ఫ్యాటీ లివర్: భారత్‌లో పెరుగుతున్న ఆరోగ్య ముప్పు
ఫ్యాటీ లివర్, MASLD, MASH, కాలేయ ఆరోగ్యం, లివర్ వ్యాధులు, డా కృష్ణ కుమార్ వేపకొమ్మ, ఆరోగ్య అవగాహన, తెలుగు ఆరోగ్య వ్యాసం
Fatty Liver: A Growing Health Threat in India - Telugu Health Article | Dr. Krishna Kumar Vepepakomma
ఫ్యాటీ లివర్: భారత్‌లో పెరుగుతున్న ఆరోగ్య ముప్పు - తెలుగు ఆరోగ్య వ్యాసం | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ
Published in manatelugukathalu.com on 27/07/2026
కాలేయం (లివర్) మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పైత్యరసాన్ని (బైల్) తయారు చేయడం, శక్తిని నిల్వ చేయడం, శరీర జీవక్రియలను నియంత్రించడం వంటి సుమారు 500కు కీలక విధులను నిర్వహిస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ ప్రస్తుతం మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD)గా పిలుస్తున్న వ్యాధి. ఇది దేశంలో వేగంగా పెరుగుతోంది.
ఒకప్పుడు ఫ్యాటీ లివర్ అంటే మద్యం ఎక్కువగా తాగే వారికి లేదా అధిక బరువు ఉన్నవారికే వస్తుందని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. యువత, ఉద్యోగులు, గృహిణులు, అలాగే బయటకు ఆరోగ్యంగా కనిపించే సాధారణ బరువు ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తోంది. ఇటీవలి భారతీయ అధ్యయనాల ప్రకారం, దేశంలోని ప్రతి 10 మంది పెద్దల్లో దాదాపు నలుగురిలో ఫ్యాటీ లివర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం, ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిలో ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, చక్కెర పానీయాలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి.
భారతీయుల్లో ‘లీన్ ఫ్యాటీ లివర్’ కూడా పెరుగుతోంది. అంటే శరీర బరువు సాధారణంగా ఉన్నప్పటికీ, పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, జీవక్రియల్లో మార్పుల వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల సన్నగా కనిపించే వారిలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని ‘సైలెంట్ డిసీజ్’ అంటారు. కొంతమందిలో అలసట, నీరసం, పొత్తికడుపు కుడివైపు అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స లేకుండా వదిలేస్తే కాలేయంలో వాపు ఏర్పడి మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ (MASH)గా మారవచ్చు. తరువాత కాలేయంలో గాయాలు (ఫైబ్రోసిస్), సిరోసిస్, కాలేయ వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఫ్యాటీ లివర్ కేవలం కాలేయానికే సంబంధించిన సమస్య కాదు. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధులు వంటి ఇతర జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
అందువల్ల సాధారణ ఆరోగ్య పరీక్షల్లో లేదా అల్ట్రాసౌండ్‌లో ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తేలితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే లివర్ ఫంక్షన్ టెస్టులు, ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవాలి.
సంతోషకరమైన విషయం ఏమిటంటే, ప్రారంభ దశలో గుర్తిస్తే చాలా మందిలో జీవనశైలి మార్పులతో ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడం, కొన్నిసార్లు పూర్తిగా తగ్గించడం సాధ్యమవుతుంది. శరీర బరువులో 7–10 శాతం తగ్గించడం, వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయడం, కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, చక్కెర పానీయాలు తగ్గించడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అలాగే మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడం చాలా అవసరం.
ఇటీవల భారత్‌లో MASH చికిత్సలో ఒక కీలక ముందడుగు పడింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) వెగోవీ (Wegovy–Semaglutide 2.4 mg) వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ ఔషధం సాధారణ ఫ్యాటీ లివర్‌కు కాదు. సిరోసిస్‌కు చేరని, మితమైన లేదా తీవ్రమైన కాలేయ ఫైబ్రోసిస్ ఉన్న MASH రోగులకు మాత్రమే, తక్కువ కేలరీల ఆహారం, క్రమమైన వ్యాయామంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో దీనిని ఉపయోగిస్తారు.
ఫ్యాటీ లివర్ ఒక నిశ్శబ్ద హెచ్చరిక. లక్షణాలు వచ్చే వరకు వేచి ఉండకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఆరోగ్యమైన కాలేయం ఉంటేనే ఆరోగ్యమైన జీవితం సాధ్యమవుతుంది.
———————————
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ
***
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ గారి కొన్ని ఇతర రచనలు:
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్కారం,
నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.
మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.
డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ
ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)
వార్తాపత్రిక కాలమిస్ట్
రాజీవ్ నగర్, హైదరాబాద్










Comments