top of page

జీవనజ్యోతి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







'Jeevanajyothi' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రవి, దీప లు.

అనుకోకుండా అతను దూరం అయ్యాడు.

దీప తల్లిదండ్రులు ఆమెకు విజయ్ తో మళ్ళీ వివాహం చేసారు. కానీ తన పాప జ్యోతిని ఆదరించలేని విజయ్ తో ఉండలేక పోయింది దీప. అతన్ని వదిలి వచ్చేసింది.

ఉద్యోగం చేస్తూ తన పాప జ్యోతిని ప్రేమగా చూసుకొంటోంది.

ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు ఈ కథను రచించారు.


" ఏయ్ దీపా! సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా వస్తాను. డాక్టరు వద్దకు వెళదాం. సిధ్ధంగా ఉండు" చెప్పాడు రవి భార్య దీపతో.

"సరే రవీ!" అంది దీప.


రవి ఆఫీసుకు వెళ్ళాక మిగిలిన పని పూర్తిచేసింది. దీపకు గత కొన్ని రోజులుగా నీరసంగా ఉంటోంది. ఆ సాయంత్రం రవి దీపలు డాక్టరు వద్దకు వెళితే ఆవిడ దీపను పరీక్ష చేసి, తల్లి కాబోతున్నట్టు చెప్పింది. రవి, దీపలు ఆనందంతో పొంగిపోయారు.


కళాశాలలో చదువుతున్నప్పుడే దీప, రవిలు ప్రేమించుకున్నారు. మంచివాడు, అనాధ అయిన రవి అంటే దీపకు ప్రాణం. అతనికి ఉద్యోగం రాగానే దీప తన పెద్దలనెదిరించి రవిని పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటోంది . వాళ్ల ప్రేమకు గుర్తుగా ఇప్పడీ శుభవార్త. రవి దీపను కాలు క్రింద పెట్టకుండా ప్రేమగా చూసుకుంటున్నాడు . దీప తల్లి కాబోతున్న విషయం తెలిసి దీప తల్లి తండ్రుల మనసు క్రమేపీ కరిగిపోయి రవినీ, దీపను ఆదరించారు. క్రమేణా వాళ్ల మధ్యన రాకపోకలు కొనసాగాయి. నెలలు నిండగానే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది దీప. ఆ పాపకు "జ్యోతి '' అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు రవి, దీపలు.


చూస్తూండగానే జ్యోతికి మూడవ ఏడు వచ్చింది. అన్యోన్యంగా జీవితం గడుపుతున్న ఆ జంటను చూసి 'విధికి కన్ను కుట్టిందా ' అన్నట్లుగా ఒకరోజున ఆఫీసు నుంచి వస్తున్న రవిని ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టగా, అక్కడికక్కడే రవి విగతజీవుడయ్యాడు. జనం గుమిగూడి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. వాళ్లు వచ్చి రవి ఫోనులో ఉన్న నెంబర్లు ఆధారంగా దీపకు, ఆఫీసు వాళ్లకు సమాచారాన్ని ఇచ్చారు. విషయం తెలిసిన దీపకు తన కాళ్ల క్రింద భూమి కదులుతున్నట్లయి పరుగు పరుగున రవి వద్దకు వచ్చి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె బాధ చెప్పనలవికాదు.


పోలీసులు దీపను సముదాయించి చట్టరీత్యా వాళ్ల విధులను నిర్వర్తించి రవి భౌతికకాయాన్ని ఇంటికి చేర్చారు. కూతురికి వచ్చిన కష్టాన్ని చూసి దీప తల్లి తండ్రులు రోదించి తమను తామే సముదాయించుకుని దీపను ఓదార్చారు. జరిగిన దారుణం గురించి ఏమీ తెలీని చిన్నారి జ్యోతి తన తండ్రి వద్దకు వచ్చి ముద్దు ముద్దు మాటలతో, 'నాన్నా! నాన్నా ! లే!' అంటూ తన చిట్టి చిట్టి చేతులతో రవిని తట్టిలేపుతుంటే అక్కడున్న వాళ్లందరి మనసులు ద్రవించాయి. ఆ తర్వాత జరగవలసిన కర్మకాండ అంతా యధావిధిగా జరిపించారు దీప తల్లి తండ్రులు, బంధువులు. కొన్ని రోజులకు ఆఫీసు వాళ్ళు రవి తాలూకు రావలసిన పైకంతో పాటు ఆ ఆఫీసులోనే దీపకు ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు. దీప ఆ పైకాన్ని జ్యోతి పేరున బాంకులో వేసింది. కాలం గడిచిపోతోంది. దీప తల్లితండ్రులు దీప వద్దే ఉంటూ జ్యోతిని చూసుకుంటున్నారు.


దీప తల్లి తండ్రులు కూతురి జీవితాన్ని తలుచుకుని కుమిలిపోతూ తాము బ్రతికుండగానే దీపకు మరలా పెళ్లి చేసి తనకు మంచి జీవితాన్ని ఇద్దామని తలచి దీప వద్ద ఆ ప్రసక్తి తెచ్చారు. దీప అందుకు ఒప్పుకోలేదు. రవి ప్రేమ మర్చిపోలేనిదనీ, అతనిని జ్యోతిలో చూసుకుంటూ బ్రతుకుతానని చెప్పింది. కానీ ' జ్యోతి చిన్న పిల్ల, తన భవిష్యత్తు కోసమన్నా నీవు మరో పెళ్లిచేసుకోవాలి, మేము పెద్దవాళ్లమయ్యాము, ఎంతకాలం బ్రతుకు తామో తెలీదు. మా తర్వాత నీకూ, జ్యోతి కి ఓ అండ, ఆసరా దొరుకుతుంది ' అని వాళ్లు నచ్చచెప్పడం, దీప ఒప్పుకోవడం జరిగాయి.


దీపకు పెళ్లి సంబంధాల కోసం వాళ్లు ప్రయత్నం చేస్తున్న సమయంలో తెలిసిన వాళ్ల ద్వారా విజయ్ సంబంధం వచ్చింది. విజయ్ సాఫ్టువేరు ఉద్యోగం చేస్తూ తల్లితో ఉంటున్నాడు. తనతో చనువుగా ఉండే సహొద్యోగి వందనను ఇష్టపడి ప్రేమించాడు. కొన్నినెలలకు తన మనసులోని మాటను చెప్పి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు.


"నాకు విదేశాల్లో ఉన్న మా బావతో పెళ్లి ఎప్పుడో నిశ్చయమైంది. ఇంకో నెలలో అతను వస్తాడు. రాగానే మా పెళ్లి. అయినా నీతో స్నేహం తప్పితే నీమీద నాకా అభిప్రాయం లేదు " చెప్పింది వందన.


తన ప్రేమ విఫలమైందని విజయ్ చాలా బాధపడి ఇంక జీవితంలో తనకు పెళ్లి వద్దనుకున్నాడు. కొడుకు ద్వారా విషయం తెలిసిన విజయ్ తల్లి శ్యామలమ్మ తను బ్రతికుండగానే కొడుక్కి పెళ్లి చేయాలని విజయ్ ను పెళ్లికి ఒప్పించింది. విజయ్ వాళ్లు దీప ఇంటికి వచ్చి దీపను చూశారు. తనను, జ్యోతిని బాగా చూసుకోవాలనీ, జ్యోతికి తండ్రి లేని లోటు ఉండగూడదని దీప విజయ్ ను కోరడం‌, అందుకు అతను అంగీకరించడం, ఆ వెంటనే ఇద్దరూ రిజిస్టరు ఆఫీసులో పెళ్లికి దరఖాస్తు చేయడం జరిగింది. కొన్నాళ్లకు దండల మార్పిడితో దీప, విజయ్ లు దంపతులయ్యారు.


దీప జ్యోతిని తీసుకుని విజయ్ ఇంటికి వచ్చింది. రోజులు గడుస్తున్నా తను ఎంత కలుపుగోలుగా ఉంటున్నా విజయ్ ముభావంగా ఉండటం, రాత్రిళ్లు ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నా అతను ఏమాత్రం తనను దగ్గరకు తీసుకోకపోవడం, మాట, మనసు కలుపుకోని అతని ప్రవర్తనకు కారణం అడిగింది. "నేను కేవలం మా అమ్మ కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను " అన్న అతని మాటలకు దీప మనసు బాధతో విలవిలలాడింది . అతను తనకిచ్చిన మాటను తప్పాడని అర్ధమైంది.


