డ్రగ్ - ది లైఫ్ బగ్
డ్రగ్, ది లైఫ్ బగ్, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, యువత, విద్యార్థులు, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, అవగాహన కథ, తెలుగు కథ

Drug - The Life Bug - Telugu Emotional Social Story | Venku Sanatani
డ్రగ్ - ది లైఫ్ బగ్ - తెలుగు భావోద్వేగ సామాజిక కథ | వెంకు సనాతని
Published In manatelugukathalu.com on 27/07/2026
మాదకద్రవ్యాలు ఒక్క వ్యక్తినే కాదు... ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును, ఒక సమాజాన్ని నాశనం చేస్తాయి. "డ్రగ్ (ది లైఫ్ బగ్)" కథలో ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ చెప్పిన నిజజీవిత కేసు ద్వారా డ్రగ్స్ యువత జీవితాలను ఎలా చీకట్లోకి నెడుతున్నాయో, తల్లిదండ్రుల బాధ్యత ఎంత ముఖ్యమో, అవగాహన ఎంత అవసరమో హృదయాన్ని కదిలించేలా తెలియజేశారు. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి తప్పక చదవాల్సిన సామాజిక చైతన్య కథ.
“వెల్కమ్ టు ప్రైడ్ సీరీస్!
ఈ ప్రైడ్ సీరీస్‌లో భాగంగా వారం వారం.. ప్రత్యేకంగా ఆదివారం ఎంతో మంది ప్రముఖుల్ని నేనూ నా టీం ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారు సాధించిన విజయాలు, సరిచేసిన జీవితాలు, ఎదురైన సవాళ్ళు ఇలాంటి ఎన్నో అనుభవాలు ఎంతో మంది ఈ కార్యక్రమం ద్వారా పంచుకుంటున్నారు.
ఈ వారం మన గెస్ట్ వచ్చేసి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ గారు. 2005 బ్యాచ్. నమస్కారం సార్!" అంటూ సాదర స్వాగతాన్ని తెలియజేశాడు యాంకర్ మయూక్.
"నమస్కారం అండి!" ప్రతి స్పందనగా నవ్వుతూ పలికాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్.
“వృత్తి రీత్యా మీరు ఇన్‌స్పెక్టర్ అయినప్పటికీ, గొప్ప వక్త కూడా అన్న విషయం అందరికీ విదితమే. మీ వాగ్ధాటి చాలా మీటింగ్స్‌లో చూశాం. ఒకపక్క ఊపిరి సలపని ఇన్వెస్టిగేషన్స్ చేస్తూనే మరోపక్క స్కూల్స్, కాలేజ్ మీటింగ్స్‌కి తప్పకుండా అటెండ్ అవుతారని తెలిసింది.
చెప్పండి సార్... స్కూల్స్, కాలేజ్ మీటింగ్స్‌కే ఎందుకని ఎక్కువగా హాజరవుతారు, అందుకు గల ముఖ్య కారణమేమిటో ఈ కార్యక్రమం ద్వారా నేనూ, మా ప్రేక్షకులూ తెలుసుకోవాలనుకుంటున్నాం.” అన్నాడు యాంకర్ మయూక్ కుతూహలంతో.
“ముందుగా ప్రైడ్ సీరీస్ ప్రేక్షకులకు నమస్కారం. పోలీస్ జాబ్ అంటేనే అనేక రకాలైన సవాళ్ళతో కూడుకున్నది. మోస్ట్ టఫెస్ట్ జాబ్. షాకింగ్ విషయం ఏంటంటే, నేను ఇన్వెస్టిగేషన్ చేసిన చాలా కేసుల్లో నిందితులుగా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. రాష్ డ్రైవింగ్, డ్రగ్స్, రేప్ అండ్ మర్డర్, చైన్ స్నాచింగ్ ఇలా ఎన్నో కేసుల్లో ‘దే ఆర్ అక్యూజ్డ్!’ అభివృద్ధి పథంలో నడవాల్సిన యువతే జీవితాల్ని అంధకారం చేసుకుంటున్నారని ఆ విషయం గురించి నేను చాలా బాధపడ్డాను. మదనపడ్డాను.
నా కాలేజ్ డేస్‌లో, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు సమాజంలో జరుగుతున్న దారుణాల గురించి, మారణాల గురించి ఎన్నో సెమినార్లు ఇచ్చాను. ‘యాంటీ సోషల్ యాక్టివిటీస్’ జరగకుండా లా అండ్ ఆర్డర్ ఎంత ముఖ్యమో, అవి పునరావృతం కాకుండా సరైన అవగాహన కొరకు కౌన్సిలింగ్ కూడా అంతే ముఖ్యమని భావించాను. దురాగతాలు, దురాచారాలు జరగకూడదని భావించి వీలు కుదిరినప్పుడల్లా స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి సెమినార్లు ఇవ్వడం ప్రారంభించాను.
పాఠశాలలు, కళాశాలలే ఎందుకని అంటే, భావి భారత పౌరులు భాసించడం మొదలయ్యేది అక్కడి నుండే కాబట్టి, వారిని తీర్చిదిద్దే విషయంలో నా వంతు బాధ్యతగా వాటిని ఎంపిక చేసుకున్నాను. నా ప్రసంగాల పట్ల చాలా మంది ఆకర్షితులయ్యారు. అలాగే అందులో కొంతమంది నడక, నడత మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
“వాస్తవంగా చెప్పాలంటే, అందరికీ ఖాకీ బట్టలంటే కాఠిన్యం, లాఠీన్యం మాత్రమే కనిపిస్తాయి. కానీ మాకు కారుణ్యం కూడా ఉంటుంది. వివిధ సందర్భాల్లో అది వ్యక్తమవుతున్నా దాన్నెవరూ పట్టించుకోరు!” అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని చిరుమందహాసంతో తెలియజేశాడు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్.
చివరి విషయానికి అవునన్నట్టుగా తలూపాడు యాంకర్ మయూక్.
యాంకర్ కొనసాగిస్తూ, “ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన కేస్ లేదా బాధించిన కేస్ ఏమైనా ఉన్నదా?” అని అడిగాడు.
“ఇబ్బంది పెట్టిన కేసులు కాదుకానండీ, బాధించిన కేసులు చాలానే ఉన్నాయి.” అంటూ...
ప్రస్తుతం ఉన్న సమస్యల్లో “వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇష్యూ డ్రగ్స్.” యువతనే టార్గెట్ చేసుకుని రాష్ట్రీయంగా, జాతీయంగా కోట్లల్లో వ్యాపారం జరుగుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. ‘హౌ టు హ్యాండిల్’ అనే విషయం మీద న్యూ ఇన్నోవేషన్స్ కూడా స్టడీ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తరహాలోనే డ్రగ్ టెస్ట్ చేస్తున్నాం. ‘డ్రగ్ అనలైజర్ కిట్స్’ ఉపయోగించి క్షణాల్లో పాజిటివ్ ఆర్ నెగటివ్ అన్నది తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నాం.
"డ్రగ్ అడిక్టైన ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ కేస్ గురించి వివరిస్తాను." చెప్పడం మొదలుపెట్టాడు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్.
తండ్రి శేఖర్ ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశాడు. ప్రభుత్వోద్యోగిగా ప్రజలకు సేవలందించాడు. తల్లి సంధ్య బీఏ పాసైంది. గృహిణిగానే స్థిరపడింది. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో నివాసం. వీరికి విక్రమ్ ఒక్కగానొక్క కొడుకు.
