క్షమించు అమ్మా! మన్నించు నాన్నా! పార్ట్ 1
- Kasivarapu Venkatasubbaiah

- 10 hours ago
- 6 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #క్షమించుఅమ్మామన్నించునాన్నా, #తెలుగుపల్లెకథలు, #TeluguHeartTouchingStories

పెద్దకథ ప్రారంభం
Kshaminchu Amma Manninchu Nanna - Part 1/3 - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 20/02/2026
క్షమించు అమ్మా మన్నించు నాన్నా- పార్ట్ 1/3 - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
అక్కా, బావా ఆటో నుంచి దిగగానే రాజన్న, అతని భార్య మంగమ్మ, వారి పిల్లలు ఆదరంగా ఇంట్లోకి తీసుకొని పోయి సోఫా మీద కూర్చోబెట్టి "బావా! రాంప్రసాద్ విజయాల మీద ఉన్నాడు. కాబట్టి అహంకారం, అహంభావం పెరిగింది. ఉచ్చనీచాలు తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. తలకు ఎక్కిన మైకం దిగే రోజు వస్తుంది. అప్పుడు మీ విలువ తెలుసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అందాకా వేచి ఉందాం బావా! ఇప్పటికి ఈ బాడుగింట్లో ఉండండి" ఓదార్చాడు బావమరిది రాజన్న.
"అలా కాక మనం ఇంకేం చేయగలం రాజన్న" అన్నాడు బావ మాధవయ్య నిర్లిప్తంగా
"అది సరేగానీ వాడిచ్చిన ఈ డబ్బు ఏమి చేయాలో చెప్పు రాజన్న" అడిగింది అక్క జానకమ్మ.
"ఏమీ లేదు అక్కా! మీ దగ్గర ఉన్న కోటి రూపాయల్ని బ్యాంకులో వేద్దాం. సీనియర్ సిటిజన్స్ కింద ఎనిమిది పర్సెంట్ నెలకు వడ్డీ వస్తుంది. అంటే నెలకు 75,000 వేల రూపాయల దాకా వస్తుంది. ఇప్పుడు నేను లక్ష రూపాయలు మీకు ఇస్తాను. యాభై వేలు ఇంటి ఓనర్‌కు అడ్వాన్స్ ఇవ్వండి. యాభై వేలు సంసారానికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోండి. నా డబ్బు నెలకు ఇంత ఇస్తారు గానీ." అనునయంగా చెప్పి వాళ్ళ మనసును కుదుటపరిచాడు రాజన్న
బాడుగ ఇల్లు చిన్నదైనా చాలా బాగుంది. సింగిల్ బెడ్రూమ్, కిచెన్, హాలు, సోఫా, కాంపౌండ్ కలిగివుంది. ఇంటిపైనా కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. అన్ని సర్దుకొని అందులో చేరి కాలం గడుపుతున్నారు మాధవయ్య జానకమ్మ దంపతులు.
. *
మాధవయ్యది సాదాసీదాగా సాగిపోతున్న సాధారణ కుటుంబం. ఎర్రగుంట్ల మండలంలోని ఒక మారుమూల గ్రామం వలసపల్లె అతనిది. మాధవయ్యకు రెండెకరాల వెలి భూమి ఉండేది. ఊర్లో ఇల్లు, కళ్లదొడ్డి ఉండేవి. అతడూ, అతని భార్య జానకమ్మ కలిసి వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ తమకు ఉన్న ఒకే ఒక పాడి ఎనుము పాలు పితుక్కుంటూ బతికేవాళ్ళు. వాళ్ళ చేలో పని లేనప్పుడు ఇతరుల పొలాల్లోకి కూలి పనికి పోయేవాళ్ళు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకున్నా భార్యాభర్తలు సుఖంగానే ఉండేవాళ్ళు.
