top of page

మన ఇల్లు


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Mana Illu' New Telugu Story


Written By Lakshmi Madan


రచన: లక్ష్మి మదన్


ఇల్లు అంటే ఒక అందమైన ప్రదేశం. అది గుడిసె అయినా, మేడైనా, ఇంద్ర భవనమైనా ఇల్లు ఇల్లే...


మనకంటూ ఒక ప్రశాంతతని, స్వేచ్ఛని ఇచ్చేది మన ఇల్లు మాత్రమే. ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగి వచ్చినా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనిపిస్తుంది. ఇంటికొచ్చాక తినే ఆవకాయ అన్నమో... పెరుగన్నమో ఇచ్చే ఆనందం మరిన్ని అధరువులు తిన్నా ఆ రుచి రాదేమో...


అందుకే ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు.


ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకప్పుడు మనం పుట్టి పెరిగిన ఇళ్లు తరతరాల చరిత్రకు ఆనవాళ్లుగా ఉండేవి.. తల్లిదండ్రులు, మన ముందు తరాల వాళ్ళు- పుట్టి, ఆ ఇళ్లల్లో ఆడుకొని, విద్యాబుద్ధులు నేర్చుకొని, తరలి వెళ్లేవారు,పెళ్లిళ్లు చేసుకొని లేదా ఉద్యోగరీత్యా. !


ఇక ముందు ముందు తరాలకి అలాంటి ఇళ్ళ తాలూకు జ్ఞాపకాలు ఎక్కువగా ఉండవేమో... ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఒక 10 ఏళ్లు దాంట్లో ఉన్న తర్వాత మళ్లీ మరొక కొత్త గూడు కోసం ప్రయత్నం చేసి ఇంకా మంచి లైఫ్ అంటూ వెళ్లిపోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఆనాటి మన తరం పెరిగిన ఇళ్ల జ్ఞాపకాలు ఎంతో అద్భుతం.


మా ఊళ్లో మా వీధిలో మా ఇల్లు కాస్త ఎత్తుగా ఉండేది. వీధిలో మిగతా ఇళ్లన్నీ కొంచెం క్రిందికి ఉండేవి. ఎంతో రాజసంగా ఉండే మాఇల్లు, 'ఈ వాడకట్టును చూసే బాధ్యత అంతా నాదే' అనుకునేది పాపం! చాలా మంచి మనసు. ఎందుకంటే పెంకులతో పరుచుకుని, పచ్చని చెట్ల కట్టెలతో కట్టిన చక్కని ఇల్లు..


మట్టి గోడలతో, ప్రకృతితో మమేకమైన మట్టి ఇల్లు...


ఎంత చల్లదనం ఆ ఇళ్లల్లో..


అసలు వేసవి ఎప్పుడు వచ్చిందో తెలిసేది కాదు.

చలికాలం ఎప్పుడొచ్చిందో తెలిసేది కాదు, ఒక్క వర్షా కాలం మాత్రం తెలిసేది...


ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఇంటి మధ్యలో గవాక్షం ఉండేది కదా.. దాని ద్వారా వచ్చే వానలు గచ్చులో పడి ఇల్లంతా తుంపర్లు తుంపర్లుగా నిండేది. అయినా ఎక్కువ చలి అనిపించేది కాదు... ఆ వర్షాన్ని చూస్తూ మనసాల ( మండువా)లో పడుకొని ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయా? అని ఆలోచిస్తూ అప్పుడప్పుడు మెరిసిన మెరుపులకి ఆకాశం కనబడుతుంటే నల్లని మేఘాలు కొంచెం భయం కలిగించేలా ఉరుముతుంటే ఏదో తెలియని ఆలోచనలు చుట్టుముడుతుంటే అలా చూస్తూ నిద్రలోకి జారుకున్న మధుర క్షణాలు ఎలా మరువగలం?