ఐదేళ్ళ క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం, శేఖర్ ని శాశ్వతంగా చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కుటుంబాన్ని రోడ్డున పడేసినంత పని చేసింది. సంధ్య పచ్చళ్ళ వ్యాపారంతో కుటుంబ భారాన్ని తన భుజాలపై మోస్తుందిప్పుడు. సంధ్యకు సహకరిస్తున్నాడు శేఖర్. కొడుకును ఎంబీబీఎస్ చదివిస్తూ, సంపాదనలో అధిక భాగం కొడుక్కే ఖర్చు చేస్తూ, ఉన్నదానితో సర్దుకుపోతూ, ధైర్యంతో, సడలని స్థైర్యంతో ముందుకు సాగుతున్నారు భార్యాభర్తలు.
ఇవి ఫ్యామిలీ డీటెయిల్స్, కేస్ విషయానికి వస్తే –
***
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం!
మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం ఎక్కువయిందని, మత్తుకు బానిసై భవితను కోల్పోతున్న యువత సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని, ఒళ్ళు తెలియక చేసే వికృత చేష్టలకు ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, ఈ విపరీత చర్యను వీలైనంత త్వరగా అణచివేయాలని జిల్లా పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే నిర్మానుష్య ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగు జాగ్రత్త వహించాలని సూచన చేశారు డీజీపీ.
హాల్లో కూర్చుని టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు శేఖర్, సంధ్య. న్యూస్లో కిలోల కొద్దీ గంజాయి, డ్రగ్స్ పట్టుబడిన వీడియోలను చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరూ.
“అమ్మో! అంతా!” అంటూ నోరెళ్ళబెట్టింది సంధ్య.
“ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత డ్రగ్స్ పట్టుబడినా ఏదో మూల ఈ నార్కోటిక్ బిజినెస్ జరుగుతూనే ఉంది. ఇది సమాజానికీ, దేశానికీ చాలా ప్రమాదం!” అన్నాడు శేఖర్ తీక్షణంగా టీవీ చూస్తూ.
“ఇవి తీసుకునే రాస్కెల్స్ పిశాచాల్లా పైనబడి ఎంతో మందిని బలి తీసుకుంటున్నారు” న్యూస్ చూస్తూనే తిడుతుంది సంధ్య.
“మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్ పట్టుకున్నారట. నిన్నటికి నిన్న గుజరాత్లో, అక్కడ కూడా ఐదు వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారట. ఇవేనా! పట్టుబడుతున్న హెరాయిన్, గంజాయి ఇతరత్రా మాదకద్రవ్యాల లిస్టు చాలానే ఉంది” సంధ్యతో అన్నాడు శేఖర్.
“వేల కోట్లా..! వామ్మో..! చాప కింద నీరులా వ్యాపిస్తుందీ మాదక మహమ్మారి! ఇది ఇలానే కొనసాగితే అంతర్గతంగా జరుగుతున్న వ్యాపారం భవిష్యత్తులో బహిరంగంగా జరిగే అవకాశం లేకపోలేదు, ఊహించుకుంటేనే భయమేస్తుంది!” అంది సంధ్య.
“బయటి దొంగల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా, ఇంటి దొంగల్ని పట్టడమే కష్టమైన పని! అదే పనిలో ఉన్నారు అధికారులు” అన్నాడు శేఖర్.
“ఇంటి దొంగలా...!” అనుమానంగా అంది సంధ్య.
“ఆ... ఇంటి దొంగలే! వివరంగా చెప్పాలంటే, ఎక్కడో గంజాయి పంట మరెక్కడో వ్యాపారం ఇది ఎలా సాధ్యం!” కళ్ళెగరేశాడు శేఖర్.
చిన్నా చితకా షాపుల ముసుగులో కోట్లల్లో వ్యాపారం జరుగుతుందని కనుగొన్నారు. పట్టుకుంటున్నారు కూడా. స్థావరాలు మారుతున్నాయి కానీ మత్తు పదార్థాల దందా అయితే ఆగడం లేదు! కాగడాలు పట్టి మరీ జరిగే ఆగడాలూ ఆగడం లేదు. ఇందంతా ఇంటి దొంగల పనే!
