top of page
Original.png

సుఖ సంతోషంతో ఆనందం, పరమానందంతో సచ్చిదానందం

1 hour ago
6 min read

సచ్చిదానంద తత్వం, ఆత్మజ్ఞానం, పరమానందానికి ప్రతీకగా నదీతీరంలో ధ్యానం చేస్తున్న గురువు, పది మంది శిష్యులు, పడవ నడిపే బెస్తవాడు.
సచ్చిదానంద తత్వం

 Sukha Santhoshamtho Anandam Paramanandamtho Sachhidanandam - Telugu Spiritual Article | R C Kumar

సుఖ సంతోషంతో ఆనందం, పరమానందంతో సచ్చిదానందం - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 02/11/2026


సుఖ సంతోషాలు : 

సుఖం వేరు, సంతోషం వేరు. సుఖం అనేది ప్రధానంగా శరీరానికి మరియు ఇంద్రియాలకు సంబంధించిన అనుభూతి. అది బయటి వస్తువుల ద్వారా వచ్చేది. ఉదా || మంచి ఆహారం తినడం, సౌకర్యవంతమైన మంచంపై పడుకోవడం, ఏసీ గదిలో ఉండటం, మసాజ్ చేసే ఎలక్ట్రిక్ కుర్చీపై కూర్చొని శారీరక సుఖాన్ని అనుభవించడం. ఇటువంటి భౌతిక వస్తువులు లేదా సౌకర్యాల వల్ల శరీరం పొందే అనుభవం సుఖం. ఈ సుఖం ఎప్పటికీ ఉండేది కాదు. ఇది తాత్కాలికమైనది. ఆ భౌతిక వస్తువు లేదా అనుభూతి ముగిసిన వెంటనే సుఖం కూడా ముగిసిపోతుంది.


ఇక సంతోషం అనేది శరీరాన్ని దాటి మనస్సుకు సంబంధించిన ఒక సానుకూల స్థితి. అనుకున్నది సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, ప్రశంసలు పొందడం లేదా ఎవరైనా షాలువా కప్పుతుంటే సంతోషంగా ఫోటోకి ఫోజ్ ఇవ్వడం వంటి మంచి సంఘటనలు జరిగినప్పుడు మన మనసుకు కలిగే తృప్తి లేదా ఉల్లాసం. ఎవరినైనా కొత్తవారికి పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ల గుణగణాల గురించి చాలా గొప్పగా, ఒక్కోసారి ఉన్నదాని కంటే ఎక్కువగా చెబుతూ ఉంటే, లోలోపల సంతోషం పెల్లుబుకుతుంది. ఈ సంతోషాలన్నీ కూడా మార్పు చెందేవే, శాశ్వతంగా ఉండేవి కావు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు సంతోషం ఉంటుంది; పరిస్థితులు మారితే ఇది విచారంగా లేదా దుఃఖంగా కూడా మారవచ్చు.


మనిషి లగ్జరీగా బతుకుతూ కూడా తీవ్రమైన మానసిక వేదనను అనుభవించవచ్చు (సుఖం ఉంది, సంతోషం లేదు). అలాగే, ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఒక చిన్న గుడిసెలో ప్రశాంతంగా నిద్రపోవచ్చు (సుఖం లేదు, సంతోషం ఉంది). నిజమైన సంతోషం అనేది మన అంతరంగం నుండి మాత్రమే వస్తుంది. ప్రేమించే కుటుంబం, అర్థం చేసుకునే స్నేహితులు, నిజాయితీగా జీవిస్తున్నాననే తృప్తి - ఇవే సంతోషాన్ని ఇస్తాయి.


సుఖం వస్తువుల వల్ల వస్తుంది; సంతోషం మనుషుల వల్ల వస్తుంది.

సుఖం బయట దొరుకుతుంది; సంతోషం మన మనసులో పుడుతుంది.

