ఆడపిల్ల
- Venku Sanathani
- 2 minutes ago
- 6 min read
ఆడపిల్ల, వెంకు సనాతని, తెలుగు కథ, ఆడశిశువు, గర్భంలో ఆడపిల్ల, స్త్రీ సమానత్వం, మహిళా సాధికారత, తల్లి ప్రేమ, మహిళా శక్తి, గాయని జానకి, సామాజిక అవగాహన, తెలుగు సాహిత్యం, కుటుంబ కథ, ప్రేరణాత్మక కథ, Mana Telugu Kathalu

Adapilla - Telugu Emotional Family Story | Venku Sanathani
ఆడపిల్ల - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | వెంకు సనాతని
Published In manatelugukathalu.com on 22/07/2026
ఆడపిల్ల పుట్టడం పండుగ కావాల్సిన సమాజంలో, ఇంకా కొన్నిచోట్ల ఆమె పుట్టుకే ప్రశ్నార్థకంగా మారుతున్న వాస్తవాన్ని హృదయ విదారకంగా ఆవిష్కరించే కథ "ఆడపిల్ల". గర్భంలో ఉన్న బిడ్డను కాపాడేందుకు ఒక తల్లి చేసిన పోరాటం, ఆడపిల్ల విలువను గుర్తించని మనస్తత్వంపై ఆమె చేసిన ప్రశ్నలు, చివరికి అదే ఆడపిల్ల దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన గాయనిగా ఎదిగిన ప్రయాణం ప్రతి పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. స్త్రీ శక్తి, మాతృత్వం, సమానత్వం గురించి బలమైన సందేశాన్ని అందించే అద్భుత కథ ఇది.
“అమ్మా.. బయల్దేరావా..!”
“హ, ఇప్పుడే రైలెక్కానే! శ్రీను మామయ్యే దగ్గరుండి ఎక్కించి వెళ్ళాడు.”
“సరే, ఏమైనా తిన్నావా?”
“ఆ! తిన్నాను. వద్దంటే సులోచన అత్త ఊరుకుంటుందా? కొసరి మరీ వడ్డించింది. అన్నట్టూ నీకిష్టమైన పూర్ణాలు కూడా చేసి పంపుతుందే మీ అత్త.”
“అయ్! అత్త వంటల్లో పూర్ణాలు నా ఫేవరెట్, అది తెలిసే పంపుతున్నట్టుంది.”
“ఒక్క పూర్ణాలేమిటే, వంటలన్నీ అద్భుతంగా చేస్తుంది! మనమంటే ఎంత ప్రేమో దానికి, పిచ్చి పిల్ల.”
“అవునమ్మా.. కల్మషం లేని ప్రేమ అత్తది!”
“ఉమ్.. నువ్వూ రజిత ఏం చేసుకున్నారు ఈ పూట?”
“రజిత ఊరు నుండి వస్తూ పచ్చళ్ళు తెచ్చిందమ్మా! ఈ పూటకు వాటితో సరిపెట్టాం. నువ్వెటూ వస్తున్నావుగా, రేపటి నుండి వారం రోజులు ఎంచక్కా నీ చేతి వంట తింటాం. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. కాదు నెలలే..!!” జానకి గొంతులో బెంగను గమనించింది భువనేశ్వరి.
“జానకీ..!”
“ఊమ్..”
“అమ్మను బాగా మిస్సవుతున్నావు కదూ!”
“మిస్సవరా మరి! నా దగ్గరకు వచ్చేయమ్మా అంటే వినవు.”
“ఓ ఆర్నెల్లు ఓపిక పట్టరా.. మా అమ్మ కదూ.. ఆ తర్వాత అంతా నీతోనేగా ఉండేది.”
“సరే, ఉంటాను. ఉదయం స్టేషనుకు వచ్చి పికప్ చేసుకుంటాను.”
“అలాగే.”
