top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 39


'Nallamala Nidhi Rahasyam Part - 39' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో తల్లి కోసం ఎదురుచూస్తూ, చనిపోయిన తన అన్ననే తలుచుకుంటూ ఏడుస్తోన్న సంజయ్ కి తోడుగా ఉండి, ధైర్యం చెప్తోంది అంజలి. అదే హాస్పిటల్ లో అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. సంజయ్ గుండె పగిలేలా ఏడుస్తూనే ఉన్నాడు.

ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి, "షీ ఈజ్ అవుట్ అఫ్ డేంజర్! నథింగ్ టు వర్రీ. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల హార్ట్ ఎటాక్ లాగా వచ్చింది. బట్ నథింగ్ సీరియస్. కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తాను. అవి వాడండి. ఆమె ఇంకో గంటలో స్పృహలోకి వచ్చేస్తారు. డోంట్ వర్రీ!" అని చెప్పి, సీత విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లారు.

తల్లిని దూరం నుండే చూసుకుంటూ, కన్నీరు మున్నీరు అవుతున్న సంజయ్ ని ఓదారుస్తూ, "ఆంటీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు జరగవలసింది చూడు" అని ధైర్యం చెప్పింది అంజలి. అజయ్ మరణానికి కారణం అతని ఊపిరితిత్తులలో చేరిన విష వాయువే అని రిపోర్ట్స్ వచ్చాయి. అతని భౌతిక దేహాన్ని ఇంటికి తరలించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అజయ్ మృతికి సంతాపం తెలియజేసారు. ఆ రోజంతా, అజయ్ ని చివరి చూపు చూసుకోవడం కోసం గాజు బాక్స్ లో పెట్టి ఉంచారు.

"తమ పిల్లల్ని ప్రాణాలకు తెగించి కాపాడి తెచ్చిన దేవుడే, ఇవాళ దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడే!"అంటూ అజయ్ కాపాడిన పిల్లల తల్లితండ్రులంతా, అజయ్ పార్ధివ దేహం దగ్గర కూలబడి ఏడుస్తున్నారు.

" మా పిల్లలను ఇక జన్మలో చూడలేము అనుకున్నాం. దేముడిలా వచ్చావయ్యా! దేవుడు పంపినట్టే వచ్చావు. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలి మేమంతా.." అంటూ ఆ పిల్లల తల్లులు, గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అజయ్ స్నేహితులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ వస్తున్నారు.

అజయ్ తో వారి బంధాన్ని గుర్తు చేసుకుంటూ, వారంతా కన్నీటి పర్యంతం అవుతుంటే, సంజయ్ మాత్రం ఏడ్చి, ఏడ్చి నీరు ఇంకిపోయిన సంద్రంలా, శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.

***

సీతకి స్పృహ రాగానే, " నాన్నా.. అజయ్!" అంటూ లేవడానికి ప్రయత్నం చేసింది. అంజలి ఆమెను ఓదారుస్తూ, డాక్టర్స్, నర్స్ ల సాయంతో అంబులెన్సులో సీతను ఇంటికి తీసుకు వచ్చింది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకుని విగత జీవిగా చూసిన ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

" మల్లన్న స్వామీ! నా బిడ్డని కాపాడమని ఎన్ని మొక్కులు మొక్కాను నీకు? జీవితంలో ఏమి చూసాడు వాడు! కాటికి కాళ్ళు జాపుకుని కూర్చున్న నన్ను వదిలేసి, నా బిడ్డను తీసుకెళ్లిపోయావే!

నీకూ ఒక తల్లి ఉండి ఉంటే తెలిసేది ఈ తల్లి బాధ! నీకు ప్రాణాలే కావాలంటే నా బిడ్డ ప్రాణానికి బదులు నా ప్రాణం తీసుకోవచ్చు కదా! అయ్యో.." అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్చడానికి అంజలి, అంజలి తల్లీ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు.

