top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 38


'Nallamala Nidhi Rahasyam Part - 38' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

నిర్జీవంగా పడి ఉన్న అజయ్ ని చూస్తూ, గుండెలవిసిపోయేలా రోదిస్తున్నాడు సంజయ్. తన అన్నగా మళ్ళీ పుట్టిన తన మిత్రుడ్ని గుండెలకు హత్తుకుని, "నిన్ను ఎలాగైనా కాపాడి తీరాలి అన్న కంగారులో నేను చేసిన తప్పుకి, నీ ప్రాణాలు పణంగా పెట్టావే! నిన్ను తీసుకు వస్తాను అని అమ్మకి చెప్పి ఇక్కడికి వచ్చిన నేను, ఇప్పుడు నీ శవాన్ని తీసుకు వెళ్ళాలా? అన్నయ్యా! అమ్మకి నేను ఏమని చెప్పాలిరా? ఎందుకు ఇంత త్యాగం చేసావురా?" అంటూ కన్నీటికే కన్నీరు పెట్టించేంతగా విలపిస్తున్నాడు సంజయ్. అప్పుడే అతని బుజం పై ఒక చేయ పడింది. అదిరిపడి పైకి చూసాడు సంజయ్. సంజయ్ నే చూస్తూ నిలబడ్డారు పూజారి గారు.

" పూజారిగారూ! చూడండి. మా అన్నయ్య.." అంటూ బోరుమని విలపించసాగాడు సంజయ్.

" ఏడవకు నాయనా! ఆ ఖడ్గమును సంపాదించాలి అని ఎంతో మంది ప్రయత్నం చేశారు. వారెవరు ప్రాణాలతో తిరిగి రాలేదు. మీరు కారణ జన్ములు కాబట్టే, బయటకు రాగలిగారు. ఈ జన్మలో నీకు అన్నగా పుట్టిన, నీ మిత్రుని మరణం బ్రహ్మ రాత నాయనా! ఇందులో నీ తప్పు ఏ మాత్రం లేదు" అంటున్న పూజారిగారి వైపు ఆశ్చర్యంగా చూస్తున్న సంజయ్ తో

" నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? మీరిరువురు లోపలికి వెళ్ళింది మొదలు, బయటకు వచ్చు వరకూ లోపల ఏమి జరిగింది అనేది నా దృష్టికి కనిపిస్తూనే ఉంది. అన్నను కాపాడుకోవాలని నువ్వు ఊబిలోకి దిగిపోవడం తెలుసు. మీ ఇద్దరూ అక్కడ నుండి బయటకు వస్తారు అని తెలుసు. ఇద్దరిలో ఒకరే మిగులుతారు అని కూడా తెలుసు. అసలు అక్కడే పోవాల్సిన నీ ప్రాణం, నిలబడింది. నిన్ను కాపాడి, మీ అన్నయ్య మృత్యువుకి బలి అయ్యాడు. కానీ ఇదే విధి! దీన్ని నువ్వు ఒప్పుకుని తీరాలి. నువ్వు ఇక్కడే ఎంత ఏడ్చినా, నీ అన్న తిరిగిరాడు. జరగవలసింది చూడు!" అంటూ సంజయ్ ను ఓదార్చసాగారు పూజారి గారు. ఆయన ఇంకా మాట్లాడుతూ

"సంజయ్! ఆ సింగా శవం కూడా కాలి బూడిద అయిపోయింది. జరిగిన దాన్ని ఋజువు చేసేందుకు మన దగ్గర ఏ విధమైన సాక్ష్యాలు లేవు. అలాగే నీ అన్న మరణానికి కూడా ఏ రకమైన సాక్ష్యాలు లేవు. పోలీసులు అడవి అంతా జల్లెడ పడుతున్నారు. ఏ నిమిషం అయినా మా గూడేనికి రావచ్చు. అందుకే నేను అక్కడ జరిగినది పోలీస్ లకు చెప్పవద్దు అని మా గూడెం వారికి చెప్పాను. అక్కడ అంత జరిగినట్లు ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశాను. ఆ ఖడ్గం అమ్మవారి అనుగ్రహంగా మళ్ళీ దాని స్థానం లోకి వెళ్ళిపోయింది.

ఆ సింగా ని వెతుకుతున్న మీ అన్నయ్య ఇక్కడికి వచ్చినట్లు పోలీస్ లకు చెప్పమన్నాను. వారు ఏ నిముషంలో అయినా ఇక్కడికి చేరవచ్చు. సింగా చనిపోలేదు. పారిపోయాడు. వాడిని వెతుకుతు ఇక్కడికి మీ అన్నయ్య వచ్చాడు. ఆ క్రమంలో ఈ నిధి మీ అన్నయ్యకు దొరికింది. ఇక మీ అన్నయ్య విష వాయువు వల్లే కదా చనిపోయాడు! అదే చెప్పు. ఇంత నాటకం ఎందుకు. నిజం చెప్పేయొచ్చు కదా అంటావా? నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. నీ అన్న మరణానికి నిన్నూ బలి చేస్తారు. అందుకే ఇలా చెప్పు" అంటూ తన ఉద్దేశం చెప్పారు పూజారి గారు.

