top of page
Writer's pictureDr Shahanaj Bathul

మట్టిలో మాణిక్యం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link


'Mattilo Manikyam' New Telugu Story


Written By Dr. Shahanaz Bathul


రచన : డా: షహనాజ్ బతుల్



నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, హాల్లో గోడ వద్ద క్రింద కూర్చొని, ఏకాగ్రతతో సీతాలు ఏదో పుస్తకం చదవటం గమనించాను.


తను నన్ను గమనించలేదు. మెల్లిగా వెళ్లి, తనకు దగ్గరగా నిల్చొని చూసాను. చందమామ చదువుతుండింది.


ఆశ్చర్యం, సంతోషము కలిగాయి. కథలు చదివేంతగా చదువు వచ్చేసిందా?

సీతాలు మా ఇంటిలో పని మనిషి. కానీ ఎప్పుడూ నేను పనిమనిషిలా చూడలేదు. అభిమానంగా, ఆప్యాయతతో చూసేదాన్ని.


తాను అందరి పనిమనిషుల్లాంటిది కాదు. ఏదీ అడగదు. ఎక్కువ పని చేసాను కాబట్టి ఎక్కువ డబ్బు లివ్వండి అని అడుగదు. పండుగ మామూళ్లు అడుగదు. పాత చీరలు అడుగదు. కానీ నేనే ఇచ్చేదాన్ని.


అడగడం నాకిష్టము ఉండదు. నేనిచ్చింది సంతోషముగా స్వీకరించాలన్నది నా అభిమతం.


ఖరీదుగల బట్టలు లేకపోయినా, శుభ్రమైన బట్టలు తొడిగేది. శుభ్రముగా పని చేస్తుండేది. ఎక్కువ గిన్నెలు పడినా, ఉతకడానికి, ఎక్కువ బట్టలు పడినా, విసుక్కునేది కాదు.

ప్రక్కింటి కామాక్షమ్మఇంటిలో పనిమనిషి ఎప్పుడైనా రాకపోయినా సీతాలు చేత పని చేయించుకునేది.


ఇంత ఇవ్వమని అడిగేది కాదు. ఎంత ఇస్తే అంత తీసుకునేది. ఇవ్వక పోయినా అడిగేది కాదు.


చదువుకున్నవాళ్ళు, వీళ్ళ గురించి, వాళ్ళు చెప్పుకోవడము, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడము, దెబ్బలాడుకోవడము చూసాను.


అటువంటి వాళ్ళు సీతాలుని చూసి, బుద్ధి తెచ్చుకోవాలి. పనిమనిషంటే, ఈ ఇంటిలో కబుర్లు ఆ ఇంటిలో కబుర్లు ఈ ఇంటిలో చెపుతుంది అనుకుంటారు.

కానీ సీతాలు ఎప్పుడూ ఒక ఇంటి కబుర్లు, మరో ఇంటిలో చెప్పదు.

తన పనేదో తాను చేసుకొని, పోతుంది. అసలు తను, పని చేస్తున్న ఇంటిలో వాళ్ళ వివరాలు పట్టించుకోదు.


నా వద్ద పుస్తకాలు చూసి, కొద్దిగా పేర్లు చదువు తుండేది. తనకి చదువు మీద శ్రద్ధ ఉంది.

"ఏమైనా చదువు కున్నావా?" అడిగాను.

"బళ్ళో మూడవ తరగతి వరకు సదువు కున్నానమ్మా" అన్నది.

"నేను చదువు చెప్తాను. చదువుకో, తర్వాత పదవ తరగతి ప్రైవేట్ గా వ్రాయవచ్చు" అన్నాను.

అప్పటినుండి నా వద్ద చదువు కుంటుంది. చదువు లో మంచి, తెలివితేటలు చూపించింది.

చాలా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఇటువంటి వాళ్ళను పైకి తీసుకు రావాలి.