మాధవయ్య పది వరకు చదువుకున్నాడు. చాలా హుషారైనవాడు. ఊర్లో జరిగే జాతరలు, దేవరలు, తిరునాళ్ళు, పండుగల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తనకు చేతనైనంతలో చందా కూడా ఇచ్చేవాడు. పంట కాలం ముగిశాక తమ ఊర్లో నిర్వహించే హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, ఆవులపబ్బం, విరాటపర్వం, సుద్దులు, నాటకాలు మొదలైనవి శ్రద్ధగా విని చూసి ఆనందించేవాడు.
భార్యతో ఏ చీకూచింతా, కీచులాట లేకుండా ఉన్నంతలో ఆనందంగా గడిపేవాడు మాధవయ్య. భార్య జానకమ్మ కూడా భర్తకు తగిన విధంగా నడుచుకుంటూ సంతోషంగా ఉండేది. నెలకు ఒకసారైనా ఖుషీగా ఎర్రగుంట్ల టౌన్‌కు పోయి సినిమా చూసి, హోటల్లో భోజనం చేసి వచ్చేవారు. మాధవయ్య ఉదయమో, సాయంకాలమో పాగేట్లో ఈతాడుతుంటే జానకమ్మ గట్టుమీద కూర్చుని ఉత్సాహంగా చూస్తుండేది. భర్త హుషారును చూసి ఆప్యాయంగా నవ్వుకునేది జానకమ్మ. మాధవయ్యది కాయకష్టం చేసిన ఒళ్ళు కాబట్టి అందమైన ఆకృతిలో ఉండేది.
కొంత కాలానికి వాళ్ళ దాంపత్య జీవిత ఫలితంగా వారికొక మగబిడ్డ పుట్టాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లోడికి "రాంప్రసాద్" అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకునేవారు. వాడు బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఎంతో మురిసిపోయారు. వాడు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే సంతోషంతో పులకించిపోయారు. వాళ్ళ లోకం వాడే. వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు వాడిపైనే. వాడిని చదివించి పైకి తేవడమే వాళ్ళ జీవితాశయం. వాడి యోగక్షేమాలు, వాడి అభివృద్ధే వాళ్ళ సర్వస్వం. అంతెందుకు వాళ్ళ పంచ ప్రాణాలు వాడే.
రాంప్రసాద్‌కు ఐదేళ్లు నిండి, ఆరో ఏట పడగానే మాధవయ్య ఊరిలోని ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. పదేళ్ల వయసు రాగానే అతని ఊరికి పక్కనే ఉన్న తుమ్మలపల్లి పంచాయతీ కేంద్రంలో హైస్కూల్‌లో చదివించారు. ఇంటర్మీడియట్ ఎర్రగుంట్లలో చేర్పించారు. పిల్లోడి చదువుకు ఏ ఆటంకం రాకుండా, తిండికి గుడ్డకు నలక్కుండా ఉండేందుకు ఆ దంపతులిద్దరూ గొడ్డుచాకిరీ చేశారు.
రాంప్రసాద్‌కు పదవ తరగతి వరకూ తల్లిదండ్రులతోనే లోకం. వాళ్లను విడిచి ఉండేవాడు కాదు. ఆ సమయంలోనే రాంప్రసాద్‌కు పాగేటి మడుగులో ఈత నేర్పి గజ ఈతగాణ్ణి చేశాడు. పొలం దున్నకం నేర్పి రాంప్రసాద్‌ను మంచి సేద్యగాణ్ణి చేశాడు మాధవయ్య. 'చేతిలో విద్య ఉంటే కూడు ఉన్నట్లే' అనేది మాధవయ్య సిద్ధాంతం.
రాంప్రసాద్ ఇంటర్‌లో చేరాక క్రమేణా అమ్మానాన్నలతో చనువు తగ్గించాడు. వాడికి అవసరం మేరకు మాట్లాడేవాడు. మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. కాలేజీలో స్నేహితులు ఏర్పడ్డాక స్నేహితులతోనే ముచ్చట్లు పెట్టుకునేవాడు. కబుర్లు చెప్పుకునేవాడు, సినిమాలు ఎక్కువగా చూసేవాడు. సినిమాల గురించి స్నేహితులతో ఆసక్తికరంగా చర్చించేవాడు. ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, రాయచోటి - ఎక్కడ నాటకాలు ఆడుతున్నా, ఎక్కడ సాహిత్య సభలు జరుగుతున్నా అక్కడికి తప్పక పోయేవాడు. తల్లిదండ్రులతో గడపడం బాగా తగ్గించాడు. డబ్బు అవసరాలకు మాత్రమే వారి వద్దకు వచ్చేవాడు.
