top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 40


'Nallamala Nidhi Rahasyam Part - 40' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

సంజయ్ తన అన్ననే తల్చుకుంటూ, శున్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. అతనికి కాఫీ అందిస్తూ, "ఇంకా మనకి ఈ ఊరిలో ఏమి పని? మళ్ళీ మనము వైజాగ్ వెళ్ళిపోదాం. నువ్వు కూడా కాలేజీకి వెళ్లివస్తుంటే కాస్త దృష్టి మారుతుంది. ఆంటీని అమ్మ చూసుకుంటుంది. కార్యక్రమాలు అన్నీ అయిపోయాయిగా సంజయ్" అంటూ అంజలి, వైజాగ్ తిరిగి వెళ్లిపోవడం గురించి మాట్లాడుతూ ఉండగా

ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ " ఇక మీదట ఇదే నా ఊరు. నా అన్న ఊపిరి తనలో కలిపేసుకున్న ఈ ఆడవే ఇక మీదట నా ప్రపంచం. మా అన్నయ్య శ్వాస ఆగిపోయిన ఆ ఆడవే ఇకపై నా ఆవాసం, నా జీవితం, నా సర్వస్వం" అంటూ సూటిగా చెప్పాడు సంజయ్. ఆ మాటలు విన్న సీత స్థాణువులా ఉండిపోయింది. అంజలికి సంజయ్ మనసు అర్ధం అయింది.

కానీ అంజలి తల్లి సంజయ్ మాటకు అడ్డు వస్తూ, " ఏం మాట్లాడుతున్నావు బాబూ! ఇక్కడ ఎలా ఉంటావు? నీకు బోలెడంత మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఈ అడవిలో నువ్వు ఏమి చేస్తావు? " అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే

సంజయ్ లేచి నుంచుని, చేతులు జోడించి," ఆంటీ! మా అన్నయ్య నాతో భౌతికంగా లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఉంటే, ఇంకా వాడు నాతో ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. మా అన్నయ్య జ్ఞాపకాలు నన్ను కాల్చేస్తున్నాయి. నేను మా అన్నయ్య ఉనికిని తనలో కలిపేసుకున్న ఈ నల్లమలలోనే బ్రతకాలి అనుకుంటున్నాను.

ఇక్కడే ఉంటూ, వెనుకబడి బ్రతుకుతున్న అదివాసుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్తూ, వారి యోగక్షేమాలు చూస్తూ నా జీవితాన్ని వారి అభివృద్ధి కోసం ధారపోయాలి అనుకుంటున్నాను. నాకు ఈ అడవిలో ఉంటే, మా అన్నయ్య నాతో ఉన్నట్టు ఉంటుంది. ఇందులో మార్పు లేదు. రాదు" అంటూ సూటిగా, స్పష్టంగా చెప్పేసాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా, సంజయ్ నే చూస్తూ ఉండిపోయింది.

సీతకి సంజయ్ మాటల్లో, అతనికి తన అన్న మీద ఉన్న ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఆ తల్లి మనసు ఇంకేమీ మాట్లాడలేక గొంతు పూడుకుపోయి, కన్నుల వెంబడి కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ, తన అంగీకారం మౌనంగానే తెలిపింది. కొంత సేపు మౌనం రాజ్యం ఏలిన ఆ ఇంట్లో

" నేను నీతోటే, నీ వెంటే ఉంటాను." అన్న అంజలి మాటతో ఆ మౌనం మాటల రూపం దాల్చింది. గాడాంధకారంలో నిండిపోయిన అమావాస్య నిశీధి నింగిలోని చీకట్లను చీల్చుకుంటూ, వెలుగును చిందిస్తూ, ఉదయిస్తున్న సూర్యుని కిరణంలా ఆమె మాట్లాడిన ఆ ఒక్క మాట, సీత గుండెల్లో రేగుతున్న ఆవేదన మంటల అగ్నికీలలపై మంచు కురిసినంత చల్లదనాన్ని ఇస్తే, సంజయ్ మాత్రం, తన జీవితం ఇక ఆ అడవిలోనే అని, నాకోసం, నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని స్పష్టంగా చెప్పి, ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు.