“ఎంత మందినని అనుమానిస్తారు. మంచిని ముసుగేసుకుని, మాదకద్రవ్యాల సంచిని బొడ్లో దోపుకుని ఏమీ తెలియనట్లు అందరి మధ్య తిరుగుతూ వ్యాపారం చేసే వాళ్ళు, అవి తీసుకుని నీచంగా వ్యవహరించే వాళ్ళు ఇలా చాలా మంది సమాజానికి చీడ పట్టినట్టు పట్టారు.
అమ్మేవాళ్ళకు కొనేవాళ్ళకు మధ్య అవినాభావ సంబంధం ఎలాంటిదంటే ఆ వ్యాపారం వాళ్ళకు తప్ప మూడో కంటికి తెలియనంత!” అన్నాడు శేఖర్.
” అలాగని, తెలియకుండా ఎంతకాలం ఉంటుంది. ఎప్పటికైనా తెలియాల్సిందే!” అంది సంధ్య.
“పోలీసులు హెచ్చరించినట్లుగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి!” అనాలోచితంగా అన్నాడు శేఖర్.
“అలాగని మన అబ్బాయిని అనుమానిస్తారంటారా ఏంటి?” అంది సంధ్య భృకుటి ముడి వేస్తూ..
“ఛ! మన అబ్బాయి అలాంటి పనులు చేస్తాడా! చస్తే చేయడు!! అన్నాడు శేఖర్ కొడుకు మీద ఉన్న నమ్మకంతో.
“అన్నట్టూ... టైమ్ పది అవుతుంది! విక్కీ ఇంకా రాలేదు. నీతో ఏమైనా చెప్పాడా...!” అన్నాడు శేఖర్ సంధ్యతో.
“ఏవో కంబైన్డ్ స్టడీస్ అంటండీ! వెళ్ళేప్పుడే అన్నాడు రావడానికి ఆలస్యం అవుతుందని!”,
“వాడీ మధ్య చాలా బాగా కష్టపడుతున్నాడండీ!” అంది సంధ్య.
“తప్పదు మరి! వాడు చదివేది ఎంబీబీఎస్, ఆ మాత్రం కష్టపడాలి. ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్లు మన అబ్బాయి కూడా మెడిసిన్‌లో ప్రబుద్ధుడైతే అంతకంటే కావాల్సిందేముంటుంది” ఆకాంక్షను వెలిబుచ్చాడు శేఖర్.
తథాస్తు.. అంటూ చిరునవ్వుతో వంట గదిలోకి వెళ్ళింది సంధ్య.
విక్కీ నుండి ఫోన్ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు శేఖర్.
“ఆ.. విక్కీ వస్తున్నావా..!” అన్నాడు శేఖర్.
డాడీ..! అంటూ బిగ్గరగా ఏడ్చాడు విక్కీ.
విక్కీ..! ఏమైంది నాన్నా, ఎందుకేడుస్తున్నావ్? అన్నాడు శేఖర్ కంగారుపడుతూ.
శేఖర్ మాటలకు వంట గదిలో నుండి పరిగెత్తుకొచ్చింది సంధ్య. “ఏంటండీ ఏమైంది విక్కీకి?” అంది సంధ్య కూడా కంగారుపడుతూ. “ఒక్క నిమిషం ఉండు!” ఆగమన్నట్లుగా చెయ్యి చూపిస్తూ సంధ్యతో అన్నాడు శేఖర్.
“నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు డాడీ!”
“పోలీసులా...!” అంటూ కళ్ళు పెద్దవి చేశాడు శేఖర్. భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది సంధ్య.
“డాడీ..! మీరు అర్జెంట్గా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి రండి డాడీ..!” ఏడుస్తూ ఫోన్ కట్ చేశాడు విక్కీ.
“విక్కీని పోలీసులు అరెస్ట్ చేశారట! హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు!” సంధ్యతో అన్నాడు శేఖర్.
