ముఖం పలికే మాటలు
ముఖం పలికే మాటలు, ముఖ హావభావాలు, మనస్తత్వం, మనోభావాలు, వ్యక్తిత్వ వికాసం, చిరునవ్వు, మానసిక స్థితి, తెలుగు వ్యాసం, కనకదుర్గా లక్ష్మీ రత్న, జీవిత పాఠాలు

MUkham Palike Matalu - Telugu Inspirational Article | Kanakadurga Lakshmirathna
ముఖం పలికే మాటలు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కనకదుర్గా లక్ష్మీరత్న
Published in manatelugukathalu.com on 09/07/2026
ముఖం మనిషి మనసుకు అద్దం అంటారు. మాటల్లో చెప్పని భావాలను కూడా ముఖ హావభావాలు స్పష్టంగా వ్యక్తపరుస్తాయి. నవ్వు, దిగులు, గంభీరత, ఆందోళన, ఆత్మవిశ్వాసం, ప్రేమ, కోపం… ప్రతి భావం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రముఖ రచయిత్రి కనకదుర్గా లక్ష్మీ రత్న రచించిన "ముఖం పలికే మాటలు" వ్యాసం, మనం కలిసే ప్రతి మనిషి ముఖం వెనుక దాగి ఉన్న భావ ప్రపంచాన్ని సున్నితంగా విశ్లేషిస్తూ, మన మనసును అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.
ముఖం మనస్సుకు అద్దం అని చెబుతారు. ముఖంలోని హావభావాలను బట్టి మనుషుల మనస్తత్వాలు, మనోభావాలు, ఆలోచనా సరళి అంచనా వేయవచ్చును. పెదవి దాటని మాటలకు ముఖం మౌన భాష్యాన్ని ఇస్తుంది.
మన జీవన పయనంలో మనకు ఎంతోమంది తారసపడుతుంటారు. వారు స్నేహితులు, సన్నిహితులు, ఇరుగు-పొరుగు, మనతో కలిసి పనిచేసేవారు, అపరిచితులు ఎవరైనా కావచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. కొందరివి ముచ్చటగా అనిపిస్తే, కొందరివి జాలి గొలిపే విధంగా ఉంటాయి. మరికొందరివి ఆసక్తిగానూ, ఆశ్చర్యంగానూ, భయంగానూ... ఇలా రకరకాల భావాలు కలుగుతుంటాయి.
కొందరికి “సిరిమల్లె పువ్వల్లె నవ్వు” అన్న మాదిరిగా ఎప్పుడూ ముఖానికి నవ్వు అద్ది ఉంటుంది. ఏ సమయంలోనూ వారి నవ్వు చెక్కుచెదరదు. వారికి ఏ సమస్యలూ లేనట్లు ఉంటారు. వారి జీవితం పూలపాన్పులా అనిపిస్తుంటుంది. ఆ నవ్వే ముఖంలో సంతోషాన్ని, సంతృప్తిని తెచ్చిపెడుతుంది. వారిని చూడగానే ఎదుటి వారికి కూడా అప్రయత్నంగా ముఖం విచ్చుకుంటుంది.
ఆ మందస్మిత వదనం ఎదుటి వారిలోనూ, చుట్టుపక్కల అంతా సానుకూల అనుభూతిని (positive vibes) కలిగిస్తుంది. అలాంటి వారు అందరి అభిమానాన్ని చూరగొంటారు. మనస్సు బాగోలేనప్పుడు అలాంటి వారు తారసపడితే మనస్సు తేలిక పడుతుంది.
కొందరి ముఖాలు “మొగుడు కొట్టాడా? లేక మొహం తీరేనా?” అన్న సామెతను అనుసరించి ఉంటాయి. దిగాలుగా, జీవితంలోని భారమంతా తామే మోస్తున్నట్లు, నెత్తిన చేయి పెట్టుకుని, కష్టాల కడలిలా ఉంటారు. గుండెల్లో అగ్నిపర్వతం మోస్తున్నట్లు, ఏ క్షణంలో లావా బయటకు వస్తుందో అన్నట్లు అనిపిస్తుంటుంది. మరి ఎలాంటి కష్టాలు ఉన్నాయో చూసేవారికి తెలియదు కదా! ఏది ఏమైనా వారిని చూస్తుంటే మనస్సుకు కష్టంగా ఉంటుంది. వీళ్ళ కష్టాలు తొలగి, వారి జీవితంలో నవ్వుల పువ్వులు వికసిస్తే బాగుంటుందనిపిస్తుంది.