అప్పుడు సంజయ్ కి తన అన్న మాట్లాడిన చివరి మాటలు గుర్తుకు వచ్చాయి.

వెంటనే ఆ నిధిని తెరిచి, అందులో విలువైన వజ్రాల మూటను పూజారి గారికి ఇచ్చి, "అయ్యా. ఇది మా అన్నయ్య చివరి కోరిక. ఆవాసాలను కోల్పోయిన నిరుపేద గిరిజనుల కోసం దీన్ని మీకు ఇస్తున్నాను. దీన్ని వారి అభివృద్ధి కోసం ఉపయోగించండి" అని చెప్పాడు.

" తప్పకుండా. అలాగే వారి కోసం ఉపయోగిస్తాను. అంటూ ఆ వజ్రాల మూటను తన దగ్గర భద్రపరుచుకుంటూ కన్నీరు తుడుచుకుంటూ, సంజయ్ ని ఓదార్చుతున్నారు పూజారి గారు.

***

"రిపోర్టర్ అనే వాడు ఎప్పుడూ మౌనంగా ఒకే చోట ఉండిపోకుడదు గంగా! ఏ విషయం అయినా ప్రపంచం ముందు నిలబెట్టే వృత్తి జర్నలిజం అంటే! అదే పనిని దైవం లాగా తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించే వ్యక్తే ఈ రాంబాబు" అంటూ ఆ వర్షంలోనే రైన్ కోట్లు, గొడుగుల సాయంతో ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ, చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసారు కెమెరా పట్టుకుని గంగ, ఆవిడతో పాటు పీకే ఛానల్ ప్రతినిధి రాంబాబు. అలా నడుస్తూ, నడుస్తూ గూడెం దాకా వచ్చేసారు వాళ్లు. అప్పుడే పోలీసులు కూడా అక్కడ గిరిజన గూడేనికి చేరుకున్నారు. వర్షం తగ్గడంతో సిగ్నల్ దొరికింది. ఇక లైవ్ స్టార్ట్ చేశారు పీకే ఛానల్ వారు.

" ఇన్స్పెక్టర్ అజయ్ కనిపించకుండా పోయి 24 గంటలు దాటి పోయినా, ఇంకా చిక్కని ఆచూకీ! నేరస్తుడు సింగా, అడవిలోనే ఉన్నట్టు సమాచారం అందుకున్న అజయ్, ఆ నేరస్థుడిని పట్టుకోవడానికి గాను అడవిలో, ఒంటరిగా రావడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన పై అధికారులు.. అజయ్, నేరస్తుడు సింగా లను పట్టుకునేందుకు అడవి మొత్తం జల్లెడ పడుతున్నా లభ్యం కానీ ఆచూకీ.. ఎన్నో నేరాలకు పాల్పడిన సింగా, తాజాగా ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కూడా చంపినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించడం జరిగింది. వర్షం కారణంగా గాలింపు చర్యలు వేగంగా చెప్పలేక పోవడం విచారకరం. ఐతే అక్కడ పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో ఉన్నారు.

“చెప్పండి రాంబాబు, అక్కడ ఏమి జరుగుతోంది? " అంటూ అప్పటి వరకూ అనర్గళంగా మాట్లాడిన న్యూస్ రీడర్, మాటలు అందుకుంటూ. రాంబాబు మాట్లాడటం మొదలుపెట్టాడు.

" సంధ్యా! 24 గంటలు దాటుతున్నా ఇన్స్పెక్టర్ అజయ్, ఇంకా ఆ నేరస్తుడు సింగా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీస్ లు గాలింపు చర్యలు చేపడుతూ ఇక్కడ గూడెం ప్రజలను వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఆ దృశ్యాలు లైవ్ లో చూడండి" అంటూ అక్కడి ప్రజలకు అజయ్, సింగాల ఫొటోస్ చూపిస్తూ, వారి గురించి పోలీసులు ప్రశ్నించడం చూపిస్తున్నారు.

అది టీవీ లో చూస్తూ ఉన్న సీత ఊపిరి బిగపట్టి, వారి సమాధానం వినడం కోసం ఎదురుచూస్తోంది.