"భగవాన్ ! నేను రవినీ, అతని ప్రేమను, అతనితో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ, తమ ప్రేమగుర్తుగా జ్యోతిని చూసుకుంటూ జీవితం గడుపుదామనుకుంటే తల్లిదండ్రుల బలవంతం వలన జ్యోతి భవిష్యత్తు కోసం విజయ్ ను పెళ్లి చేసుకుంటే ఇలా అయిందేంటి ? ఇప్పుడు తనకు, తన బిడ్డకు దారి ఏదీ ? " అని మనసులో వ్యధ చెందుతూ తన ప్రేమతో , ఓర్పుతో విజయ్ మనసును మార్చుకోవచ్చు అనుకుని తన మనసుకు తానే సర్దిచెప్పుకుంది .


దీపకు మనసులో రవి జ్ణాపకాలు కదలాడాయి. తన ప్రాణమైన రవి అనుక్షణం తనను ఎంతో బాగా చూసుకునేవాడు. రామనామం లాగా అతని నోటి వెంట ఎప్పుడూ తన పేరే వినపడేది. తమ తొలి రాత్రి అతను చేసిన చిలిపితనం , అతని ప్రేఘ, తమ ముద్దు ముచ్చట్లు , క్రొత్త కాపురం అంతా గుర్తొచ్చి మనసు ఆనందంతో ఓలలాడింది. క్రమేణా నిద్రాదేవి ఒడిలోకి జారింది.

ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే దీప ఇంటిపని , వంట పనీ, జ్యోతికి స్నానం వగైరా పనులు పూర్తి చేసి అత్తగారికీ , విజయ్ కు, జ్యోతికి టిఫెను పెట్టి, తానూ తిని ఆటోలో ఆఫీసుకు వెళ్లేది. అదే సమయానికి విజయ్ కూడా ఆఫీసుకు బయలుదేరుతున్నా ఏనాడూ తనను ఎక్కించుకోవడం కానీ, వస్తూ తనను కలుపుకొని రావడం గానీ లేదు. ఒకసారి తనే చొరవగా అడిగితే 'ఆటోలో వెళ్లు' అన్న అతని మాటలకు మిన్నకుండిపోయింది. కాలం గడచిపోతోంది.


కొన్ని నెలలకు వ్రృధ్ధాప్యం కారణంగా దీప తండ్రి కాలం చేశాడు. దీప ఆ కార్యక్రమాలను నిర్వర్తించి భర్త, అత్తలకు చెప్పి తల్లి సుగుణమ్మను తనింటికి తీసుకువచ్చింది. ఆవిడ రాకను వాళ్లు అయిష్టంగా ఒప్పుకున్నారు. చిన్నప్పటినుంచి అమ్మమ్మ అలవాటు కనుక జ్యోతి ఆనందానికి అవధులు లేవు.


విజయ్ , దీపలు వారాంతపు శలవులలో కూడా ఎక్కడికీ కలిసి వెళ్లటం లేదు. జ్యోతి చేత విజయ్ ని 'నాన్నా' అనీ, శ్యామలమ్మను ''బామ్మా' అని పిలుపు అలవాటు చేసింది. 'నాన్నా, ' అంటూ దగ్గరకు వస్తున్న ఆ పసిదాన్ని విజయ్ ఏనాడూ ప్రేమగా దగ్గరకు తీయకపోగా దూరంగా వెళ్లేవాడు. ఇంక శ్యామలమ్మ సరేసరి. తన గడుసుతనంతో ఎప్పుడూ ఏదో సాధింపులు, సణుగుడు. ఆ ఇంట్లో ఆవిడ మాటలకు, చేతలకు ఎదురులేదు. విజయ్ కు తల్లి మాటే వేదం.


