top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 31


'Nallamala Nidhi Rahasyam Part - 31' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

సిద్ధాంతి గారు చెప్పినట్టుగానే, ఆ ఖడ్గమును సంపాదించడం కోసం, నల్లమల అడవులలో కొలువై ఉన్న మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి బయలుదేరాడు సంజయ్. అప్పటికే టైం రెండు అయిపోయింది. మూడింటి తరువాత, ఎవరినీ అడవిలోకి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వరు. సంజయ్ కార్ ని స్పీడ్ గా నడిపి, నంది సర్కిల్ కి చేరుకున్నాడు.

కార్ పక్కకి పార్క్ చేసుకుని, జీప్ మాట్లాడుకోడానికి వెడితే, ఎవ్వరూ ‘మేము రాము. ఇంక గంట తరువాత ఎవరిని లోపలికి అనుమతించరు, మీరు రేపు వెళ్ళండి’ అన్నారు. కానీ ఒక జీప్ అతను మాత్రం, సంజయ్ దగ్గరికి వచ్చి, "మిమ్మల్ని నేను తీసుకుపోతా! రండి, ఫారెస్ట్ ఆఫీసర్స్ ని నేను మేనేజ్ చేస్తాను " అంటూ నమ్మించి, జీప్ ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ వచ్చింది.

" మీరు కూర్చోండి. నేను వెళ్లి పర్మిషన్ తీసుకుని వస్తా!" అంటూ వెళ్ళాడు ఆ జీప్ నడిపే వ్యక్తి. సంజయ్ ఉన్న కంగారులో, అక్కడ ఏమి జరుగుతోందో గమనించలేదు.

ఆ జీప్ అతను వెళ్లి, "అయ్యా! అమ్మవారి గుడి కాడికి పోవాల! పర్మిషన్ ఇయ్యుండ్రి " అన్నాడు.

" ఇవాళ టైం అయిపోయింది. లోపలికి ఇంక అనుమతించం. రేపు రండి" అన్నారు అక్కడ ఆఫీసర్స్.

అంతే! ఆ జీప్ నడిపే వ్యక్తి, అక్కడ ఉన్న ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్స్ పీకల్ని చెరో చేత్తో గట్టిగా పట్టుకుని, గాలిలో పైకి లేపి, " అయ్యారే. ఈ నరేంద్రుని మాటకే ఎదురు చెప్తారా? వాడు పోవాలి. అడవిలోనే పోవాలి. మీకభ్యన్తరమా? " అంటూ గొంతు వికృతంగా మార్చి, ఆ ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిపేసాడు. మళ్ళీ వచ్చి జీప్ స్టార్ట్ చేసి, "పర్మిషన్ ఇచ్చిన్రు. " అంటూ వేగంగా అడవిలోకి పోనిచ్చాడు జీప్ ని. కొంత దూరం వెళ్ళాక జీప్ అడవిలోకి తిరిగాక, కొంత దూరం తీసుకెళ్లి జీప్ ఆపేసి, "ఇక్కడ నుండి నడుస్తూ పోవాలి. నువ్వు వచ్చే వరకూ నేను ఈడనే ఉంటా" అని చెప్పాడు ఆ జీప్ నడిపిన వ్యక్తి.

"చాలా థాంక్స్ అన్నా! " అంటూ అడవిలో ముందుకు సాగాడు సంజయ్.

"జన్మలు మారినా, నన్ను నమ్ముతూనే ఉంటావా ప్రతాప!" అంటూ వికృతంగా నవ్వాడు జీప్ వాడిలా సంజయ్ ని అడవిలోకి తీసుకువచ్చిన సింగా. కాదు..కాదు! సింగాలోని నరేంద్రుడు.

సంజయ్ అడవి మార్గంలో, దారులు చూపించే బోర్డుల సాయంతో ముందుకు వెడుతున్నాడు. అతని వెనకనే ఎవరో వస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసాడు. అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ నడక ప్రారంభించాడు. "రేపు ఉదయం ఏడింటికి ప్రారంభం అయ్యే సూర్యగ్రహణం లోపు ఖడ్గాన్ని సంపాదించాలి "అనుకుంటూ నడకలో వేగం పెంచాడు సంజయ్. అతన్ని నీడలా అదృశ్యంగా వెంటాడుతున్నాడు నరేంద్రుడు.

"వెళ్ళు మహారాజా! నువ్వు ఖడ్గాన్ని వెలికి తీయి. నాకు కావాల్సింది కూడా అదే" అనుకుంటూ సంజయ్ ని అనుసరిస్తూ గాలిలో ఎగురుతున్నాడు సింగాని ఆవహించి ఉన్న నరేంద్రుడు.

***

" అవును మావా! ఆ సింగా, ఈ జన్మలో నీకు రక్త సంబంధీకుడే. నీకు జన్మనిచ్చిన నీ తల్లి సీతకి స్వయానా బాబయ్య కొడుకు. నీకు మేనమామ అవుతాడు. అందుకే, ఆ నరేంద్రుని దుష్టాత్మ అతన్ని వాహకంగా మార్చుకుంది. ఆనాడు చనిపోయే క్షణం ముందు, నా నోటి నుంచి అలాంటి శాపం రావడానికి కారణం లేకపోలేదు. ఆ అమ్మవారే నా నోటి నుండి అలా పలికించింది.

వాడికి అంతం ఉంది. అది కూడా మళ్ళీ పుట్టిన నీ చేతిలోనే అని నా నోటి నుండీ అమ్మవారు పలికించుటకు కారణం, ఆ నీచుడి ఆత్మ, ప్రళయంగా మార కూడదు అనే!" అంటున్న మరియా వైపు ఆశ్చర్యంగా చూసాడు అజయ్.

