top of page
Original.png

మౌనం


ఫోన్లో వచ్చిన మెసేజీలవంక చూస్తూ డయాగ్నాస్టిక్ సెంటర్లోకి అడుగుపెట్టాడు చక్రవర్తి.
ఫోన్లో వచ్చిన మెసేజీలవంక చూస్తూ డయాగ్నాస్టిక్ సెంటర్లోకి అడుగుపెట్టాడు చక్రవర్తి.

Mounam -Telugu Inspirational Story | G. S. S. Kalyani

మౌనం - తెలుగు ప్రేరణాత్మక కథ |G. S. S. కళ్యాణి

Published in manatelugukathalu.com on 16/05/2026

ఈ కథ మన రోజువారీ జీవితంలో ఉన్న సమస్యలకు ఒక సరళమైన కానీ శక్తివంతమైన పరిష్కారం చూపిస్తుంది — “మౌనం”.


ఫోన్లో వచ్చిన మెసేజీలవంక చూస్తూ డయాగ్నాస్టిక్ సెంటర్లోకి అడుగుపెట్టాడు చక్రవర్తి.

"చెప్పండి సర్?", చక్రవర్తిని మర్యాదగా అడిగింది రిసెప్షనిస్ట్ ఇందిర.


"నేను బ్లడ్ టెస్టులు చేయించుకోవాలమ్మా…", అంటూ తన ఫోనును ఇందిరకి చూపించాడు చక్రవర్తి.


అందులో చక్రవర్తికి డాక్టర్ పంపిన ఈమెయిల్ చూసి, "సరే సార్! వెయిటింగ్ రూంలో కూర్చోండి. నర్సు పిలుస్తుంది", చెప్పింది ఇందిర.


వెయిటింగ్ రూంలోకి వెళ్ళాడు చక్రవర్తి. ఆరోజు వర్కింగ్ డే కావడంతో అక్కడ దాదాపు అన్ని కుర్చీలూ ఖాళీగా ఉన్నాయి. 


వెయిటింగ్ రూంలో కూర్చున్నవారిలో తనతోపాటూ ఉద్యోగం చేసి రిటైరైన తన చిన్ననాటి స్నేహితుడు పురుషోత్తంను చూసి గుర్తుపట్టి , "ఏరా పురుషోత్తం! బాగున్నావా??", అంటూ పలకరించాడు చక్రవర్తి.


పురుషోత్తం పలకరింపుగా నవ్వి బానే ఉన్నట్లు సైగ చేశాడు.

"ఏమిటీ విషయం? నువ్వు కూడా నాలాగా టెస్టులకొచ్చావా?", అడిగాడు చక్రవర్తి.


అవునన్నట్లు తల ఊపాడు పురుషోత్తం.


"ప్రాబ్లం ఏంటీ? ఏ పరీక్షలు చేయించుకుంటున్నావ్?", అడిగాడు చక్రవర్తి.


పురుషోత్తం తన జేబులోంచీ ఒక కాగితమూ, పెన్నూ తీసి , 'సమస్యలేమీ లేవు. ఏడాదికోసారి ఇలా చెకప్ చేయించుకుంటానంతే', అని రాసి చూపించాడు.


"ఏమిటీ రాసి చూపిస్తున్నావ్? మాట్లాడడానికేమైందీ?", ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి.


‘నేను ఇవాళ మౌన వ్రతం’, మళ్ళీ రాసి చూపించాడు పురుషోత్తం.


అది చూసి చక్రవర్తి పగలబడి నవ్వుతూ, "నువ్వేంట్రా?? ఆడవాళ్లలాగా మౌనవ్రతం చేస్తున్నావ్? వృద్ధాప్యంలో ఇలాంటివి నీకు అవసరమా?", అన్నాడు.


అందుకు పురుషోత్తం చిన్న చిరునవ్వుని సమాధానంగా ఇచ్చి సరిపెట్టాడు.

కొన్నిరోజుల తర్వాత మార్నింగ్ వాక్ కు వెడుతున్న చక్రవర్తికి పురుషోత్తం ఎదురయ్యాడు.


"ఒరేయ్ పురుషోత్తం! ఎలా ఉన్నావ్?”, పురుషోత్తంని పలకరించాడు చక్రవర్తి.


"బానే ఉన్నాను", సమాధానమిచ్చాడు పురుషోత్తం.


“టెస్ట్ రిపోర్టులు ఎలా వచ్చాయ్?", అడిగాడు చక్రవర్తి. 


“అన్నీ బానే ఉన్నాయి. ఇంతకీ నీ సంగతేంటీ?", అడిగాడు పురుషోత్తం.


"నా రిపోర్టులు కూడా వచ్చాయిరా! నాకు గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మానసిక ఆందోళన తగ్గించుకుంటే మంచిదని చెప్పారు డాక్టర్", నీరసంగా అన్నాడు చక్రవర్తి.


"అదేవిట్రా?! రిటైరైపోయావు కాబట్టి నీకు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలేవీ లేవు. జీవితంలో తీరని బాధలు కూడా నాకు తెలిసీ నీకు ఏమీ లేవు. మరి ఆందోళన ఎందుకూ?", అడిగాడు పురుషోత్తం.


"ఏం చెప్పమంటావురా! రోజంతా ఇంట్లో ఉండేసరికి మా అవిడతో ఎప్పుడూ ఏదో ఒక గొడవ వచ్చి పడుతూ ఉంటుంది. కాలక్షేపంకోసం కబుర్లు చెప్పుకోవడంతో మొదలయ్యే మా సంభాషణ పెద్ద యుద్ధంతో ముగుస్తుంది. ఆఫీసు ఉన్న రోజుల్లో జీవితం హడావుడిగా సాగిపోయేది. ఇప్పుడు చెయ్యడానికి పనిలేక ఏం చెయ్యాలో తోచక నేను ప్రతి క్షణం సతమతమైపోతున్నాను.


ఇదే విషయం మా పిల్లలతో అంటే మావాడు నాకో స్మార్ట్ ఫోన్ కొనిపెట్టి, అందులో ఏవేవో గేములూ, సోషల్ మీడియా యాప్ లూ పెట్టి ఇచ్చాడు. దానివంక కాసేపు చూస్తే రెండుగంటలు ఇట్టే గడిచిపోయినట్లనిపిస్తాయి. ఎవరెవరో పెట్టిన పోస్టులూ, మెసేజీలూ అవసరమున్నా లేకపోయినా కాలక్షేపంకోసం చదువుతూ ఉంటాను. కొందరికి కామెంట్లు కూడా పెడుతూ ఉంటాను. సోషల్ మీడియా ద్వారా నాకు తెలియని చాలామందితో కొత్తగా పరిచయం ఏర్పడింది.


అయినా మనసులో ఏదో వెలితి! ఇంకెవరో నాతో మాట్లాడాలనీ, నేను పెట్టిన పోస్టులు అందరూ చూడాలనీ, నా కామెంట్లకు జనం స్పందించాలనీ నా మనసు అదేపనిగా ఆరాటపడుతూనే ఉంటుంది. ఈ ఆధునిక సాంకేతికతతో మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయని అందరూ అంటూ ఉంటారు. నాకు మాత్రం దానివల్ల పెద్ద ఇబ్బందొకటి వచ్చిందిరా పురుషోత్తం.


మా పిల్లలు ఉద్యోగాలని వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళు ప్రతిరోజూ పొద్దున్నా, మధ్యాహ్నం, రాత్రీ ఫోన్లు చేస్తారు. ఏ కారణంచేతనో వాళ్ళనుండీ రావలసిన సమయానికి ఫోన్లు రాకపోతే నాకూ, మా ఆవిడకీ కాళ్ళూ చేతులూ ఆడవ్! నా ఆందోళనకు ఇలాంటివన్నీ కారణాలు", అంటూ తన బాధనంతా వెళ్ళగక్కాడు చక్రవర్తి.


పురుషోత్తం ఆప్యాయంగా చక్రవర్తి భుజం పైన చెయ్యి వేసి, "ఒరేయ్ చక్రవర్తీ! నువ్వు చెప్పిన మొదటి సమస్య మీ ఆవిడతో గొడవ. ఇలా చూడూ...! ఆడవాళ్ళు మనకోసం జీవితాంతం కష్టపడతారురా. వయసు పెరిగేకొద్దీ వాళ్ళకు శారీరకంగా వచ్చే మార్పువల్ల త్వరగా అలిసిపోయి సహనం నశిస్తూ ఉంటుంది. మానసికంగానూ ఏవో మార్పులు రావచ్చు. నువ్వే అర్థం చేసుకుని సహనంతో ఉండాలి.