కాల్ కట్ చేసి ఫోన్ హ్యాండ్ బ్యాగులో పెట్టుకుంది భువనేశ్వరి. ఎయిర్ పిల్లోలో గాలి ఊది తలగడను ఏర్పాటు చేసుకుని, హ్యాండ్ బ్యాగ్ పిల్లో క్రింద పెట్టుకుని నడుం వాల్చింది. సులోచన కడుపునిండా పెట్టేసరికి కంటినిండా నిద్రపట్టింది భువనేశ్వరికి. రైలు కుదుపులకు ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు.
మరుసటి రోజు సాయంత్రం చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో తన కూతురు జానకి గాన కచేరీ ఉండటంతో ముందురోజు రాత్రి హైదారాబాద్ ఎక్స్ ప్రెస్ లో బాపట్ల నుండి హైదరాబాదుకు బయలుదేరింది భువనేశ్వరి.
సరిగ్గా సంవత్సరం క్రితం జానకి నేపథ్య గానం చేసిన చిత్రం విడుదలై విజయవంతమైంది. అందులో తాను పాడిన రెండు పాటలు చాలా ప్రాచుర్యం పొందటంతో తన గాత్రానికి మంచి మార్కులే పడ్డాయి.
ఆ తర్వాత అవకాశాలు వరుసగా క్యూ కట్టడం, అనతికాలంలోనే జూనియర్ జానకిగా పేరు ప్రఖ్యాతలు సాధించడం, సరస్వతీ అనుగ్రహ ప్రవాహమైంది జీవితం. జానకి ఈరోజు ఒక ప్రముఖ గాయని. కానీ తన పుట్టుకే ప్రశ్నార్థకమైంది ఒకప్పుడు.
*****
“భవానీ శంకర్ గారూ, మీరు ఊహించినట్టుగానే అయ్యింది! మీ భార్య కడుపులో పెరుగుతున్నది అక్షరాలా ఆడపిల్లే!” ఉన్నదున్నట్టు చెప్పింది డాక్టర్ స్వరూపారాణి.
“చేసేదేముంది, తీసేయండి!!” కటువుగా అన్నాడు భవానీశంకర్.
“ఏంటండీ! అంత సింపుల్ గా చెప్పారు! మీరూ నేనూ అనుకుంటే సరిపోదు. ఇందుకు మీ భార్య అనుమతి కూడా కావాలి” అంది డాక్టర్.
“పోషించేది నేనైతే! దీనికి దాని పర్మిషన్ దేనికి?” అన్నాడు అహంభావాన్ని ప్రదర్శిస్తూ.
“గర్భం తీయించుకోవాల్సింది తను కాబట్టి, ఆమె ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది” నిర్మొహమాటంగా అంది డాక్టర్.
భవానీ శంకర్ వెక్కిరింపుగా నవ్వుతూ, “ది గ్రేట్ గైనకాలజీ డాక్టర్! సర్వీస్ లో సో మెనీ ఇల్లీగల్ అబార్షన్స్! ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంది” అన్నాడు.
“చూడండీ..! మనం చేసేది ఇల్లీగల్ అబార్షన్ అని గుర్తుంచుకోండి. మామూలుగా అబార్షన్ జరిగితే హెల్త్ ఇష్యూ అంటూ ఓ వంద కారణాలు చెప్పొచ్చు, కానీ ఇల్లీగల్ అబార్షన్ కి ఒకే ఒక్క కారణం ‘ఆడపిల్ల!’
అబార్షన్ దాకా దేవుడెరుగు, ‘జెండర్ డెటెర్మినేషన్ టెస్ట్’ అంటే తెలుసు కదా, ‘లింగ నిర్ధారణ పరీక్ష’ అది కూడా తప్పే. ఏదైనా తేడా జరిగితే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది” అంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ.
భార్య భువనేశ్వరి గురించి హేళనగా మాట్లాడుతూ, “దాని మొహం, దానికంత సీన్ లేదు” అన్నాడు.
