top of page
Original.png

హ్యాండ్సమ్‌ హంక్

Jul 28
6 min read

హ్యాండ్సమ్ హంక్, తాత మోహనకృష్ణ, హాస్య కథ, తెలుగు కథ, హనీమూన్ కథ, ప్రేమ కథ, సరదా కథ, కుటుంబ కథ

హనీమూన్‌లో జరిగిన సరదా ప్రాంక్‌తో అపార్థానికి గురైన కొత్త దంపతుల భావోద్వేగ, హాస్యభరిత దృశ్యం
హనీమూన్‌లో జరిగిన సరదా ప్రాంక్‌తో అపార్థానికి గురైన కొత్త దంపతుల భావోద్వేగ, హాస్యభరిత దృశ్యం

Handsum Hunk - Telugu Emotional Family story | Venkat Manthripragada

హ్యాండ్సమ్‌ హంక్ తెలుగు భావోద్వేగ జీవిత కథ | వెంకట్ మంత్రిప్రగడ

Published in manatelugukathalu.com on 28/07/2026


కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య ప్రేమతో పాటు సరదా ఆటలు, చిన్న చిన్న అపార్థాలు కూడా జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. "హ్యాండ్సమ్‌ హంక్" కథలో చంద్ర, మోహన హనీమూన్ సమయంలో జరిగిన ఒక చిన్న ప్రాంక్ ఎలా పెద్ద అపార్థానికి దారితీసిందో, చివరికి అది ఎలా నవ్వుల్లో ముగిసిందో రచయిత వెంకట్ మంత్రిప్రగడ చమత్కారమైన సంభాషణలతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఆద్యంతం నవ్వించే, ప్రేమను మరింత బలపరిచే వినోదభరిత కథ ఇది.


చంద్రకి పెళ్లి అయ్యే దాకా అతని ఫ్రెండ్స్‌కి ఒకే ఒక్క భయం.

ఈ మనిషి పెళ్ళిచేసుకుని అందరిలాగా జీవిస్తాడా లేక జీవితాంతం టెడ్‌టాక్‌లు ఇస్తూ తిరుగుతాడా?” అని. 


ఎందుకంటే చంద్ర మాట్లాడితే మాట కాదు… పవరుపాయింటు ప్రజెంటేషన్‌. ఇప్పుడే ట్రైనింగ్ అవుతోన్న ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ మింగేసినట్టుంటాయి అతని మాటలు 


“మనిషి అనుబంధం అనేది బాడీ-మైండు-ఇంటెలెక్టు త్రివేణి సంగమం” లాంటి గంభీరమైన స్పీచులు ఇస్తూ తిరిగే అతడిని భరించాలంటే మోహన లాంటి భార్య రావాలి అనుకునేవారు 

అదే మోహన. 


అందమైన అమ్మాయి. అయినా తనతో మాట్లాడే ధైర్యం అక్కడి కుర్రాళ్లకు లేదు. బహుశా చాలా ఆత్మవిశ్వాసం బాడీ లాంగ్వేజ్ లో చూపించే అమ్మాయిలని కదిలించే ప్రయత్నం అబ్బాయిలు తల పెట్టరు. 


ఆమె నవ్వితే పక్కింటి వాళ్లు కూడా “ఏమైంది?” అని బయటికి వస్తారు. ఆమె మాట్లాడితే పది పదాల్లో రెండు ఇంగ్లీషు, మూడు సెటైర్లు, ఐదు కరెంటు అఫైర్స్ పై తన అభిప్రాయాలూ ఉంటాయి.


ఇద్దరూ ఐఐటీలు, ఐఐఎంలు, విదేశీ యూనివర్సిటీలు, కంపెనీలు అన్నీ దాటి వచ్చి చివరకు పెళ్లి చేసుకున్నారు. కుటుంబాలందరికీ ఒక్కటే ఆనందం.


“ఇద్దరూ ఒకరినొకరు భరించగలిగితే… ప్రపంచంలో ఎవ్వరైనా కాపురం చేయగలరు” అని.


పెళ్లిఅయిన తరువాత తానెప్పడూ వినని సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, తిరుపతికి వెళ్లి స్పెషల్ దర్శనం చేసుకోవడం లాంటి మొదటి సారి అనుభూతులను ఇద్దరూ ఎంజాయ్ చేసారు. 


హనీమూన్‌కి ఊటీ దగ్గర ఉన్న ఒక పెద్ద రిసార్టుకి వెళ్లారు. రిసార్టు అంటే చిన్న విషయం కాదు.