మూడేళ్లు ప్రొద్దుటూరులో డిగ్రీ, మరో రెండేళ్లు కడపలో పీజీ హాస్టల్‌లో ఉండి చదివాడు. తల్లిదండ్రులు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుని, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి కొడుక్కు డబ్బు పంపించేవారు. అతనిపై వాళ్ళకున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం రాంప్రసాద్‌లో పెద్దగా ప్రభావం కలిగించినట్లు కనిపించదు. ఉదాసీనంగా వ్యవహరించేవాడు. అవసరాలకు తప్ప ఇంటికి రావడం దాదాపు మానేశాడు. వాడి చదువు కోసం ఊరిలోని కళ్లదొడ్డి అమ్మేశారు. వాడు ఎదిగి బాగుపడితే చాలు అనుకున్నారు మాధవయ్య, జానకమ్మలు.
రాంప్రసాద్ పాటలు, పద్యాలు, కథలు, కవితలు రాసేవాడు. అవి పత్రికల్లో ప్రచురించబడేవి. చిన్నచిన్న నాటికలు రాసి కాలేజీ ఫంక్షన్లలో ప్రదర్శించేవాడు. వాడి చుట్టూ ఒక ఇమేజ్‌ను పెంచుకున్నాడు. తల్లిదండ్రులు వాడి ప్రతిభకు చాలా మురిసిపోయేవాళ్ళు.
ఉన్నట్టుండి ఒక రోజు రాంప్రసాద్ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. "బాబు! చాలా మంచి చదువు చదివావు, ఇక ఒక మంచి ఉద్యోగం చూసుకుని, పెళ్లి చేసుకో నాయనా" అన్నారు తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోతూ.
"లేదు నాన్నా! నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అమ్మా! నాన్నా! నా మాటలు జాగ్రత్తగా వినండి. నాకు సినీ రంగమంటే చాలా ఇష్టం, ఆసక్తి. సినిమా రంగంలోకి పోయి డైరెక్టర్‌గా సినిమాలు తీయాలని ఉంది. నేను తప్పక అందులో విజయం సాధిస్తానని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. మీరు ఇంతవరకు నా కోసం ఎంతో చేశారు, ఎంతో కష్టపడ్డారు. ఈ ఒక్కసారి నన్ను హైదరాబాద్ పంపించండి. అక్కడ యాక్టింగ్ స్కూల్‌లో చేరి దర్శకత్వం శాఖలో శిక్షణ తీసుకుంటాను. నేను సినిమా రంగంలో తప్పక ఎదుగుతాను. మన బతుకులు బాగుపడతాయి. నన్ను హైదరాబాదుకు పంపించండి" చివరిగా తెగేసి చెప్పాడు రాంప్రసాద్.
తల్లిదండ్రులు చాలా చెప్పి చూశారు. సినిమా రంగంలో ఏ వెనుకబలం లేకుండా ఎదగడం కష్టమన్నారు. ఉద్యోగమైతే ఏ చీకూచింతా లేకుండా జీవితం కుదురుగా ఉంటుందని చెప్పి చూశారు. దానికి రాంప్రసాద్ ఏవేవో కారణాలు చెప్పాడు. అందులో అయితేనే నేను రాణిస్తాను అన్నాడు. అతని పట్టుదల చూసి సరే అన్నారు. వాడి తెలివితేటల మీద తల్లిదండ్రులకు కూడా నమ్మకం ఉంది.
