జ్ఞాన దీపాలు
- Munipalle Vasundhara Rani

- 2 days ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #JnanaDeepalu, #జ్ఞానదీపాలు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 16
Jnana Deepalu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 28/01/2026
జ్ఞాన దీపాలు - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
చింటూకి బామ్మ ఇదివరకు చెప్పిన 'తెర వెనుక రాక్షసుడు' కథ విన్న తర్వాత ఫోన్ వాడకం తాత్కాలికంగా కొంత తగ్గినా, కొద్దిరోజులకే మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు వాడికి స్మార్ట్ అనే పిచ్చి పట్టుకుంది. చేతిలో ఫోన్, చెవిలో హెడ్‌ఫోన్స్ ఉంటే చాలు, పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోడు.
ఒకరోజు బామ్మ స్నేహితురాలు జానకమ్మ గారు ఇంటికి వచ్చారు. ఆమె వయసు 80 దాటింది, వణుకుతున్న చేతులతో నెమ్మదిగా నడుస్తారు. అది చూసి చింటూ తన ఫ్రెండ్‌తో ఫోన్లో, "మా ఇంట్లో ఒక స్లో మోషన్ సినిమా నడుస్తోందిరా, మా బామ్మ కన్నా ఈవిడకి ఛాదస్తం ఎక్కువ రా బాబు" అని వెక్కిరించాడు. "ఇంకా చిన్ననాటి విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు, మామూలు విషయాలు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. భలే బోరు కొడుతోందిరా, ఈ పాతకాలం ముసలమ్మ ముచ్చట్లు వింటుంటే" అంటూ విసుగ్గా మాట్లాడాడు.
చింటూ మాటలు విన్న బామ్మ వీడికి పెద్దల పట్ల తన అభిప్రాయం, ప్రవర్తన మారేట్టు చేయాలి అనుకుంది. ముసలివాళ్లు అంటే ఒక ముడతలు పడిన శరీరం మాత్రమే కాదు, తమ అనుభవ జ్ఞానంతో మన అజ్ఞానాన్ని పారదోలే జ్ఞాన దీపాలు అని వాడు తెలుసుకోవాలి అని నిశ్చయించుకుంది. అలా చింటూకి ఒక మర్చిపోలేని పాఠం నేర్పాలని ప్లాన్ చేసింది.
ముందుగా బామ్మ కొన్ని పాత ఇత్తడి విగ్రహాలు తెచ్చి, "చింటూ! వీటిని మెరిపిస్తే నీకు ఐదువందల రూపాయల గిఫ్ట్" అంది. చింటూ ఇంటర్నెట్ లో దొరికిన చిట్కాలను వాడి గంట సేపు తోమాడు. కానీ ఆ మొండి నలుపు వదలలేదు. "ఇవి పాతవి బామ్మ, వీటి మెరుపు రాదు" అని పక్కన పడేసి చేతులెత్తేశాడు. అప్పుడు జానకమ్మ గారు నవ్వుతూ వంటింట్లోకి వెళ్లి కొంచెం చింతపండు, విభూతి తీసుకురమ్మని మెల్లగా తోమడం మొదలుపెట్టారు. ఐదు నిమిషాల్లో ఆ విగ్రహాలు అప్పుడే కొన్న కొత్త బంగారంలా మెరిసిపోయాయి. చింటూ అవాక్కయ్యాడు. తన ఇంటర్నెట్ లో దొరకని ఉపాయం ఆమె అనుభవంలో ఉందని అప్పుడు అర్థమైంది.
కాసేపటికి బామ్మ బయటకు వెళ్తూ "చింటూ! పాలు కాచి ఉంచు, నేను వచ్చాక కాఫీ చేసి జానకి బామ్మకి ఇస్తాను" అంటూ బయటకు వెళ్లింది. చింటూ కిచెన్‌లోకి వెళ్లి ఇండక్షన్ స్టవ్ మీద పాలు పెట్టి, ఫోన్లో అలారం సెట్ చేసి, 'అదే ఆగిపోతుందిలే' అని తన గదిలోకి వెళ్లి హెడ్‌ఫోన్స్ పెట్టుకుని గేమ్స్ ఆడుకోవడం మొదలుపెట్టాడు. కానీ హడావిడిలో స్టవ్ పక్కనే ఒక ప్లాస్టిక్ ట్రేని, కాటన్ తువ్వాలును ఆనుకుని వదిలేశాడు. స్టవ్ వేడికి ఆ ప్లాస్టిక్ ట్రే మెల్లగా కరుగుతూ, సన్నని పొగ, స్వల్పమైన వాసన రావడం మొదలైంది. ఆ వాసన చింటూ ఉన్న గది వరకు చేరలేదు. కానీ హాల్లో కూర్చున్న జానకమ్మ గారికి ఆ చిన్న వాసన తగిలింది. వయసు రీత్యా చూపు మందగించినా, ఆమె ఘ్రాణ శక్తి మాత్రం చాలా చురుగ్గా ఉంది. అది ప్లాస్టిక్ కాలుతున్న వాసన అని ఆమె క్షణంలో పసిగట్టారు.
జానకమ్మ గారు చింటూని పిలిచారు, కానీ వాడు వినలేదు. ఆమెకి మోకాళ్ల నొప్పులు ఉన్నా కూడా, గోడ పట్టుకుని కష్టపడుతూ కిచెన్ వైపు వెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ మంటలు తువ్వాలుకు అంటుకునేలా ఉండటం చూసి ఆమె కంగారు పడలేదు. ప్లాస్టిక్ మంటల మీద నీళ్లు పోయకూడదని ఆమెకు తెలుసు. వెంటనే పక్కనే ఉన్న పొడి గోధుమపిండి డబ్బా తీసి ఆ మంటలపై చల్లి వాటిని ఆర్పేశారు. వణుకుతున్న చేతులతోనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు. కొద్దిసేపటికి కిచెన్‌లోకి వచ్చిన చింటూ, అక్కడ జరిగిన గందరగోళం చూసి నిశ్చేష్టుడయ్యాడు. బామ్మ కూడా అదే సమయానికి వచ్చి అంతా విన్నది.
"చూశావా చింటూ! నీ స్మార్ట్ అలారం మోగుతూనే ఉంది, కానీ నీకు వినిపించలేదు. నీ ఆటోమేటిక్ స్టవ్‌కి పక్కన మంటలు వస్తున్నా ఆపే తెలివి లేదు. కానీ నువ్వు పాతకాలం మనిషి అని తీసిపారేసిన జానకమ్మ గారి అనుభవం ఆ చిన్న వాసననే పసిగట్టి ప్రమాదాన్ని ముందే గుర్తించింది. ఆమె సమయస్ఫూర్తితో రాకపోతే, ఈ పాటికి ఇల్లంతా తగలబడిపోయేది" అని బామ్మ వివరించింది. చింటూ కళ్లు భయంతో ఎర్రబడిపోయాయి. "తప్పు అయిపోయింది బామ్మ. టెక్నాలజీ మన పనిని సులభం చేయగలదేమో కానీ, పెద్దల అనుభవం, వాళ్ల అప్రమత్తత మనల్ని రక్షిస్తాయి అని అర్థం అయింది బామ్మ" అంటూ జానకమ్మ గారికి క్షమాపణ చెప్పి నమస్కరించాడు.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments