top of page
Original.png

మహానటి

Updated: 5 hours ago

మహానటి, తెలుగు కథ, మహిళా ప్రేరణ, సినీ రంగం, నాటక రంగం, కాస్టింగ్ కౌచ్, వినీల, వనజ, ఆత్మగౌరవం, మహిళా విజయం, తెలుగు కథలు, Emotional Story, Inspirational Story, Actress Story, National Award

కాస్టింగ్ కౌచ్‌ను ధైర్యంగా ఎదుర్కొని జాతీయ ఉత్తమ నటిగా ఎదిగిన వినీల
కాస్టింగ్ కౌచ్‌ను ధైర్యంగా ఎదుర్కొని జాతీయ ఉత్తమ నటిగా ఎదిగిన వినీల

Mahanati - Telugu Emotional Life Story | M R V Sathyanarayana Murthy

మహానటి - తెలుగు భావోద్వేగ జీవిత కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com on 20/07/2026

 

   

"ఈ కథలో ఒక నటి ఉంది... అవకాశాల కోసం ఎప్పుడూ తలవంచలేదు. అందుకే చివరికి జీవితమే ఆమెకు వంగింది. ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారి  'మహానటి' కథను చివరివరకు తప్పక చదవండి." 


పార్ట్ 1: రంగస్థలం 


“ఎంతో అపురూపంగా పెంచిన నా కొడుకుకి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా? నేనే తప్పు చేయలేదే? ఎవరినీ నేను నిందించలేదే? నాకు చేతనైనంత వరకూ ఇతరులకు సాయం చేశానే? అయినా నా మీద దయ లేకుండా, ఎందుకు నాకీ శిక్ష విధించావు భగవాన్?” భోరున విలపిస్తోంది సరోజ.


ఆమె భర్త ఆమెను అనునయిస్తున్నాడు. “చూడు సరోజా, మనకి పిల్లలు లేకపోవడం వలన అనాథాశ్రమం నుండి వాడిని తెచ్చుకుని పెంచుకున్నాం. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆరవ ఏట నుండీ వాడికి అనారోగ్యమే. వాడు బాగుండాలనే కదా, ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి వాడికి వైద్యం చేయించాం. ఎంత ఖర్చు అయినా మందులు కొనగలం కానీ, ఆయుష్షు కొనలేం కదా. వాడికీ మనకీ ఋణం తీరిపోయింది. ఏం చేస్తాం? ఇంటికి వెళ్దాం పద” అన్నాడు రాఘవ.


నర్సు వచ్చి “అమ్మా, ఇది హాస్పిటల్. మీరు అంత గట్టిగా ఏడవకూడదు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి, మీ అబ్బాయి బాడీని అప్పగిస్తారు సార్. మీరు బిల్ పే చేసేయండి. తర్వాత అంబులెన్సులో మీరు వెళ్లవచ్చు” అంది. నర్సు అలా చెప్పి వెళ్లగానే సరోజ మరోసారి ఘొల్లుమంది.


రాఘవ తమ్ముడు కిరణ్, “అన్నయ్యా, నువ్వు వదినను చూడు. నేను బిల్ కట్టేస్తాను” అని రిసెప్షన్ వైపు నడిచాడు. కొద్దిసేపటికి కిరణ్ వచ్చి “అన్నయ్యా బిల్ కట్టేశాను. అంబులెన్సు వచ్చింది వెళ్దాం” అని అన్నాడు.


అంబులెన్సు వచ్చింది అనగానే, సరోజ ‘బాబూ’ అని గట్టిగా కేకపెట్టి నేల మీద పడిపోయింది. రాఘవ ‘సరోజా.. సరోజా’ అంటూ ఆమెను ఒడిలోకి తీసుకుని, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘వదినా’ అని కంగారుగా కిరణ్ ఆమె వద్దకు వచ్చాడు. వారి కేకలకు నర్సు వచ్చి సరోజను చూసి, గబగబా డాక్టరుని తీసుకువచ్చింది. డాక్టర్ ఆమెను పరీక్షించి “సారీ రాఘవ గారు. మీ భార్య చనిపోయారు” అని చెప్పి వెళ్లిపోయారు. నర్సు ఆయనతో వెళ్లిపోయింది.


