కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Hammayya Ammayi Pelli Kudirindi' - New Telugu
Story By written by Parimala Kalyan
రచన: పరిమళ కళ్యాణ్
"ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్లే అనుకుని, మీ నాన్న నిన్ను ఎంతో గారాబంగా పెంచాడు. పురిట్లోనే తల్లిని కోల్పోయావని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా పూర్ణిమా? పెళ్ళొద్దని అంటావా? నీకోసం ఎంతో కష్టపడి తెచ్చిన సంబంధాలన్నీ చెడగొడతావా? అసలు పెళ్ళి చేసుకోనని అంటే ఎలాగే? నీకంటూ ఒక తోడు కావద్దా? నాకా వయసైపోయింది, ఇంకెన్నాళ్లు ఉంటానో తెలీదు. నేనూ పోయేలోపు నిన్ను ఒక చేతిలో పెడితే హాయిగా మా ఆయన దగ్గరకి పోతాను. మీ నాన్న కి నీ టెన్షన్ కూడా తగ్గుతుంది. ఆలోచించవే!" అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతోంది వెంకు బాయి అనబడే వెంకాయమ్మ గారు తన మనవరాలిని ఉద్దేశించి పెళ్ళి చేసుకోమని చెప్తూ..
"మళ్ళీ మొదలు పెట్టావా వెంకూ బాయి. ఇదుగో చూడు బామ్మా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ చివర్లో నువ్వే చెప్పావ్ చూడు.. నాకు పెళ్ళి చేసి నువ్వు నిశ్చింతగా మీ ఆయన దగ్గరకి వెళ్ళిపోతాను అని, మరి అప్పుడు నాన్నకి ఎవరు తోడుంటారు బామ్మా? అమ్మ పురిట్లోనే పోతే, తల్లి లేని పిల్లని చూసుకోవాలని మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు నాన్న. నువ్వేమో అమ్మకంటే ఎక్కువగా పెంచావ్ నన్ను. నువ్వున్నావు కాబట్టి సరిపోయింది బామ్మా లేదంటే నాన్న పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనూ పెళ్ళి చేసుకుని నాన్నని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవాలా చెప్పు బామ్మా? అప్పుడు నాన్నని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను పెళ్ళి చేసుకోను అనేది. ఎప్పటికి ఇలా నాన్నని చూసుకుంటూ ఉంటాను. నాకేం వేరొకరి తోడు అవసరం కూడా లేదు!" అంది పూర్ణిమ.
పూర్ణిమ మాటలకి నవ్వాలో బాధపడాలో అర్థం కాలేదు వెంకూ బాయికి, తండ్రి ప్రసాదరావు గారికి.
ప్రసాదరావు గారు టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు. పాతికేళ్ళు వచ్చిన కూతురు పెళ్ళి ఎందుకు వద్దంటుందో అనుకునేవాడు. ఇలాంటి సమయంలో తల్లి ఉండాలి ఆడపిల్లకి అని బాధ పడేవాడు. కానీ కూతురి మనసులో ఉన్న కారణం తెలుసుకుని నివ్వెరపోయాడు. తనని ఒప్పించాలని ఎంతో ప్రయత్నం చేసాడు.
"హవ్వ ఇదేం చోద్యమే. మీ నాన్న కోసం నువ్వు పెళ్ళి పిల్లలూ లేకుండా ఉండిపోతావా? ఎవరైనా వింటే నవ్విపోతారు. మమ్మల్ని అంటారు ఇలాగేనా పెంచేది ఆడపిల్లని అని. ఇదంతా చూడాల్సి రావటం నా కర్మ!" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వెంకూ బాయి గారు.
చివరకి ప్రసాదరావు ఇలా అన్నాడు, "చూడమ్మా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నీ ఆలోచనకు ఒక ఒక్క సంతోషంగా ఉన్నా మరో పక్కన నీ జీవితం ఏమవుతుందనే బాధ భయం తండ్రిగా నాకు ఉన్నాయి. పెళ్ళీడు వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నానని ఇరుగు పొరుగు మాటలు అంటూ ఉంటే భరించలేక అలా అంది మీ బామ్మ.
అంతేకాదు తండ్రిగా నా మీద నీకున్న ప్రేమా నాకు అర్థం అయ్యింది, అలాగే నీపై నాకున్న బాధ్యత నీకు పెళ్ళి చెయ్యటం. నీకొక మంచి జీవితాన్నివ్వటం. నా బాధ్యత నన్ను సక్రమంగా నిర్వర్తించనీ రా బంగారం.
సరే నన్ను ఎవరు చూస్తారనే కదా నీ బాధ. నాకు ఓపిక ఉన్నంత వరకూ నేను చేసుకోగలను. మహా అయితే నాలో ఓపిక నశించాక అప్పుడు నీ దగ్గరకి వస్తాను. ఒకవేళ అదే అయితే ఒక పని చేద్దాం, నీతో పాటు నన్ను కూడా చూసుకుంటానని చెప్పిన వ్యక్తి దొరికితే అప్పుడు మాత్రం అతనితో నీ పెళ్ళి నేనే జరిపిస్తాను. కాదనకు!" అన్నాడు.
"సరే నాన్నా మీ ఇష్టం. నాతో పాటు నిన్ను కూడా చూసుకునే వాడు దొరికితే అప్పుడు చూద్దాం లెండి!" అంది పూర్ణిమ.
*********
నాలుగు రోజుల తర్వాత ప్రసాదరావు తన చిన్ననాటి స్నేహితుడు మురళీ ని కలిసి కూతురి గురించీ, తన పెళ్ళి గురించీ చెప్పాడు. అతని కొడుకు శశిధర్ అన్న మాటలు ప్రసాద రావుకి ఎంతగానో నచ్చాయి.
"అంకుల్ ఈ రోజుల్లో ఆడపిల్లలు కొందరు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు అలాగే కొందరు ఎంతో చక్కగా ఆలోచిస్తున్నారు. ఇలా కనీ పెంచిన వారి కోసం ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటారేమో. కానీ మీ అమ్మాయి అలాంటి కొందరిలో ఒకటి. ఒకవేళ పూర్ణిమ పెళ్ళికి సిద్ధం అయితే తనతో పాటు మిమ్మల్నీ నేను చూసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నా తండ్రితో సమానమే!" అని...
"హమ్మయ్య ఇక అమ్మాయికి పెళ్ళి కుదిరినట్టే!" అని సంతోషంతో నిట్టూర్పు విడిచాడు ప్రసాదరావు.
** సమాప్తం **
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.
Comments