గదిలోకి వెళ్లగానే చంద్రకి అనిపించింది — “ఇది రూమా? లేక యూరోపియన్‌ రాజవంశీయుడు పదవీ విరమణ తర్వాత కూర్చునే ఆత్మపరిశీలన మందిరమా?”

అంతా తెల్లటి కర్టెన్లు, పెద్ద గాజు కిటికీలు, చలిలో పొగలు కక్కే కాఫీ కప్పులు.


మొదటి రోజు బాగానే గడిచింది. ఇద్దరూ కాలేజీ రోజుల జ్ఞాపకాలు తవ్వుకున్నారు.

“గుర్తుందా? నువ్వు మొదట నాతో మాట్లాడింది లైబ్రరీలో…” అంది మోహన.


“అవును. నువ్వు అయిన్‌రాండ్‌ చదువుతున్నట్టు నటిస్తూ లోపల చందమామ చదువుతున్నావు” అన్నాడు చంద్ర.


“అది రీసెర్చ్‌.”


“దేని మీద?”


“నీలాంటి అబ్బాయిలు ఎలా బురిడీ కొడతారో అని.”


ఇద్దరూ నవ్వుకున్నారు.


రాత్రికి ఫైర్‌క్యాంపు దగ్గర కూర్చుని పాత పాటలు విన్నారు. చంద్రకు ఘంటసాలంటే ప్రాణం. మోహనకి ఎస్పీబీ అంటే వీరాభిమానం.

“నువ్వు క్లాసికల్‌ సివిలైజేషన్‌లాంటివాడివి” అంది మోహన.


“అంటే?”


“వాడుకోవడానికి పనికిరావు. కానీ మెయింటెనెన్సు ఎక్కువ.”


చంద్ర తలూపాడు.

“నువ్వూ మోడర్న్‌ ఆర్టులాంటిదానివే.”


“అంటే?”


“చూసేవాళ్లకి అర్థం కాదు. కానీ ఎక్స్‌పెన్సివ్‌.”


మళ్లీ నవ్వులు.

ఇలా మొదటి రోజు ప్రేమగా, పూలుగా, కాఫీ ఆవిరిలా వెళ్లిపోయింది.


రెండో రోజు ఉదయం.

చలికి చంద్ర తొందరగా లేచిపోయాడు. స్నానం చేసి, జుట్టు సెట్‌ చేసుకుని, ఫోను చూస్తూ సోఫాలో కూర్చున్నాడు.

మోహన మాత్రం ఇంకా దుప్పట్లోనే.

“మోహూ… లేచి రా. బ్రేక్‌ఫాస్టుకి వెళ్లాలి.”


“ఐదు నిమిషాలు…” అంది దుప్పట్లోంచి చేతులు చాపుతూ.


తానిప్పుడు మోహనను లేవదీసి ముద్దు చెయ్యాలా? అంటూ ఆలోచిస్తున్నాడు చంద్ర

అప్పుడే…టక్‌.రూము డోరు తెరుచుకుంది.

చంద్ర మొదట హౌస్‌కీపింగు అనుకున్నాడు.

కానీ లోపలికి వచ్చినది… చాలా అందమైన అమ్మాయి.


తెల్లగా. స్టైలిష్‌గా. విదేశాల నుంచి వచ్చిన భారతీయురాలు లాగా. జుట్టు బ్రౌన్‌ షేడు. చేతిలో సన్‌గ్లాసులు. పెర్‌ఫ్యూము వాసన రూమంతా నింపేసింది.


కొత్తగా పెళ్లయి, భార్య సాక్షాత్తూ రూంలో ఉండగా ఆ అందమైన అమ్మాయిని చూడటం ఎలా? ఆ మాటకొస్తే చూడకుండా ఉండటం ఎలా? జీవితం లో ఇలాంటి గడ్డు సమస్య వస్తుందని చంద్ర ఎప్పుడూ ఊహించలేదు. పెళ్ళికి కూడా రిస్క్ మానేజ్మెంట్, ప్లాన్ బి కావాల్సివస్తాయని ఊహించనందుకు కొంచం సిగ్గేసింది


ఆమె నేరుగా చంద్ర దగ్గరకు వచ్చింది.


చంద్ర మొహం ఒక్కసారిగా యూపీఎస్‌ ఆఫ్‌ అయిన కంప్యూటర్లా బ్లాంక్‌ గా ఉంది.