రాఘవ ఒడిలో సరోజ దీర్ఘనిద్రలోకి వెళ్లిపోయింది. రాఘవ కళ్లు శ్రావణ మేఘాలై వర్షిస్తున్నాయి. కిరణ్ భారమైన హృదయంతో అన్న, వదినల కేసి చూస్తున్నాడు.

‘ఋణానుబంధం.. అంతా ఋణానుబంధం’ అన్న పాట నెమ్మదిగా వినిపిస్తుండగా, తెర పడింది.


పార్ట్ 2: కాస్టింగ్ కౌచ్ 


వేదిక ముందు ఉన్న రంగబాబు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపాడు. నాటకం డైరెక్టర్ శేషగిరి కూడా చప్పట్లు కొట్టాడు. అతని మనసు ఆనందంగా ఉంది, నాటకం స్క్రూటినీకి వచ్చిన రంగబాబుకి తమ నాటకం నచ్చినందుకు. “ధన్యవాదాలు సార్” అన్నాడు శేషగిరి. చిన్నగా తలూపాడు రంగబాబు.


శివపురం వర్తక సంఘం భవనంలో ఉన్నారు అందరూ. కొద్దిసేపటికి నాటకంలో ఉన్న నటీనటులు అందరూ వచ్చి, రంగబాబుకి నమస్కరించి కుర్చీలలో కూర్చున్నారు.

అకస్మాత్తుగా రంగబాబు లేచి, సరోజ పాత్ర వేసిన వనజ దగ్గరకు వచ్చి ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని “చాలా బాగా చేశావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అని అన్నాడు.


అతని చర్యకు విస్తుపోయిన వనజ, ఏమీ అనలేక “థాంక్స్ సార్” అని నెమ్మదిగా, అతని చేతిలోంచి తన చేయిని తీసుకుంది. రంగబాబు రాసుకున్న ఖరీదైన సెంటు ఆమె ముక్కుపుటాలకు సోకింది. రంగబాబు ఆమె కేసి అదోలా చూసి, తన కుర్చీ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.


కొద్దిసేపటికి అందరికీ భోజనాలు వచ్చాయి. సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనాలు చేశారు. రంగబాబు, శేషగిరిని పక్కకు తీసుకువెళ్లి మాట్లాడి, మేడ మీద ఉన్న రూముకి వెళ్లిపోయాడు. అప్పటికి సమయం రాత్రి పదకొండు గంటలు అయ్యింది. నాటకంలోని నటీనటులు అందరికీ చాలా రిలీఫ్ గా ఉంది. రెండు నెలల నుండీ ‘ఋణానుబంధం’ నాటకం రిహార్సల్సు వేస్తున్నారు. రాష్ట్రంలోనే పేరున్న ‘ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్’ వారి నాటక పోటీలకి ఎంట్రీ పంపారు. ఈ రోజు స్క్రూటినీ జరిగింది. స్క్రూటినీ జడ్జిగా రంగబాబు వచ్చాడు. అతని ఫీలింగ్స్ ని బట్టి తమ నాటకం పోటీలకు ‘సెలెక్ట్’ అవ్వవచ్చు అన్న ధీమా వారిలో కనిపించింది.


నాటకం డైరెక్టర్ శేషగిరి మిత్రులు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. “మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎంతో శ్రమపడి రిహార్సల్సు వేశారు. నా డైరెక్షన్ లో వస్తున్న రెండవ నాటకం ఇది.


ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి పోటీలకు అర్హత సంపాదించడం అంత తేలిక కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలోని నాటక సమాజాలు, ఆ వేదిక మీద తమ నాటకం ప్రదర్శించాలని చాలా ఆశ పడతారు. మీకు తెలుసు, ఉత్తమ నాటకంకి లక్ష రూపాయలు బహుమతి ఇస్తారు వారు. ఉత్తమ దర్శకుడికి కూడా లక్ష రూపాయలు ఇస్తారు. అందుకే చాలా మంది పోటీ పడతారు. డబ్బుతో పాటు చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి.


సినీ ప్రముఖులు కూడా వచ్చి నాటకాలు చూసి వెళ్తారు. అది ప్రత్యేక ఆకర్షణ మరియు సినీ రంగంకి మనం వెళ్లడానికి ఒక గొప్ప అవకాశం. మనలో ఎవరికి సినిమాలలో అవకాశం వచ్చినా నాకు చాలా సంతోషం. మనం అందరం కళామతల్లి బిడ్డలం. ముఖ్యంగా వనజ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఎప్పుడు రిహార్సల్ వేద్దామన్నా ‘కాదు’ అనకుండా మన నాటక సమాజం మీద గౌరవంతో ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి, రిహార్సల్ వేసి, ఇక్కడే ఉండి, ఉదయమే వారి ఊరికి వెళ్లేవారు. ఈ రోజు వారి నటనా విశ్వరూపం చూశాను.