సుఖాన్ని డబ్బుతో కొనొచ్చు. సంతోషాన్ని మాత్రం ఏ సంపదతోనూ కొనలేం.

 

జీవితంలో వెనక్కి వెళ్లకుండా ప్రస్తుత స్థితిని మనస్ఫూర్తిగా అంగీకరించడమే మానసిక ఆనందం. బాహ్య పరిస్థితులు, మార్పులు లేదా ఇతరుల చర్యలను మనం శాసించలేము, కానీ వాటికి ఎలా స్పందించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నడి సముద్రంలో నావలో పయనిస్తున్న వేళ హోరుగా వీస్తున్న గాలిని మనం నియంత్రించలేము. కానీ తెరచాపను ఉపయోగించి గాలివీస్తున్న దిశకు అనుకూలంగా తిప్పుకుంటూ సురక్షితంగా ప్రయాణం కొనసాగించవచ్చు. 


ఆనందం, పరమానందం :

సుఖానికి, సంతోషానికి భిన్నంగా ఆనందం అనేది ఒకటి ఉంది. 'సుఖం' శరీరానికి సంబంధించినది, 'సంతోషం' మనస్సుకు సంబంధించినది. 'ఆనందం' ఆత్మకు సంబంధించినది. ఆనందం మానసిక స్థితి అయితే, పరమానందం ఆధ్యాత్మిక స్థితి. 'పరమ' అంటే అత్యున్నతమైనది. కోరికలకు, బాహ్య ప్రపంచానికి అతీతంగా ఉండే స్వచ్ఛమైన, నిత్యమైన ఆనందమే 'పరమానందం'. అందుకే దీనిని పరమాత్మతో పోలుస్తారు. 'పరమానంద మాధవమ్' అంటూ గీతా ధ్యానంలో కీర్తిస్తారు. బాహ్య కారణాల వల్ల వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు కాబట్టి, ఎటువంటి కారణాలు లేని, శాశ్వతమైన ఆనంద స్వరూపమే పరబ్రహ్మము. అదే పరమానందం.


సచ్చిదానంద స్థితి :

1. సత్ : శాశ్వతమైన నిజం. ఎల్లప్పుడూ మార్పు లేకుండా స్థిరంగా ఉండేది 'సత్'.

2. చిత్ : శుద్ధమైన స్పృహ, అవగాహన లేదా జ్ఞానం. బాహ్య ప్రపంచాన్ని, అంతర్గత ఆలోచనలను గ్రహించే ఆత్మ యొక్క చైతన్య శక్తి 'చిత్'.

3. ఆనందం : సత్-చిత్‌లతో కూడిన ఆనందం స్వచ్ఛమైనది. లౌకికమైన లేదా ఇంద్రియాల ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కాకుండా, ఎటువంటి కారణం లేకుండా ఆత్మ లోపలి నుండి లభించే అపరిమితమైన ఆనంద స్థితి ఇది.


సచ్చిదానంద స్థితి అనేది మనం కొత్తగా సంపాదించేది కాదు. మనలోనే ఉన్న ఆ సత్యాన్ని ఒక గురువు సహాయంతో గుర్తించగలగాలి. సచ్చిదానంద స్థితిలో ఉన్న అతను తన ఆత్మలోనే తాను రమిస్తాడు. బాహ్య ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, అతను తన ఆత్మలోనే నిమగ్నమై, ప్రశాంతంగా మరియు తృప్తిగా ఉంటాడు. అలాంటి వారిని ఆత్మారాముడు అంటారు. దీనికి సంబంధించిన రెండు ఉపాఖ్యానాలు ఉన్నాయి.


ఉపాఖ్యానం 1 :

పూర్వం పది మంది శిష్యులు తమ గురువుగారి ఆజ్ఞ మేరకు ఆశ్రమం నుండి వేరే ఊరికి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఒక పెద్ద నదిని ఈదుకుంటూ దాటవలసి వచ్చింది. నదిలో ప్రవాహం చాలా బలంగా ఉంది. మొసళ్ళు కూడా తిరుగుతున్నాయి. అయినా సరే ఎలాగోలా కష్టపడి అందరూ నది దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు.

