హేమ గుణం
- Bhattu Venkata Rao

- 23 hours ago
- 4 min read

Hema Gunam- Telugu Inspirational Story | Bhattu Venkata Rao
హేమ గుణం - తెలుగు ప్రేరణాత్మక కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 01/09/2026
మనసులో కలిగే ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేసే అర్థవంతమైన తెలుగు కథ “హేమ గుణం”. భట్టు వెంకటరావు రచించిన ఈ కథలో తెలుగు పూర్వపద్య సాహిత్యంలోని చక్కని పద్యాలను ఆధారంగా చేసుకుని స్థిరచిత్తం అనే గొప్ప జీవన విలువను పరిచయం చేశారు.
మహాకవి తిక్కన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే సాహిత్య కార్యక్రమాలలో భాగంగా, జిల్లా అంతర కళాశాలల వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. పోటీలో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులు 'స్థిరచిత్తం' అనే అంశం గురించి ఉపన్యసించాలి. బి.ఏ. స్పెషల్ తెలుగు ఆఖరి సంవత్సరంలో చదువుతున్న రాఘవ అనే విద్యార్థి పోటీలో పాల్గొని, తన పేరు పిలవబడగానే వెళ్ళి మాట్లాడుతున్నాడు.
"ఆలోచనలను అదుపులో ఉంచుకోలేని వ్యక్తి చిత్తం, ఊరిలో వీధికుక్క వంటిది అని ఒక చక్కని కంద పద్యంలో చెప్పాడు 15వ శతాబ్దానికి చెందిన మడికి సింగన, 'వాసిష్ఠ రామాయణం' ప్రథమాశ్వాసంలో.
యవ్వన దశలోకి అడుగు పెడుతున్న శ్రీరాముడి చిత్తంలో, మనిషి జీవితానికి సంబంధించిన సందేహాలు ఎన్నో కలగగా, ఆ సందేహాలన్నిటినీ తమ కులగురువైన వసిష్ఠులవారితో చెప్పుకుని, ఆ మహర్షి నుండి సమాధానాలను పొందుతున్న సందర్భంలో, అదుపులో ఉండని మనిషి ఆలోచనలకు సంబంధించి ఒక అర్థవంతమైన వ్యాఖ్య చేయబడింది.
కం. దూరము పనిగలగతిఁ జను,
నూరక యిల్లిల్లు సొచ్చు నొగిఁ జీ యనఁగా
గూరదు సిగ్గున, సుజనులఁ
జేరదు, చిత్తంబు, గ్రామసింహము వోలెన్.
ఏదో ముఖ్యమైన పనిమీద వెళుతున్నట్లుగా దూరం వెళుతుంది; ఏ పనీ లేకుండానే యింటింటికీ తిరుగుతుంది; 'ఛీ' అని ఛీత్కరించుకున్నప్పటికీ అక్కడి నుంచి తొలగిపోదు; మంచివారితో సాంగత్యాన్ని పెంచుకోదు; అలా, ఆలోచనలను కట్టడి చేసుకోలేని మనస్సు వీధికుక్క వంటిది - అని పై పద్యం భావం. కొంచెం కటువుగా చెప్పినప్పటికీ, అందులో ఎంతో నిజం ఉన్న మాటను ఒప్పుకోవలసిందే!
అదలా ఉంటే, మనసు చేసే ఆలోచనలను అదుపులో పెట్టుకోలేని మనిషి, తపస్సు చేస్తూ అడవిలో ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదని దంతులూరి బాపకవి ‘మూర్తిత్రయోపాఖ్యానము’ ద్వితీయాశ్వాసంలో చెప్పాడు. ‘ఇల్లు వొదిలి అడవులలో అడుగుపెట్టగానే కామసంబంధమైన ఆలోచనలు కరిగిపోయి, బుద్ధి నిష్కామమై మిగులుతుందా? మిగలదు కదా! అలాగే క్రోధమోహమదమాత్సర్యాలనే లక్షణాలు కూడా జీవితంలో ఏదో ఒక క్షణం మొదలై, మరేదో ఒక క్షణంలో అంతమవ్వాలని కోరుకున్నప్పుడు అంతమయ్యేవిగా ఉండవు. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే, అతడిని మించిన తెలివితక్కువవాడు మరొకడు ఉండడు!’ అన్నాడు. ఆ సందర్భంలో ముఖ్య విషయానికి ముక్తాయింపుగా ఇంకా ఇలా చెప్పాడాకవి.
