top of page
Original.png

మెరుపు


మెరుపు – తెలుగు పద్యసాహిత్యంలో కవి ఆలోచనకు ప్రతీకగా మెరిసే కాంతి

Merupu - Telugu Inspirational Article | Bhattu Venkata Rao

మెరుపు తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 26/08/2026


మనసు ఆహ్లాదకరమైన భావనలతో నిండిన క్షణాలలో, ఒక కవికి ఒక అందమైన ఆలోచన మెరుపులా మనసులో మెదులుతుంది. కవి అయిన కారణంగా ఆ ఆలోచనను భద్రంగా మనసులో దాచుకుని, సందర్భం వచ్చినప్పుడు, ఒక పద్యంగా మలుస్తాడు. 


అప్పుడు ఆ ఆలోచనలోని స్వచ్ఛత, కూర్చబడిన పద్యంలోకి కూడా ప్రసరించి, ఆ పద్యాన్ని మొదటిసారిగా చదివినవాళ్ళకు, విన్నవాళ్ళకు, అప్పుడే విరిసిన పువ్వు పరిమళాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. 


తెలుగు పద్య సాహిత్యంలో సముద్రమంతగా ఉన్న పద్యరాశిలో, మళ్ళీ ఎక్కడా మనకు ఆ కవి అందమైన ఊహ పునరావృతమై కనిపించకపోవడం వలన, ఆ ఆలోచనలోని స్వచ్ఛత ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించడంలో సఫలీకృతమవుతుంది. 


సాధారణంగా పద్యసాహిత్యంలో అలంకారాలకు, శ్లేషలకు సంబంధించిన కొన్ని పోలికలు, ఉత్ప్రేక్షలు పండితలోకంలో ఎంతగానో ప్రసిద్ధమై ఉండి, అవే చాలా చోట్ల కొత్త మాటలలో పునరావృతమై కావ్యాలలో కనిపించే నేపథ్యంలో, ఏదైనా ఒక కొత్త సంగతి కనపడగానే, ఆ కొత్త సంగతికి సంబంధించిన భావం, హృదయానికి ఎంతో హాయినిచ్చి మంచి అనుభూతిని మిగుల్చుతుంది.


ఏదైనా ఒక కొత్త విషయం చెప్పేటప్పుడు, ఆ చెప్పే విషయం చివరన మెరిసే ‘మెరుపు’లో చాలా బలం ఉంటుంది. పద్యంలో, అంటే కేవలం నాలుగు పాదాల నిడివిలో, ఈ మెరుపును సాధించడం ఒక కళ. సీస పద్యంలో అయితే ఆ నిడివి రెట్టింపౌతుంది. అతి తక్కువ నిడివి దొరికేది కంద పద్యంలో. 64 మాత్రల నిడివి కందపద్యానిది. అక్షరాల సంఖ్యలో చూసుకుంటే ఈ సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. 


మిగతా పద్యాలతో పోలిస్తే పద్యం చెప్పే కవికి సీస పద్యంలో కాస్త ఎక్కువ చోటు దొరుకుతుంది. ఇప్పుడు ఈ విషయం వ్రాయడానికి కారణమైన పద్యం సీసపద్యమే.


సీ. మునులపాలిటివాఁడ వనుట కాదిని నీవు సవరించు యజ్ఞరక్షణమె సాక్షి

యతిపావనుఁడ వౌట కలయహల్యాపాషాణరాశి ద్రోచిన పాదరజమె సాక్షి

భువనాధికుఁడవౌట కవిరతోద్ధతి శూలివిలు దళించిన బాహుబలమె సాక్షి

యఘటనప్రఘటనోద్యముఁడ వౌటకు ఱాలు నీటిపైఁ దేలించు నేర్పె సాక్షి,


తే. యఖిలజీవేశ్వరుఁడవైనయందులకును,

 వనచరులచేతఁ దగుపనుల్ గొనుటె సాక్షి,

 యట్టినీ కేము దీవింప నీప్రతాప

 మీయశముఁ గల్గె ననుమాట కేమి సాక్షి.


శ్రీరాముడి గురించి అగస్త్యాది మహామునులు మాట్లాడిన మాటలు ఈ పద్యం. ఒక వరుసగా శ్రీరాముడి ప్రతిభావంతమైన పనులను గురించి కీర్తిస్తూ చెప్పిన మాటలు ఇవి. 


ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క ముఖ్యమైన ఘటనను ఉదాహరిస్తూ సాగుతుంది పద్యం. మొదటిపాదంలో - విశ్వామిత్రునితో వెళ్ళి యాగసంరక్షణచేసి తాటకిని సంహరించిన ఘటనలో శ్రీరాముడు ఎల్లప్పుడూ మహర్షుల పక్షం వహించేవాడనడానికి ఆ చర్య సాక్ష్యంగా నిలుస్తుంది అని కీర్తించడం; 


రెండవపాదంలో - ఎన్నో ఏళ్ళుగా చలనం లేకుండా పడివున్న అహల్యను, మళ్ళీ మామూలు మనిషిగా చేసిన ఘటనలో, శ్రీరాముడి పవిత్రతకు, పావనత్వానికి అది సాక్ష్యంగా నిలుస్తుంది అని కీర్తించడం; 


మూడవపాదంలో - అఖిలభువనాలలో అత్యంత శక్తివంతుడు శ్రీరాముడు అని నిరూపణకు, సీతాస్వయంవరంలో శివుని విల్లు విదళించడమనే మహత్తరమైన ఘటనే సాక్షి అని గొప్పగా చెప్పడం; నాల్గవపాదంలో - సంభవంకానిదని భావించే పనిని సంభవమయ్యేలా చేయగలిగే అసమాన్యమైన ప్రతిభకు, అలౌకిక శక్తికీ, సముద్రంపై వారధిని నిర్మించే క్రమంలో, నీళ్ళపై రాళ్ళను తేలియాడేలా చేయగలగడమనే ఘటన సాక్షి అనడం; 


అలా కీర్తిస్తూ వచ్చి, ఇంత మహత్తరమైన కార్యాన్ని కూడా, ఒకచోట క్షణం నిలకడగా ఉండనటువంటి వనచరములచేతనే ఆ పని చేయించగలగడం అనేది సకలజీవకోటికీ శ్రీరాముడు ఈశ్వరుని యంతటివాడే సుమా! అని తెలియజేయడానికి తిరుగులేని సాక్ష్యం అని చెప్పి... పద్యంలో మిగిలిన చివరి రెండు పాదాలలో అసలు మెరుపు మెరిపించాడు కవి. 


'అయ్యా శ్రీరామా, ఇన్నిటికీ ఇన్ని తిరుగులేని సాక్ష్యాలు ఎదురుగానే ఉన్నాయి గాబట్టి, ఎవరికైనా వేరే మాటాడేందుకు ఏముంటుంది? ఏమీ ఉండదు. అన్నిటినీ మారుమాటాడక ఒప్పుకోవలసిందే! 


అయితే, ‘ఈ ప్రతాపాతిశయం, మానవాతీతమైన ప్రతిభ, అంతా మా దీవనల ఫలితమే సుమా!’ అని అమాయకంగా, అత్యంత వినయంగా నీవు మమ్మల్ని పెద్ద చేసి మాట్లాడుతున్న మాటలకు ఏది సాక్షి?' అని శ్రీరాముడికి అగస్త్యాది మహామునులు సంధించిన చమత్కారయుతమైన ప్రశ్నతో చివరన అసలైన మెరుపు మెరిపించి పద్యాన్ని ముగించాడు కవి. ఉన్నతమైన, అత్యద్భుతమైన ఆలోచనతో కూడుకున్న భావన ఇది అని అనిపించకుండా ఉండగలదా?


కంకంటి పాపరాజు రచించిన ‘ఉత్తరరామాయణం’ ప్రథమాశ్వాసంలోనిది ఈ పద్యం. ఈ పద్యానికి ముందు పద్యాలలో"భవదాశీర్మధువైభవంబునఁ గదా ప్రాప్తించు మాదృగ్భుజాభవదావంబు..." అని శ్రీరాముడు, తనను చూడడానికి వచ్చిన అగస్త్య, కణ్వాదిమహర్షులను కీర్తిస్తూ, అన్న మాటలు (మీ ఆశీర్వచనం అనే కమ్మటి వైభవం వలననే కదా నాకు ఈ శక్తిసామర్ధ్యాలు ప్రాప్తమైనాయి - అని ఆ మాటల అర్ధం) ఈ పద్యానికి కారకం. 



భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page