కష్టం సుఖం
- Kidala Sivakrishna
- Jan 1, 2022
- 3 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Kashtam Sukham' Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
అతని పేరు రవి.
స్నేహితుడి వల్ల ఉపకారం పొందాడు. ఆ మేలు
మరిచిపోకుండా ఇప్పటికీ గుర్తుంచుకొని మనతో పంచుకుంటున్నాడు. అదేమిటో
తెలుసుకోవాలంటే యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించిన ఈ కథ ‘కష్టం సుఖం’
చదవండి.
నా పేరు రవి. నా మిత్రుడి పేరు వాసు. మేము ఇద్దరం మంచి మిత్రులం అని అంటుంటారు ఊరిలోని వారందరూ. నిజం చెప్పాలంటే ఆ మాట నిజమే. ఎందుకంటే మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగాం. అందులోనూ ప్రతి విషయాన్ని మేము మాత్రమే పంచుకుంటాం.
వాసు నాకు చాలా సహాయం చేశాడు. పడిపోతున్న నా జీవితాన్ని నిలబెట్టాడు. నా మిత్రుడి గురించి అంతగా చెపుతున్నాను అంటే ఏమి చేశాడు అని మీ సందేహమా? అయితే నాకు జరిగిన సంఘటన గూర్చి చెపుతాను వినండి.
నేను మామూలుగానే పనిచేయడానికి ఇష్ట పడను. ఇంకా చెప్పాలంటే నాకు బద్దకం ఎక్కువ. అందులోనూ నాకు మందు తాగే అలవాటు ఉంది. కానీ నా మిత్రుడు కష్టమైన పనిని కూడా చాలాఇష్టంగా చేసేవాడు. పైగా ఏ చెడు అలవాటు లేనివాడు.
మా ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు పొలాల్లో అప్పుడప్పుడూ వజ్రాలు దొరికేవి. నేను ఎక్కువగా సుఖాన్ని కోరుకునే వాడిని. కాబట్టి వర్షం వచ్చిన ప్రతి సారి వజ్రాల కోసం వెతికేందుకు వెళ్ళేవాడిని.
నేను వెళ్ళేటప్పుడు నా మిత్రుడు అయిన వాసును కూడా రమ్మని పిలిచేవాడిని.వాడు “నేను రాను. నువ్వు వెళ్ళు. నాకు పనిచేస్తే వచ్చే 300 రూపాయలు చాలు” అని చెప్పేవాడు. ఆ విధంగా నేను చాలా సార్లు వజ్రాల కోసం వెళ్ళేవాడిని. నా అదృష్టం కొద్దీ నాకు ఒకరోజు అనుకోకుండా వజ్రం దొరికింది.
“దేవుడు దయ తలిచాడు! అదృష్టం అడ్డం తిరిగింది” అని సంతోషించాను . ఆ విషయాన్ని నా మిత్రుడు వాసుకు కూడా చెప్పాను. తరువాత నేను, నా మిత్రుడు కలిసి ఆ వజ్రాన్ని దాదాపు నాలుగు లక్షల రూపాయలకు అమ్మేశాము. నాకు వున్న లక్షన్నర రూపాయల అప్పును తీర్చేసాను. మిగిలిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలుపెట్టాను. నా జల్సాలు చాలా రోజులు నడవలేదు. సంవత్సర కాలంలోనే డబ్బు అంతా అయిపోయింది. నా మిత్రుడు మాత్రం కష్టపడి పైసా పైసా పోగు చేయ సాగాడు. రెక్కల కష్టంతో ఇల్లుకూడా కట్టుకున్నాడు.
నా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఖాళీ చేతులు మిగిలాయి. కొన్ని రోజులలోనే మరలా అప్పు చేయాల్సి వచ్చింది. నా మిత్రుడు మాత్రం కష్టపడుతూ మంచి స్థాయికి చేరుకున్నాడు. నేను మాత్రం అప్పులలో మునిగి పోతున్నాను. అటువంటి సమయంలో నా మిత్రుడి దగ్గరికి వెళ్లి
"కొంతడబ్బును అప్పుగా ఇవ్వు. తరువాత తిరిగి చెల్లిస్తాను" అని అడిగాను.
అపుడు నా మిత్రుడు "నీకు డబ్బు ఇస్తాను కానీ ఒక షరతుకు ఒప్పుకుంటేనే ఇస్తాను” అన్నాడు.
గత్యంతరం లేక “సరే చెప్పు” అన్నాను.
అపుడు వాసు “నీవు ముందుగా మందును తాగడం ఆపివేయాలి. తరువాత ప్రతి రోజూ, పని ఉంటే పనికి వెళ్ళాలి. ఇంటి దగ్గర మాత్రం ఉండకూడదు” అన్నాడు.
సరే అని నా మిత్రుడు పెట్టిన షరతుకు ఒప్పుకున్నాను. నా మిత్రుడు ఇచ్చిన డబ్బుతో నా అప్పును తీర్చుకున్నాను. తరువాత మద్యం సేవించడం మానేశాను. ప్రతి రోజూ పనికి వెళ్ళడం మొదలు పెట్టాను. నా మిత్రుడు ఇచ్చిన డబ్బుతో అప్పులు కట్టుకోవడం వలన, మరియు మందు తాగడం మానేయడం వలన కొన్ని రోజుల వ్యవధిలోనే డబ్బును మిగిల్చుకున్నాను. ఆ డబ్బుతో నా మిత్రుడి అప్పును తీర్చేందుకు వెళ్ళాను.
వెళ్లి, “డబ్బులు తీసుకో వాసు” అన్నాను.
అపుడు వాసు “నేను నీకు డబ్బును అప్పుగా ఇవ్వలేదు. ఆ డబ్బును నువ్వే ఉంచుకో. నీలో మార్పుకోసం ఈ విధంగా షరతులు విధించాల్సి వచ్చింది. నువ్వు మారావు చాలు. అదే నాకు పదివేలు” అన్నాడు.
అంతే కాదు, “నీకు కష్టం విలువ తెలియచేయాలి అనే ఉద్యేశంతోనే ప్రామిసరి నోటురాయించాను. అంతే కానీ నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు” అన్నాడు.
అలా నా మిత్రుడి వల్లనే నేను ‘కష్టం విలువ’ తెలుసుకున్నాను. కష్ట పడితేనే సుఖం వస్తుదని కూడా తెలుసుకున్నాను. ఆ రోజు నుండి మరింత ఇష్టంతో కష్టపడుతూ మంచి స్థాయికి చేరుకున్నాను.
ఈ విధంగా నేను ఎదగడానికి కారణం నా మిత్రుడు కాబట్టి అతడి గురించి నా జీవితంలోజరిగిన సంఘటన మీతో చెప్పుకున్నాను.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments