top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 30


'Nallamala Nidhi Rahasyam Part - 30' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. కానీ నా బాధ్యత పూర్తి చేసుకునే వెళ్తాను. ముందు నేను చెప్పబోయేది పూర్తిగా విను!" అంటూ అజయ్ ని ఊరడిస్తూ మరియా మాట్లాడడం ప్రారంభించింది.

"మామా! ఆనాటి మన ప్రేమ కన్నా, నిన్ను నమ్మి, నీ సాయం కోరిన మహారాజుకి నువ్వు ఇచ్చిన మాటే విలువైనది. నీకు గుర్తు ఉందో లేదో కానీ, నువ్వు నీచుడైన నరేంద్రుడిని చంపిన క్షణంలో,నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

"మిత్రమా! నీ చావుకి బదులు తీర్చుకున్నాను. కానీ నా ఊపిరి కూడా ఆగిపోతోంది. నిధిని నీ రాజ్యానికి చేర్చినా, ఆ నీచుల పాలు ఐపోతుంది. నువ్వే తిరిగి రావాలి. నువ్వొచ్చే నాడే నేనొస్తా! మళ్ళీ పుట్టొస్తా!" అన్న నీ మాటలు, నువ్వు మహారాజుకి చేసిన వాగ్దానమే నిన్ను మళ్ళీ పుట్టించింది. నువ్వు పుట్టినట్టే, మన మహారాజు ప్రతాపరుద్రుల వారు కూడా మళ్ళీ పుట్టారు.నీతో పాటే పుట్టిన, నీ కవల తమ్ముడు ఎవరనుకుంటున్నావ్? నువ్వు ఎవరికోసమైతే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి బదులు తీర్చుకున్నావో, ఆ మహారాజే నీ తమ్ముడు సంజయ్!" అంటున్న మరియా వైపు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో చూస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు అజయ్.

"ఏంటి మరియా? నువ్వు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను. నా తమ్ముడు సంజయ్, పూర్వజన్మలో ఆ మహారాజా? అయ్యో! ఎంత తప్పు చేసాను. ఆయన్ని నేను, నాకన్నా చిన్నవాడేగా, తమ్ముడే కదా అని ఎన్నో సార్లు ఆయనపై ఆధిపత్యం చూపించేవాడ్ని" అంటూ అజయ్ కుమిలి పోతుంటే, మరియా " జరగబోయే ప్రమాదం గురించి తెలిస్తే, ఇంకేమైపోతావ్ మామా!? " అంది. ఆ మాట విన్న అజయ్ సూటిగా మరియా కళ్ళలోకి చూసాడు. ఆమె మొహంలో బాధ, భయమే చెప్తోంది, రాబోయే ఉపద్రవం తీవ్రత.

మరియా, అజయ్ నే చూస్తూ "మామా! రేపు సూర్య గ్రహణం. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే గ్రహ కూటమి, రేపు రానుంది. ఇది మీ అన్నదమ్ములు ఇద్దరి జాతకంలోనూ కీడును కలిగిస్తుంది. ఇద్దరిలో ఎవరికైనా, ఏమైనా కావొచ్చు. లేదా ఇద్దరికీ హాని కలగవచ్చు! ఈ ఘడియ కోసమే ఆ నరేంద్రుడి దుష్టాత్మ మీరు పుట్టినరోజు నుండీ మీ 25 వ పుట్టినరోజు వరకూ మిమ్మల్ని ఏమీ చేయలేకుండా, రేపటి గ్రహణం రోజు కోసం ఎదురు చూస్తోంది. మీ 25వ పుట్టినరోజు రాత్రి నుండీ, కేవలం నీ మీద మాత్రమే దాడి చేస్తూ, నిన్ను హింసించాలని ప్రయత్నం చేస్తూ వచ్చేది. నీకన్నా రెండు నిముషాలే తేడాతో పుట్టిన నీ తమ్ముడిని మాత్రం ఏమీ చేసేది కాదు. నువ్వు మరల జన్మించి ఉండి ఉంటే, ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి, నా చెంతకు త్వరగా రావాలి అని నేను నిరంతరం ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారిని ప్రార్ధించడం వల్ల, నీ జాతక ప్రభావం వలన, వాడు నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడల్లా, నీవే వాడిని ఎదుర్కొనే వాడివి. కానీ అది నీకు గుర్తు ఉండేది కాదు. వాడికి 25 వ ఏట నీ జాతకంలో పొంచి ఉన్న మృత్యు గండం, ఇప్పుడు అనుకూలంగా మారింది. వాడు మీ రక్త సంబంధీకులలో ఒకరిని తన ఒక వాహకంగా మార్చుకుని, రేపటి గ్రహణ ఘడియలలో నిన్ను వధించి, ఆ వాహకంలోనే అమరుడై జీవిస్తూ, నిధిని కైవసం చేసుకుని, ఈ లోకాన్ని ఏలాలి అని పధకం రూపొందించాడు.

నేను చనిపోతూ వాడికి పెట్టిన శాపాన్నే, వాడు వరంగా మార్చుకోబోతున్నాడు మామా! అదే జరిగితే, ఈ ప్రపంచాన్నే తన చెప్పుచేతల్లో పెట్టుకోగలడు, ఆ నిధిని సొంతం చేసుకుని. మన మహారాజు ఆ నిధిని దేశం కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఉపయోగించాలని కోరాడు. ఆ కోరికతోనే, మళ్ళీ పుట్టాడు. ఆయనికి ఇదంతా గుర్తు లేకపోవచ్చు. కానీ ఆయన నీ తమ్ముడిగా మళ్ళీ పుట్టడానికి కారణం మాత్రం, ఆయన ఆశయమే. దేశం కోసమే మళ్ళీ పుట్టాడు ఆయన!అలాంటి మనిషిని, నీ నాశనం కోసం, తన వాహకంగా ఎంచుకున్నాడు ఆ నరేంద్రుడు. కానీ, మీ తమ్ముని వంటిపై ఉన్న రక్ష ఆ నీచుడ్ని మీ తమ్ముడిని తాకనివ్వక పోవడంతో, వేరొక వాహకాన్ని ఎంచుకున్నాడు. ఆ వేరొక వాహకమే, ఈ సింగా!" అంటూ మరియా చెప్తూ ఉంది.

"నువ్వు ఏమి చెప్తున్నావ్ మరియా? సింగా నాకు రక్త సంబంధీకుడు ఎలా అవుతాడు? " అంటూ అడిగాడు అజయ్.

"ఆవును మామా! సింగా ఈ జన్మలో నీకు రక్త సంబంధీకుడే." అంటూ మరియా సింగా గురించిన నిజం చెప్పనారంభించింది.

***

కారుని వాయువేగంలో నడుపుతూ, ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం అయిపోయింది సంజయ్ వాళ్ళకి.ఇంటి ముందు కారు ఆగగానే, సీత పరుగున వెళ్ళింది.సంజయ్ ని చూస్తూనే, ఏడుస్తూ వెళ్లి గట్టిగా పట్టేసుకుని, "వచ్చేసావా చిన్నోడా! " అంటూ భోరుమంది సీత.

అంజలి ఆమెను ఊరడిస్తూ, " మేము వచ్చేసాముగా ఆంటీ! ఇంక అంతా సంజయ్ చూసుకుంటాడు. మీరు ఏడవకండి." అంటూ ధైర్యం చెబుతూ లోపలికి తీసుకు వెళ్ళింది.

సంజయ్ మాత్రం, తనకి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల, అక్కడనుండే " అమ్మా! నువ్వు కంగారు పడకు. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు " అని చెప్పి అంజలితో "అమ్మని నేను వచ్చే వరకూ జాగ్రత్తగా చూసుకో" అని చెప్పి, సిద్ధాంతి గారు చెప్పిన పని పూర్తి చేసేందుకు బయలుదేరాడు. సంజయ్ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది అంజలి. ఆమె కంట వస్తున్న కన్నీటిని బలవంతంగా అదుపు చేసుకుంటూ..

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


38 views0 comments
bottom of page