రిజర్వేషన్ ఉంది కాబట్టి, ఉద్యోగం త్వరగా వస్తుంది. సీతాలు పదవ తరగతి పాస్ అయ్యాక కంప్యూటర్స్ నేర్పిస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. కనీసము డీ. టి. పి ఆపరేటర్ గా నయినా ఉద్యోగము వస్తే, నా ఆశయము నెరవేరినట్లే.

కానీ నామదిలో ఇటువంటి ఆలోచన ఉన్నట్లు చెప్పలేదు. పని అయ్యాక సర్ప్రైజ్ చెయ్యాలి. అనుకున్నాను.

"అమ్మగారు ఎంత సేపు అయ్యింది?" అడిగింది, నన్ను చూస్తూనే, లేచి, నిల్చొని. "అప్పుడే కథలు చదువ గలుగు తున్నావా? అర్థం అవుతున్నాయా?" అడిగాను.

"అవునమ్మా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నా పిల్లలకు కథలు చెప్ప గలను. "

"ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతున్నావు"

"మీ చలువే నమ్మగారు"

"నేనేమీ చేశాను సీతాలు. నీకు సహజమైన తెలివి తేటలు ఉన్నాయి. చదువు కున్నావు. "

"ముఖము కడుక్కొని, రండి. టీ చేసుకొని, వస్తాను. "

అలాగేనని ముఖము కడుక్కోడానికి వెళ్ళాను. ఇంటిలో వంట నేనే చేసుకుంటాను. కానీ ఆఫీస్ నుండి రాగానే టీ చేసి, పెడుతుంది.

తనుప్రేమతో పెట్టే టీ అంటే నా కిష్టం. అప్పుడప్పుడూ అనిపిస్తుంది. నాకు, సీతాలుకి ఏదో అవినాభావ సంబంధం ఉంది.

నేను ముఖము కడుక్కొని, బట్టలు మార్చుకొని, వచ్చేసరికి, టీ రెడీ చేసింది. *** ఆరోజు సీతాలు గిన్నెలు తోమడానికి రాలేదు. సాధారణంగా తను నాగాలు చెయ్యదు. ఒంట్లో బాగోలేక పోయినా వస్తుండేది. నేనే పంపించేసేదాన్ని. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఫోన్ చేసి, చెప్పేది.

నేనే పని చేసుకున్నాను. సీతాలు, చెప్పకుండా మానేసిందంటే, తప్పక ఏదో కారణం ఉండి ఉంటుంది. నా మనస్సు ఎందుకో కీడుని శంకిస్తుంది.

సీతాలు కి ఇద్దరు పిల్లలున్నారు అని తెలుసు. ఎప్పుడూ ఇంటి విషయాలు చెప్పలేదు.

ఎప్పుడూ సంతోషముగా చురుకుగా ఉండేది. ఆమె ను చూడాలి, అనిపించింది.


వాళ్ళింటికి, బయలు దేరాను. తలుపు దగ్గరగా వేసి, ఉన్నది.

"సీతాలూ!" బయటే నిల్చొని, పిలిచాను.

తలుపు బార్లా తెరచు కున్నది.

తలుపు ఎదురుగా చక్రాల కుర్చీ లో ఒక వ్యక్తి ఉన్నాడు.

నాకు అనుమానం కలిగింది. ఈ ఇల్లేనా? అయితే ఈ వ్యక్తి ఎవరు?

" అమ్మగారా. . రండి " ఆహ్వానించాడు ఆ వ్యక్తి.

లోపలికి అడుగు పెట్టాను. సీతాలు మంచం మీద పడుకొని, ఉంది.


"జ్వరం వచ్చిందా?" అడిగాను, దగ్గరగా వెళ్ళి.

లేవ బోయింది.

“ఫర్వాలేదు. పడుకో”, అన్నాను. కుర్చీ లో కూర్చున్నాను.