“మీరు ఎన్నైనా చెప్పండి సార్, ఆమె అంగీకారం తప్పనిసరి” నొక్కి చెప్పింది డాక్టర్ స్వరూపారాణి.
కొద్దిపాటి నిట్టూర్పుతో మందుల చీటీ తీసుకుని బయటకు వచ్చాడు భవానీశంకర్. వచ్చీరావడంతోనే “డాక్టర్ ఏం చెప్పారండీ!” ఆతృతగా అడిగింది భువనేశ్వరి. “చెప్తాను” ఆగమన్నట్టుగా సైగ చేశాడు.
ఆసుపత్రి నుండి ఇంటికి బయలుదేరారు ఇద్దరూ. మగ పిల్లవాడు పుడతాడు, వంశాన్ని ఉద్ధరిస్తాడనుకుంటే, ఛ! ఆడపిల్ల!! డాక్టర్ నోట ఈ మాట విన్నప్పటి నుండి జీర్ణించుకోలేకపోతున్నాడు భవానీశంకర్.
“అబార్షన్ కి దీని బోడి పర్మిషన్ కూడా కావాలట!” భువనేశ్వరి వైపు చూసి ముఖం చిట్లించుకుని కారు వేగం పెంచాడు.
ఇంట్లోకొచ్చి సోఫాలో తలపట్టుకుని కూర్చున్న భర్తను చూసిన భువనేశ్వరి కంగారుపడింది. “డాక్టర్ ఏం చెప్పారండీ!” అంది భువనేశ్వరి.
భవానీ శంకర్ వైపు నుండి సమాధానం రాలేదు. భర్త మౌనానికి కారణమేమిటో తెలియక అయోమయంలో పడింది. ఉండబట్టలేక భర్తను మళ్ళీ అడిగింది. “ఏమైందండీ! హాస్పిటల్ లో డాక్టరుతో మాట్లాడొచ్చినప్పటి నుండి గమనిస్తున్నా, మీరదోలా ఉన్నారు. ఎందుకలా ఉన్నారు?” మళ్ళీ అదే ప్రశ్న.
అయినా సమాధానం రాలేదు తనకి. సహనం నశించిన భువనేశ్వరి, “ఏమైందని అడుగుతుంటే అలా తలపట్టుకు కూర్చుంటారేంటి? కడుపులో బిడ్డకేమైనా ప్రమాదమా?” గట్టిగా అంది.
“కడుపులో బిడ్డకేం ప్రమాదం లేదు. అది బయటకొస్తేనే ప్రమాదం” అన్నాడు.
భర్త వైపు అర్థం కానట్టు చూసింది భువనేశ్వరి.
“నీ కడుపులో పెరుగుతున్నది ఆడపిల్లంట!” అన్నాడు భవానీ శంకర్ చిరాగ్గా.
“అవునా...! ఎంత మంచి విషయం చెప్పారండీ, అయినా సంతోషించాల్సిన విషయం అలా చిరాగ్గా చెప్తారేం...!” అంటూ ముఖమంతా నవ్వును నింపుకుని ఆనందపడుతూ ఆగి, భర్త వైఖరిపై అనుమానం కలగడంతో “నా గర్భంలోని శిశువు ఆడా! మగా! అన్నది మీకెలా తెలుసు?” అడిగింది భువనేశ్వరి.
“నేనే పరీక్ష చేయించాను” అన్నాడు.
“మీరా...! ఎందుకు?” అంది భృకుటి ముడివేస్తూ. భవానీశంకర్ వైపు నుండి మౌనమే సమాధానమైంది మరలా.
“అయినా లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరం కదా! ఆ విషయం తెలిసి కూడా ఏ ఉద్దేశంతో మీరు ఆ పరీక్ష చేయించారు?” భర్త భవానీశంకరును నిలదీసింది భువనేశ్వరి.
“నాకు ఆడపిల్ల వద్దు! మగ పిల్లాడు కావాలి!! తీయించేసుకో...!” కుండబద్దలు కొట్టి చెప్పాడు.