ఇక నీ మాటలనుబట్టి నీ రెండో సమస్య ఈ ఆధునిక సాంకేతికతను అవసరానికి మించి వాడటంవల్ల వచ్చింది. ఇక్కడ నువ్వు ఒక్క విషయం గ్రహించాలి. స్మార్ట్ ఫోనుతో నువ్వు ఎన్ని గంటలు గడిపినా నిజంగా ఒక మనిషితో మనసువిప్పి మాట్లాడితే వచ్చే మానసిక ప్రశాంతత నీకు ఆ ఫోనువల్ల కలగదు. అసలే కుదురులేని మన మనసు ఆన్లైన్ లో వస్తున్న విషయాల గురించి అతిగా ఆలోచించి అల్లకల్లోలమైపోతోంది. దానివల్ల ఈమధ్య మానసిక ఆందోళన అనేది అందరిలోనూ విపరీతంగా పెరిగిపోతోంది!", అన్నాడు పురుషోత్తం.


"మరి దీనికి పరిష్కారమేమిటంటావ్?", అడిగాడు చక్రవర్తి.


"ఒక్కటే పరిష్కారం. అదే మౌనం!", చిన్నగా నవ్వుతూ చెప్పాడు పురుషోత్తం. ఆశ్చర్యపోయాడు చక్రవర్తి.


"అవును! మౌనానికి చాలా శక్తి ఉంది. మీ ఆవిడతో గొడవ మొదలయ్యేలా ఉందన్నప్పుడు ఈసారి మౌనంగా ఉండి ఏం జరుగుతుందో చూడు! అలాగే ప్రతిరోజూ ఒక్క పది నిమిషాలు ఫోను పక్కనపెట్టేసి కళ్ళు మూసుకుని నీ మనసుని ఏ ఆలోచనలూ లేకుండా నిలిపి చూడు! మౌనం ఎంత శక్తివంతమైనదో నీకే అర్థమవుతుంది. నేనా శక్తి అనుభవించాను కాబట్టే వారానికోరోజు మౌనవ్రతం పాటిస్తున్నాను. నాకు ఆరోగ్యసమస్యలు లేకపోవడానికీ, నా మనసు ప్రశాంతంగా ఉంచుకోగలగడానికీ కారణం అదే!", అన్నాడు పురుషోత్తం.


"సరేరా! నా ఆరోగ్యసమస్యలకి మౌనం మంచి మందు అని అంటావ్. అంతేగా? నువ్వు నా మంచిని కోరే మిత్రుడివి కాబట్టి నీ మాట వింటాను. మౌనం అనే మందుని నేనూ ప్రయత్నించి చూస్తాను", అన్నాడు చక్రవర్తి.


రెండునెలల గడిచాయి. ఓరోజు బజారులో మళ్ళీ పురుషోత్తంకి ఎదురుపడ్డాడు చక్రవర్తి.

"ఏరా చక్రవర్తీ! ఏమిటీ విషయం? ఆరోగ్యం ఎలా ఉందీ?", అడిగాడు పురుషోత్తం.


చక్రవర్తి ఒక కాగితం తీసి, ‘నేనివాళ మాట్లాడను. రేపు ఫోన్ చేస్తా. అప్పుడు మాట్లాడుకుందాం", అని రాసి చూపించాడు.


కాగితం చూసిన పురుషోత్తం ఆశ్చర్యపోతూ, "ఓహో! నువ్వు కూడా మౌనవ్రతంలో ఉన్నావన్నమాట! మంచిది. రేపే మాట్లాడుకుందాంరా!", అన్నాడు నవ్వుతూ.


మర్నాడు చక్రవర్తి పురుషోత్తంకు ఫోన్ చేసి, "ఒరేయ్ పురుషోత్తం! మౌనంగా ఉండమని నువ్వు ఇచ్చిన సలహా అద్భుతంగా పనిచేసిందిరా! ఇప్పుడు మా ఆవిడతో గొడవలే లేవు. అందమైన మా అనుబంధం మరింత దృఢంగా నిలబడింది. ప్రతిరోజూ ఫోనుని కాసేపు దూరంగా పెట్టి, నువ్వు చెప్పినట్లు కళ్ళు మూసుకుని మనసుని నియంత్రించ డానికి ప్రయత్నిస్తూ ధ్యానం చేస్తున్నాను. దానివల్ల ‘ఇన్నర్ కాంనెస్’ అంటే ఏమిటో నాకు బాగా అర్థమయ్యిందిరా.


