top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 37


'Nallamala Nidhi Rahasyam Part - 37' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

"మహారాజా! మీ నిధి పదిలముగా ఉన్నది. మీకు ఆ నిధిని అప్పగించి, నా కర్తవ్యం పూర్తి చేసుకొనవలెను. నేనిక పరమాత్మలో ఐక్యం కావలెను. అందుచేత, మీ ఇరువురిని నాతో తీసుకు వెడుతున్నాను" అంటూ పూజారి గారికి నమస్కరించి, ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారికి కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన ఆత్మ శక్తితో, ఆ ఇరువురు కారణ జన్ములను నిధిని దాచి ఉంచిన నీలగిరి కొండ గుహలలోకి తీసుకువెళ్ళింది. వారు ముగ్గురూ మెరుపు వేగంతో అక్కడికి చేరిపోయారు.

ఆ నీలగిరి కొండల వరకూ తన ఆత్మ శక్తి తో తీసుకు వచ్చిన మరియా, వారిని అక్కడ నుండి నడిపించుకుని తీసుకు వెడుతోంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన చెట్లు, గుబురైన పొదలు, లతలు, తీగలతో నిండిపోయి ఉంది. మరియా వారిరువురిని ‘నిధి ఉన్న ప్రాంతం ఇదే’ అంటూ లోపలికి తీసుకు వెళుతోంది.

అజయ్ కి, సంజయ్ ని విద్యుత్ ఘాతం నుండి కాపాడడానికి తాను చేసిన త్యాగానికి ఫలితం కొద్దికొద్దిగా తెలుస్తోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కడుపులో పేగులు మెలి తిప్పుతున్నట్టు బాధ మొదలైంది. కానీ, తన కర్తవ్యం నెరవేరే వరకు, ప్రాణాలు ఉగ్గబెట్టుకుంటూ, మరియా చూపిస్తున్న దిశగా నడవసాగాడు. వారు ఆ కొండ గుహలలోకి అడుగు పెట్టేసరికి, అజయ్ కి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కాసాగింది. కానీ అదేమీ బయట పడనివ్వకుండా, ఓపిక నటిస్తూ, నడుస్తున్నాడు అజయ్. ఎలాగో, ఆ నిధిని భద్రపరచిన స్థానానికి చేరుకున్నారు ముగ్గురూ.

మరియా తన ఆత్మ శక్తిని ప్రయోగించి, నిధిని దాచి ఉంచిన భోషాణాన్ని బయటకు తీసింది. ఆ క్రమంలో కొన్ని అస్థిపంజరాలు కూడా బయటపడ్డాయి. అవి ఈ జన్మలో అజయ్, సంజయ్ లకు తాత అయిన బసవయ్య, మరియు అతని పనివారివి. ఆ భోషాణాన్ని చూపిస్తూ, మరియా, సంజయ్ తో "మహారాజా! ఈ నిధి కోసమే ఆ నీచుడు పచ్చని మా బతుకులు బుగ్గిపాలు చేసాడు. ఈ నిధిని కాపాడే ప్రయత్నంలో వేల మంది ఆదివాసి వీరులు అమరులయ్యారు. నా పెనిమిటికి ఇచ్చిన మాట కోసం ఇన్ని జన్మలుగా నేను ఆత్మని అయినా కూడా, ఈ నిధికి కావలి ఉన్నాను" అని చెప్పి, అజయ్ వైపు తిరిగింది.

"మావా! ఆనాడు నీ ప్రాణం పోయే క్షణంలో నా దగ్గర మాట తీసుకున్నావు, నువ్వు వచ్చే వరకూ నిధికి కావలుండమని! ఆ నాడే నా ఊపిరి ఈ అనంత విశ్వంలో కలిసిపోయినా, అలసిపోని ఆకారాన్నై, అంతులేని శూన్యాన్నై, నీ రాక కోసం, జన్మలు వేచి, అలసి సొలసి ఉన్న నా ఆత్మఘోష, ఈ అరణ్యానికి మాత్రమే తెలుసు. నీ రాకతోనే నా తపస్సు ఫలించింది అనుకున్నా!

ఈనాటితో నా కర్తవ్యం తీరిపోయింది అని తెలుస్తున్నా.