గతంలో ఆలపాటి లక్ష్మి గారు, పావలా శ్యామల గారు, విజయలక్ష్మి గారు తమ అసమాన నటనతో తెలుగు నాటక రంగాన్ని ఉర్రూతలూగించారు. వారి ముగ్గురి వారసత్వం ఈ రోజు నాకు వనజగారిలో కనిపించింది. ఇందాక రంగబాబు గారు చెప్పినట్టు వనజ గారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” అనగానే, నాటకంలోని నటులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.


రాఘవ పాత్ర వేసిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ “ఈ రోజు వనజ గారి ఎమోషన్ చూసి రెండు సందర్భాలలో నేను డైలాగ్ మర్చిపోయాను కూడా. రిహార్సల్స్ లో కన్నా ఈ రోజు వనజ గారు త్రిబుల్ యాక్షన్ చేశారు. అద్భుతం మేడం. మీకు నా అభినందనలు” అన్నాడు.


వనజ చిన్నగా నవ్వి, లేచి నిలబడి అందరికీ నమస్కారం చేసి కూర్చుంది. శేషగిరి మూడువేలు తీసి వనజకి ఇచ్చాడు. “మీ అబ్బాయికి జ్వరం వచ్చినా, మా మాట కాదనలేక ఈ రోజు వచ్చారు. థాంక్స్” అన్నాడు శేషగిరి.


“అవునండి. వాడికి నూట రెండు జ్వరం. పక్క ఇంటి ఆవిడకి అప్పజెప్పి ఇలా వచ్చాను. స్క్రూటినీ విలువ నాకు తెలుసు. మన సమాజం రెండు నెలల శ్రమ ఈ రోజే కనిపించాలి. నా వలన మీకు ఇబ్బంది కలగకూడదని వచ్చాను” అంది వనజ.


“మీతో కొంచెం మాట్లాడాలి” అని హాలులోంచి వరండాలోకి తీసుకువెళ్లాడు శేషగిరి, వనజను.


పార్ట్ 3: తల వంచని మనస్తత్వం 


“మన నాటక సమాజం భవిష్యత్తు మీ చేతులలో ఉంది. మీరు కొంచెం విశాల హృదయంతో ఆలోచించి సాయం చేయాలి. దీనికి ప్రతిఫలంగా మీ అబ్బాయి చదువు విషయంలో నేను సాయం చేస్తాను. ఇప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాడని మీరు చెప్పారు” అని ఒక క్షణం ఆగాడు శేషగిరి.


“నా వలన మన సమాజానికి మేలు జరుగుతుంది అంటే, నేను తప్పక చేస్తాను” అంది వనజ.


“ఈ స్క్రూటినీలో మన నాటకం సెలెక్ట్ అయితే, నాకు తప్పకుండా ‘ఉత్తమ డైరెక్టర్’ అవార్డు వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అది నా జీవితాశయం కూడా. మీకు ‘ఉత్తమ నటి’ అవార్డు కూడా వస్తుంది. ఇప్పుడు రంగబాబుని మనం ‘సంతృప్తి’ పరిస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకని మీరు ఒకసారి ఆయన రూముకి వెళ్లి వస్తే, మనకి అంతా మంచే జరుగుతుంది” చిన్నగా నవ్వుతూ అన్నాడు శేషగిరి.


అతని మాటలు వినగానే, వనజకి వళ్లు మండిపోయింది. ఒక్క నిమిషం ఆలోచించింది.

“మీకు ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకోవాలని ఉంది. దానికి నేనెందుకు సహకరించాలి? మీ ఆవిడ చాలా అందంగా ఉంటారని మన వాళ్లు చెప్పారు. మీకు కావలసిన సాయం ఆవిడ ద్వారా చేయించుకోండి. ఇంకొకరిని బతిమాలడం ఎందుకు?” అంది శాంతంగా వనజ.


ఆమె మాటలు వినగానే శేషగిరికి కళ్లు ఎర్రబడ్డాయి. నిలువెల్లా ఆవేశంతో ఊగిపోయాడు.