“మన అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటండీ! నాకు భయంగా ఉందండీ!” అంటూ ఏడుస్తుంది సంధ్య.
“ఊరుకో సంధ్యా... ఏడవకు! మనబ్బాయికి ఏం కాదు! ముందు మనం స్టేషన్ కి వెళ్తే అన్నీ విషయాలు తెలుస్తాయి” భార్యను ఓదార్చాడు శేఖర్.
ఉరుకుల పరుగుల మీద పోలీస్ స్టేషన్ చేరుకున్నారు శేఖర్, సంధ్య.
స్టేషన్ లోపలికి వస్తూనే,
"మా అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారు?",
"ఏమైంది సర్? ఏం చేశాడని మా అబ్బాయిని అరెస్ట్ చేశారు." అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సంధ్య, శేఖర్ ఒక్కసారిగా.
అక్కడే ఉన్న కొడుకు విక్కీని చూసి, “నాన్నా.. నీకేం కాలేదుగా!” అంటూ విక్కీని దగ్గరకు తీసుకుని విలపించింది సంధ్య.
"సర్, మీరెవరనుకొని తీసుకొచ్చారో..! మా వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది." అన్నాడు శేఖర్ ఇన్‌స్పెక్టర్ తో.
"పొరపాటే జరిగింది! చిన్నాచితకా పొరపాటు కాదు. మీ వాడు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు" అన్నాడు ఇన్‌స్పెక్టర్.
“డ్రగ్సా..!!” ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు శేఖర్, సంధ్య.
“వీడు డ్రగ్స్ తీసుకోవడమేంటండీ! నాకంతా అయోమయంగా ఉందండీ! అంది సంధ్య కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ.
“నువ్వూరుకో” సంధ్యను సముదాయించాడు శేఖర్.
కొడుకు వైపు చూసి, "విక్కీ! ఏంట్రా ఇదంతా! చెప్పరా... సార్ చెప్పేదంతా నిజమేనా..!" గదమాయించాడు శేఖర్.
“నిజం కాకపోతే మీ వాడ్ని అరెస్ట్ చేయడం మాకేమన్నా సరదానా!” అన్నాడు కానిస్టేబుల్ కల్పించుకుని.
“నువ్వుండు!” అంటూ కానిస్టేబుల్ ని ఆగమన్నట్టు చేయి చూపించాడు ఇన్‌స్పెక్టర్.
“పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడ్డం లేదనుకుంటుంది. మీ సుపుత్రుడు విక్రమ్ అలియాస్ విక్కీ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ప్రాణాంతకమైన వైట్ కొకైన్, లిక్విడ్ గంజాయి సేవించడమే కాకుండా ఆ మత్తులో ఒక అమ్మాయిని రేప్ అటెంప్ట్ కూడా చేశాడు.
ఆ అమ్మాయి తప్పించుకుని వచ్చి వెంటనే కంప్లయింట్ ఇవ్వడంతో హుటాహుటిన స్పాట్ కి వెళ్ళి పట్టుకున్నాం. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం.
ఇతను తీసుకున్న టూ నార్కోటిక్స్ మోర్ డేంజరస్! ముఖ్యంగా లిక్విడ్ గంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకెనాబినోల్(THC) అనే రసాయనిక పదార్థం వలన వారిపై వారికి ఆధీనం కోల్పోయి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు." అంటూ స్పాట్‌లో దొరికిన డ్రగ్స్ సంబంధిత ఆధారాలను శేఖర్ సంధ్యలకు చూపించాడు ఇన్‌స్పెక్టర్.
ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ కేసు గురించి వివరించడంతో శేఖర్ సంధ్యలకు నోట మాట రాలేదు. ఒక్కసారిగా స్థాణువులైపోయారు. బిక్కముఖం వేశాడు విక్కీ.