ఇల్లు రేకుల షెడ్డు. సిమెంట్ గోడలు. ఇల్లు శుభ్రంగా ఉంది. సీతాలు నుదుటి మీద చెయ్యి, వేసి, చూసాను. వేడిగా ఉంది.

"జ్వరం వచ్చిందని,నాకెందుకు చెప్పలేదు. డాక్టర్ దగ్గరకు వెళదాం పద” అన్నాను. "లేదమ్మ గారు. బిళ్ల వేసుకున్నాను. తగ్గిపోతుంది. ఈయన నా భర్త" భర్తను పరిచయం చేసింది.

వీల్ చైర్ లో ఉన్నది, సీతాలు భర్త. అతనికి ఒక కాలు మోకాలు వరకు లేదు. ఇది నాకు షాకింగ్ వార్త. నాతో ఎంత చనువు గా ఉన్నా నాతో కూడా చెప్పలేదు.

‘ఇండ్లల్లో పని చేస్తూ, భర్తకు సేవ చేస్తూ, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూన్నావా. . నువ్వు చాలా గ్రేట్ సీతాలు. ఇన్ని కష్టాలున్నా నిండు కుండ లాగా ఉంటూ, నవ్వుతూ మాట్లాడుతున్నావు’ అనుకున్నాను.

"డాక్టర్ దగ్గరికి తీసుకు వెళతాను పద"

"వద్దు అమ్మగారు"

"నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా నాతో పద" అన్నాను.

డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను. డాక్టర్ మందులు వ్రాసి, ఇచ్చారు. రక్త పరీక్షలు చేయించా లన్నారు.

"నువ్వేమీ బాధ పడ వద్దు. నీకు నేను చికిత్స చేయిస్తాను. ఎంత డబ్బయినా ఫర్వాలేదు. "

"మీకు చాలా రుణపడి పోతున్నాను. " అని చెప్పి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది.

"ఏమీ మాట్లాడకు. పద" అని చెప్పి రక్త పరీక్ష చేయించాను.

మందులు వ్రాసి, ఇచ్చారు. వాళ్ళింటికి వెళ్లి, తనను దిగబెట్టి, ఇంటికి వచ్చాను.

మరుసటి రోజు పనిలోకి వచ్చింది.

“నేను చేసు కుంటానులే. వెళ్ళి, రెస్ట్ తీసుకో” అన్నాను.

రక్త పరీక్ష లో నార్మల్ అని వచ్చింది. "వేరే ఇండ్లలో పని చేయాలి కదా అమ్మ గారూ" అని చెప్పి, పని చేసి, వెళ్ళింది. *** తర్వాత ఒకసారి అడిగాను తన భర్త కాళ్ళు ఎలా పోయాయని. తన కథ చెప్పింది.

సీతాలు రాములది మేనరికం. వాళ్లకు చిన్న వయస్సు లో పెళ్లి చేశారు. రాములు చదువు కోలేదు. బరువులు మోస్తుండేవాడు.

ప్రతి రోజు కూలీ దొరికేది కాదు. ఒక్కోరోజు కూలీ దొరకక పోతే పస్తులుండే వాళ్ళు.

వృత్తి కొరకు హైదరాబాద్ వచ్చారు. అప్పు తీసుకొని ఆటో కొన్నాడు. ప్రతి నెల అప్పుకట్టాలి. అప్పు పోగా మిగిలినది సర్దుకునే వాళ్ళు.

సీతాలు రాములది అన్యోన్య దాంపత్యం. రాము చాలా బాగా చూసుకునే వాడు. ఎటువంటి దురలవాట్లు లేవు రాములు కి. కొన్ని నెలలు సంతోషముగా ఉన్నారు.

ఆ తర్వాత ఒకరోజు రాము ఇంటికి రాగానే వాసన వచ్చింది. త్రాగి, వచ్చాడని, అర్థం చేసుకుంది. కానీ ఏమి అనలేదు. అప్పట్నుంచి త్రాగడం మొదలు పెట్టాడు.