నది దాటిన తర్వాత, వాళ్లకు ఒక సందేహం వచ్చింది. "అందరం దాటేశామా? లేక ప్రవాహంలో ఎవరైనా కొట్టుకుపోయారా?" అన్న భయం పట్టుకుంది. అందుకని ఒక శిష్యుడు లేచి, "మనమంతా సురక్షితంగా ఉన్నామా లేదా అని లెక్కపెడతాను" అని అందరినీ వరుసగా నిలబెట్టి లెక్కించడం ప్రారంభించాడు. ఆయన ఒక్కొక్కరినీ... ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది... అని లెక్కపెట్టి ఆగిపోయాడు. తనను తాను లెక్కించుకోవడం మరచిపోయిన అతను, "అయ్యో! తొమ్మిది మందే ఉన్నారు. పదవ వాడు నదిలో కొట్టుకుపోయాడు!" అని ఏడవడం మొదలుపెట్టాడు.

మరొక శిష్యుడికి అనుమానం వచ్చి, "ఆగు, నేనే లెక్కపెడతాను" అని మిగిలిన తొమ్మిది మందిని లెక్కించాడు. అతను కూడా తనను తాను లెక్కించుకోకపోవడంతో మళ్లీ తొమ్మిదో సంఖ్యే వచ్చింది. దాంతో తమ స్నేహితుడు నదిలో మునిగిపోయాడని భావించి, అందరూ ఒకరినొకరు పట్టుకుని గట్టిగా ఏడవడం ప్రారంభించారు.


అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు వీరి ఏడుపు చూసి ఆగి, "ఏమైంది నాయనా? ఎందుకు ఏడుస్తున్నారు?" అని అడిగాడు. శిష్యులు జరిగిందంతా చెప్పి, "మాలో పదవ వాడు నదిలో కొట్టుకుపోయాడు స్వామీ!" అని బాధపడ్డారు. ఆ సాధువు వారిని గమనించి చూసి, అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందో గ్రహించాడు.


ఆయన నవ్వుతూ, "బాధపడకండి, మీ పదవ వాడు చనిపోలేదు, ఇక్కడే ఉన్నాడు. నేను అతన్ని చూపిస్తాను" అన్నాడు. అందరినీ వరుసగా నిలబెట్టి, మొదటి వాడిని పిలిచి లెక్కించమన్నాడు. ఆ శిష్యుడు మళ్లీ మిగతా వారిని 1 నుండి 9 వరకు లెక్కించాడు. అప్పుడు ఆ సాధువు ఆ శిష్యుడి భుజం తట్టి, "దశమ త్వమసి" అన్నాడు. అంటే "ఆ పదవ వాడు ఎవరో కాదు... నువ్వే!" అని నిరూపించాడు. తనను తాను మరచిపోవడం వల్లే ఇంతసేపు లేని దుఃఖాన్ని అనుభవించామని ఆ శిష్యులు గ్రహించి, ఆనందపడ్డారు.

వినడానికి ఇది ఏదో పరమానందయ్య శిష్యుల కథలా ఉంది; కానీ ఈ కథ మన ఆత్మ తత్వానికి, సచ్చిదానంద స్థితికి అద్దం పడుతుంది.

1. సత్ (నిజం, ఉనికి): ఆ పదవ వాడు నది ప్రవాహంలో కొట్టుకుపోలేదు. అతను ఎప్పుడూ అక్కడే ఉనికిలో ఉన్నాడు. అలాగే, భగవంతుడు మీలోనే ఉండే 'ఆత్మ'. అది ఎప్పుడూ సత్యమై, నిత్యమై మీలోనే ఉంటుంది. ఎక్కడికీ పోదు.

