మార్పు
- Nandyala Vijaya Lakshmi

- 8 hours ago
- 4 min read

Marpu - Telugu Emotional story | Nandyala Vijaya Lakshmi
మార్పు - తెలుగు భావోద్వేగ కథ | నంద్యాల విజయలక్ష్మి
Published in manatelugukathalu.com on 20/08/2026
మార్పు అనేది కుటుంబ బంధాలు, మానవతా విలువలు, ఆప్యాయతల అసలైన ప్రాధాన్యతను తెలియజేసే హృదయస్పర్శి తెలుగు కథ. చిన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలతో పెరిగిన మయూరి, తన తల్లిదండ్రులు బంధువుల కోసం చేసే ఖర్చులు, అతిథి మర్యాదలు, దానధర్మాలను అనవసరమైనవిగా భావిస్తుంది. తన సంపాదనతో స్వేచ్ఛగా, విలాసవంతంగా జీవించాలని కోరుకుని విదేశాలకు వెళ్లిన ఆమెకు అక్కడ అనుకోని ఒంటరితనం ఎదురవుతుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తనను ప్రేమగా పలకరించే వారు, “ఇది తిను, విశ్రాంతి తీసుకో” అని ఆప్యాయంగా చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో మయూరికి కుటుంబం విలువ అర్థమవుతుంది. డబ్బు ఉన్నా ప్రేమను కొనలేమని, మనుషుల్లో లోపాలను మాత్రమే చూస్తే చివరికి మనకు తోడుగా ఎవరూ మిగలరని ఆమె తెలుసుకుంటుంది. తన తల్లిదండ్రులు, బంధుమిత్రులు చూపించిన ప్రేమను కొత్త కోణంలో అర్థం చేసుకున్న మయూరి జీవితంలో వచ్చే ఈ ఆలోచనా మార్పే కథకు ప్రధాన సందేశం.
“దగ్గరగా ఉన్నప్పుడు విలువ తెలియదు... వస్తువైనా, మనిషైనా!” అనే జీవిత సత్యాన్ని గుర్తుచేస్తూ, కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ మనసుకు హత్తుకునేలా చెబుతుంది.
మయూరికి చిన్నప్పటినుండీ స్వతంత్ర భావాలు ఎక్కువ. స్వశక్తి, బుద్ధిబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది తన నమ్మకం. సాధారణ స్త్రీలలా "ఇల్లే దేవాలయం, పతియే ప్రత్యక్ష దైవం, అతిథులే దేవతలు" అనుకుంటూ కాలం గడపడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉండటంతో ఆమె భావాలకు ఆలంబన దొరికింది. మంచి ఉద్యోగం లభించింది. అప్పటినుంచి ఆమెలో స్వార్థ చింతన పెరిగింది. "ఈ బంధువులు అనేవాళ్ళు రాబందుల లాంటివారు.
దోచుకుని తింటారు అంతే!" ఇది ఆమెకు కుటుంబ సంబంధాల గురించి ఉన్న అభిప్రాయం. తల్లిదండ్రుల అతి మంచితనం ఉపయోగించుకుని తమ అవసరాలు తీర్చుకుంటూ వచ్చేపోయే బంధువులంటే ఆమెకు చిన్నచూపు. "నా కుటుంబము - మానవతా విలువలు" అని చెప్పి ఆమె తండ్రి మాధవరావు ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించేలా చేసిన ఖర్చులు, దానధర్మాలు, అతిథి మర్యాదలు... పైగా ఆమె తల్లి మాలతి కూడా ఏమీ మాట్లాడకుండా అందరినీ ఆదరించడం, ఎప్పుడు చూసినా ఇల్లంతా సందడి, హడావుడి! ఇవన్నీ చిన్నప్పటినుండీ చూసి మయూరికి చాలా చిరాకుగా అనిపించేది.
ఎవరూ లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉండవచ్చు అనే భావనతో కుటుంబము అంటే విరక్తి వచ్చింది. వచ్చేపోయే చుట్టాలు, ఆదాయానికి మించి ఖర్చులు... దీనివలన ఏమైనా కొనుక్కుందామంటే కుదిరేది కాదు. కోరికలు అటక ఎక్కించి సన్యాసి జీవనం గడపడం దుర్భరం అనుకుంది. అన్నింటికీ మూలకారణం తల్లిదండ్రులు సొంత లాభము, అవసరాలు పక్కనపెట్టి పరుల కోసమే తమ జీవితం అనుకుంటూ అందులోనే ఆత్మానందం పొందడం.