భార్యను తిట్టడం, కొట్టడం మొదలు పెట్టాడు. మెల్లగా నచ్చ జెప్పటానికి ప్రయత్నించింది.

“నువ్వే నాకు నీతులు చెప్తావా” అంటూ జుట్టు పట్టుకొని, ఈడ్చి కొట్టాడు.

రోజూ రోజుకి పరిస్థితి దిగజారి పోతుంది. బాబు పాలు త్రాగుతున్నాడు. తనకి పాలు సరిగ్గా రావడం లేదు. డబ్బా పాలు పట్టవలసి వస్తుంది. డబ్బు సరిపోవడం లేదు.

రాము ఇంటి పరిస్థితి పట్టించుకునే వాడు కాదు. పైగా డబ్బులు కావాలని, సీతాలు నీ వేధించే వాడు. తను ఇండ్లల్లో పాచి పని చెయ్యడం మొదలు పెట్టింది. అతని లో మార్పు వస్తుందేమోనని చూసింది. అతనిలో మార్పు రాలేదు. భార్యని బాగా హింసిస్తున్నాడు.

త్రాగిన మనిషి, వివేకాన్ని, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. తానేమీ చేస్తున్నాడో తనకే తెలియదు.


ఎటువంటి మనిషి ఎలా అయిపోయాడు. సిటీకి రావడం కారణమా? స్నేహితులు కారణమా?

పల్లే లోనే బాగుండేవాడు. తన దురదృష్ట మని సరిపెట్టు కున్నది.

ఒక్కోరోజు త్రాగి రిక్షాలో పడుకునే వాడు. ఒక్కోరోజు రోడ్డు మీద పడి పోతే ఎవరో ఒకరు తెచ్చే వారు.

ఇటువంటి పరిస్థితి లోనే కూతురు పుట్టింది. పిల్లలను బాగా చదివించాలి. వాళ్ళు ఉద్యోగాలు చెయ్యాలి. అనుకున్నది.

కన్నీటిని ఇంటిలోనే సమాధి చేసుకుంది. బయట సంతోషముగా ఉండేది. తను ఏ ఏ ఇండ్లల్లో పని చేస్తుందో, అందరూ మెచ్చుకునే వారు.

తన నిజాయితీని మెచ్చుకునే వారు. ఎవరైనా అన్నం ఇస్తే, తీసుకొచ్చి, పిల్లలకు పెట్టేది.

నేను తనకి చదువు చెప్పడం వలన తనకి బలం వచ్చిందట. ఒక రోజు రాము బాగా త్రాగి, రోడ్డు మీద పడ్డాడు. ఒక లారీ అతని కాలు మీద నుండి వెళ్ళిపోయింది. కాలు విరిగి పోయింది. ఇంటి భారమంతా తనే తీసుకున్నది.

రాముత్రాగుడు మానినందుకు సంతోషించాలా? కాలు పోయినందుకు బాధ పడాలా?

పిల్లలను, భర్తను చూసుకుంటుంది. ఇండ్లల్లో పని చేస్తుంది. సీతాలు కథ విన్నాక నా కళ్ళల్లో నీళ్ళు.

"అమ్మగారు ఏడుస్తున్నారా? జరగ వలసిందేదో జరిగి పోయింది. పిల్లల్ని, పెంచాలి, చూసుకోవాలి. రాముని చూసుకోవాలి. పిల్లలు చదువు కోవాలి. ఇదే నా కర్తవ్యం. ఎవరితో నైన చెప్పితే జాలీ చూపిస్తారు. హేళనగా మాట్లాడుతారు. నిజమైన మనస్సుతో అర్థం చేసుకోరు. "

"నేను అటువంటి దాన్ననుకున్నవా సీతాలు. "

"అవకాశము రాలేదు అమ్మగారు. "

సీతాలుకి ఎలాగైనా సహాయము చెయ్యాలి అనుకున్నాను. *** నాకు ఒక బాబు. పదవ తరగతి చదువు తున్నాడు. నేను సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగము చేస్తున్నాను. సీతాలు కథ ఆయన తో చెప్పాను. ‘అలాగే సహాయము చేద్దాం’ అన్నారు.

