top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 29


'Nallamala Nidhi Rahasyam Part - 29' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఉద్రేకంతో ఊగిపోతున్న అజయ్ వెనకనే నీడగా నిలబడి వికృతంగా నవ్వుతోంది సింగాని ఆవహించిన దుష్టాత్మ. అజయ్ తన వెనక ఉన్నది సింగానే అనుకుని ఒక్కసారిగా పిడికిలి బిగించి, వెనక్కి తిరిగి సింగా మొహంపై ఒక్క గుద్దు గుద్దాడు. మాములు మనిషి అయ్యుంటే ఆ ఫోర్స్ కి చచ్చిపోయేవాడు. కానీ ఇప్పుడు సింగా లాంటి నీచుడి వంట్లో ఇంకా నీచమైన నరేంద్రుని ఆత్మ ఆవహించి ఉండడం వల్లవాడికి ఏమీ కాలేదు.

వాడు ఇంకా వికృతంగా నవ్వుతూ గాలిలోకి ఎగిరిపోయి గిరగిరా తిరుగుతూ వికృతంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎలా ఉంది అంటే ఓ మాదిరి గుండె ధైర్యం కలవారికి అక్కడే గుండె ఆగిపోతుంది. అంత వికృతంగా, అత్యంత పాశవికంగా ఉంది ఆ నవ్వు.

"ఫగ్గబ్జ్ గ్బజ్జా, హుఖబిక్ జక్కమన్గగ్ హిజంగ్గు (పిరికి వెధవ! ధైర్యం ఉంటే నేరుగా నాతో తలపడరా!)” అన్నాడు అజయ్. తను ఇప్పుడు మార్తాండగా తనని తాను పూర్తిగా నమ్ముతూ! సింగా ఒక్కసారిగా నేల మీదకి దూకి, నేరుగా అజయ్ మీదకు దూసుకు వచ్చి, అజయ్ పీక పట్టుకోబోయి, గాలిలో ఎగిరి పడ్డాడు.

అంతలోనే తేరుకొని, "అయ్యారే! సిద్ధాంతి తెలివైన వాడురా! ముందే బంధనాలన్నీ బిగించేసాడు. ఐనా ఇంకెంతలే! రేపటి సూర్యగ్రహణం ఒక ఘడియ పాటు అన్ని శక్తుల్ని నిర్వీర్యం చేసేస్తుంది. అప్పుడు నా పగ తీర్చుకుంటా. నిన్ను మృత్యుదేవతకి కానుకిచ్చి , మళ్లీ నా వీర విహారం ఆరంభించెద!" అంటూ వికటాట్టహాసం చేస్తూ గాలిలో ఎగిరి మాయమైపోయింది.

ఇదే జరుగుతుంది అని ముందే ఊహించిన మరియా అక్కడే మౌనంగా అదంతా చూస్తూ ఉండిపోయింది. మార్తండగా తనని తాను ఊహించుకుంటున్న అజయ్ కి, తనకు నీడలా కావలికాస్తూ ఉన్న మరియా కనిపించింది.

"మరియా! ఓ నా ప్రాణమా!" అంటూ మరియా వైపుగా అడుగులు వేస్తున్నాడు అజయ్.

"ఆగు మామా! నీవు నన్ను తాకలేవు. నేను ఇప్పుడు ఆత్మను. నీకిచ్చిన మాట కోసం జన్మలుగా ఎదురుచూశాను. ఏ ఒక్కరినీ ఆ నిధిని తాకనివ్వలేదు. నీ మిత్రునికి నువ్వు మాటిచ్చావు. నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు. ఆనాటి నుండి ఈనాటి వరకూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నీ రాకకై వేచి ఉండి, విధి విధించిన వింత పయనంలో కల్లోల కడలిలోని నావలా, ఎడారి మంటల గ్రీష్మాన్ని గుండెల్లో దాచుకున్న ఆయువు లేని ఆకారాన్నయి నిలుచున్నా! ఏనాటికైనా నువ్వు తిరిగొస్తావని, మన ప్రేమ నిండిన ప్రణయ గీతికనే పాటలుగా పాడుకుంటూ..నీ అనురాగపు మాధుర్యంలోని మధురానుభూతులను కావ్యంగా మలుచుకుంటూ..ఆత్మనై మిగిలున్నా!

పున్నమి చంద్రుని సాక్షిగా, పచ్చని ప్రకృతి సాక్షిగా, సెలయేరుల సాక్షిగా ఈ అడవితల్లి నీడలో ఒక్కటైన మన జంట, పది కాలాలు పచ్చగా ఉండాలి అన్న మన గూడెం పెద్దల దీవెనలు ఫలించలేదు మామా! విధి వక్ర దృష్టి . మన జంటపై పడి, మనము విడిపోయాము. రెండు దేహాలు, ఒకటే ప్రాణం అనుకున్నాము మనము, మరణం కూడా మనల్ని విడదీయలేదు అనుకున్నాము. కానీ జాలి లేని విధి మరణం రూపంలో మనల్ని వేరు చేసింది.