ఆ అమ్మాయి నవ్వింది. “హాయ్‌ చందూ… హ్యాండ్సమ్‌ హంక్ …”

అని అతని నుదుటిపై ముద్దుపెట్టింది.


“బై డార్లింగ్‌… ఎంజాయ్‌…” అని వెనక్కి తిరిగి బయటికి వెళ్లిపోయింది.


ఐదు సెకన్లు చంద్రకి ప్రపంచం నిలిచిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా లేచి డోరు దగ్గరకు పరిగెత్తాడు. కారిడారులో ఎవరూ లేరు. రిసార్టు అంతా నిశ్శబ్దం.


అతను నెమ్మదిగా తిరిగి లోపలికి వచ్చాడు. ఇక అక్కడ…మోహన మంచం మీద నుంచి ఒక్క దూకుడు తో సోఫా దగ్గరకు వచ్చేసింది. ఆమె కళ్లల్లో ప్రేమ లేదు. సివిలైజ్డ్‌ యాంగరు ఉంది.అది చాలా ప్రమాదకరం.


“ఎవరు ఆ అమ్మాయి?” అంది. ఆమె గొంతులో ధ్వనిస్తూన్న భావం ఏమిటో చంద్ర కి అర్ధం కాలేదు.నోరు తెరిచాడు. మూసేశాడు. మళ్లీ తెరిచాడు. 

“నాకు తెలియదు.”


“అహా.”


ఆ “అహా”లో మూడు ఖండాల వ్యంగ్యం ఉంది.


“నిజంగానే తెలియదు మోహూ.”


“చందూ… హ్యాండ్సమ్‌ హంక్ అంటోంది.”


“నేనూ షాకులోనే ఉన్నాను. అయినా హ్యాండ్సమ్ హంక్ అంటే డిక్షనరీ మీనింగ్ దృఢమైన కండరాలు, బలిష్ఠమైన శరీర నిర్మాణం కలిగిన ఆకర్షణీయమైన పురుషుడు. నన్ను చూస్తే అలావున్నానా?  ఏదో పొరపాటు జరిగింది” అన్నాడు.

 

“నుదుటిపై ముద్దుపెట్టింది. తెలియని మొగవాడికి అమ్మాయిలు ముద్దుపెడతారా? అదీ ఇండియా లో" అంది మోహన కోపంగా.


“అదే నాకు అర్థం కావట్లేదు.”


“డార్లింగ్‌ అంది.”


“అది లింగ్విస్టిక్‌ ఎక్స్‌ప్రెషన్‌ కావచ్చు.”


“చాలా బాగుంది. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ కూడా ఏడుస్తోంది.”


చంద్ర చెమటలు పట్టాడు.


“నీకు నేను బాగా తెలుసు. నేను ఇంకా ఏన్షియంట్‌ సివిలైజేషన్‌ మనిషిని. ఈ వెస్ట్రన్‌ బాయ్‌ఫ్రెండ్‌-గర్ల్‌ఫ్రెండ్‌ కన్స్ట్రక్టులు నమ్మను.”


“నాకు బాగా తెలుసు నువ్వు మమల్ని అమాయకుడివనే భ్రమలో పడేసావు. నువ్వు దేవాంతకుడివి" అంది మోహన. 


ఏదో పాతసినిమాలో విన్న పదం దేవాంతకుడు అని. అదిక్కడ వాడేసాను. ఇప్పుడీ పప్పుగాడు దాని అర్ధం అడిగితే ఎలా అంటూ మదన పడుతోంది మోహన.

 

చంద్ర తల పట్టుకున్నాడు. అతనికి నిజంగానే అర్థం కావట్లేదు. ఒక్క క్షణం అతనికే అనుమానం వచ్చింది.


ఇది నిజమేనా లేక హాల్యూసినేషనా? కానీ మోహన చూసింది. అంటే నిజంగానే జరిగింది.


ఇద్దరి మధ్య చల్లని యుద్ధం మొదలైంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే… హైలీ ఎడ్యుకేటెడ్‌ కపుల్స్‌ తిట్టుకోరు. వాళ్లు వొకాబులరీతో చంపేస్తారు.


“ట్రాన్స్‌పరెన్సీ ఈజ్‌ ఫౌండేషనల్‌ టు ట్రస్టు” అంది మోహన కాఫీ తాగుతూ.


“సస్పిషన్‌ ఈజ్‌ ఫౌండేషనల్‌ టు ప్యారనోయా” అన్నాడు చంద్ర.