“విక్కీ..! ఏమీ ఎరగనట్టు అలా మూగ మొద్దులా నిలబడ్డావేంట్రా...! నా తాహతుకు మించిందని తెలిసినా నిన్ను ఎంబీబీఎస్ లో జాయిన్ చేశాను. డాక్టరువై ప్రాణాలు పోసి పేరు తెస్తావనుకుంటే ఇలాంటి నీచపు పనుల్తో సమాజానికి ప్రమాదకారిగా మారతావని కలలో కూడా అనుకోలేదురా! కాళ్ళు చచ్చుబడి కుర్చీకే పరిమితమైన ఈ అవిటి తండ్రినంట్రా నువ్వు మోసం చేసేది” కన్నీటి పర్యంతం అయ్యాడు శేఖర్.
“ఒరేయ్! నువ్వు మనిషివా...! పశువ్వా...! నిన్నేనంట్రా నా కడుపున మోసింది! నీకేం తక్కువ చేశాంరా! నీ గురించి ఎన్నో కలలుకంటున్న మాకు నువ్విచ్చే బహుమానం ఇదట్రా..! ఈ విషయం బయటకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా... భగవంతుడా!” అంటూ బోరున విలపించింది సంధ్య.
“మీరిప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. మత్తు పదార్థాల వాడకం పెద్దమొత్తంలో జరుగుతుందని రోజూ నెత్తీ నోరూ బాదుకుంటున్నాం, పోలీసులుగా మా బాధ్యత మేం నిర్వర్తిస్తున్నాం, త్తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు గమనించండి అని మేమంటే, వాళ్ళని అనుమానిస్తే అవమానించినట్లేనని అదేదో బూతులాగా ఫీల్ అవుతున్నారు. తీరా పరిస్థితి చేదాటిన తర్వాత ఎన్ని నీతి వాక్యాలు చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు!”
“జస్ట్, జస్ట్ టేస్ట్ కోసం మొదలుపెట్టి డ్రగ్స్‌కి అడిక్టై లైఫుని వేస్ట్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కేసెస్ ఎన్నో! ఆ కేసుల్లో కూడా యూత్ పర్సంటేజే ఎక్కువగా ఉందంటే మీరు నమ్ముతారా...!
తమ గోల్, రోల్ మర్చిపోయి మరీ మత్తుకు బానిసై వీడి లాంటి వాళ్ళు చేసే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. తెలిసి తెలిసి చేసే తప్పులివన్నీ. వీళ్ళు బలవ్వడమే కాక, ఆ మైకంలో ఇతరుల్ని బలి చేస్తున్నారు. వావి వరసలు మరచిపోయి, వ్యక్తి ధర్మాన్ని పక్కన పెట్టి సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు!”
“నిప్పు కాలుతుందని తెలిసి కూడా పట్టుకోవడం మన తప్పే! చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అలవాటైతే శిక్షలు, శిక్షణలే అనివార్యం అవుతాయి. మంచీ చెడూ అన్నీ తెలిసిన యువతే పెడదోవ పడితే దేశం పరిస్థితి ఏం కావాలి!” అంటూ మాదక ద్రవ్యాల గురించి వాటి వలన జరుగుతున్న అనర్థాల గురించి పూస గుచ్చినట్టు వివరించాడు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్.
కొద్దిపాటి నిశ్శబ్దం తర్వాత, శేఖర్ సంధ్యల ముందే డ్రగ్స్ అలవాటు గురించి అనేక ప్రశ్నలు సంధిస్తూ విక్కీని ఆరా తీస్తాడు ఇన్‌స్పెక్టర్.
“నాకు తెలియకుండానే నేను డ్రగ్స్ కి అలవాటు పడ్డాను. ఫుల్లీ అడిక్ట్ అయిపోయాను. ఎంత కాదనుకున్నా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడిని. డ్రగ్స్ తీసుకోని రోజు చచ్చిపోవాలనిపించేది. ఇంట్లో ఇచ్చే డబ్బులు చాలక అప్పులు చేసేవాడిని. అవీ చాలక దొంగతనాలు కూడా మొదలుపెట్టాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడిని.