తే. మనసు నిలుపలేని మనుజుండు వనములో
నున్నయంత మోక్షయుక్తి లేదు
వహ్నిలోన నెన్ని వారముల్ వైచినం
గుప్యమునకు హేమగుణము గలదె?
మనసును కట్టడి చేసుకోలేకపోతే అడవిలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నా మోక్షమార్గం కనపడదు. అగ్నిలో పడేసి ఎన్ని వారాల కాలం మండించినా ఇత్తడి ఇత్తడిగానే ఉంటుంది గాని బంగారం కాదు కదా! ఆ విధంగానే ఆలోచనలను అదుపులో ఉంచుకోకుండా నైతికంగా ఎంత గొప్పగా ఎదగాలని ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. అది తెలుసుకుని, ఆ దిశగా ప్రయత్నం చేసినపుడు మాత్రమే స్థిరచిత్తానికి మార్గం సుగమమై, సుఖవంతమైన జీవితం మనిషి సొంతమౌతుంది. సెలవు." అని ముగించి డయాస్ దిగుతుండగా ఆడిటోరియమ్ కరతాళ ధ్వనులతో నిండిపోయింది.
ఒక్కొక్కరికి ఇచ్చిన సమయం కేవలం రెండు నిమిషాలు మాత్రమే. ఆ రెండు నిమిషాల వ్యవధిలో తెలుగు పూర్వపద్యసాహిత్యంలోని రెండు కావ్యాల నుండి ఎన్నుకున్న రెండు మంచి పద్యాలను వినసొంపుగా చదివి, మనసులోని ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే స్థిరచిత్తానికి మార్గం అని చెప్పాడు రాఘవ. ఆ చిన్న ప్రసంగం అందరి ప్రశంసలు అందుకుంది.
అయితే, ఎవరు విని ప్రశంసిస్తే తాను ఎక్కువగా ఆనందిస్తాడో ఆ వ్యక్తి మాత్రం ఆ రోజు ఆడిటోరియంలో లేదు. ఆ వ్యక్తి పేరు హేమ. రాఘవ సహవిద్యార్థిని. రాఘవ చాలా ఆశాభంగం చెందాడు. ఆ ఆశాభంగాన్ని మించిన అలజడితో అతడి యువక చిత్తం నిండిపోయింది. 'హేమ ఎందుకు రాలేదు?' అనే చిన్న ప్రశ్న అతడి మనసులోని ఆ అలజడికి కారణం. అంతకు ముందురోజు సాయంత్రం వారు ఇరువురూ కూర్చుని చర్చించుకుని నిర్ణయించినవే రాఘవ ప్రసంగంలో చదివిన ఆ రెండు పద్యాలు.
(2)
మనసులో అలజడితో ఉన్న రాఘవకి, ఆ తరువాత కొంతసేపటికి తెలిసింది - అంతకుముందురోజు రాత్రి హడావుడిగా వాళ్ళ ఊరెళ్ళిపోయింది హేమ అని. మనసులో అలజడి మరింత పెరిగింది రాఘవకి. ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టారని కొన్ని రోజుల క్రితం రాఘవతో చెప్పింది ఆమె. ఆమెకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. ఎమ్.ఎ. స్పెషల్ తెలుగు చేసి, తెలుగు లెక్చెరర్ కావాలని ఆమె కోరిక. రాఘవ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. చదువులోనే కాదు, జీవితంలో కూడా హేమతో కలిసి ప్రయాణం చేయాలనే కోరిక అతడికి ఉంది. తాను నోరు తెరిచి చెప్పలేదు గాని, హేమ తన మనసులోని అభిప్రాయాన్ని గ్రహించిందనే అతడు అనుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో, హేమ హడావుడిగా తమ ఊరెళ్ళిపోయిందని తెలిసిన సమాచారం, దాదాపుగా ఆ రాత్రంతా అతడికి నిద్ర లేకుండా చేసింది. ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళాయి. ఎంతగా ప్రయత్నించినప్పటికీ, నియంత్రించి అదుపులో పెట్టుకోవడం ఆ యువ హృదయానికి సాధ్యం కాలేదు.
(3)
ఆ మరుసటి రోజు కూడా హేమ జాడ లేదు. రాఘవ ఆలోచనల అలజడికి అంతం లేదు.