“ఇంటరెస్టింగ్‌.”


“వెరీ.”


“నిన్ను నేను అండర్‌ఎస్టిమేట్‌ చేశాననుకుంటా.”


“నేనూ అలాగే.”


రిసార్టులోని వెయిటరుకి వీళ్లిద్దరూ డైవోర్స్‌ పిటిషను డ్రాఫ్టు చేస్తున్నట్టు అనిపించింది.

బ్రేక్‌ఫాస్టుకి వెళ్లారు. అక్కడ కూడా యుద్ధమే.

“ఇడ్లీ తీసుకుంటావా?” అంది మోహన.


“నేను తీసుకునే స్వేచ్ఛ ఇంకా ఉందా?” అన్నాడు చంద్ర.


“విక్టిమ్‌ కార్డు వేయొద్దు.”


“నేను యూఎన్ఓ ఆడట్లేదు.”


పక్క టేబుల్లో కూర్చున్న కొత్త జంట సైలెంటుగా దోశ తిని మిగిలిన టిఫిన్లు రుచి చూసే కార్యక్రమం విరమించుకుని భయంగా వెళ్లిపోయారు.


ఈ అనూహ్యమైన అనుభవం తరువాత మోహన, చంద్రు బయటకు వెళ్లే ఆలోచన విరమించుకుని రూంలోనే ఉండిపోయారు. 


మధ్యాహ్నం. మోహన బాల్కనీలో కూర్చుంది.


చంద్ర లోపల ల్యాప్‌టాపు తెరిచి ఏదో పని చేస్తున్నట్టు నటిస్తున్నాడు. కానీ స్క్రీన్‌సేవరు మాత్రమే తిరుగుతోంది. అతని మెదడులో మాత్రం ఇన్వెస్టిగేషన్‌ జరుగుతోంది.


నేను ఎవరినైనా మర్చిపోయానా? అమెరికాలో కాన్ఫరెన్సులో కలిసానా? లింక్డ్‌ఇన్‌ కనెక్షనా? వెబినారు అటెండీనా? ఇంకా దారుణంగా…అతను తన గతాన్ని తానే అనుమానించడం మొదలుపెట్టాడు. నేను స్లీప్‌వాకింగులో రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేశానా?. 


అంతలో మోహన లోపలికి వచ్చింది.

“చందూ.”


“హమ్‌?”


“ఒక్క ప్రశ్న.”


“అడుగు.”


“ఆమె నిన్ను హ్యాండ్సమ్‌ హంక్ అనింది కదా?”


“అవును.”


“అది నిజమే అనిపించిందా?”


చంద్రకి ఇది ట్రాప్‌ క్వశ్చను అని అర్థమైంది.

“లేదు.”


“అంటే ఆమె అబద్ధం చెప్పిందా?”


“అది… సబ్జెక్టివ్‌ అప్రిషియేషన్‌…”


“అంటే నువ్వు హ్యాండ్సమ్‌ అనుకుంటున్నావా?”


“లేదు. ఆ విషయం ముందే చెప్పాను కానీ…”


“కానీ?”


“నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా… నీ అంత అందమైన తెలివైన అమ్మాయి నన్ను చేసుకుందంటే నాలో  ఏదో ఉందనే కదా ”


మోహన రెండు సెకన్లు సీరియస్‌గా చూసి ఒక్కసారిగా నవ్వేసింది.

అక్కడ చంద్రకి చిన్న ఆశ కలిగింది. సర్లే … సిట్యుయేషన్‌ కూలింగ్‌డౌన్‌…అనుకున్నాడు.


అప్పుడే…డోరు మళ్లీ తెరుచుకుంది. అదే అమ్మాయి లోపలికి వచ్చింది. నేరుగా వచ్చి మోహనని హత్తుకుంది!


“మోహూ! నువ్వు చెప్పిందే నిజం. నీ హజ్బెండు టోటల్‌ ఇన్నోసెంట్‌ బక్రా!” అంది. 


అదివిన్న చంద్ర మొహం చూడాల్సిందే. తెల్లగా పాలిపోయిన మొహం చిమ్మ చీకట్లో ఉన్నట్టుంది. అతను ఆ స్థితిలో ఉంటే పాస్‌పోర్టు ఫోటో తీస్తే రెన్యువల్ కి అప్రూవల్‌ వచ్చేది కాదు. ఆధార్ కార్డుకి సరిపోతుంది.