కొందరికి అన్నీ ఉన్నా, ఏ లోటూ లేకున్నా ముఖం మాత్రం ఏమీ లేవంటుంది. వారు చిరునవ్వులో చిరు భాగమే చూపిస్తారు. ఆ చిరునవ్వులో కూడా ఒక వేదాంత సారం లేదా ఒక విరక్తి భావం గోచరిస్తుంటుంది. వారు ఎదుటపడినప్పుడు ఎలా ఉన్నారని పొరపాటున ప్రశ్నిస్తే “ఏదో అలా... అలా...” అని అరచేతిని ఒకసారి చిన్నగా ఎత్తి, సాగిపోతోంది అన్నట్లుగా గద్గద స్వరంతో జవాబు ఇస్తారు. ఏ చింతలూ లేకున్నా తేనెతుట్టెలో చిక్కుకున్నామన్న భావం వారి ముఖం చెబుతుంటుంది. వారు అలా నిస్సారంగా ఉండటానికే ఇష్టపడతారు. భగవంతుడు తమకు ఇచ్చిన జీవితం యొక్క విలువను గుర్తించి, దానిని గౌరవించడం నేర్చుకోమని వీరికి తెలియజేయాలనిపిస్తుంది.
కొందరు గంభీరంగా, హుందాగా ఉంటారు శరత్చంద్ర కథల్లో ఇంటి పెద్దల్లాగా. వస్త్రధారణ కూడా బాగుంటుంది. మాటలను, నవ్వును పొదుపుగా వాడుతుంటారు. వాళ్ళ పని వాళ్ళది అన్నట్లుగా ఉంటారు. వాళ్ళని పలకరించవచ్చో లేదో తెలియదు. ఒకవేళ పలకరిస్తే కనుబొమ్మలతో కానీ, తలని కొంచెంగా ఆడించి గంభీరంగా తమ పనిలో నిమగ్నమైపోతారు.
కొందరి ముఖంలో కంగారు అన్ని వేళలా తాండవిస్తుంటుంది. ఆదరాబాదరాగా అటూ ఇటూ తిరుగుతుంటారు. అన్నింటికీ కంగారు పడిపోతుంటారు. వారికి కంగారు నుండి చిరాకు, చిరాకు నుండి కోపం పుట్టుకొస్తుంటాయి. వారిని పలకరిస్తే మరింత కంగారుకు లోనవుతుంటారు. వారి చుట్టుపక్కల అంతా తాపీగా, ప్రశాంతంగానే ఉంటుంది, కానీ వారి మనస్సు మాత్రం అలజడిగా ఉంటుంది. అలాంటి వారిని చూస్తే ‘పోనీ ధ్యానం చేసుకోరాదూ? కొంచెం కంగారు తగ్గుతుంది’ అని చెబుదామనిపిస్తుంది. కానీ ఎదుటివారిని మాట్లాడనిస్తేగా? “ఉండు, ఉండు” అంటూ గుండె పట్టుకుంటారు. ఎందుకొచ్చిందిలే! ఆ ధ్యానమేదో మనమే చేసుకుంటే పోతుంది అనిపిస్తుంది.
కొందరి ముఖాలు చాలా ఉత్సాహంగానూ, ఉల్లాసంగానూ ఉంటాయి. కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి, నేర్చుకోవాలనే ఉబలాటం, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవాలని, విజయ శిఖరాలు అధిరోహించాలనే కాంక్ష వీరిలో గోచరిస్తుంటుంది. ముఖంలో ఆత్మవిశ్వాసం చిప్పిల్లుతుంటుంది.
కొందరు ప్రతిదానికీ ఆశ్చర్యానికి లోనవుతుంటారు; ఏదో ఎప్పుడూ చూడనట్లు, విననట్లు, అర్థం కానట్లు. వారి ముఖంలో దిగ్భ్రమ, అయోమయం గోచరిస్తుంటాయి. వారి హావభావాలతో ఎదుటివారిని కూడా దిక్కుతోచని స్థితికి గురిచేస్తుంటారు.
కొందరు పంటి బిగువున ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని అదిమిపెట్టి ఉంచుతారు. బుసలు కొట్టే పాములాగా ఉండి ఉండి ఉద్రేకం బయటికి వస్తుంటుంది. తమ చుట్టుపక్కల ఎక్కడైనా అన్యాయం, అవినీతి కంటపడితే ఉద్వేగానికి లోనవుతారు. వెనువెంటనే దానిని సవరించడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి పూనుకుంటారు. వాగ్యుద్ధానికి దిగుతారు. వీరు ఉద్రేకపూరితమైన స్వభావం కలిగి ఉండటం చేత మనస్సు ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. వీరితో కలిసి బయటకు వెళ్లాలంటే ఎప్పుడు ఎక్కడ ఏ రణరంగం అవుతుందోనని వీరి తోడివారికి కొంచెం బిక్కుబిక్కుమని ఉంటుంది.
కొందరి ముఖాల్లో గర్వం, దానితో వచ్చే అహంకారం పొడసూపుతుంటాయి. జీవితంలో మేము అన్నీ సాధించేశాము, ఇక అంతకు మించి సాధించవలసింది ఏమీ లేదు అని కావచ్చు, లేదా తమను మించిన పండితులు లేరని కావచ్చు, లేదా ధనబలం కావచ్చు. ఇవి ఉన్నా లేకపోయినా ఆ రెండూ వారి నైజం కావచ్చు.
కొందరి ముఖాల్లో హావభావాలు ఎదుటి వారిలో భయాన్ని కలుగజేస్తాయి. బహుశా మనుషుల్లో క్రమశిక్షణను కలిగించడానికి అలా ప్రకటిస్తారేమో! ముందే భయం గొలిపేలా ఉంటే తమని ఎవరూ మోసం చేయడానికి ప్రయత్నించరనే ముందు జాగ్రత్త కూడా కావచ్చు. లేదా అది వారి నైజం కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు, ఎదుటివారికి మాత్రం ఇలాంటి వారికి దూరంగా ఉంటేనే నయం అనిపిస్తుంటుంది.
కొందరి ముఖాల్లో ప్రేమ, కరుణరసం తొంగి చూస్తుంటాయి.
ఒకొక్క భావం. ఒకొక్క ముఖం.
అందరి ముఖాలు అరవిందాలే! మనస్సులోని భావాలు ఎలాంటివైనా అవి మనకు తెలియకుండానే ముఖంలో ప్రతిబింబిస్తుంటాయి. కొన్ని ముఖాల్లో ఎక్కువగా ప్రస్ఫుటిస్తుంటాయి. కొన్ని భావాలను ఎంతగా మనస్సులో అదిమిపెట్టినా, కుక్కర్ విజిల్ వేసినప్పుడు స్టీమ్ వచ్చినట్లుగా ముఖంలోకి తన్నుకువచ్చేస్తాయి.
మరికొన్నింటిని దాచాలని చూసినా, ముఖం దాచలేక ఇబ్బందికి లోనవుతుంది. మనస్సులోని భావాలను బాహాటంగా ప్రకటిస్తేనే మంచిది. మనస్సు ఏ ఒత్తిడికి లోనుగాక తేలిక పడుతుంది.
***
కనకదుర్గా లక్ష్మీరత్న గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: కనకదుర్గా లక్ష్మీరత్న
నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.







చాలా మంచి వ్యాసం రాశారు రచయిత్రి. అందరూ చదవవలసిన వ్యాసం. అన్నిరకాల భావాలకి, ముఖ కవళిలకు అద్దం పట్టేరు. Positive vibes కి సానుకూల అనుభూతి అన్న ట్రాన్స్లేషన్ బావుంది.
'Face is the index of mind ' అన్నారు పెద్దలు. మొహం అనే.అద్దంలో వారి మనసు కనబడుతుంది. రత్నా గారు రకరకాల ముఖాదర్పణాలు వాటిలో ప్రస్ఫుటంగా కనిపించే హావభావాల గురించి అసక్తికరంగా వివరించారు.