నీ పరిష్వంగనకు సైతం నోచుకోని నేను నీలో ఎలా కలవగలను? మరు జన్మ కూడా కలుపలేని ఆగాథం మిగిల్చింది ఈ విధి. మన ప్రకృతి విరుద్ధమైన బంధంలో గాలిలా మిగిలిన నాకు తోడువై నువ్వు ఉంటాను అన్నా, ఉండనివ్వని విధి రాత, నన్ను చూసి హేళనగా నవ్వక మునుపే, పరమాత్మలో లీనం అయిపోతున్నా! మరువలేను నీ ప్రేమను! తిరిగిరాలేను నేను!" అంటూ తన పయనం మొదలు పెట్టబోయిన మరియా అజయ్ నోటిలోనుండి వస్తున్న రక్తాన్ని చూసి హతాశురాలు అయింది.

అంత వరకూ మౌనంగా మరియా మాటలు విన్న సంజయ్. అజయ్ ని ఆ పరిస్థితుల్లో చూసి, గుండె పగిలేలా ఏడుస్తూ " మిత్రమా! ఏమైంది నీకు.. ఈ రక్తం ఏమిటి? " అంటూ బోరున విలపించసాగాడు.

" మహారాజా! ఆ దివ్య ఖడ్గమును పొందదలచిన వ్యక్తి శివ లింగానికి అభిషేకం చేసి, ఆ అభిషేక జలమును తాను త్రాగి, ఆపై ఆ శిల్పంపై ఆ జలాన్ని చిలకరించి, ఖడ్గమును తీసుకొనవలెను. అభిషేకం చేసినను, ఆ అభిషేక జలాన్ని త్రాగకుండా, శిల్పంపై చిలకరించినను, ఖడ్గమును పొందవచ్చు. కానీ ఆ వ్యక్తి కొన్ని ఘడియల కంటే బ్రతకలేడు. అలా అని ఆ గ్రంధములో రాసి ఉంది. కానీ మీరు ఉన్న పరిస్థితుల్లో, ఆ నీటిని మీకు త్రాగించాను. అటుపై శిల్పం పై చిలకరించి, ఖడ్గమును తీసుకొన్నాను. మిమ్మల్ని కాపాడుకో గలిగాను . ఆ నీచుడ్ని అంతం చేయగలిగాను. నిధిని మీకు అప్పగించ గలిగాను. ఇదే నా పుట్టుకకు పరమార్ధం. మీకు నిధిని అప్పగించుట కొరకే నేను జన్మించాను. నా వాగ్దానం నేటితో నెరవేరింది. ఇక నా పయనం నా ప్రేమ కోసం జన్మలుగా వేచి ఉన్న నా ప్రేయసి కోసమే" అంటూ మరియా వైపు చూస్తూ

" నా ప్రేమ కోసం, నేను తీసుకున్న మాట కోసం జన్మలుగా నా కోసం ఎదురుచూసిన ఓ ప్రేమ మూర్తి! మరణం విడదీసిన మన ప్రేమను, మరణమే కలుపుతుంది. నాకోసం జన్మలు వేచి ఉన్న నీ ప్రేమకు, నా ప్రాణాన్నే కానుకగా ఇస్తాను. అని ఆన చేసాను. ఇది కూడా విధి లిఖితమే ప్రియా! నా అంతట నేనే మరణాన్ని ఆహ్వానించైనా నిను చేరుతాను అని ఆన చేసాను. కానీ, నా ఈ మరణం, నా గత జన్మలోని మిత్రునికి, ఈ జన్మలోని సహోదరునికి పునర్జన్మని ఇస్తూ, అన్నగా నా బాధ్యతను, ప్రియునిగా నా ప్రతిజ్ఞను రెండిటిని నెరవేరుస్తోంది. అని చెప్తూనే సంజయ్ వైపు తిరిగి,