ఆవిడ జ్యోతిని "ముదరష్టపు శని . ఎవడికో పుట్టిన దాన్ని పెంచి పెద్దచేసే బాధ్యత నా మీద పడింది " అని సాధిస్తూ విదిలించుకునేది. ఆ మాటలకు అర్థం తెలియని ఆ పసిది బిక్కముఖంతో ఏడుస్తూ దీపను చుట్టేసుకునేది. దీప జ్యోతినెత్తుకుని సముదాయించేది. ఆవిడ ప్రవర్తనకు దీప, సుగుణమ్మ చాలా బాధపడేవారు. ఆ తల్లీకొడుకులు సుగుణమ్మను కూడా చాలా చులకనగా చూసేవాళ్లు. తన తల్లిపట్ల వాళ్ల ప్రవర్తనను దీప తట్టుకోలేకపోతోంది. రవి తన తల్లితండ్రులను ఎంత గౌరవంగా, ప్రేమగా స్వంత కొడుకులా చూసేవాడు. 'మీరు మా అమ్మే ఆంటీ' అని నవ్వుతూ అనేవాడు. ఆ మాటలకు సుగుణమ్మ ఎంతో సంతోషించేది.


కొన్నిరోజులకే దీప ఇంటిపరిస్ధితులను , వాళ్ల ప్రవర్తనను అర్ధం చేసుకున్న సుగుణమ్మ ' తామే ఈ పెళ్లి చేసి దీపకు కష్టాలను తెచ్చాము ' అని మనసులో వేదన పడేది. మనోవ్యధకు మందులేనట్టుగా ఆ దిగులుతోనే ఆతర్వాత కొన్ని రోజులకే ఆవిడ నిద్రలోనే గుండెపోటుతో ఈలోకాన్ని వీడింది. దీప గుండెలవిసేలా రోదించి తదుపరి కార్యక్రమాలను నిర్వర్తించి తన మనసుకు తనే ధైర్యం చెప్పుకుని జ్యోతి కోసం మామూలు మనిషి అవుతోంది.


జ్యోతిని స్కూలులో చేర్చింది. ఒకనాడు దీప ఆఫీసుకు శెలవు పెట్టి ఇంట్లో ఉంది. ఇంటి పని పూర్తి చేసి జ్యోతికి చదువు చెబుతోంది. అకస్మాత్తుగా శ్యామలమ్మకు గుండెజబ్బు వస్తే దీప స్వయంగా హాస్పిటల్లో ఆవిడను చేర్చింది. డాక్టర్లు చికిత్స చేసి 'సమయానికి తీసుకువచ్చారు కనుక ఆవిడ బ్రతికింది' అని చెప్పగా మనసులోనే ఆ దేవుడికి ధన్యవాదాలను తెలుపుకుంది . ఆఫీసులో ఉన్న విజయ్ కు దీప ఫోను చేసి విషయం తెలిపింది. ఆదుర్దాపడుతూ విజయ్ వచ్చి తల్లిని చూశాడు. రెండు రోజుల తర్వాత శ్యామలమ్మ ను ఇంటికి తీసుకెళ్లారు. దీప కొన్ని రోజులు ఆఫీసుకు శెలవు పెట్టి అత్తగారికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా ఆవిడను చూసుకుంటోంది.


దీప ఆదరణ, ఆప్యాయత వలన అతి త్వరలోనే ఆవిడ కోలుకుని సంతోషంగా ఉంటోంది. దీపే తనను రక్షించి, తనకు సేవలు చేస్తోందని తెలిసి కూడా ఆవిడలో కించిత్ మార్పురాకపోగా కోడలు ఎక్కడ అనుకుంటుందోనని 'ఎవరికోసంచెయ్యవూ ! అత్తగారికి ఆమాత్రం చెయ్యద్దూ! మా కాలంలో మేము అత్తమామల అడుగులకు మడుగులొత్తేవాళ్లం . నిత్యం వాళ్లకు పాదనమస్కారములు చేస్తూ భయభక్తులతో మసిలేవాళ్ళం. ' అనేది. ఆవిడలో అత్తగారనే అహం పెరుగుతోందే కానీ తరగలేదు.