“ఎంత పొగరే నీకు? మా ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నావు. నువ్వెంత, నీ బతుకెంత? నీకు ఎక్కడా అవకాశాలు రాకుండా చేస్తాను. చేతిలో రూపాయి లేక అడుక్కు తినాల్సి వస్తుంది. ఏమనుకున్నావో నా గురించి?” అన్నాడు శేషగిరి.


“మీ వాళ్ల గురించి అంటే మీకు అంత కోపం వస్తోందే? మరి, మీకు అవార్డు రావడం కోసం నన్ను నేను అమ్ముకోవాలా? ఎంత నీచమైన ఆలోచన మీది. నటన నా వృత్తి. ‘వ్యభిచారం’ కాదు. అది గ్రహించండి.


నైతికంగా దిగజారి విలాసంగా జీవించడం కంటే, నిజాయితీగా జీవిస్తూ ‘పస్తులు’ ఉన్నా ఫర్వాలేదు. ఈ రోజుతో నా పేమెంట్ మొత్తం నాకు అందింది. మీలాంటి కుసంస్కారుల మధ్య నేను ఉండలేను. ఇంతవరకూ ‘మీరు’ అని గౌరవంగా మాట్లాడిన మీరు, ‘నువ్వు’ అని ఏకవచనంలోకి దిగి మాట్లాడి, మీ అసలు నైజం బయటపెట్టుకున్నారు.


ఆడది అంటే ‘అబల’ అని చిన్నచూపు చూడకండి. అవసరమైతే ‘ఆది పరాశక్తిగా’

మారుతుంది అని గుర్తుపెట్టుకోండి” అని విసవిసా నడుస్తూ హాలులోకి వచ్చింది వనజ.


ఆమె మొహం చూసి ఏదో జరిగిందని ఊహించారు అందరూ. సుబ్రహ్మణ్యం దగ్గరకు వచ్చింది.


“సార్, మీ బైకు మీద నన్ను మా ఊరు దింపగలరా?” సౌమ్యంగా అడిగింది వనజ.

‘అలాగే’ అన్నట్టు తలూపాడు సుబ్రహ్మణ్యం. ఇద్దరూ బయటకు వచ్చారు.


సుబ్రహ్మణ్యం బైకు ఎక్కి తన ఊరు బయల్దేరింది వనజ, బాబుకి ఎలా ఉందో అని ఆలోచిస్తూ.

***

పార్ట్ 4: ఉత్తమ నటి వనజ


నెల రోజుల తర్వాత ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి పోటీలు హైదరాబాద్ లో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందు రోజు ప్రదర్శనలలో విశాఖపట్నం వారి ‘స్వయంసిద్ధ’ నాటకంలో వనజ, ఝాన్సీ పాత్రలో నటించింది. ప్రేక్షకులతో పాటు, సినిమా డైరెక్టర్లు కూడా ఆమె నటనకు జోహార్లు పలికారు. ఒక పనిమనిషి కూతురు సమాజంలోని ఎంతో మంది వలన ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొని, పట్టుదలతో చదివి పోలీస్ ఆఫీసర్ గా ఎదిగి, సమాజంలోని దుర్మార్గుల, స్వార్థపరుల ఆటలు కట్టించి పేదవారికి, మహిళలకు అండగా నిలవడం నాటక సారాంశం. ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.


మరునాడు శేషగిరి దర్శకత్వం వహించిన ‘ఋణానుబంధం’ నాటకం ప్రదర్శించారు. వనజ స్థానంలో భీమవరం నుండి గిరిజ అనే అమ్మాయిని తీసుకువచ్చి, రిహార్సల్సు వేయించి పోటీకి తీసుకువచ్చాడు శేషగిరి. గిరిజ నటనను కొద్దిమంది మాత్రమే మెచ్చుకున్నారు. ఎందుకో గిరిజ తడబడినట్టు సుబ్రహ్మణ్యం కూడా గ్రహించాడు.


వనజ, తాను విశాఖపట్నం వారి సమాజంలో నటిస్తున్నట్టు శేషగిరికి చెప్పలేదు.

మూడు రోజులూ నాటక ప్రదర్శనలు బాగా జరిగాయి. ‘స్వయంసిద్ధ’ నాటకానికి ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకత్వం అవార్డులు వచ్చాయి. వనజకు ఉత్తమ నటిగా కూడా అవార్డు వచ్చింది. ‘ఋణానుబంధం’ నాటకం ఉత్తమ రచనగా ఎంపికయ్యింది. అంతకు మించి ఏ విధమైన అవార్డులూ రాలేదు.