అంతో ఇంతో కూడబెట్టుకున్న సొమ్మును ఖర్చుల కింద ఇచ్చి ఒక మంచి రోజు చూసి రాంప్రసాద్‌ను హైదరాబాద్ బస్సు ఎక్కించారు. తర్వాత పొలమో, ఇల్లో అమ్మి డబ్బు పంపుతామని చెప్పారు. వాడు ఎదుగుతే మమ్మల్ని చూసుకుంటాడనే నమ్మకంతో. రాంప్రసాద్ పోయిన కొద్దిరోజులకు ఊరిలోని ఇల్లు అమ్మి డబ్బు పంపారు. భార్యాభర్తలు రెండెకరాల పొలంలో చిన్న పూరిపాక వేసుకొని ఉండిపోయారు.
హైదరాబాద్‌కు పోయిన ఆరు నెలలకు ఉత్తరం రాశాడు రాంప్రసాద్. "తాను శిక్షణ పూర్తి చేసినట్లు, కథ రాసుకుని ఒక నిర్మాతకు కూడా చూపినట్లు, ఆ నిర్మాత సినిమా తీయడానికి అంగీకరించాడని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని, ఆరు నెలల తర్వాత రిలీజ్ అవుతుందని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు బాడుగ ఇంట్లో ఉండాల్సి వస్తుందని, కాబట్టి మీరు రెండెకరాల భూమిని అమ్ముకుని హైదరాబాద్ వచ్చేయండని, సినిమాలలో అవకాశాలు వచ్చేంత వరకు ఆ డబ్బును ఇంటి బాడుగకు, మన నిత్యావసరాలకు, షూటింగ్‌లకు పోవడానికి కారుకు అవసరమవుతుందని, తక్షణం భూమి అమ్ముకుని రాండి" అని రాశాడు.
మాధవయ్య, జానకమ్మలు ఆలోచించారు! "ఇక మనకు వాడే దిక్కు, దిశ. వాడు ఎక్కడ ఉంటే మనమూ అక్కడే ఉండడం సమంజసం" అనుకుని భూమిని అమ్మి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటికే అతను ఒక అందమైన భవంతిని బాడుగకు తీసుకుని ఉన్నాడు. తల్లిదండ్రులు భూమిని అమ్మగా వచ్చిన డబ్బును అతని చేతిలో పెట్టారు. రాంప్రసాద్ ఆ మరునాడే అందమైన కారును కొని ఇంటి ముందు పెట్టాడు. ఇంట్లో కళ్ళు జిగేల్మనే ఫర్నీచర్ పెట్టించాడు.
రాంప్రసాద్ చెప్పినట్లుగానే ఆరు నెలల తర్వాత వాడి డైరెక్షన్‌లో తయారైన సినిమా రిలీజై యావరేజ్‌గా ఆడింది. ఇంతలో శ్రద్ధగా మరో కథ రాసుకున్నాడు. దాన్ని మరో నిర్మాతకు చూపించి సినిమా తీయడానికి ఒప్పించాడు. అది షూటింగ్ ముగించుకుని రిలీజై హిట్టు కొట్టింది. ఇంకొక నిర్మాత రాంప్రసాద్‌కు ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చాడు. అతనికి సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఒక పేరున్న నిర్మాత ఇంటికొచ్చి నాకు ఒక సినిమా చేసిపెట్టమని అడిగాడు. చేశాడు. అది కూడా సూపర్ హిట్టై కూర్చుంది. దాని తర్వాత ఒక అగ్రశ్రేణి నిర్మాత అవకాశం ఇచ్చాడు. దాన్ని అత్యంత శ్రద్ధగా తీశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టరై మంచి పేరుప్రతిష్ఠలతోపాటు పాపులారిటీ కూడా సొంతం చేసింది. దానితో రాంప్రసాద్ అగ్రశ్రేణి దర్శకులలో ఒకడైపోయాడు. ఇంక అక్కడి నుంచి అతడి దగ్గరికి హీరోలు, నిర్మాతలు క్యూ కట్టారు. అదే సమయంలో రాంప్రసాద్ సర్వాంగ సుందరమైన ఒక భవంతిని కొన్నాడు. అందరూ అందులోకి చేరిపోయారు.