భర్త సమాధానానికి నివ్వెరపోయింది భువనేశ్వరి. “ఆపండీ...!” అంటూ గట్టిగా అరిచింది.
హాలంతా కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. భర్త నిజస్వరూపానికి నిర్ఘాంతపోయిన భువనేశ్వరి, ఇన్నాళ్ళూ కాపురం చేసింది ఇతనితోనేనా అన్న జుగుప్స కలిగింది తనకి.
భువనేశ్వరి తమాయించుకుని, “ఆడపిల్ల పుట్టడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీ ఇష్ట ప్రకారమే తీయించుకుంటాను” అంది.
కళ్ళు పెద్దవి చేసి భార్య వైపు చూశాడు భవానీశంకర్. “థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్” అతని ముఖమంతా మతాబులా వెలిగిపోతుంది. “అవన్నీ తర్వాత, నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటికి సమాధానాలు కావాలి” అంది.
“ఏంటవి” అన్నట్టు చూశాడు.
“ఇప్పుడు తీయించుకుంటాను ఓకే, మళ్ళీ ఆడపిల్లైతే!” భర్త వైపు చూసింది భువనేశ్వరి.
నేల చూపులు చూశాడు భవానీ శంకర్. “సరే, తదుపరి కాన్పులో ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడని మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా!” కళ్ళెగరేస్తూ అంది భారతి.
దానికి కూడా నీళ్ళు నమిలాడు భవానీశంకర్.
భర్త ప్రవర్తనకు భువనేశ్వరి కోపం నషాళానికి అంటింది. “నాలుగు డబ్బులు పడేసి పుట్టబోయేది ఆడో మగో తెలుసుకున్నారు సరే, అసలు కడుపున పడేది ఆడో మగో ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలరు? ఆఖరికి, బ్రహ్మాండాన్నే బొజ్జలో దాచిన అమ్మకు కూడా తెలియదు తన కడుపున కాసేది ఏ పిండమో!
అది ప్రకృతి. త్రిగుణాత్మకమైన స్త్రీ శరీరంలో సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. మీలాంటి వాళ్ళకు అర్థం కానిది. అతీతమైనది. మాపైన పారాడి ఆపై మాకు ఆడపిల్ల వద్దు మగ పిల్లోడే కావాలంటూ అరచి గోల చేస్తే, అర్థం పర్థం లేని హేతువాదానికి ఆడవాళ్ళు మాత్రం ఎంతవరకు పోరాడగలరు?
మిమ్మల్ని కనడానికి ఆడది కావాలి. మీ కోరిక తీర్చడానికి ఆడది కావాలి. మీకు సంతానంగా మాత్రం మగపిల్లాడే కావాలి రైట్! ఆడ మగ తేడా లేదంటారు. మరి దీన్నేమంటారు? మహానుభావా. సమభావం, సమానత్వం అన్నవి పైపై మాటలే. దేశపు అంగాంగం లింగ బేధమే! కాదని అనగలరా...!!”
తడుముకున్నాడు భవానీ శంకర్.
“వాస్తవానికి అమ్మ కడుపులో ఊపిరిపోసుకున్నప్పటి నుండే మొదలౌతుందీ అసమానత. పురుషాధిక్య సమాజం కదా, ఆధిపత్యం వహించిన మీ గర్వానికి తలవంచాలి. గర్భాన్ని తీయించుకోవాలి. లేదంటే జీవితాంతం మీచేత తూట్లు పొడిచే మాటలు పడాలి. అనాది నుండి ఆడదంటే మీకు ఆటబొమ్మేగా...! కారుణ్యాన్ని మరచిన భర్త కాఠిన్యపు మాటలకు కొట్టినట్టే బదులు చెప్పసాగింది భువనేశ్వరి. ఒక్కసారిగా భార్యలో భద్రకాళి రూపాన్ని చూసిన భవానీశంకరుకు నోటమాట కరువైంది.
“లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమైనా అధిక ధనాన్ని ఆశ చూపి మూర్ఖులు చేయిస్తున్నారు. డబ్బుకు లోబడి డాక్టర్లు చేస్తున్నారు. కడుపులో బిడ్డ ‘ఆడపిల్ల’ అని తెలుసుకుని, దేశవ్యాప్తంగా ఇల్లీగల్ గా రోజుకు రెండు వేల భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఆ విషయం తెలుసా మీకు?
‘చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి ఘోరాతి ఘోరాలు’ అని మీవంటి ప్రబుద్ధులు ఓ పక్క ఆడపిల్లలు కరువవుతున్నారంటూనే మరో పక్క అమ్మ కడుపులో ఉండగానే తుంచేస్తున్నారు. ఆఖరికి ఆడపిల్లకు అమ్మ కడుపులో కూడా రక్షణ లేదంటే, ఇంకెక్కడుంటుంది! సృష్టికి మూలమైన స్త్రీని ఆదిలోనే చిదిమేస్తుంటే మానవ మనుగడ ప్రశ్నార్థకం కాక ఏమౌతుంది!” అంటూ ఆవేదన వెళ్లగ్రక్కింది భువనేశ్వరి.
“నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం పొందినట్టు ఆడవాళ్ళం అన్నింటా ఇట్టే ఒదిగిపోవడం తప్ప మాకేం తెలుసు! అమ్మతనం మా జన్మగుణం. స్త్రీ ఓరిమి ముందు పురుషుడి బలిమి ఏపాటిది” చెరగని చిరునవ్వుతో కూడిన ఆత్మవిశ్వాసంతో చెప్తోంది భువనేశ్వరి.
తలదించుకున్నాడు భవానీ శంకర్. అన్ని చెప్పినా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు మంకు పట్టు వీడలేదు. గొడవ పెద్దదై విడిపోయేవరకు వచ్చింది.
*****
ఉలిక్కిపడి లేచింది భువనేశ్వరి! చుట్టూ చూసింది. చలికాలం కావడంతో ఎవరి బెర్తుల్లో వాళ్ళు దుప్పటి ముసుగుతన్ని గుర్రుగా నిద్రపోతున్నారు. ఉష్.., శుభమా అంటూ అమ్మాయి దగ్గరకు వెళ్తున్నప్పుడే గుర్తుకు రావాలా పాడు జ్ఞాపకం అనుకుంటూ లేచి కంపార్ట్మెంట్ వాటర్ ట్యాప్ వైపు నడిచింది.
చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుని యధావిధిగా వచ్చి కూర్చుంది. రైలు కదులుతున్న వేగంతో సమానంగా ఆలోచనలు మెదులుతున్నాయి.
గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు దెబ్బతింటుంది. కష్టాలున్నాయి కదాని కుమిలిపోతూ కూర్చుంటే కాలం ఆగదు సరికదా తన పని తాను చేసుకుపోతుంది. వేదాంతం ఎంత వల్లించినా రాద్ధాంతం చేసే మనుషులున్నప్పుడు ఏదీ సజావుగా సాగదు.
రసాభాసతోనే రోజు గడుస్తుంటే బాసలన్నీ బోసిపోవడం తప్ప ఏం ఉండదు. ఆసరా కరువైనా తనకు తాను ధైర్యం చెప్పుకుని జానకిని కని పెంచి పెద్దాదాన్ని చేసింది భువనేశ్వరి. సంగీతం పట్ల కూతురికున్న శ్రద్ధను గ్రహించి గాయనిగా తీర్చిదిద్దింది.
‘కూలీ.. కూలీ..’ అన్న మాటలు వినబడేసరికి పరధ్యానంలో ఉన్న భువనేశ్వరి సికింద్రాబాద్ స్టేషన్ వచ్చిందని తెలుసుకుని హడావిడిగా లగేజీ సర్దుకోవడం మొదలుపెట్టింది.
