
నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది
కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది
Pullela V Somayajulu • 4 hours ago
Bagundi.