‘ఉత్తమ నటిగా’ వనజ ప్రసిద్ధ సినీ డైరెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. అది చూసి శేషగిరి కుతకుత ఉడికిపోయాడు. ఫంక్షన్ అయ్యాక సుబ్రహ్మణ్యం వెళ్లి వనజను అభినందించాడు. ఆమె ఎంతో ఆదరంగా మాట్లాడింది అతనితో. ‘మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అడగండి. ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటాను’ అన్నాడు సుబ్రహ్మణ్యం. ‘థాంక్స్’ అంది వనజ.

******


పార్ట్ 5: హీరోయిన్ వినీలగా మారిన వనజ 


సినిమా హీరోయిన్ వినీల ఇంటి డ్రాయింగ్ రూమ్ లో ఉన్నాడు చైతన్య. అతనికి చాలా ఆత్రుతగా ఉంది. ఆమె సాధారణంగా ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వదు. రామనాథం మావయ్య రికమెండేషన్ వలన ఆవిడ ఒప్పుకుంది. ఈ ఇంటర్వ్యూ వలన తమ ఛానల్ ‘రేటింగ్’ తప్పకుండా పెరుగుతుంది. తనకి మంచి గుర్తింపు కూడా వస్తుంది.


ఐదు నిమిషాలు గడవగానే డోర్ కర్టెన్ తీసుకుని వినీల రూమ్ లోకి వచ్చింది.

చైతన్య, కెమెరా మేన్ సుబ్బు లేచి నిలబడి ‘గుడ్ మార్నింగ్ మేడం’ అన్నారు. వినీల చిరునవ్వుతో అభివాదం చేసి ‘కూర్చోండి సార్’ అంది. ఆమె సోఫాలో కూర్చున్నాక, ఇద్దరూ కూర్చున్నారు.


‘నా పేరు చైతన్య. ఇతను కెమెరా మేన్ సుబ్బు. విజన్ ఛానల్ నుండి వచ్చాం’ అన్నాడు చైతన్య.


“నిన్న మాస్టారు చెప్పారు మీ గురించి. అందుకని ఒప్పుకున్నాను” అంది వినీల. ఆమెనే కన్నార్పకుండా చూశాడు చైతన్య. బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది వినీల. మెడలో సన్నని బంగారు చెయిన్. చాలా కొద్ది మేకప్ వేసుకుంది మొహానికి. సుబ్బు కెమెరా పొజిషన్ చూసుకున్నాడు. చైతన్య ఒక మైకు ఆమెకిచ్చాడు. వినీల చీరకి దానిని పిన్ చేసుకుంది.


చైతన్య మైకు చేతిలోకి తీసుకుని “గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మా ఛానల్ తరపున మీకు అభినందనలు. జాతీయ స్థాయిలో ‘సంగమం’ చిత్రంలో ఉత్తమ నటిగా అవార్డు పొందినందుకు” అన్నాడు.


వినీల రెండు చేతులూ జోడించి “అందరికీ ధన్య వాదాలు” అంది.


“ఇంతవరకూ మీరు ఎన్ని తెలుగు చిత్రాలలో నటించారు? సంగమం ఎన్నో చిత్రం? ఆ విశేషాలు మా ప్రేక్షకులకు చెబుతారా?” అడిగాడు చైతన్య.


“ఇప్పటికి నేను నటించిన ఎనిమిది చిత్రాలు విడుదల అయ్యాయి. ‘సంగమం’ ఏడవ చిత్రం.


కథ నచ్చడం వలన ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాను. షూటింగ్ జరిగిన ఆరు నెలలు వేరే సినిమాకు పని చేయలేదు. డైరెక్టర్ మిధున్ గారు గొప్ప క్రియేటివిటీ ఉన్న మనిషి. విశ్వనాథ్ గారి వారసత్వం ఆయనలో నాకు కనిపించింది. ప్రతి సన్నివేశం తాను నటించి మాకు చూపించేవారు. క్లైమాక్స్ సీన్లు అన్నీ రామేశ్వరంలో తీశారు. ఆయన వలనే నాకు ఈ అవార్డు వచ్చింది. నిర్మాత రాజు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంది వినీల.