నా లోపలి మౌనం నా మనసుకు ఎంతో ప్రశాంతతనూ, హాయినీ ఇస్తోంది. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడింది. బీపీ అదుపులో ఉంటోంది. ఇంతకీ ఈ మౌనంలో ఉన్న శక్తిని ఎలా కనుక్కున్నావ్? మౌనస్వామిలాంటి యోగులనుండీ స్ఫూర్తిని పొందావా?”, అని అడిగాడు. 


అందుకు పురుషోత్తం, "మనకు గురువులుగా ఉన్న ఎందరో మహనీయులు మౌనానికున్న విలువను అనేకమార్లు మనకు చెప్పారు. వారిలో కొందరు తమ జీవితమంతా మౌనంగా ఉండి మనోనిగ్రహానికి మౌనం ఎంత ముఖ్యమో ఆచరించి మరీ చూపించారు. కానీ నాకు మౌనానికున్న శక్తేమిటో చూపించినది ఎవరో తెలుసా? అది నా మనవరాలు రాధిక!!


ఓసారి రాధిక అడిగిన బొమ్మ కొనివ్వలేదని అది నాతో మాట్లాడటం మానేసింది. అప్పుడు దాని ముద్దుమాటలు వినాలని నా మనసు ఎంతో కొట్టుకుపోయింది. రాధిక బుంగమూతి పెట్టుకుని కూర్చున్నంతసేపూ నాకేమీ తోచలేదు. కాసేపు మాటలన్నీ ఆపేసి కేవలం మౌనంతో తనకు ఆ బొమ్మ ఎంతగా కావాలో స్పష్టంగా చెప్పగలిగింది మా రాధిక. అప్పుడర్థమైంది! కొన్ని సందర్భాల్లో మౌనాన్ని ఆశ్రయించి మనకు కావలసినదాన్ని కష్టపడకుండా సాధించొచ్చన్న సంగతి!", అన్నాడు.


అంతా విన్న చక్రవర్తి, “నిజమేరా! ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు మన పెద్దలు. మంచి ఆరోగ్యం కావాలని అందరూ కోరుకుంటారు. దానికోసం సులువైన మార్గాలు కూడా వెతుకుతూ ఉంటారు. మౌనాన్ని ఆశ్రయించి మనకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని కష్టపడకుండా సాధించొచ్చన్నది అక్షరాలా నిజం! శారీరక ఆరోగ్యమూ, మానసిక ఆరోగ్యమూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సమాజంలో అనేక కారణాలవల్ల వస్తున్న మార్పులు మానసిక ఆశాంతిని కలిగించి, మనుషుల మధ్య మనస్పర్థలు వచ్చేలా చేస్తున్నాయి. సోషల్ మీడియా మన జీవితాల్లో భాగమైపోయింది.


అందులో అందే సమాచారానికి అంతమనేదే లేదు! ఆరోజు నువ్వన్నట్లు ఈ సోషల్ మీడియాద్వారా కావలసిన విషయాలతోపాటూ మనకు అవసరంలేని విషయాలు కూడా చాలా తెలుస్తున్నాయి. అనవసరమైన ఆలోచనలతో మనసు తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అదే మానసిక ఆందోళనకు కారణమవుతోంది. శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తున్న ఈ ఆందోళన అనే సమస్యకు తిరుగులేని పరిష్కారం మౌనం అని నీవల్ల తెలుసుకోగలిగాను”, అన్నాడు. 


"అదీ అసలు సంగతి! మౌనాన్ని పాటించి ఆలోచనలను నియంత్రిస్తే మనసు నిర్మలమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శారీరక ఆరోగ్యం చాలావరకూ కుదుట పడుతుంది. ఈనాటి మానసిక ఆందోళనలకు మౌనమే మంచి మందు. అందుకు మన మెడికల్ రిపోర్టులే సాక్ష్యం!", అన్నాడు పురుషోత్తం.


"మౌనం - ఎ గ్రేట్ మెడిసిన్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట! ఈ మందు గురించి నాకు తెలిసినవాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నానురా", అన్నాడు చక్రవర్తి.

"చెప్పు! కానీ సాధ్యమైనంత మౌనంగా ఉండటం మర్చిపోకు!", అన్నాడు పురుషోత్తం నవ్వుతూ.

 

సమాప్తం. 


*****


G. S. S. కళ్యాణి  గారి కొన్ని ఇతర రచనలు:


G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





bottom of page