“ఏం… ఏమిటిది?” అన్నాడు.


మోహన నవ్వుతూ సోఫాలో కూర్చుంది. “మీట్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌. సమంతా.”


“సమంతా?”


“అవును. అమెరికాలో ఉంటుంది. పెళ్లికి రాలేకపోయింది. కానీ ప్రాంకుకి మాత్రం వచ్చింది.”


చంద్ర నోరు తెరిచి నిలబడ్డాడు. సమంతా నవ్వింది.


“సారీ చందూ… బట్‌ యువర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ వెర్‌ ప్రైస్‌లెస్‌!”


“ఒక్క నిమిషం…” అన్నాడు చంద్ర. “అంటే… మీరు ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారా? ఇంత దురాలోచన ఎలాచేసావు మోహో నా కళ్లెదుటే తిరుగుతూ”


“త్రీ మంత్స్‌ ప్లానింగ్‌” అంది మోహన గర్వంగా.


“త్రీ మంత్సా?”


“అవును. సమంతా ఫుల్‌ స్క్రిప్టింగ్‌ చేసింది.” 


“అంటే నా జీవితాన్ని నెట్‌ఫ్లిక్సు ప్రాంకు షోలాగా మార్చారా?”


“అది కాదు చందూ…” అంది మోహన. “నువ్వు టూ కంపోజ్డ్‌. టూ ఇంటెలెక్చువల్‌. కొంచెం పానిక్ లో ఎలా ఉంటావో చూడాలనిపించింది.”


సమంతా నవ్వుతూ — “యాక్చువల్లీ నువ్వు చాలా క్యూట్‌గా పానిక్‌ అయ్యావు.”


“ధన్యవాదాలు. ఇది నా జీవితంలో అత్యంత అవమానకరమైన కాంప్లిమెంటు.”


మోహన నవ్వుతూ అతని దగ్గరకు వచ్చింది. “కోపమా?”


చంద్ర చాలా డిగ్నిటీతో కూర్చున్నాడు. “లేదు.”


“ష్యూరా?”


“అబ్సల్యూట్లీ.”


“అయితే ఎందుకు నీ చెవులు ఎర్రబడ్డాయి?”


“బ్లడ్‌ సర్క్యులేషన్‌.”


“ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి?”


“క్లైమేట్‌.”


“ఎందుకు నీ కళ్లల్లో రివెంజ్‌ కనిపిస్తోంది?”


“రిఫ్లెక్షన్‌.”


సమంతా నవ్వి నవ్వి సోఫా మీద పడిపోయింది.

“మోహూ! ఇతను డేంజరస్‌ కమెడియన్‌.”


చంద్ర ఒక్కసారిగా లేచాడు.

“సరే. నా టర్న్‌.”


ఇద్దరూ ఆగిపోయారు.

చంద్ర నెమ్మదిగా ఫోను తీసుకున్నాడు.

“హలో రూమ్‌ సర్వీసా?”


“యెస్‌ సర్‌?”


“మా రూముకి వెంటనే ఒక బొకే పంపండి.”


మోహన ఐబ్రో ఎత్తింది.

“ఎవరికోసం?”


“ఒక్క నిమిషం.”


ఐదు నిమిషాల్లో బొకే వచ్చింది. చంద్ర బొకే తీసుకుని సమంతాకి ఇచ్చాడు.

“డియర్‌ సమంతా. ఈ ప్రాంకు వల్ల నా వైవాహిక జీవితం ప్రారంభంలోనే కార్డియాక్‌ ఎండ్యూరెన్సు టెస్టయిపోయింది. థాంక్యూ.”


సమంతా నవ్వేసింది. మోహన సస్పీషస్‌గా చూసింది.

“చందూ…”


“హమ్‌?”


“ఇది రివెంజ్‌ ప్రారంభమా?”


“ఇది సివిలైజేషన్‌.”


“అంటే?”


“వార్‌ ఇన్‌ పాలిష్డ్‌ ఫార్మాట్‌.”


ఆ రాత్రి డిన్నరుకి వెళ్లారు.

మోహన ఇంకా నవ్వుతూనే ఉంది.

“చందూ… నీ మొహం గుర్తొస్తే ఇంకా నవ్వొస్తోంది.”


“నాకైతే నా ఫ్యూచర్‌ కనిపించింది.”


“ఏంటి?”


“ఇక జీవితాంతం నువ్వు నన్ను ఆటపట్టిస్తావు.”


“అదే పెళ్లి.”