ఊపిరి ఆగే క్షణం లో నీ ఆత్మ లోనే నా ఆత్మ కూడా కలిసి, పరమాత్మలో లీనం ఆయిపోవాలి అనిపించింది. కానీ నీకిచ్చిన మాట నాకు ఆ వరాన్ని కూడా దూరం చేసింది. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేని నేను.. నువ్వు లేకుండా నీ కోసమే ఎదురుచూస్తూ వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాను.

నీరాక నాకు విముక్తిని కల్పించనుంది. ఆత్మ రూపం నుండి పరమాత్మలోకి కలిసిపోయే సమయం వచ్చింది" అంటున్న మరియా మాటలకూ అడ్డువస్తూ

" నేనూ నీ దగ్గరికి వచ్చేస్తా ప్రియా! నన్ను వదిలి వెళ్ళకు" అంటూ భోరున విలపిస్తున్నాడు అజయ్.

" వద్దు మామా! నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. కానీ నా బాధ్యత పూర్తిచేసుకునే వెళ్తాను. ముందు నేను చెప్పబోయేది పూర్తిగా విను" అంటూ అజయ్ ని ఊరడిస్తూ, మరియా మాట్లాడడం ప్రారంభించింది.

***

సంజయ్ కారు వేగంగా పోనిస్తున్నాడు. అప్పటికే సంజయ్ డ్రైవింగ్ చూసి, అంజలి వాళ్ళ అమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. అంజలి,సంజయ్ కి ధైర్యం చెప్తోంది. సంజయ్ మాత్రం కార్ చాలా స్పీడ్ గా నడుపుతున్నాడు. అతని ధ్యాస అంతా తన అన్న మీదనే. అతనికి ఎప్పుడెప్పుడు తన అన్నని చూస్తానా.. ఎలా అతన్ని కాపాడతానా.. అనే ఆలోచనలు! అది గమనించిన అంజలి, సంజయ్ కి ధైర్యం చెబుతూ ఉంది.

అంజలి తల్లి మాత్రం "పోయి పోయి, ఇతన్ని డ్రైవ్ చేసి పెట్టమని అడిగాను. ఈ స్పీడేంటో? శ్రీశైలం తీసుకెడతాడో? డైరెక్ట్ గా శివుడి దగ్గరే నిలబెట్టేస్తాడో? ఓరి నాయనో! పూర్వ జన్మలో గుర్రాలెక్కి, యుద్ధాలు చేసేవాడేమో! ఓరి దేముడా.. నువ్వే దిక్కు మల్లన్నా! మమ్మల్ని కాపాడు స్వామి.." అంటూ మనసులోనే మొక్కుకుంటోంది. మరి ఆవిడకి పూర్తిగా తెలియదు కదా సంజయ్ దేని గురించి భయపడుతున్నాడు అనేది! ఆవిడ భయంలో ఆవిడ ఉంది పాపం. అంజలికి మాత్రం రేపు అజయ్ ని కాపాడే ప్రయత్నంలో తన సంజయ్ కి ఏమవుతుందో అన్న భయం వెంటాడుతూ ఉన్నా పైకి మాత్రం గంభీరంగా ఉండి, సంజయ్ ని కాచుకుంటోంది.

***

సీత మనసు మాత్రం కీడుని శంకిస్తూ ఉంది. ఆమె కుడి కన్ను విపరీతంగా అదురుతోంది. 'మా పెళ్లి విషయంలో జోక్యం చేసుకుని, కయ్యానికి కాలు దువ్విన ఆ సింగాతో అజయ్ కి విరోధం రావడం విధి నిర్ణయమా? ఇన్నేళ్ల తరువాత కూడా పాత పగను మనసులో పెట్టుకుని, నా కొడుకు జీవితంలోకి, ఆ సింగా కావాలనే వచ్చాడా? కాదు! అజయ్ నా కొడుకు అని సింగా కి ఎలా తెలుస్తుంది? కాదు. నా కొడుకు అని తెలిసి ఉండదు. ఇదంతా యాదృచ్చికంగానే జరిగి ఉంటుంది' అనుకుంటూ పరి పరి విధాలుగా ఆలోచిస్తూ కలవరపడిపోతోంది సీత. ఆమెకు ఉన్న ఒకే ఒక్క ధైర్యం ఆ మల్లన్న స్వామే! ఆయన్నే స్మరించుకుంటూ తన కొడుకులిద్దరూ క్షేమంగా ఇంటికి చేరాలని తపిస్తోంది ఆ తల్లి హృదయం.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :
రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
29 views0 comments

Comments


bottom of page