అందుకే మయూరి వీటన్నింటికీ అతీతంగా తన సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి విదేశాల్లో ఒక మంచి ఉద్యోగానికి దరఖాస్తు పెట్టడం, తెలివైనది కనుక ఆ ఉద్యోగం ఆమెకు రావడం... తల్లి మాత్రం "పెళ్లి చేసుకుని వెళ్లు, నీకు ఒక కుటుంబం ఉండాలి" అని చెప్పింది. కానీ మయూరి ఆలోచనలో మార్పు తీసుకుని రాలేకపోయింది.
ఫలితం... మయూరి విదేశాలకు వెళ్లడం. కొన్ని నెలలు గడిచాక అనుకోకుండా తన సహోద్యోగి మోహన్‌తో పరిచయం, అది ప్రేమగా మారి కొన్ని రోజులు సహజీవనం, ఆ తర్వాత వివాహము... అలా అన్నీ జరిగాయి. ఆమె తల్లిదండ్రులుగా కొంచెం బాధపడ్డా, కూతురు సుఖంగా ఉంటే చాలు అనుకున్నారు. వారిది వర్ణాంతర వివాహము. మోహన్ కూడా పెద్దగా కుటుంబ బాధ్యతల పట్ల ఆసక్తి చూపేవాడు కాదు కనుక కొన్ని రోజులు బాగానే గడిచాయి. మోహన్ తల్లిదండ్రులు కొడుకు దగ్గర, పైగా కోడలిని చూడాలనే కోరికతో వాళ్ల దగ్గరికి వస్తామన్నారు. మయూరి ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు.
మయూరి అత్తమామగార్లు మయూరి ధోరణి నచ్చక, అక్కడ ఏమీ తోచక తిరుగుప్రయాణమయ్యారు. మోహన్‌కి ఏమీ అర్థం కాలేదు. మయూరి తనకు ఏమీ తెలియదు అంది. మోహన్‌కి కూడా ఎక్కువ సమయము వాళ్లతో గడపడం కుదరలేదు. మయూరికి ఒకరోజు ఉన్నట్టుండి కళ్లు తిరగడం, చాలా నీరసంగా అనిపించింది. ఆఫీసు మధ్యలోనే అనుమతి తీసుకుని ఇంటికి వచ్చింది.
మోహన్ ఆ రోజు ఆలస్యంగా వచ్చాడు. మయూరి పడుకోవడం చూసి ఉన్నది తిని పడుకున్నాడు. ఆ మర్నాడు మోహన్ పొద్దున్నే ఆఫీసు పని ఉందని వెళ్ళిపోయాడు. బాగా తలనొప్పి, జ్వరం... పిలిస్తే దగ్గరలో పలికేవారు కూడా లేరు. అప్పుడే మయూరి తల్లి ఫోన్ చేసింది. "హలో" అంది మయూరి. "ఏమ్మా ఎలా ఉన్నావు? ఏమన్నా తిన్నావా?" అని అడిగింది.
మయూరి రాబోయే కన్నీళ్లు ఆపుకుని "బాగానే ఉన్నా" అని చెప్పిందే కానీ, మనసులో ఏదో తెలియని బాధ! ఇదే ఇంటి దగ్గర తను ఇలా పడుకుని ఉంటే ఎంత కంగారుపడేవారు! అందరూ వచ్చి ప్రేమగా పలకరించి, ఒకరు వేడి కాఫీ, ఒకరు ఒక మాత్ర, ఒకరు అమృతాంజనము రాస్తూ "ఇది తాగు, ఇది తిను" అంటూ హడావుడి చేసేవారు. ఆ ప్రేమ ఎంత బాగుంటుంది! ఇప్పుడు పలకరించే దిక్కు లేదు. ఇన్నాళ్లూ తను ఎంత మూర్ఖంగా ఆలోచించింది! "వారు స్వార్థం కోసమే నటిస్తున్నారు" అని అపోహపడింది.