తీరా.. డ్రగ్స్ ఊబిలో పూర్తిగా కూరుకుపోయాను. భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసిన వారిలో నేనూ ఒకడిని. ఆ ప్రతిజ్ఞని విస్మరించాను. నా చదువు, నా జీవితం, నా కుటుంబం అన్నీ... అన్నీ మరచి దుర్వ్యసనాలను ప్రోత్సహించాను.
తల్లిదండ్రుల ఆశల్ని మసి చేశాను.
ఆఖరికి నా లైఫ్ ని నేనే స్పాయిల్ చేసుకున్నాను. టోటల్లీ ఐ డిడ్ స్పాయిల్ మై లైఫ్. నాలా ఎవ్వరూ కాకూడదు! నాలా ఎవ్వరూ కాకూడదు!!” వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నచోటనే కూలబడ్డాడు విక్కీ.
కొడుకుని ఆ విధంగా చూసిన శేఖర్ సంధ్యల కళ్ళు సజలాలయ్యాయి.
“డ్రగ్స్‌కి బానిసైన మీ అబ్బాయిని డీ-ఎడిక్షన్ సెంటరుకు పంపిస్తాం! కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. చేసిన తప్పులకు సెక్షన్ల వారీగా శిక్షలు మాత్రం తప్పనిసరి!” తదుపరి కార్యాచరణ ఉన్నదున్నట్టు తెలియజేశాడు ఇన్‌స్పెక్టర్.
***
“ఒక్క శేఖర్ కుటుంబం మాత్రమే కాదు మయూక్ గారూ, మాదక ద్రవ్యాల బారినపడి ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. చదువుకునే యువతే చెడిపోతే సమాజ స్థితిగతులు ఏం కావాలి. ఉక్కు కండరాలు కలిగిన నలుగురు యువకులు చాలన్న పెద్దల మాటను పెడచెవిన పెట్టి పెడదోవ పట్టిన యువత మారితేనే దేశం భవిత మారుతుంది.
మనమందరం మన దేశాన్ని అధిక యువతను కలిగిన దేశమని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ దేహల్ని మత్తుకు బానిస చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్!!’ అన్న మహానుభావుల మాటలకు గట్టి మేలు తలపెట్టేలా… యువత మత్తు వదలాలి. వదిలించాలి. గర్జించాలి. పర్జన్య శంఖం పూరించాలి.
యువతే! దేశాన్ని నడిపించాలి. యువతే! దేశానికై నడుమొంచాలి. యువతే! పెచ్చుమీరుతున్న మత్తు పదార్థాల పీచమణచాలి. యువతే! దేశపు ఆశల్ని, ఆశయాల్ని సాధించాలి. భావితరాలకు ఆదర్శంగా నిలవాలి.
యువతే! నవ సమాజపు నిర్మాణానికి నాందీ గీతం కావాలి. “YOUTH THE POWER OF NATION, THEY CAN CREATE SENSATION”, కేస్ గురించి చెప్పడమే కాకుండా యువత లక్ష్యాల్ని తెలియజేశాడు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్.
“విన్నారు కదండీ, వృత్తి పరంగా ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ గారికి ఎదురైన అనుభవాలు. అక్షర సత్యమైన, ఆదర్శనీయమైన ప్రసాద్ గారి మాటలు ఆచరణ యోగ్యమైనవి, కావున యువత తెలుసుకుంటారని, ఆ విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ... వచ్చే వారం మరొక గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. ఈ వారం ప్రైడ్ సీరీస్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.” ముగించాడు యాంకర్ మయూక్.
వెంకు సనాతని గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వెంకు సనాతని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
పేరు : వెంకు సనాతని
అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత
ఊరు : బాపట్ల
జిల్లా : గుంటూరు
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్











Comments