మా ఇంటి గోడలన్నీ చక్కగా మమ్మల్ని పొదువుకున్నట్లు అనిపించేది... ఆర్తిగా హత్తుకున్నట్టు అనిపించేది. మా సంరక్షణ అంతా తనదే అన్నట్లుగా భావించేది మా ఇల్లు. రక్త రక్తసంబంధమే గొప్పది అంటారు కదా! కానీ నాకు మా ఇల్లు, మాఇంటి పరిసరాలు, మా గొట్టమల్లె చెట్టు, మా కొబ్బరి చెట్టు, మా ఇంటి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడి, మా ఇంటి ముందు అరుగులు.. ఇవన్నీ నాతో అనుబంధం ఉన్నట్లుగానే అనిపిస్తుంది.


ఎప్పుడో నిద్రలో ఉన్నప్పుడు చప్పున మెలకువ వచ్చిందంటే మనసంతా మా ఇంటి వైపే వెళుతుంది. ఆడుకున్న స్థలాలు... భోజనం చేసిన వంటిల్లు.. ఎంతోమందికి అన్నపూర్ణగా నిలిచిన మా అందమైన ఇల్లు మదిలో మెదులుతుంది.


అతిథులకు కొదవలేదు,

బంధువులకి అడ్డం లేదు,

వచ్చి పోయేవారికి అదుపు లేదు.

అందరినీ ప్రేమతో హత్తుకున్న మా ఇల్లు. ఇంట్లో ఎన్నో యజ్ఞయాగాలు జరిగిన ఇల్లు

నోములు వ్రతాలకు కొదవలేనే లేదు.


శృంగేరి భారతీ తీర్థ స్వామి పాదం మోపిన మా గుడి లాంటి ఇల్లు! ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది.. అది 'ఇల్లు కాదు కోవెల' అని నాకు అనిపిస్తుంది.


నాయనమ్మ తన స్వహస్తాలతో ఇంటిని ఎప్పటికప్పుడు సొబగులు అద్దేది... చిన్నచిన్న రిపేర్లు ఏదైనా చేసుకోవాలంటే అందరమూ తలో చేయి వేసి బాగు చేసుకునే వాళ్ళము. పెరట్లో పూల మొక్కలు పెట్టుకున్నా... మొక్కజొన్న చేను వేసుకున్నా...

కొబ్బరి చెట్టు కాయలు కోసుకొని శ్రావణమాసం అంతా అభిషేకాలు చేసుకున్నా

అవన్నీ మా ఇంటి గొప్పతనమే!


సంవత్సరంకు ఒకసారి అనంత పద్మనాభ స్వామి వ్రతం కు తెల్లగా సున్నం పట్టించుకునేది. అంతవరకు కాస్త నల్లబడి మొహం మాడ్చుకున్న మా ఇల్లు విప్పారిన మొహంతో సంతోషంతో కనబడేది. గోడలకు అలంకరణగా జాజు పట్టీలు వేసుకొని తలుపులకు, కిటికీలకు రంగులతో విలమిలా మెరిసిపోయేది మా ఇల్లు...


ఏమి దర్జా ఒలక పోసేది? నా అంతటి వాళ్లు లేదనుకునేది.

అంత ఆనందం ....


మమ్మల్ని ఇలా ఒక్క చూపు చూసేది 'చూడు.. నేను ఎలా తయారయ్యానో' అని....


అప్పుడు మేము చెప్పే వాళ్ళము "చూడు.. పండగ రోజు మేము కొత్త డ్రెస్సులు వేసుకొని నీకన్నా మెరిసిపోతాము" అని..


అయినా తగ్గకపోయేది😄 మా ఇల్లు!

నా అంత దర్జా మీకెక్కడిదిలే అన్నట్టు కాస్త గర్వంగా చూసేది....


నిజమే! మనం ఎంత తయారైనా🏡 ఇంటికి ఉన్న దర్జా మనకి ఎక్కడిది? ఇంటి ముందు, వెనక చెట్లతో పూసిన🌱🌳 పువ్వులతో🌹🌸, ఇంటి పైనుండే కనబడే కొబ్బరి ఆకులతో, చక్కగా పరుచుకున్న పెంకులతో, ఇంటిముందు అందంగా ఉన్న అరుగులతో, చానిపి చల్లిన వాకిలితో, తీర్చిన ముగ్గులతో.. ఎంత అందంగా ఉండేదని! ఇప్పుడు ఉన్న ఇళ్లకి ఆ అందం ఎక్కడిది?