" మిత్రమా! ఈ చరాచర సృష్టిని సృష్టించి, పాలించి, లయం చేయు , ఆ దేవాది దేవుని అనుజ్ఞ మేరకు, మీకిచ్చిన వాగ్దానం మేరకు, ఈ నిధిని మీకు అప్పగించు వరకు మాత్రమే నా పాత్రకి ప్రాణం ఉంది. ఈ జగన్నాటకంలో నా పాత్ర ముగియక తప్పదు. చివరిగా నాదొక విన్నపం. ఇచ్చిన మాటకోసం, గురు దక్షిణగా బొటనవేలు నరుక్కున్న ఏకలవ్యుని వారసులం! ఇచ్చిన మాట కోసం పుట్టుటలో ఆశ్చర్యం ఏమీ లేదు. నిజాయితీకి, స్వామిభక్తికి ప్రాణం పెట్టే మా ఆదిమవాసులు, ఆనాడు నరేంద్రునితో యుద్ధం జరిగినప్పుడు వారి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు.

ఈనాడు ధర్మానికి, దుష్ట ఆత్మకీ జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకపు గిరిజనులు తమ ఆవాసాలను సైతం కోల్పోయారు. వారికి న్యాయం చేయండి మహారాజా!. మీ ప్రాణం కాపాడాను అనే అధికారంతో కాదు, అభం శుభం తెలియని ఆ అమాయకుల కోసం అడుగుతున్నాను. ఈ నిధి ఇంకా ప్రభుత్వం ఆధీనం చేసుకోక మునుపే, వారికి కొంత సాయం అందించండి. ఈ జన్మలో నేను మీకు అన్నగా పుట్టాను. ఆ బాధ్యత తోనే నేను మీ ప్రాణం కోసం నా ప్రాణాన్ని అడ్డుపెట్టాను. నేను చనిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. అమ్మ గురించే నా బాధ! అమ్మని మీరు బాగా చూసుకుంటారు. నాకంటే గొప్పగా చూసుకుంటారు. అమ్మా జాగ్రత్త!" అంటూ అజయ్, సంజయ్ ఒడిలోనే కన్నుమూసాడు.

అతని ఆత్మ పూర్తిగా కోయరాజు మార్తాండగా మారింది. మరియా కన్నీటి సంద్రం అయింది.

"మావా! నీ ఆన ఇలా నెరవేర్చుకున్నావా? దీనిని ఏమనాలి మావా? నీ త్యాగం అనాలా? బ్రహ్మ రాత అనాలా? నా ఆత్మ రూపం నీకు కనిపించిన రోజు, ప్రేమోన్మాదంతో నువ్వు చేసిన ఆన నేను మర్చిపోలేదు.

"ఈ హృదయంలో నీ ప్రేమే నిలిచి ఉంటుంది.

ఈ కన్నుల్లో నీ రూపం కదలాడుతూనే ఉంటుంది.

నన్ను నీలో, నిన్ను నాలో కలిపేది మరణమే అయితే,

నా పునర్జన్మకి కారణమైన నా వాగ్దానాన్ని నెరవేర్చిన మరు క్షణం, నా ఊపిరి నీ ఆత్మకు నేను ఇస్తున్న కానుక అవుతుంది. ఇది ఆ కొండదేవర పై ఆన!

నేను ప్రేమించే నీ పై ఆన!

నా ప్రపంచమైన ఈ నల్లమల పై ఆన!" అంటూ నీ మరణం నా ప్రేమకు కానుక అవుతుందని ఆన చేసావు. ఆ ఆన ఈ రూపంలో నిలబెట్టుకున్నావా?" అంటూ మార్తాండ ఆత్మను గాఢంగా కౌగిలించుకుంది మరియా. ఆ ఇద్దరి పవిత్ర ఆత్మలకీ బోరున విలపిస్తూ చేతులు జోడించి దండం పెట్టాడు సంజయ్. ఆ పవిత్ర ఆత్మలు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని, పరమాత్మలో లీనం అయిపోయాయి.

" అయ్యో మిత్రమా! నాకోసం, నీ ప్రాణాలు పణం పెట్టావు. అన్నగా, నీ బాధ్యతగా నన్ను కాపాడి, నువ్వు మృత్యువుకి బలి అయిపోయావు. నిన్ను కాపాడటానికి వచ్చిన నన్ను కాపాడడం కోసం, నువ్వు బలి అయిపోయావు. అమ్మకి నేను ఏమని చెప్పను?" అంటూ శోకసంద్రంలో మునిగిపోయాడు సంజయ్.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.





12 views0 comments
bottom of page