తను వచ్చేసాక నాన్నకు ప్రమాదము జరిగితే ధైర్యం చెప్పి అమ్మకు చేదోడుగా ఉన్నారు. ఆ తరవాత అమ్మకు అకస్మాత్తుగా గుండెనొప్పి వస్తే దగ్గరుండీ తినిపించేవారు. తనకు కనీసం వచ్చి చూడడానికి కూడా కుదరలేదు. అయినా అమ్మానాన్నా ఎప్పుడూ తనని ద్వేషించలేదు, కోప్పడలేదు. "కుటుంబము" అంటూ నాన్న తాపత్రయపడిన దానికి ఫలితము ఇదా? వారు చేసిన మంచే వారిని ఆదుకుంది. తనకు కావలసినంత డబ్బు ఉంది కానీ ఏమి లాభం? మోహన్‌కి ఎప్పుడూ బిజినెస్ గొడవలే, ఇలాంటి సున్నితమైన విషయాలు పట్టవు. మనుష్యులలో లోపాలు, అవకతవకలు సహజము.
కానీ లోపాలు ఎంచుకుంటూ పోతే తోడు ఎవరూ మిగలరు. మయూరికి ఇంటిదగ్గర కోలాహలము, నవ్వులూ, తగాదాలూ... అన్నీ ఉంటేనే బాగుంటుంది. పోట్లాట, ఆ తరవాత మరలా కలుసుకుని ముచ్చట్లు చెప్పుకోవడము... అదే అసలైన జీవితము. మయూరికి ఒక్కసారిగా జీవితముపైన ఆసక్తి తగ్గింది. అందులో ఆరోగ్యం కుంటుపడ్డాక బంధుమిత్రుల ప్రేమలు మరీ మరీ కావాలి అనిపించింది. దీనికి పరిష్కారము ఏమిటీ అని ఆలోచించడము మొదలుపెట్టింది. ప్రేమగా "ఇది తిను, ఇవాళ విశ్రాంతి తీసుకో" అనే వారు దగ్గర లేరు. మోహన్ కూడా ఇంటికి వచ్చేటప్పటికి నీరసంగా ఉన్న మయూరిని చూసి విసుగు అనిపించేది. ప్రేమగా అమ్మ వండి వడ్డించినప్పుడు తను ఎన్నోసార్లు విసుక్కోవడము జరిగింది. ఇప్పుడు అలా పెట్టేవాడు ఎవరు?
ముందునుంచీ మయూరి తనకు కావలసినది తినేది. మోహన్ కూడా ఆమె పెట్టాలని ఆశించేవాడు కాడు. అందుకే ఇద్దరికీ కొత్తలో బాగానే ఉందనిపించింది. కానీ ఇప్పుడు బాగా అనిపిస్తోంది... ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే బాగుండును! నాన్న తను అడగకుండా ఎన్నో కొని తెచ్చేవారు. అందుకే మోహన్‌కి ఎదుటివారి గురించి ఆలోచించడము తెలీలేదు. సరైన వేళకు ఆహారం సిద్ధంగా లేకపోవడంతో బయట తినేసి రావడం... ఇలా రానురాను ఇద్దరి మధ్య దూరం పెరిగి మమకారం తగ్గింది. ఆ రోజు అకస్మాత్తుగా "మోహన్, నీకో విషయం చెప్పాలి" అంది మయూరి.
"నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి" అన్నాడు మోహన్. "సరే ముందు నువ్వు చెప్పు... కాదు, నువ్వు చెప్పు" అంటూ ఇద్దరూ వాదించుకున్నాక, "మనము ఇండియాలో మన ఇంటికి, మనవాళ్ల దగ్గరికి వెళ్లిపోదాం" అన్నారు... ఒకేసారి! దానితో ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నారు. ఏదైనా దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు... వస్తువైనా, మనిషైనా! మారుతున్న పరిస్థితులలో కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉంటేనే మానవజాతి మనుగడకు ప్రశాంతత. మనిషి ఆలోచనలో మార్పు రావడం మంచిదే!
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను. రెండు వందలపైగా కవితలు, మూడుకథానికలు రాసాను. యాభై పైగా సర్టిఫికెట్స్, సహస్రకవిమిత్ర బిరుదు పొందాను. పుస్తకపఠనము పై నాకు ఆసక్తి. విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను. ఇంకా ఎన్నో చదవాలని కోరిక.




Comments