పార్ట్ 6: గతం పంచుకున్న వినీల 


“మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో చెబుతారా?” అడిగాడు చైతన్య.


“మీకు నేనో విషయం చెప్పాలి. నేను నాటక రంగానికి చెందిన మనిషిని. మాది తణుకు పక్కనున్న మండపాక గ్రామం” అని ఆమె చెబుతూండగానే, చైతన్య మధ్యలో “ప్రసిద్ధ కవి, రచయిత దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి ఊరు” అన్నాడు.


“అవునండి. మా అమ్మ, అక్క, నేను అందరం నాటకాలలో వేషాలు వేసిన వాళ్లమే. మా అమ్మ సావిత్రి చాలా స్టేజీ నాటకాలలో పాల్గొని ఎన్నో బహుమతులు తెచ్చుకుంది. మా నాన్న లారీ డ్రైవర్. నా ఎనిమిదో ఏట మా అమ్మ చనిపోయింది. ఒక ఏడాదికి మా నాన్న కూడా మా అమ్మ దగ్గరకు వెళ్లిపోయాడు.


అప్పటికే రెండు, మూడు నాటకాలలో వేషాలు వేసిన మా అక్క, నన్నూ తమ్ముడినీ పెంచడం కోసం నటిగా మారింది. సాంఘిక, పౌరాణిక నాటకాలలో వేషాలు వేసింది. తన సహనటుడు చలపతిని పెళ్లి చేసుకుంది.


వాళ్లకు ఒక అబ్బాయి పుట్టాడు. కొద్ది కాలం గడిచాక, అతను మా అక్కను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనకు మా అక్క తట్టుకోలేకపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పక్కింటి రాధ సకాలంలో చూసి హాస్పిటల్ లో చేర్పించడం వలన బతికింది. మానసికంగా చాలా నలిగిపోయింది. అప్పుడు నేను తణుకులో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాను.


మీ మావయ్య రామనాథం గారు మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. రమ్య గాయత్రి మేడం మ్యాథ్స్ చెప్పారు. ఆవిడ లెక్కలు చెబుతుంటే నేను కన్నార్పకుండా ఆమెనే చూసేదానిని. నేను పరీక్షలు పూర్తికాగానే, కుటుంబం గడవడం కోసం నాటకాలలో నటించడం ప్రారంభించాను. ఐదు సంవత్సరాలు గడిచేసరికి నాటకాలలో చాలా బిజీ అయిపోయాను. మా తమ్ముడిని డిగ్రీ చదివించాను. కానీ దురదృష్టం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది.


నేను విశాఖపట్నం నాటక ప్రదర్శనకు వెళ్లి వచ్చేసరికి మా అక్క హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అప్పటి నుండి మా అక్క కొడుకు బాధ్యత నేను తీసుకున్నాను. తమ్ముడికి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చి అక్కడికి వెళ్లిపోయాడు. నేను నాటకాలకి రిహార్సల్సుకి వెళ్లేటప్పుడు, మా పక్కింటి రాధకి మా అక్క కొడుకుని అప్పజెప్పి వెళ్లేదానిని.


ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి నాటిక పోటీలలో, విశాఖపట్నం సమాజం తరపున ప్రదర్శించిన ‘స్వయంసిద్ధ’ నాటకంలో నా పాత్రకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఆ ఫంక్షన్ కి వచ్చిన డైరెక్టర్ సుధీర్ గారు నా నటన చూసి, తన సినిమా ‘భూమిపుత్రుడు’లో హీరోయిన్ స్నేహితురాలిగా నటించే అవకాశం ఇచ్చారు.


అప్పుడే ఆయన నా పేరుని వనజ నుండి ‘వినీల’గా మార్చారు. ఆ విధంగా నేను వెండితెరకు పరిచయం అయ్యాను. నన్ను సినీరంగానికి పరిచయం చేసిన సుధీర్ గారికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను.” వినీల ఒక్కసారి ఆగింది. ఆమె గొంతు గంభీరంగా మారిపోయింది ఒక్క క్షణం.


“మీరు ‘యాడ్స్’ ఎక్కువగా చేస్తున్నారని ఒక విమర్శ ఉంది. దానికి మీ సమాధానం?”