ఆయన కూడా వేరే సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగము చేస్తున్నారు. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం భోజనం చేశాక, పడుకున్నాను.

"అమ్మగారూ". సీతాలు పిలుపుతో మంచం మీద నుండి లేచాను.

"నేను కంప్యూటర్ పరీక్ష పాస్ అయ్యాను. "

"కంగ్రాట్స్"

"థాంక్యూ అమ్మగారు. "

పదవ తరగతి కూడా పాస్ అయ్యింది. నాకు చాలా సంతోషముగా ఉంది. నేను ఒక . మంచి పని చేశా నన్న తృప్తి కలిగింది.

ఇక మిగిలింది ఉద్యోగము. ఎలాగైనా తనకు సంపాదించి పెట్టాలి. నా కొడుక్కి రికమెండేషన్ మీద ఉద్యోగము రావడము నాకిష్టం లేదు. వాడికి మెరిట్ మీదనే రావాలి. సీతాలు కొరకు రికమెండ్ చెయ్యాలి అనుకున్నాను. తనకు ఉద్యోగము ఇప్పిస్తే, నా జన్మ ధన్యం అయినట్లే. *** మా ఎం. డి ని అడిగాను.

"ఆమెను పీల్చుకొని రండి అన్నారు. రేపే రమ్మనండి. రేపే ఆర్డర్స్ టైప్ చేయించి ఇస్తాను. మీరు చెప్పారంటే మంచి క్యాండిడేట్ అయి ఉంటుంది" అన్నారు.

"థాంక్యూ సార్. " ఇంటికి వెళ్ళ గానే తనకి ఈ విషయం చెప్పాలి. నిన్న తను పనిలోకి రాలేదు ఎందుకో?

ఈ రోజు ఇంటికి వెళ్ళి తన చేతుల్తో ఇచ్చే ఆఖరి టీ త్రాగాలి. రేపట్నుంచి, ఇండ్లల్లో పని మానేస్తుంది. అనుకున్నాను.

ఇంటికి సంతోషముగా వచ్చాను. తను కనిపించలేదు. నిన్న రాలేదు. ఈ రోజు రాలేదు. జ్వరం వచ్చిందా. . ?


ఫోన్ చెయ్యకుండా తనని కలిసి, సంతోష కరమైన వార్తను చెప్పాలి అనుకున్నాను.

సీతాలు ఇంటికి బయలు దేరాను. సీతాలు ఇంటి ముందు జనం. నా మనస్సు ఏదో కీడును శంకిస్తుంది.


సీతాలు శవం!


వీల్ చైర్ లో కూర్చొని, రాము ఏడుస్తున్నాడు. వీధిలో జనం చాలా దూరంగా నిల్చున్నారు. రాము మాత్రమే తనకి దగ్గర ఉన్నాడు. పిల్లల్ని దగ్గరకు రానివ్వలేదు. పిల్లలు అమ్మా అమ్మా అని ఏడుస్తున్నారు.

"ఎలా జరిగింది?" అడిగాను.

కరోనా వచ్చిందట!


ఈ విషయము నాకు తెలియదు.


రెండు రోజులనుండి పని లోకి రాలేదు అనుకున్నాను. . నాకు కన్నీళ్లు ఆగలేదు. ఫోన్ చేసి, ఆయన్ని పిలిపించాను. దహన సంస్కారాలు దగ్గరుండి చేయించాను. ఎంతో సంతోషముగా నీకు ఉద్యోగం దొరికింది అని, చెప్పటానికి వచ్చాను.