ఆ తరువాతి రోజు ప్రత్యక్షమైంది హేమ. అప్పటికి రాఘవ ముఖం పీక్కుపోయి, కళ్ళు ఎర్రబడి ఉండడం గమనించి "ఏమిటీ అవతారం?" అంది ఆశ్చర్యపోయి.
"ఏదోలే..." అని దాటేసే ప్రయత్నం చేశాడు రాఘవ.
ఇంతలో ఒక స్నేహితుడు వచ్చి రాఘవకి 'కంగ్రాచులేషన్స్ రా!' అని కరచాలనం చేసి చెప్పాడు.
"వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి మనదే!" అన్నాడు ఉత్సాహంగా రాఘవ.
"ఓహో అందుకా ఈ వేషం?!" అంది నవ్వుతూ హేమ.
రాఘవ కూడా నవ్వే ప్రయత్నం చేస్తూ "ఇంతకీ అంత సడన్‌గా ఎందుకు మాయమైనట్లు?" అని అడిగాడు.
"చెప్పాగా... ఇంట్లో పెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నారని. నిన్న అమ్మవాళ్ళు చూసిన అబ్బాయితో నాకు పెళ్ళిచూపులు!" అంది హేమ.
గుండెకొట్టుకోవడంలో వేగం పెరిగింది రాఘవకి.
"సో... నేను కంగారుపడ్డదే అన్నమాట!" అన్నాడు.
"అన్నమాటే గానీ... డిబేట్లలో ఫస్టు ప్రైజు తెచ్చుకోవడమే కాదు, డెయిలీ లైఫ్‌లో కూడా ఆ పూర్వ కవులు చెప్పినదాన్ని పాటించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది రాఘవా... అర్థంలేని ఊహాజనితమైన ఆలోచనలతో బుద్ధిని కలుషితం చేసుకుని ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఏమంత తెలివిగల పని?" అంది భరోసాగా రాఘవ కనులలోకి సూటిగా చూస్తూ హేమ.
హేమ అలా చెప్పిన తరువాత, అంతకుముందు రోజు జరిగిన ఆమె పెళ్ళిచూపుల పర్యవసానం గురించి మరింకేమీ అడగాల్సిన అవసరం లేదనిపించింది రాఘవకి. అయినప్పటికీ "అది నిజమేననుకో. కానీ... అదెంత కష్టమో ఈ రెండు రోజులలో నాకు బాగా అర్థమయింది!" అన్నాడు.
రాఘవ మనసులో భావాన్ని గ్రహించిన హేమ "సరేలే... జరిగింది చెబుతా విను. ఆ వచ్చిన పెళ్ళికొడుకుతో... అయ్యా, నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. చదువుతున్న చదువు పూర్తి చేసుకుని, నాకంటూ ఒక ఉద్యోగం సంపాదించుకుని, ఆ తరువాతనే పెళ్ళి చేసుకోవాలనే చిన్న కోరికతో నేనున్నాను. ఆ సంగతిని నేను నా తల్లిదండ్రులకు స్పష్టంగానే చెప్పాను. అయినా వాళ్ళు నా మాట పట్టించుకోకుండా, ఈ పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. దయచేసి మీరైనా నా బాధను అర్థం చేసుకుని, నా మొర ఆలకించి, మీకు కలిగించిన కష్టానికి నన్ను మన్నించి, వెళ్ళిపోతే ధన్యురాలనౌతాను... అని విన్నవించుకున్నాను. ఆ సహృదయుడు వొప్పుకున్నాడు. నేనిలా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చేశాను. అదీ సంగతి!" అంది హేమ నవ్వు ముఖంతో.
హేమ చెప్పినదాన్ని రాఘవ వెంటనే నమ్మలేకపోయాడు. కానీ, హేమకు అలా తన అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా స్పష్టం చేసి చెప్పే ధైర్యం ఉందని అతడికి తెలుసు. మబ్బులు వీడిన ఆకాశంలా తేటపడింది అతడి వదనం.
"సరేలే!" అన్నాడు, ఆమెతో కలిసి, అప్పటికప్పుడు లభించిన ఆనందంతో, మందహాసం చేస్తూ.
హేమది నిజంగానే హేమ గుణం! ఆమెతో జీవితకాలం సాహచర్యాన్ని వదులుకోకూడదని మరొకసారి మనసులో గట్టిగా అనుకున్నాడు రాఘవ.
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.




Comments