ఆ ప్రశ్నకి చిన్నగా నవ్వింది వినీల. “యాడ్స్ చేయడం వలన వచ్చే ప్రతి రూపాయీ ధార్మిక సంస్థలకి విరాళంగా ఇస్తున్నాను. అందుకే వారి విమర్శలను నేను పట్టించుకోవడం లేదు. సినిమాలలో వచ్చేది నాకు సరిపోతుంది. నేను నడిచిన దారిలో నాకు తోడుగా నిలిచిన వారిని మరిచిపోలేదు. మా ఊరిలో నన్ను, నా అక్క కొడుకుని ఎంతో ఆదరంగా చూసిన మా రాధక్కను నా దగ్గరే పెట్టుకున్నాను. మా రాధక్క భర్త కృష్ణ, నా కారు డ్రైవర్ మాత్రమే కాదు, నా రక్షకుడు” అంది వినీల.


“మొన్న ఒక హిందీ సినిమాకు కోట్లు పారితోషికం ఇస్తానన్నా మీరు చేయనన్నారని ‘వార్త’ వచ్చింది. దీని గురించి మీరు ఏం చెబుతారు?” అడిగాడు చైతన్య.


“డబ్బు గురించి నేను ఎక్కువగా ఆలోచించడం లేదు. నన్ను గుర్తించి, నన్ను ఆదరిస్తున్న తెలుగు చిత్ర సీమలో నేను పూర్తిగా నిలదొక్కుకోవాలి. ఆ తర్వాత మిగతా భాషల చిత్రాల గురించి ఆలోచిస్తాను” అంది వినీల. మరో రెండు ప్రశ్నల తర్వాత ఇంటర్వ్యూ ముగించాడు చైతన్య. వినీలకి ధన్యవాదాలు తెలిపి కెమెరా మేన్ తో కలిసి వెళ్లిపోయాడు చైతన్య.

******


పార్ట్ 7: ఊరికి ఉపకారం 


వినీల ఇంటర్వ్యూ చూసి మండపాక గ్రామంలో చాలా మంది ఆనందించారు. గత సంవత్సరమే గ్రామంలోని విద్యార్థినుల కోసం పది కంప్యూటర్లతో ఒక ఉచిత సెంటర్ ని ఏర్పాటు చేసింది వినీల. ఆమెకి ఖాళీ లేకపోవడం వలన రాధ వచ్చి ఆ సెంటర్ ని ప్రారంభించి వెళ్లిపోయింది. వినీల, తల్లి సావిత్రి పేరు మీద కట్టిన మహిళా మండలి బిల్డింగ్ కి యాభై లక్షలు విరాళం ఇచ్చింది. మండపాక నుండి ఎవరు వెళ్లినా వారికి భోజనం పెట్టి, బట్టలు పెట్టి మరీ పంపిస్తుంది వినీల.


నెల గడిచింది. ఒక ఆదివారం షూటింగ్ లేకపోవడం వలన రాధతో కబుర్లు చెబుతోంది వినీల. పి.ఏ. వచ్చి “మేడం, శివపురం నుండి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు మిమ్మల్ని కలవడానికి. మీరు తెలుసని చెప్పారు” అని అన్నాడు.


“ఓకే. ఆయనకి కాఫీ, టిఫిన్లు ఇవ్వండి. ఐదు నిమిషాల్లో నేను వస్తాను” అంది వినీల. ‘అలాగే మేడం’ అని పి.ఏ. వెళ్లిపోయాడు.


కొద్దిసేపు గడిచాక హాలులోకి వెళ్లింది వినీల. ఆమెను చూడగానే లేచి నిలబడి “గుడ్ మార్నింగ్ మేడం” అన్నాడు సుబ్రహ్మణ్యం.


“గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారూ. కూర్చోండి. ఎలా ఉన్నారు మన వాళ్లు? మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారా?” ఆప్యాయంగా అడిగింది వినీల. ఆమె కేసి ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం. అదే చిరునవ్వు, అదే మాట తీరు. తమ ఊరు రిహార్సల్సుకి వచ్చినప్పుడు ఎలా ఉండేదో, అలాగే ఉంది ఆమె పలకరింపు. పెద్ద సినిమా యాక్టర్ నన్న భావన ఎక్కడా లేదు.