“రైలు దిగే లోపే అమ్మా, ఆ లగేజ్ ఇటు ఇవ్వు” అంటూ జానకి మాటలు వినిపించాయి.
ఒకరిని ఒకరు చూసుకుని తల్లీకూతుళ్ళ ముఖాలు నవ్వుతో వెలిగిపోయాయి. తల్లి రైలు దిగడం ఆలస్యం అమ్మ కాళ్ళకు నమస్కరించి గట్టిగా కౌగిలించుకుంది జానకి. చానాళ్ళకు రావడంతో కూతురును తనివితీరా చూసుకుని నుదుటిపై ముద్దుపెట్టుకుంది భువనేశ్వరి.
ఇద్దరూ స్టేషను బయటకు నడిచారు. ఫ్లాటుకు వెళ్ళి ఫ్రెషయ్యి రెస్ట్ తీసుకుంది భువనేశ్వరి. సాయంత్రానికి కారులో కార్యక్రమానికి బయలుదేరారు ఇద్దరూ.
సభా ప్రాంగణం జానకి ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆడిటోరియం సభికులతో క్రిక్కిరిసిపోయింది. వేదికను అలంకరించిన అతిథులు సభను ఉద్దేశించి చక్కగా ప్రసంగిస్తున్నారు. ప్రసంగాలకు మధ్య మధ్యలో సభాధ్యక్షుల వారు ఛలోక్తులతో ప్రేక్షకులను అలరిస్తూ సభను హుందాగా నిర్వహిస్తున్నారు.
కొద్దిసేపటికి ప్రసంగాలు ముగిశాయి. తదుపరి ప్రారంభమయ్యే ‘గానలహరి’ కార్యక్రమం గురించి పరిచయ వాక్యాలు చేశారో లేదో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
ఒక పాట తర్వాత మరొక పాట, ఇలా గాన పరంపరను కొనసాగిస్తూ పాడిన పాటలు పూదోటలై సభికులను పరిమళింపజేశాయి. తన కూతురి ప్రతిభకు, ప్రేక్షకుల స్పందనకు పులకించిపోయింది భువనేశ్వరి.
గాయని జానకితో పాటుగా తల్లి భువనేశ్వరికి కూడా ఘనమైన సన్మానం చేయడంతో కార్యక్రమం పూర్తయింది. “మా తెలుగింటి గాయని, మా అభిమాన గాయని” అంటూ జూనియర్ జానకిని మరింత దగ్గరగా చూడాలని, ఫోటోలు తీసుకోవాలని, ఆటోగ్రాఫ్ లు అందుకోవాలని అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
చిరునవ్వుతో అందరినీ దాటుకుంటూ సభ లోపల నుండి వెలుపలికి వచ్చేటప్పటికి కారు సిద్ధంగా ఉంది. కార్యక్రమ నిర్వాహకులకు వీడ్కోలు పలికి తల్లి భువనేశ్వరితో పాటుగా కారెక్కింది జానకి.
“కూతురు నోట తేనెలూరే తెలుగు పాటల్ని చెవులారా విని, కూతురు వైభవాన్ని కనులారా కని” ఆ తన్మయత్వం నుండి బయటకు రాలేదు భువనేశ్వరి.
కళ్ళ నిండుగా ఆనందభాష్పాలు. జానకి జీవితం కన్నుల పండువగా తోచింది తనకి. ఏ తల్లికైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది.
“అమ్మా, ప్లాట్ వచ్చింది” అన్న జానకి మాటకు తేరుకుని కారు దిగి, కూతురుతో పాటూ నడక సాగించింది భువనేశ్వరి.
-సమాప్తం-
వెంకు సనాతని గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వెంకు సనాతని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
పేరు : వెంకు సనాతని
అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత
ఊరు : బాపట్ల
జిల్లా : గుంటూరు
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్





