top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 41


'Nallamala Nidhi Rahasyam Part - 40' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

పూజారి గారి సాయంతో, అక్కడ ఉన్న ప్రజల కష్టాల గురించి, వారి జీవన విధానం గురించి తెలుసుకుంటూ, చాలా సమయం గడిపాడు సంజయ్. తను కూడా వారితో పాటు కలిసి బ్రతకాలి అనుకుంటున్నట్టు సంజయ్ వారికి తెలియజేయగానే, అక్కడి ప్రజలంతా, తమను ఆదుకున్న వాడు తమతోనే ఉంటాను అనడంతో ఎంతో సంతోషించారు.

అలా వారితో మాట్లాడుతూ ఉండగా, కొంతమంది ఆ అడవిలోకి రావడం గమనించిన సంజయ్ మొహంలో రంగులు మారిపోయాయి. సంతోషం, దుఃఖం అనే రెండు విభిన్న భావాలు తన మనసుని మెలిపెడుతుంటే, అప్రయత్నంగా అతని కంటి నుండి కారుతున్న ఆనంద అశ్రుభాష్పాలను తుడుచుకుంటూ, " అంజలీ. అమ్మా! అంటీ.. మీరంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? " అంటూ ఎదురు వెళ్లి వాళ్ళని ప్రశ్నించాడు సంజయ్.

అంజలి తల్లి, సంజయ్ చేతిలో అంజలి చేయి పెట్టి, " నా కూతురు ఇక మీదట నీతోనే బ్రతుకుతుంది. నీ ప్రేమ కోసమే నా కూతురు బ్రతుకుతోంది. నువ్వు కాదంటే అది బ్రతకదు . మీ ఇద్దరూ ఒకటి అయితే, మీ ఇద్దర్నీ చూసుకుంటూ మేము ఇద్దరం కూడా మీతోనే ఇక్కడే బ్రతుకుతాం. కాదనకు బాబూ!" అంటూ అంజలిని సంజయ్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి తన అంగీకారం తెలిపింది. సీత కూడా సంజయ్ కి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ సంజయ్ మాత్రం అంజలి జీవితం పాడవుతుంది అన్న ఆలోచనతో, అంజలికి ఈ పెళ్లి ఉద్దేశ్యం మార్చుకోమని నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు.

" నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి వృత్తిలో ఉన్నా, నీ లక్ష్యం ఏది అయినా.. నేను నీకు తోడుగా ఉంటాను. అరణ్యం అయినా వైభోగమే నాకు. నీతో ఉంటే నాకు అంతే చాలు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంత చెప్పినా నువ్వు కాదు అంటే మాత్రం నా ఊపిరి ఇక్కడే ఆపేసుకుంటాను కానీ, నిన్ను వదిలి నేను ఉండలేను" అంటూ అంజలి, సంజయ్ ని తన ప్రేమతో ఒప్పించింది.

పూజారి గారి ఆశీస్సులతో, కల్మషం లేని అక్కడి ప్రజల సహకారంతో అంజలి, సంజయ్ ల వివాహం జరిగింది. సీత, దుర్గలు కూడా పిల్లలతో కలిసి ఆ గూడెం లోనే ఉండి పోయేందుకు ఏర్పాట్లు చేసుకుని, వారి జీవనం మొదలుపెట్టారు. ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడిలోనే కూర్చుని, తన జీవితంలో కోల్పోయిన వారి గురించి బాధపడుతునే, అందులో నుండి పుట్టుకు వచ్చిన వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవనానికి అలవాటు పడింది సీత.

దుర్గ ఆమెను వెన్నంటే ఉంటూ, గుడికి వచ్చి పోయే భక్తులకు ప్రసాదాలు అందిస్తూ, నిత్యం అన్నదానం చేస్తూ, తన ఆస్తిని అమ్మవారి సేవకు ఖర్చు చేస్తూ, జీవితాన్ని సార్థకం చేసుకుంటోంది. సంజయ్ తన ఆశయ సాధన వైపు అడుగులు వేస్తున్నాడు. ఆ గూడెం లోని ప్రజలకు, చుట్టు పక్కల ఊర్లలోని పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపాలనే పట్టుదలతో, అభివృద్ధి వైపుగా అతని అడుగులు ముందుకు పడుతూ ఉంటే, ఆ అడుగులలో అడుగులు వేస్తూ, సహధర్మచారిణి గా అతని ఆశయంలో కూడా సగ భాగం నాది అంటూ అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ, వైద్యరాలిగా తన వృత్తి ధర్మం పాటిస్తోంది. అజయ్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేకపోయినా, ప్రాణానికి ప్రాణం అయిన నా అన్న, తన ప్రాణం నా కోసం త్యాగం చేసాడే అన్న బాధతో కుమిలిపోతున్న సంజయ్ ని ప్రేమతో ఓదార్చేది అంజలి. ఆమె చూపించిన ప్రేమ, ఆదరణతో, సంజయ్ లో కొద్దికొద్దిగా మార్పు వచ్చింది. అలా ఒక ఏడాది కాలం గడిచిపోయింది.