ఆమె ఈ పరిస్థితుల్లో అంతగా స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు అని, అంజలి ఆమెకు సడేషన్ ఇంజక్ట్ చేసింది. ఆమెను గదిలో పడుకోబెట్టి, సంజయ్ దగ్గరే కూర్చుంది అంజలి. కమల, కమల భర్త కూడా సంజయ్ కి ధైర్యం చెప్తూ, రేపు జరగవలసిన కార్యములకు ఏర్పాట్లు చేస్తూ, వచ్చిన వారందరికీ కావాల్సినవి అమరుస్తూ ఉన్నారు.

అజయ్ మరణం గురించి మీడియా ద్వారా ప్రపంచమంతా తెలిసింది. అజయ్ చూపించిన ధైర్య సాహసలకు, ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అందించనున్నట్లు సమాచారం, అందరికీ తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరిన నిధిని గురించిన వార్తలు కూడా మీడియాలో రావడం జరుగుతోంది.

***

జరిగినది అంతా తన తపోబలంతో తెలుసుకున్న సిద్ధాంతి గారు కూడా " తమ్ముడి కోసం ప్రాణ త్యాగం చేశాడా ఆ అన్నయ్య! అమ్మా, జగన్మాతా! ఏమి నీ లీలా? " అంటూ అజయ్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తూ ఉండిపోయారు.

***

మరునాడు ఉదయం, అజయ్ అంతిమ యాత్ర మొదలైంది. అతని డిపార్ట్మెంట్ వాళ్ళు, స్నేహితులతో పాటు, అజయ్ వల్ల మేలు పొందిన ప్రజలంతా, ఆ యాత్రలో పాల్గొన్నారు. పోలీస్ లాంచనాలతో అజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అతని మరణానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వ పెద్దలు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎన్నో దారుణాలను, సంబరాలను, వికృతాలను, విపరీతాలను ప్రతి నిత్యం చూస్తూ ఉన్న సూర్యనారాయణ మూర్తి, ఇవాళ జరిగింది కూడా చూస్తూనే, చూడటమే తన పని అంటూ, సాక్ష్యం చెప్పని ప్రత్యక్షసాక్షిలా, తానొక కర్మ సాక్షిని మాత్రమే అన్నట్టు భారంగా అస్తమించాడు.

ఆ అస్తమిస్తున్న సూర్యునిలాగే తన బిడ్డ కూడా అస్తమించి తనని శోక సంద్రపు సుడిలో, నావలా వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ, సీత కన్నీరు మున్నీరు అవుతోంది.

"ఈ చరాచర సృష్టిలో పుట్టడం సహజం, గిట్టడం సహజం, అనివార్యం.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।।

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి పుట్టుట తప్పదు. అనివార్యమగు ఈ విషయం కొరకు చింతించుట తగదు. చావు, పుట్టుకల అంతులేని, అలుపెరగని కాల చక్రపు ఇరుసులలో పడి నలిగిపోయే ఓ జీవీ! మరణం అనేది అనివార్యం అని గుర్తెరిగి మసలుకో. నువ్వు పుట్టినప్పుడే, నీ మరణం కూడా లిఖింపబడి ఉంటుంది. ఏనాడు అయినా అది నిన్ను వరింపక మానదు. అని గుర్తెరిగి మసలుకో. మరణించినంత మాత్రాన్న ఆ ఆత్మ నశించి పోయింది అని కాదు. మరణం అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు. మరణించిన వ్యక్తి శరీరం నుండి వేరైనా, ఆత్మ వేరొక కొత్త జన్మ ఎత్తి తీరుతుంది. ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరు చేస్తుందే కానీ ఆత్మను చంపదు"

అంటూ గీతా సారాంశం చదివి వినిపిస్తూ, సీతకి, సంజయ్ కి ధైర్యం చెప్పడం కోసం తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది అంజలి. అది అంజలి తల్లికి ఏ మాత్రం అభ్యంతరం లేదు. అప్పటికే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది.

ఇక ఏమి జరిగినా, తన కూతురి జీవితం సంజయ్ తోనే అని ఆమెకి అర్ధం అయిపోయింది కాబట్టి.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.29 views0 comments

Comments


bottom of page