తెలుగు ఇండస్ట్రీలో రాంప్రసాద్ పేరు మారుమ్రోగిపోయింది. విజయానికి మారుపేరులా నిలిచిపోయాడు. ఒక ప్రసిద్ధ నిర్మాత పిల్లనిచ్చి, భారీగా కట్నం రాంప్రసాద్‌కు ముట్టజెప్పాడు. ఇవన్నీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. తల్లిదండ్రులు కేవలం ప్రేక్షకులే అయ్యారు. కార్లు, ఆభరణాలు, ఎనలేని సంపదతో కోడలు ఇంట్లో అడుగుపెట్టింది. మూడేళ్ల వ్యవధిలో ఒక కొడుకు, ఒక కూతురుకి జన్మనిచ్చింది. మనవడు దీక్షిత్‌ను, మనవరాలు నిషితను చూసుకుంటూ, గార్డెన్ పని, ఇంటి పని చేసుకుంటూ ఉండేవారు మాధవయ్య, జానకమ్మలు.
కాలం గడిచేకొద్దీ రాంప్రసాద్ తల్లిదండ్రుల్ని తేలికగా, చులకనగా చూడడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులతో సరిగా మాట్లాడడం మానేశాడు. ప్రతిదానికి ఛీదరించుకునేవాడు, అసహ్యించుకునేవాడు. తల్లిదండ్రులు అతని ప్రవర్తన చూసి ఎదురుపడడానికి భయపడేవాళ్ళు. ఇంట్లో ఓ మూల నక్కి బతికే పరిస్థితి దాపురించింది.
రోజురోజుకూ ఇంట్లో సందడి పెరిగిపోయింది. పాటల రచయితలు, కథా రచయితలు, నటులు, దర్శకులు, నిర్మాతలు నిత్యం సమావేశమై కథా చర్చలు సాగించేవారు.
ఒకరోజు ఇంటి హాల్లో చాలా మంది కూర్చొని తీయబోయే సినిమా కోసం కథా చర్చలు జోరుగా జరుపుతున్నారు. మాధవయ్య పంచె ఎగదోసి, సైన్ బనీను వేసుకొని గార్డెన్‌లో మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. దేని కోసమో రెండుమూడుసార్లు ఇంట్లోకి, బయటికి తిరిగాడు. కథా చర్చల్లో పాల్గొన్న ఒక వ్యక్తి
"ఎవరితను? సారికి ఇటు అటూ తిరుగుతూ కథా చర్చలకు అంతరాయం కలిగిస్తున్నాడు" అంటూ విసుక్కున్నాడు. మరొకడు "ఔను, నేనూ గమనిస్తున్నాను. ఇల్లంతా స్వేచ్ఛగా కలయ తిరుగుతున్నాడు. ఎవరై ఉంటాడు ఇతను?" మొదటివాడికి వంతపాడాడు. మిగతా వారు కూడా అతను ఎవరో చెప్పమని రాంప్రసాద్‌పై ఒత్తిడి తెచ్చారు. మాధవయ్య ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్నాడు. రాంప్రసాద్ కొద్దిసేపు తటపటాయించి
"మీరు ఉండండి, ఇప్పుడే వస్తాను" అని సరాసరి మాధవయ్య దగ్గరికొచ్చి "బుద్ధుందా నీకు? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? కుక్కిన పేనులా ఒక మూలన పడి ఉండక, మకురుపట్టి అటూఇటూ తిరుగుతూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నావు! మర్యాదగా ఒక మూలన పడి ఉండండి లేదా ఇల్లు దాటండి. అంతో ఇంతో డబ్బు మీ ముఖాన పడేస్తాను!" అని తీవ్రంగా మందలించి ఛీత్కారంగా చూశాడు.
============================================
ఇంకా వుంది
క్షమించు అమ్మా మన్నించు నాన్నా- పార్ట్ 2/3 త్వరలో
===============================================
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను




Comments