విజయ్ లో కూడా ఏమాత్రం మార్పు రాకపోగా తల్లి అనారోగ్యరీత్యా ఆవిడ సేవలకోసం దీపను ఉద్యోగం మానమని ఒత్తిడి చేయసాగాడు. దీప అందుకు ఒప్పుకోకపోవటంతో దీప ఆఫీసులోని వాళ్లకు, తెలిసిన వాళ్లకు దీపను గురించి దుష్ప్రచారం చేసి అవమానించసాగాడు. అగ్నికి ఆద్యం లాగా అతనికి తల్లి వంతపాట తోడైంది. వాళ్లు ఆ కోపాన్ని జ్యోతి మీద కూడా చూపేవారు. ఈ విషయమై నిత్యం ఆ ఇంట్లో రణగొణధ్వని. దీప మానసిక సంఘర్షణకు గురవుతోంది. ఈ గొడవలు ఆ చిన్నారి పసిమనసు మీద ప్రభావితం చూపుతుండటంతో ఇంక తన బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఆ ఇంటి నుండి, ఆ మనుఘలనుండి వేరుగా ఉందామని నిర్ణయం తీసుకుని తన నిర్ణయాన్ని భర్తకు, అత్తగారికి తెలిపింది దీప.


దీప ఊహించినట్టుగానే ఆరోజున ఆ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత పదిరోజులకు దీప తన సహొద్యోగి రమ్య ద్వారా ఇల్లును వెతుక్కోవటం, వెనువెంటనే అడ్వాన్సు ఇచ్చేయడం, దీప తన బిడ్డను తీసుకుని ఆ క్రొత్త ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. దీప యధావిధిగా ఆఫీసుకు వెళుతూ జ్యోతిని స్కూలులో దింపి మరలా వచ్చేటప్పుడు ఇంటికి తెచ్చుకుంటోంది. రోజులు సాఫీగా గడచిపోతున్నాయి. తల్లి తండ్రి అన్నీ తనే అయి జ్యోతిని కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటోంది దీప.


"అమ్మా!" అంటూ సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన జ్యోతికి స్నానం చేయించి బట్టలువేసి బిస్కెట్లు, పాలు ఇచ్చింది దీప. తనను ప్రేమగా రెండు చేతులతో చుట్టేసి ముద్దు పెట్టిన జ్యోతికి తిరిగి ముద్దిచ్చి ఒడిలో పడుకోబెట్టుకుని ప్రేమగా తల నిమరసాగింది.


"దీపా! నేను ఆఫీసుకు వెళితే నీకు ఇంట్లో ఏమీ తోచదు కదా! నీవు ఉద్యోగం చేస్తానంటే మా ఆఫీసులోనే చూస్తానోయ్ " అన్న రవి మాటలు గుర్తొచ్చాయి. ఆతర్వాత దీప నెలతప్పడం, జ్యోతి పుట్టటం , జ్యోతిని జాగ్రత్తగా చూసుకోవటం జరిగిపోయాయి.


"రవీ ! నన్ను వదిలి నీకెలా వెళ్లానిపించింది? మనము కళాశాలలో ఎన్నో ఊసులు చెప్పుకుంటూ అందమైన మన జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నాము. అవన్నీ కల్లలు చేసి నన్నిడిచి వెళ్లావా ? నీవుంటే నన్ను, జ్యోతినీ ఎంతో బాగా చూసుకునేవాడివి. నీ ప్రేమే నన్ను ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది " అనుకుని మనసులో మూగగా రోదించింది. అప్రయత్నంగా దీప కన్నులవెంట కారుతున్న నాలుగు వెచ్చని కన్నీటి బొట్లు జ్యోతి బుగ్గలపై పడింది.


"ఏమైందమ్మా ! ఎందుకేడుస్తున్నావు? నిన్ను ఎవరన్నా కొట్టారా ! ఆ దేవుడితో చెపుతాను. మా స్కూలులో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్లని మా మాస్టారు కొట్టినట్టు ఆ దేవుడు కూడా వాళ్లను కొడతాడు. చెప్పమ్మా ! " అంటూ తన చిట్టి చిట్టి చేతులతో తల్లి కన్నీళ్లను తుడిచింది జ్యోతి.


"ఏంలేదమ్మా ! నేనేడవట్లేదు. కంట్లో ఏదో నలక పడింది అంతే ! నీవు నా బంగారు తల్లివి. నా ప్రాణం. నా జీవన జ్యోతివి ! " అంటూ ప్రేమగా జ్యోతిని గుండెలకు హత్తుకొంది దీప.


నవ్వుతూ గువ్వలా ఒదిగి పోయింది జ్యోతి.


సమాప్తం…..

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాట



రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



131 views0 comments
bottom of page