పోలీస్ లు చూపించిన ఫోటోలు చూస్తూ,

"నాకు ఎరుక సార్! ఈ కూనడు ఇంకో మనిషిని తరుముకుంటూ నీలగిరి కొండగులవైపు పరుగెత్తక పోవడం మేము జూసినామ్ సారూ! ఆ తరువాత, అతని తమ్ముడు కూడా మా అయ్యోరుని ఎంటబెట్టుకుని, కొండల కానికి పోయిండు సారూ1 " అంటూ చెప్పాడు ఆ వ్యక్తి.

అంతే! ఆ వ్యక్తి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నీలగిరి కొండగుహలవైపు పరుగు అందుకున్నారు పోలీస్ లు.

వారి వెనుకనే కెమెరా మాన్ గంగతో, రాంబాబు కూడా లైవ్ ఇస్తూ, పోలీస్ లను వెంబడిస్తూ, వారి కర్తవ్యంగా ప్రపంచానికి అక్కడ విషయాలు తెలియజేస్తున్నారు. అది టీవీ లో చూస్తూ ఉన్న సీత గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన కొడుకు దొరుకుతాడా? లేదా అనే టెన్షన్ తో ఆమె నిలువెల్లా వణికిపోతున్న చిగురుటాకుని తలపిస్తోంది.

***

పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అక్కడికి చేరే సరికి విగత జీవిగా పడి ఉన్న అజయ్, గూడెం వాళ్ళు చెప్పినట్టుగా అజయ్ కోసం పూజారి గారిని వెంటపెట్టుకుని వెళ్లిన అజయ్ తమ్ముడు సంజయ్ కనిపించారు. అజయ్ మరణించాడు అనే వార్త మీడియా ద్వారా ప్రపంచం అంతా తెలిసిపోయింది. అలాగే అక్కడ ఉన్న నిధి గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. సింగా ఆ అడవిలో తప్పించుకు పోయాడు అని, అజయ్ ఆ నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఇక్కడికి వచ్చాడు, ఆ సమయంలో నిధిని కనుగొన్నాడు అని, అతన్ని వెతుకుతూ వచ్చిన అతని తమ్ముడు, పూజారిగారు ఇక్కడికి వచ్చేసరికే అజయ్ చనిపోయి ఉన్నాడు అని పూర్తి వివరాలు ఇంకా సేకరించవలసి ఉన్నాయని మీడియాకి చెప్పారు పోలీస్ అధికారులు.

అందంతా టీవీ లో చూస్తున్న సీత అంతులేని గుండె మంటలను తన అశృ వర్షంతో ఇంకా ఇంకా మండిస్తూ, ‘పుత్ర శోకం మిగల్చకు దేముడా!’ అని మొరపెట్టుకుంటూ, ఊపిరి బిగపట్టి, టీవీనే చూస్తూ ఉన్న ఆమె కళ్ళు, దేన్ని అయితే చూడకూడదు అని ఇంతలా మొక్కిందో, అదే ఆమెకు కనిపించింది. ఏదైతే వినకూడదు అని ఇంత వేదన పడిందో, అదే ఆమె చెవులకు వినిపిస్తూ ఉంటే. ఆమె కన్నులు వాలిపోయాయి. గుండె ఆ భారం మోయలేక, బ్రద్దలైపోతొందా అన్నంతగా నొప్పి వచ్చి, అమాంతంగా కుప్పకూలిపోయింది.

కానీ అంజలి డాక్టర్ కావడంతో వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించింది. కమల భర్త అంబులెన్సుకు కాల్ చేయడంతో, వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించారు.

***

ఆ కొండ గుహల నుంచి అజయ్ మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు. ఆ నిధిని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంది. అజయ్ మరణానికి చింతిస్తూ, అతని తల్లికి ప్రెసిడెంట్ మెడల్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కానీ సీత పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అన్నయ్య చనిపోయాడు అన్న బాధ ఒక పక్క, తల్లికి ఏమవుతుందో అన్న బాధ ఒక పక్క. సంజయ్ జీవచ్చవంలా హాస్పిటల్ లో పడి కుమిలిపోయి ఏడుస్తుంటే, అతని పక్కనే, అతనికి అండగా అంజలి కూర్చుని ఉంది. చీకటైపోయిన అతని జీవితంలో వెలుగుని తెచ్చే ఉషోదయ కిరణంలా, అమావాస్య కటిక చీకట్లలో వెలుగును చిందించే చిరు దీపంలా, గాయపడిన హృదయానికి చేరికగా, విధి చిమ్మిన విషానికి విచ్చిన్నమైన తన కుటుంబ జ్యోతిని తిరిగి వెలిగించగలిగే ఆశాజ్యోతిలా.. ఆమె అతనికి అండగా నిలిచింది.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.


29 views0 comments

Comments


bottom of page