2. చిత్ (స్పృహ/జ్ఞానం): శిష్యులకు అంతకుముందు అజ్ఞానం లేదా మాయ అనేది ఆవరించి ఉంది. సాధువు వచ్చి గురువుగా మారి 'పదవ వాడు నువ్వే' అనే జ్ఞానాన్ని కలిగించాడు. నువ్వే ఆ పరమాత్మ స్వరూపమని తెలుసుకోవడమే 'చిత్'.

3. ఆనందం: పదవ వాడు ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకోగానే శిష్యులందరి దుఃఖం పోయి అపరిమితమైన సంతోషం కలిగింది. ఆనంద స్వరూపం మనమే (ఆత్మే) అని తెలుసుకున్నప్పుడు కలిగే స్థితే 'పరమానందం'.


ఈ కథలో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పదవ వాడు ఎక్కడి నుంచో కొత్తగా రాలేదు, ఎప్పుడూ అక్కడే ఉన్నాడు. గురువు గారి ద్వారా ఆ జ్ఞానం కలిగింది. అలాగే, సచ్చిదానంద స్థితి అనేది మనం కొత్తగా సంపాదించేది కాదు. మనలోనే ఉన్న ఆ సత్యాన్ని ఒక గురువు సహాయంతో గుర్తించగలగాలి.

ఉపాఖ్యానం 2 :

గంగానదీ తీరంలో ఒక పడవ నడిపే బెస్తవాడు తెడ్డు వేస్తూ పాటలు పాడుకుంటూ పడవ నడుపుతున్నాడు. ఆ నదిని దాటడానికి అటువైపుగా వచ్చిన ఒక సన్యాసి బెస్తవాడి సహాయం కోరాడు. ఒప్పుకున్న బెస్తవాడు అతన్ని పడవలో కూర్చోబెట్టుకొని పల్లె పాటలు పాడుతూనే చేపల కోసం వలను నదిలో విసిరాడు. సంతోషంగా తన పని తాను చేసుకుంటున్నాడు. అది చూసి ఆ పడవ ఎక్కిన సన్యాసికి పడవ వాడి ప్రవర్తన పట్ల ఆసక్తి కలిగింది.


తనను సురక్షితంగా నది దాటించినందుకు సన్యాసి పడవవాడికి ఓ నాణెం ఇవ్వగా పడవవాడు డబ్బు తీసుకోవడానికి సున్నితంగా నిరాకరించాడు. అతడి వృత్తి చేపల వేట ! డబ్బుల కోసం నదిని దాటించడం కాదు. సహాయం కోరిన సన్యాసిని ఒడ్డున దించేసి, మళ్లీ ఎప్పటిలా నదిలోకి వల విసిరి పాడుకుంటూ వెళ్లిపోయాడు.


చాలా జ్ఞానాన్ని సంపాదించాను అనుకున్న ఆ సన్యాసికి ఓ కొత్త విషయం బోధపడింది. బతుకుతెరువు కోసం చేపలు పట్టే ఆ మనిషి డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని జయించాడు. చేయగలిగింది ఏదో చేసి ఆనందంగా వెళ్ళిపోయాడు. "మోహక్షయమే మోక్షం!" అన్న విషయాన్ని అప్పుడే తెలుసుకున్నాడు. సన్యాసి అయిన తాను జేబులో నాణేలు పెట్టుకుని తిరుగుతున్నందుకు సిగ్గుపడ్డాడు. అతడి మదిలో పడవ నడిపేవాడి సుందర సుమధుర పల్లెగీతం తెరలు తెరలుగా వినిపిస్తోంది. ఆ బెస్తవాడు సచ్చిదానంద స్థితిలో తన ఆత్మలో తాను రమిస్తున్నాడు.


స్వస్తి, కృష్ణార్పణం 🙏


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y








ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page