“అందరం బాగానే ఉన్నాం మేడం. మా అమ్మాయికి పెళ్లి చేశాను, చెన్నైలో ఉంటోంది. మన నాటక సమాజం వాళ్లు అందరూ కూడా బాగానే ఉన్నారు. మొన్న మీ ఇంటర్వ్యూ చూసి చాలా ఆనందించాము. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మీకు అభినందనలు” అని స్వీట్ ప్యాకెట్ ఆమెకి ఇచ్చాడు సుబ్రహ్మణ్యం. “థాంక్స్” అని వాటిని అందుకుని టీపాయ్ మీద పెట్టింది.


ఒక పావుగంట మాట్లాడాక “శేషగిరి మీ పట్ల ప్రవర్తించిన తీరుకి భగవంతుడు అతనికి పెద్ద శిక్ష వేశాడు మేడం. ‘ఋణానుబంధం’ నాటకంలో మిమ్మల్ని తీసేసి గిరిజను పెట్టుకున్నాడు కదా, ఆమె సరిగా చేయకపోయినా తర్వాత నాటకంలో కూడా ఆమెనే హీరోయిన్ గా పెట్టి మరో నాటకం వేశాడు. ఆమెతో చనువు పెరిగి చాలా డబ్బు ఆమెకి ముట్టజెప్పాడు. అతని భార్య అతని ప్రవర్తనతో విసిగి, విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.


గత సంవత్సరం గిరిజ దగ్గరకు వెళ్లి శివపురం వస్తుండగా అతని స్కూటర్ ని లారీ గుద్దేయడంతో కుడికాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. మోకాలు వరకూ కాలు తీసేశారు. వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అయ్యింది. కృత్రిమ కాలు సహాయంతో నడుస్తున్నాడు. ప్రస్తుతం ఒక కిళ్లీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాడు. అదీ అంతంత మాత్రంగా నడుస్తోంది. మిత్రులం అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేస్తున్నాము” అన్నాడు సుబ్రహ్మణ్యం.


ఆ మాటలు విని ఊరుకుంది ఆమె. ఒక పావుగంట గడిచాక, ఆమెతో ఒక సెల్ఫీ తీసుకుని వెళ్లిపోయాడు సుబ్రహ్మణ్యం.

****

పార్ట్ 8: అజ్ఞాత దాత  


పదిహేను రోజులు గడిచాయి. సుబ్రహ్మణ్యం, శేషగిరి కొట్టు దగ్గరకు వెళ్ళాడు. 

“గిరీ నీకో శుభ వార్త. నీ పరిస్థితి గురించి మా బంధువులకు చెప్పాను. ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకోవడానికి నీకు ఆర్థిక సాయం చేస్తానన్నారు. ఒక వారంలో నాకు డబ్బు పంపుతారు. కంప్యూటర్ నేర్చుకున్న కుర్రాడిని నేను చూస్తాను. నువ్వు జిరాక్స్ కాపీలు తీస్తూ ఉండు. కాలానికి తగినట్టు మనం మారాలి” అన్నాడు సుబ్రహ్మణ్యం. అతని మాటలకి శేషగిరి కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి.


“నువ్వు ఒక్కడివే నాకు అండగా ఉంటున్నావు. నీ ఋణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. మీ బంధువులకి నా నమస్కారాలు” అన్నాడు రెండు చేతులూ జోడించి.


నెల తిరిగేసరికి ‘అమ్మ’ ఇంటర్నెట్ సెంటర్ ప్రారంభమయ్యింది. రెండు నెలలు గడిచేసరికి ఇంటర్నెట్ సెంటర్ బాగా బిజీ అయిపోయింది. శేషగిరి ఆర్థిక పరిస్థితి కుదుటపడింది. రోజూ సుబ్రహ్మణ్యం బంధువులని పొగుడుతూనే ఉన్నాడు శేషగిరి. సుబ్రహ్మణ్యం చిన్నగా నవ్వుతాడు అప్పుడు.


వినీలే అతని కొత్త జీవితానికి మూలం అని సుబ్రహ్మణ్యం శేషగిరికి చెప్పలేదు. తను చేసే సాయం ఎవరికీ చెప్పవద్దని సుబ్రహ్మణ్యం దగ్గర మాట తీసుకుంది వినీల.


సమాప్తం.

*******

M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):








M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



telugu emotional story,  wife husband story telugu,  old age home story


2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@umadevi8931

•4 hours ago

kadha, kdhanam bavunnayi

Like


@kappagantulasubbarao3915

• 2 hours ago

కధ చాలా బాగుంది

Like
bottom of page