చంద్ర నిట్టూర్చాడు.

“నేను మ్యారేజిని సేక్రెడ్‌ కంపానియన్‌షిప్‌ అనుకున్నాను.”


“అది కూడా ఉంది.”


“మరి ఇది?”


“ఎంటర్టైన్‌మెంట్‌ ప్యాకేజి.”


డిన్నరు అయ్యాక బయట మంచు పడుతోంది.

ఇద్దరూ చేతులు పట్టుకుని నడిచారు.

చంద్ర ఒక్కసారిగా ఆగిపోయాడు.

“మోహూ.”


“హమ్‌?”


“నిజంగా ఒక్క క్షణం నాకు భయమేసింది.”


“ఎందుకు?”


“నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని.”


మోహన నెమ్మదిగా నవ్వింది. “చందూ… నువ్వు ఒక విషయం మర్చిపోతుంటావు.”


“ఏంటి?”


“నేను నిన్ను ప్రేమించేముందు… చాలా సంవత్సరాలు అబ్జర్వ్‌ చేశాను.”


“అంటే?”


“నువ్వు పెద్ద ఫిలాసఫర్‌ కావచ్చు. కానీ ఫ్లర్టింగ్‌లో అబ్సల్యూట్‌ ఫెయిల్యూర్‌.”


“ధన్యవాదాలు.” అంటూ చంద్ర గర్వంగా తలూపాడు. 


“అది కాంప్లిమెంటు కాదు.”


“నాకది కాంప్లిమెంటే.”


ఇద్దరూ నవ్వుకున్నారు.


చలి పెరిగింది. దూరంగా రిసార్టు లైట్లు మెరుస్తున్నాయి.


సమంతా బాల్కనీలోంచి వీళ్లిద్దరినీ చూసి వీడియో కాల్‌ చేసింది. “మిషన్‌ సక్సెస్‌.”


అటు సమంతా నవ్వుతూ —“చంద్ర ఏడ్చాడా?”


“ఆల్మోస్ట్‌.”


“నువ్వు?”


“మనది అయితే ఆస్కార్‌ లెవెల్‌ పెర్ఫార్మెన్సు.”


“గుడ్‌. ఇప్పుడు మీ మ్యారేజి అఫీషియల్లీ స్టార్టెడ్‌.”


ఆ రాత్రి నిద్రపోయేముందు మోహన చంద్రని చూసి అడిగింది.

“చందూ… ఒకవేళ నిజంగానే నీ ఎక్స్‌ వచ్చుంటే?”


చంద్ర రెండు సెకన్లు ఆలోచించాడు. “ఇంపాజిబుల్‌.”


“ఎందుకు?”


“నన్ను భరించడం నీకే కష్టం. ఇంకెవరు సర్వైవ్‌ అవుతారు? నాకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరు.”


మోహన దుప్పటి కప్పుకుని నవ్వుకుంటూ పడుకుంది.చంద్ర లైట్‌ ఆఫ్‌ చేశాడు.

కొద్దిసేపటి తర్వాత చీకట్లో మోహన మెల్లగా అంది —

“హే హ్యాండ్సమ్‌ హంక్…”


చంద్ర దుప్పటి లోపల నుంచి గగ్గోలు పెట్టాడు.

“దయచేసి ఆ పదం రిటైర్‌ చేయి…”


     *****     

వెంకట్ మంత్రిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: వెంకట్ మంత్రిప్రగడ


వెంకట్ మంత్రిప్రగడ
వెంకట్ మంత్రిప్రగడ

పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్ లో, చాలా కాలంగా బెంగళూరు లో ఉంటున్నాను...సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది...లాక్ డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను...తెలుగు సాహిత్య ప్రపంచంలో గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, జలంధర, కేశవరెడ్డి గార్లు అభిమాన రచయితలు, శ్రీ శ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు...

ఇతర భాషా సాహిత్యాలలో మున్షీ ప్రేమ్ చంద్, మాక్సిం గోర్కీ, దోస్తోయ్వస్కీ, మొరావియా, ఆల్బర్ట్ కామూ, పౌలో కొయిలో, కన్నడం లో భైరప్ప లు కూడా చాలా ఇష్టమైన రచయితలు...

ఆధునిక రచయితల్లో యువల్ నోవా హరారీ, రాజా ఇవటూరి, సత్యం మందపాటి, అనిల్ అనంతస్వామి అభిమాన రచయితలు ...

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Quite hilarious

Edited
Like
bottom of page