ఏమైపోయాయి ఆ ఇళ్లన్నీ? ఒక్కటి ఒక్కటిగా కనుమరుగైపోతున్నాయి. వాటి స్థానంలో కంకరతో, సిమెంటుతో కట్టిన కరకుగా మారిన మన హృదయాలలాగా ఉంటున్నాయి. మారిపోయాం కదా మనం కూడా! అప్పటి సున్నితత్వం ఇప్పుడు ఉందా..?


లేదంటే లేదు ... ఉంటే నాటి విలువలను మనం కాపాడుతాం కదా!


మొన్న ఒకసారి నేను పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి తే అక్కడ చూసిన పరిస్థితులు నన్ను కలచివేశాయి. దర్జాగా ఎత్తుగా నిలబడిన ఇల్లు ఇప్పుడు కూరుకుపోయినట్లు అనిపించింది... వీధి అంతా పెద్దపెద్ద కట్టడాలు, మేడలు, వేసిన రోడ్ల వల్ల అరుగులు పాతాళంలోకి వెళ్ళిపోయాయి. మా మెత్తటి మట్టి గోడల ఇంటి పక్కన కాంక్రీట్ బిల్డింగ్ వెలయడం వల్ల మా గోడలకి ఎంతో నొప్పి కలుగుతుంది అనిపించింది ...😢


లోపలికి వెళ్ళగానే గోడలు అన్నాయి "మెత్తటి నా ఒళ్ళంతా పక్కన ఉన్న సిమెంట్ కోడలు నొక్కిపెట్టి నొప్పికి గురి చేస్తున్నాయి అమ్మడూ" అని..


ఎంత బాధ కలిగిందో నాకు! ఒకప్పుడు మా ఇల్లు వాడలో అందరి బాధ్యత నాదే అనుకునేది. గర్వం ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు వెలిసిన బిల్డింగులు మా ఇంటిని చిన్నచూపు చూస్తున్నాయి. వాటికి అంత సున్నితమైన మనసు ఎక్కడిది? మా ఇంటి చరిత్ర వాటికి ఏం తెలుసు?


మా అరుగుల మీద ఎన్ని చర్చలు జరిగేవి !ఎంతమంది బాధలు చెప్పుకునే వాళ్ళు! సంతోషాలు పొందేవాళ్ళు !పిల్లలు ఆడుకునే వాళ్ళు! ఇవన్నీ ఎలా తెలుస్తుంది వాటికి?


ఇల్లు నాతోటి తన బాధనంతా చెప్పుకున్నట్టు అనిపించింది. అయినా కూడా ఇంట్లోకి వెళ్ళగానే ఏదో ప్రశాంతత, తెలియని ఆనందం నన్ను ముంచెత్తింది. ఆ ప్రేమలో మార్పు లేదు. అలా దగ్గరికి తీసుకున్నట్లు అనిపించింది. పారాడి పెరిగిన జ్ఞాపకాలు ఒకటొకటిగా కళ్ళ ముందు కనిపించాయి.


నేను అన్నాను "ఎవరితో మనకేంటి బంగారం? నువ్వు మమ్మల్ని చిన్నప్పటినుండి పెంచిన తల్లివి .. మాప్రేమ నీమీద తగ్గదు ఎప్పుడూ ... ఊళ్లోకి వచ్చిన ప్రతిసారి నిన్ను చూసి, నీ ప్రేమను పొంది వెళ్ళిపోతాము. నువ్వు బాధపడొద్దు. నీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి" అని చెప్పాను.


సంతోషంతో ఆనందభాష్పాలు రాల్చిన మా ఇల్లు మమ్మల్ని దీవించి పంపించింది.


అందమైన ఆ జ్ఞాపకాలు మదిలో పదిలంగా నిలిచిపోయాయి.

🌹🌹🌹🌹🌹🌹🌹

***శుభం ***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.


48 views0 comments
bottom of page