" అర్ధం కాలేదా మావా! ఈ సృష్టిలో ఏదీ ఊరికే జరగదు మావా! అన్నిటికి కార్యాకారణ సంబంధం ఉంటుంది. ఆ నరేంద్రుని అంతం, మళ్ళీ పుట్టిన నీ చేతిలోనే, అని నేను శపించడం కూడా విధి లిఖితం. అందులో ఉన్న అంతరార్థం మానవమాత్రులకు అర్ధం కాదు. నిధి కోసం ఎందరో అమాయకులను బలి చేసిన ఆ క్రూరుడు, చివరికి ఆ నిధిని సొంతం చేసుకోకుండానే చనిపోయాడు. చనిపోయే క్షణంలో వాడు తీరని పగతో, నిధి మీద తీరని వ్యామోహంతో ఉన్నాడు. పగతో చనిపోయిన వాడు ప్రేతాత్మ గా మారతాడు. అలాంటి వాడి ఆత్మకు అంతం ఉండదు. అది సృష్టించే వినాశనానికి హద్దే ఉండదు. అందుకే, వాడి ఊపిరి పూర్తిగా ఆగక ముందే, వాడికి అంతం, నీ పుట్టుకతో ముడిపెట్టి, నా నోటితో చెప్పించింది ఆ జగన్మాత!" అంటూ చెప్తున్న మరియా మాటలు అజయ్ ని ఆలోచింపజేస్తున్నాయి.

"రేపటి సూర్యగ్రహణం మొదలు అయ్యేలోగా, మనము ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి చేరుకోవాలి. అక్కడ అమ్మవారి గుడి లోపల నుంచి సొరంగ మార్గం గుండా లోపలికి వెళితే, అక్కడ ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పం చేతిలో ఉన్న దివ్య ఖడ్గం మనకు చాలా అవసరం. దానితో మాత్రమే ఆ సింగాని ఆవహించి ఉన్న ఆ దుష్ఠుడ్ని నాశనం చేయగలం. మనము బయలుదేరాలి మావా!" అంటున్న మరియా వైపు చూస్తూ.

"వెళ్దాం మరియా! నేనూ వాడిని అంతం చేసి తీరుతాను. నిధిని మహారాజుకి అందించి, నా వాగ్దానాన్ని నిలబెట్టుకుని, నీతో వచ్చేస్తాను." అంటున్న అజయ్ ని వారించింది మరియా.

"అలా అనద్దు మావా! నేనూ ఆత్మని, నీవు మనిషివి. మన మధ్య ప్రేమ సృష్టికి విరుద్ధం!" అంటూ అజయ్ కి దూరంగా జరిగింది మరియా.

"సృష్టి ప్రేమతోనే మొదలైంది మరియా! మన ప్రేమ విధి ముందు ఓడిపోయింది అనుకుంటున్నావేమో, అది ఎప్పుడూ గెలుస్తూనే ఉంది. దానికి నిదర్శనం, నీ. దర్శనం.

మరణం విడదీసిన ప్రేమ. మరణమే కలిపే ప్రేమ. మన ప్రేమ అమర ప్రేమ. " అంటూ మరియాకి దగ్గరగా జరిగి, ఆమెను దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నం చేసి, గాలి లాంటి ఆమెను తనలో కలుపుకోలేక, చిన్నబోయాడు.

"ఇదే జరుగుతుంది మావా! ఇక మన పయనం ఇదే అవుతుంది. అందుకే చెబుతున్నా. నే వెళ్ళక తప్పదు. నువ్వు నిలవక తప్పదు. " అంటున్న మరియా కళ్ళలోకి సూటిగా చూస్తూ

"ఈ హృదయంలో నీ ప్రేమే నిలిచి ఉంటుంది.

ఈ కన్నుల్లో నీ రూపం కదలాడుతూనే ఉంటుంది.

నన్ను నీలో, నిన్ను నాలో కలిపేది మరణమే అయితే,

నా పునర్జన్మకి కారణమైన నా వాగ్దానాన్ని నెరవేర్చిన మరు క్షణం, నా ఊపిరి నీ ఆత్మకు నేను ఇస్తున్న కానుక అవుతుంది. ఇది ఆ కొండదేవరపై ఆన!

నేను ప్రేమించే నీ ఆన! నా ప్రపంచమైన ఈ నల్లమలపై ఆన!" అంటూ ప్రేమోన్మాదంతో, ఒక భగ్న ప్రేమికుడిగా ఆన చేసిన అజయ్ కి ఆ నిమిషం, తన ప్రేయసితో కలిసి జీవించిన గత జన్మ లోని మధుర క్షణాల వలన కలిగిన భావోద్రేగం, ఈ జన్మలో తానొక తల్లికి బిడ్డని అనే విజ్ఞతను చెరిపేసింది. ఇప్పుడు తన లక్ష్యం వైపుగా అడుగులు వేయనారంభించాడు అజయ్, మరియా తో కలిసి.

***

ఆ ఇద్దరు అన్నదమ్ముల క్షేమం కోరి, ఆయుష్ హోమం చేస్తున్న సిద్ధాంతి గారి దివ్య దృష్టికి అజయ్, తన పునర్జన్మకు కారణమైన వాగ్దానాన్ని నిలబెట్టుకుని, అది నెరవేరిన మరు క్షణం, మరియా కోసం చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు అని అర్ధం అయింది.

"అమ్మా, జగన్మాతా! ఏమి నీ లీల? ఆ తల్లికి గర్భశోకం తప్పదా?" అనుకుంటూ ఉండిపోయారు.సిద్ధాంతి గారు.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


21 views0 comments

留言


bottom of page