‘ఉద్యోగం నీకు ప్రాప్తం లేదా. నీ పిల్లలను వదిలి ఎలా వెళ్ళిపోయావు సీతాలు. . ’


నాకు తెలిసిన ఫిజికల్లి హ్యాండీ క్యాప్డ్ కి ఒక ఆశ్రమం ఉంది. వాళ్లకు ఫోన్ చేశాను. రాము ని అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు. నెల నెలా డబ్బు పంపుతా నన్నాను. వాళ్ళు ఫ్రీగా చూసుకుంటా మన్నారు.


“నేను ఫోన్ చేసి, మాట్లాడుతూ ఉంటాను. పిల్లలతో మాట్లాడిస్తాను. అపుడపుడూ తీసుకు వస్తా”నని చెప్పాను.


“నీ పిల్లల్ని నేను పెంచుతాను. చదివిస్తాను. పిల్లల గురించి, బెంగ పెట్టుకో వద్ద”న్నాను.

సీతాలు దహన సంస్కారాలు అయ్యాక ఆయన రాముని ఆశ్రమము కి తీసుకొని, వెళ్ళారు.

నేను పిల్లలను తీసుకొని, ఇంటికి వచ్చాను. ఇక నుండి నాకు ముగ్గురు పిల్లలు అనుకున్నాను.

మేమందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాము. సీతాలు పిల్లలకు నెగటివ్ అని వచ్చింది. మాకు నెగటివ్ అని వచ్చింది. (సమాప్తం) &&&&&&&&&&&&&

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం : నా వివరములు:

నేనుబి.ఎస్సీ వరకు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) లో చదివాను. ఎం. ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం లో చదివాను. గణితము లో రీసెర్చ్, ఐ.ఐ. టి (ఖరగ్ పూర్ ) లో చేసాను. జె. యెన్.టి.యు.హెచ్ (హైదరాబాద్) లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసాను.

1980 నవంబర్ దీపావళి సంచిక వనిత, మాస పత్రిక లో మొదటి వ్యాసం ప్రచురింప బడింది. వ్యాసాలూ, కుట్లు అల్లికలు, వాల్ డెకొరేషన్ పీసెస్, గ్రీటింగ్ కార్డ్స్, తయారు చేయడం, వంటలు, కవితలు, కథలు ప్రచురింప బడ్డాయి. 2000 తర్వాత చాలా కాలం వ్రాయలేదు. మళ్ళీ 2021 నుండి ప్రతిలిపిలో చాలా వ్రాసాను. 160 దాకా కథలు, చాలా వ్యాసాలూ, నాన్ ఫిక్షన్, కవితలు చాలా వ్రాసాను.

చాలా సార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.

ఒక సాటి 10 భాగముల సీరియల్ కి బహుమతి వచ్చింది. ఒక సారి డైరీ కి బహుమతి వచ్చింది. ఒక సారి వేరే ఆన్లైన్ వీక్లీ లో ఒక కథ కు బహుమతి వచ్చింది.


షహనాజ్ బతుల్


98 views2 comments

2 Comments


Ramakuru LakshmiManikyamba • 1 month ago

సీతాలు కథ tragedy గా end అవడం బాధాకరం అనిపించింది..చాలా బాగా రాశారు కథ, కధనం బాగున్నాయి

Like

అయ్యో, చివరికి సీతాలు చనిపోయింది అంటే చాలా బాధ కలిగింది. ఒక్కోసారి ఏమిటో మన ప్రయత్నాలు కలిసి రావని అనిపిస్తుంది. ఇక్కడే మనకి అర్థం కానిదేదో దాగుందన్న సత్యం బోధపడుతుంది. పోనీలెండి, ఆమె భర్త ఆశ్రమానికి చేరడం, పిల్లలు అనాధలు కాకుండా ఉండటం సంతోషించాల్సిన విషయం.🌷🙏

Like
bottom of page