top of page
Original.png

కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్


హైదరాబాద్ సమీపంలోని కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ధ్యానాంజనేయ స్వామి దర్శనం, ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి

Karmanghat Hanuman Temple - Telugu Devotional Article | Sudhavishwam Akondi

కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 19/08/2026


హైదరాబాద్ నగరానికి సమీపంలో భక్తులను విశేషంగా ఆకర్షించే పవిత్ర క్షేత్రాల్లో కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఒకటి. సుమారు 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయానికి కాకతీయుల కాలం నాటి చరిత్ర, ధ్యానాంజనేయ స్వామికి సంబంధించిన విశేషమైన స్థల పురాణం ముడిపడి ఉన్నాయి.

స్థల పురాణం ప్రకారం, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన సమయంలో ఎక్కడి నుంచో వినిపించిన ‘రామ... రామ...’ నామస్మరణను అనుసరించి వెళ్లగా, చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉన్న స్వయంభూ హనుమంతుడిని దర్శించాడట. అనంతరం స్వప్నంలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించడంతో ఈ క్షేత్రం ఏర్పడిందని భక్తుల విశ్వాసం.

కర్మాన్ ఘాట్ ఆలయ విశేషాల్లో ఇక్కడి ధ్యానాంజనేయ స్వామి ప్రధాన ఆకర్షణ. విశాలమైన ప్రాంగణంలో గణపతి, జనార్ధన స్వామి, సంతోషిమాత, సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు, శివాలయం, స్పటిక శివలింగం, నవగ్రహాలు, సరస్వతీ దేవి, దుర్గాదేవి, విశ్వనాథుడు, రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, సుబ్రహ్మణ్య స్వామి తదితర ఉపాలయాలు భక్తులకు విభిన్న దైవ దర్శనాలను అందిస్తాయి.

అంతేకాదు, ఆలయానికి సంబంధించిన మరో ప్రసిద్ధ స్థల పురాణం ఔరంగజేబు కాలానికి సంబంధించినది. ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన సైన్యాన్ని ఒక దివ్యమైన అశరీరవాణి భయపెట్టి వెనక్కి పంపిందని కథనం. ‘మనసును గట్టిపరుచుకోండి’ అనే భావంతో ముడిపడిన ఈ కథనం నుంచే ‘కర్మాన్ ఘాట్’ అనే పేరు వచ్చిందని స్థానిక స్థల పురాణం చెబుతుంది.

చరిత్ర, భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసం, అనేక ఉపాలయాల ప్రత్యేకతతో కూడిన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.


మేము అనుకోకుండా మన హైదరాబాద్‌కి దగ్గరలోనే ఉన్న కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్‌కి వెళ్లాం! విశాలమైన ప్రాంగణంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. మొదట మెయిన్ టెంపుల్‌లో గణపతి, వెంటనే ధ్యానాంజనేయ స్వామి. ఈ ఆలయానికి ఎడమ వైపు జనార్ధన స్వామి ఆలయం ఉంది. ఆంజనేయుని ఆలయం ఉన్న వరుసలోనే సంతోషి మాత, సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు, శివాలయం, స్పటిక శివలింగం, నవగ్రహాలు వరుసగా ఉన్నాయి.


దీనికి ఎదురుగా రావి చెట్టు కింద సర్పాకృతులు, దాని వెనుక సరస్వతి మాత ఆలయం ఉంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. అక్కడ నుంచి ఇంకా నాలుగు అడుగులు వేస్తే దుర్గాదేవి, విశ్వనాథుడు, ఆ పక్కనే రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆ తర్వాత షాప్ పక్కనే సుబ్రహ్మణ్యుడు సర్ప రూపంలో ఉన్న ఆలయం ఉంది. అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ప్రసాదాల కౌంటర్లు ఉన్నాయి. పులిహోర ప్రసాదం తినేసి, కారు పార్కింగ్ వైపు వెళితే అక్కడ హనుమ ఉపాలయం, వేణుగోపాల స్వామి (ఒక్కడే) ఆలయం దర్శనం చేసుకుని కారెక్కాం!


స్థల పురాణం:

హైదరాబాద్‌ సమీపంలోని సుమారు 800 సంవత్సరాల పురాతనమైన కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయ స్థల పురాణం కాకతీయ రాజుల కాలం నాటిది. వేటకు వెళ్లిన కాకతీయ రాజుకు అదృశ్యంగా రామనామ స్మరణ వినిపించి, ధ్యాన ముద్రలో ఉన్న స్వయంభూ హనుమ విగ్రహం లభించడం జరిగిందట! ఈ ప్రాంతం పైన దాడికి ప్రయత్నం చేసిన ఔరంగజేబు సైన్యం కూడా నిలువరించబడిందట!

కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని కాలంలో స్వయం వ్యక్తం అయిన ఈ ధ్యానాంజనేయ స్వామి వారికి ప్రతాప రుద్రుడు ఆలయాన్ని కట్టించాడట!

ఒకసారి ప్రతాప రుద్రుడు ఇక్కడి అటవీ ప్రాంతంలో వేటకోసం వెళ్లి, వేటాడి అలిసిపోయి ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు ఎక్కడి నుంచో 'రామ.... రామ...' అనే నామ జపం వినిపించింది.


ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్లగా అక్కడ ఎలాంటి జంతువులు కనిపించలేదు. కానీ ఒక చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉన్న స్వయంభూ హనుమ విగ్రహం దర్శనమిచ్చింది. రాజు నమస్కరించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆరోజు రాత్రి కలలో హనుమ రాజుకు దర్శనం ఇచ్చి, తానే అక్కడ వెలిశానని, తనకు ఆలయం నిర్మించమని ఆదేశించాడట! ఆంజనేయుని ఆదేశం మేరకు ప్రతాప రుద్రుడు ధ్యానాంజనేయ స్వామిని శాస్త్రోక్తంగా ప్రతిష్టింపజేసి, అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆనాటి నుంచి నేటి వరకు హనుమ తన కరుణాకటాక్షాలను భక్తులపై కురిపిస్తూ అనుగ్రహిస్తూ, కోరుకున్న కోరికలు తీరుస్తున్నాడు.


ఒకసారి ఔరంగజేబు ఈ ప్రాంతం వైపు దాడికి వచ్చినప్పుడు తన సైన్యాన్ని పంపించాడట! హనుమ తన ఉనికి తెలియపరచడానికి ఆ సైన్యాన్ని ఈ ప్రదేశంలో అడుగుపెట్టనీయకుండా తిప్పికొట్టాడట! స్వయంగా ఔరంగజేబు కూడా వచ్చి భయపడి పారిపోయాడట!


మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన సైన్యంతో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడు. ఆలయం దగ్గరకు రాగానే లోపలి నుంచి "మందిర్ తోడ్ నా హై తో పహాలే తుమ్ కరో మన్ ఘట్" (దేవాలయాన్ని కూల్చాలంటే ముందుగా మీ మనసును గట్టి పరుచుకోండి) అనే గంభీరమైన దివ్య స్వరం వినిపించింది.


ఆ అశరీర వాణికి, అక్కడి వింత అనుభవాలకు ఔరంగజేబు సైన్యం భయపడి వెనుదిరిగింది. మనసును గట్టిపరుచుకోవాలన్న ఆ సంఘటన ఆధారంగా ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ (కర్మ + మన్ + ఘాట్) అనే పేరు స్థిరపడింది.

అటువంటి మహా మహిమాన్వితమైన క్షేత్రం ఇది. వీలైనవారు దర్శించుకోండి!


శ్రీరామ జయరామ!

జై హనుమాన్!


***

సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page