అంజలి మాత్రం " నేనూ నా నిర్ణయాన్ని మార్చుకోను. నేను సంజయ్ తోనే బ్రతుకుతాను. సంజయ్ లేకపోతే చచ్చిపోతాను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే నేనూ ఉంటాను. ఆయన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. కాదు, కూడదు అని నువ్వు అంటే మాత్రం, నాన్న లేకుండా బ్రతుకుతున్నావ్ కదా! నేను కూడా చచ్చిపోయాను అనుకుని బ్రతుకు" అంటూ నిష్ఠురంగా మాట్లాడి, గది లోకి వెళ్లిపోయింది. అంజలి మాట్లాడిన మాటలు ఆమె తల్లి గుండెల్ని బాణాల్లా చీల్చేశాయి.సీత ఆమెను ఓదార్చబోతే, " చూసావా సీతమ్మా! నా కూతురు ఎంత మాట ఆందో.. అది మీ సంజయ్ ని ఇష్టపడుతోంది అని నాకు ఎప్పుడో తెలుసు. కానీ అది దానంతట అదే చెప్పాలి అనుకుంటూ ఎదురుచూశాను. సంజయ్ కి నా కూతుర్ని ఇవ్వడం నాకూ ఇష్టమేనమ్మా! కానీ, చూస్తూ, చూస్తూ, అడవుల్లో బతుకుతాను అంటున్నవాడికి నా కూతుర్ని ఎలా ఇవ్వగలను చెప్పమ్మా? " అంటూ ఏడుస్తుంటే,

ఆ మాటలు విన్న అంజలి బయటకు వచ్చి, "అమ్మా. సారీ అమ్మా!

నేను అలా మాట్లాడి ఉండకూడదు. కానీ నేను సంజయ్ లేకపొతే బ్రతకలేను అమ్మా! దయచేసి అర్ధం చేసుకో. నేనూ సంజయ్ ని పెళ్లి చేసుకుని, ఆయనతో పాటు ఆ అడవిలో ఉంటాను. ఆయన ఆ గిరిజన పిల్లలకు చదువు చెప్తే, నేనూ వైద్యురాలిగా, వారికి వైద్యం చేస్తూ, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను. నిజానికి నాకూ అందులోనే సంతోషం ఉంది" అంటూ తల్లిని ఒప్పించింది అంజలి.

****

ఇంట్లో నుంచి నడుచుకుంటూ వచ్చిన సంజయ్

నేరుగా ఆ గిరిజన గూడేనికి చేరుకున్నాడు. పూజారి గారిని కలుసుకుని, తన సంకల్పం గురించి చెప్పాడు. ఆయన ఎంతగానో సంతోషిస్తూ, సంజయ్ ఇచ్చిన వజ్రాలు అమ్మగా వచ్చిన డబ్బులతో, అక్కడి ప్రజలకు ఇళ్ళు కట్టిస్తున్నట్టు తెలిపారు. అక్కడి ప్రజలంతా కూడా, తమకు సాయం అందించినది సంజయ్ అని తెలుసుకుని అతన్ని ఎంతగానో అభినందిస్తూ, వారి అభిమానం చాటుకున్నారు. ‘ఇక మీదట నేనూ మీతోనే ఉంటాను’ అని సంజయ్ అన్న మాటకి వారంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

సంజయ్ వారందరితోను మాట్లాడుతూ, వారి జీవన విధానం గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా, కొంత మంది ఆ అడవిలోకి వస్తున్నారు. వారిని చూస్తూనే, సంజయ్ మొహంలో రంగులు మారిపోతున్నాయి. సంతోషం, దుఃఖం కలగలిపిన వింత భావమేదో తన హృదయాన్ని మెలిపెడుతుంటే, ఆ వస్తున్న వారినే చూస్తూ ఒక ప్రశ్నలా నిలబడి చూస్తున్నాడు సంజయ్.

***

గుండె పగిలే బాధ అనుభవించిన మనిషికి జీవితంలో ఆశలు చెదిరిపోయిన క్షణంలో పుట్టిన ఆశయం, ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందిస్తుంది. నిప్పుల కొలిమిలో కాలిన తరువాతే బంగారమైనా మెరుస్తుంది. ఉలి దెబ్బలు తిన్నాకే రాయి గుడిలో దేవుని ఆకృతి సంతరించుకుంటుంది. నమ్మి కొలిచే భక్తులకు అండై నిలుస్తుంది. విధి చేసే గాయాలకు జీవితం ఛిద్రమైన ఒక వ్యక్తి '’తను పడ్డ కష్టం పగవాడికి కూడా రాకూడదు’ అనుకుంటే 'మనిషి' అవుతాడు. 'తను పడిన కష్టం ఏమిటో ఎదుటివాడికి కూడా తెలియాలి' అనుకుంటే రాక్షసుడవుతాడు. ఏదైనా ఆ వ్యక్తి, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది.

ఒక్కోసారి మనిషి జీవితంలో, తన గమ్యాన్ని మలుపు తిప్పే పరిస్థితి ఎదురవుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ మనిషి తీసుకునే నిర్ణయం అతన్ని ముందుకు నడిపిస్తుంది. అది మంచి దారిలో నైనా కావచ్చు, చెడు దారిలో నైనా కావచ్చు.

ఇప్పుడు సంజయ్ తీసుకున్న నిర్ణయం కూడా అతని జీవితాన్ని ఏవిధంగా మార్చనుందో!

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.


50 views0 comments
bottom of page