ఇప్పుడు అంజలి నిండు గర్భవతి. ఆమె కడుపులో పెరుగుతున్నది తన పెద్ద కొడుకు అజయ్ నే అని సిద్ధాంతి గారి ద్వారా తెలుసుకున్న సీత ఆనందానికి హద్దే లేదు. సంజయ్, సీతలు అంజలిని ఎంతో అపురూపంగా చూసుకునే వారు. అది చూసి అంజలి తల్లి దుర్గ ఎంతో సంతోషించింది. అది కాక ఆ గూడెం ప్రజలు సంజయ్ ని, అంజలిని దేవతల్లా చూసే వారు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మీద కూడా వారందరికీ ఎంతో అభిమానం ఏర్పడింది.

అందరూ కలిసి అంజలిని కాలు కింద పెట్టకుండా ఎంతో అపురూపంగా చూసుకునే వారు. అందరూ ఎదురుచూసిన ఆ ఘడియలు రానే వచ్చాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయంలో, అత్యంత శుభాన్ని చేకూర్చే శుభముహూర్తంలో, అక్కడి ఆడవారి అనుభవంతో పురుడు పోయగా. పండంటి మగపిల్లవాడు జన్మించాడు.

ఆ పిల్లాడిని మొదటి సారి తన చేతుల్లోకి తీసుకున్న సీత ఆనందం వర్ణనాతీతం. అచ్చు పసి బిడ్డగా ఉన్న అజయ్ నే మళ్ళీ ఎత్తుకున్న అనుభూతి కలిగింది సీతకి. ఆ పుట్టిన వాడు తన బిడ్డ అజయ్ నే అని గుర్తుగా. అజయ్ కి చేతి మీద ఉండే పుట్టు మచ్చే, ఈ పసి బిడ్డ చేతి మీద ఉంది.

"సిద్ధాంతి గారు చెప్పినట్టే నా అజయ్ మళ్ళీ పుట్టాడు" అంటూ ఆనంద భాష్పలతో ఆ తల్లి ఆ పసి బిడ్డను సంజయ్ చేతిలో పెట్టింది.

తండ్రిని అయ్యాను అన్న దాని కంటే, తన అన్నే మళ్ళీ పుట్టాడు అన్న సంతోషమే సంజయ్ ని ముంచేత్తేసింది. ఆ తల్లి కొడుకులు, ఆ పసిబిడ్డను చూసుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇన్ని రోజుల తరువాత సంజయ్ మొహంలో నిజమైన సంతోషాన్ని చూసి, అంజలి ఎంతగానో సంతోషించింది. ఆ పిల్లవాడి ఆలనా, పాలన లో సీత, దుర్గలకు ఇక లోకం తెలియట్లేదు.

సంజయ్, అంజలి లు ఆ ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతూనే, వారికి మళ్ళీ కొడుకుగా పుట్టిన అజయ్ ని చూసుకుంటూ, బతకడం అంటే నలుగురిని బ్రతికించడం అన్నట్టు వారి జీవనాన్ని ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ఆ పిల్లవాడికి అజయ్ మార్తాండ అని పేరు పెట్టుకుని, ఆ పిల్లాడే అజయ్ అనే నమ్మకంతో ఉన్నారు వారు. అలా అజయ్ మళ్ళీ పుట్టి, తొమ్మిది నెలలు గడిచాయి.

అజయ్ కి అన్నప్రాసన చేయడం కోసం సీత మొక్కుకున్నట్టు శ్రీశైలం గుడిలో ఏర్పాట్లు చేశారు సంజయ్, అంజలిలు. వారంతా అక్కడికి చేరుకునే సరికి, అక్కడ ఇంకో కుటుంబం కూడా అన్నప్రాసన కోసమే వచ్చారని , రెండు కుటుంబాలకి ఒకసారి ముహూర్తం కుదరడంతో కలిసి చేసుకోవలసిందిగా పూజారి గారు సంజయ్ ని కోరారు. సంజయ్ ఒప్పుకోవడంతో, ఆ కుటుంబం వాళ్లు కూడా, వీరితో కలిసి అన్నప్రాసన ముహుర్తానికల్లా, వారి బిడ్డను తీసుకుని వచ్చారు.

వారికి పాప. పచ్చరంగు పట్టుపరికిణి కట్టుకున్న చందమామ లాగ ఉంది ఆ పసి పాప! పాల తెలుపులో, కలువల్లాంటి కళ్ళతో, ఆ కళ్ళకు కాటుకతో, ఆగులుతో పెట్టిన దిష్టి చుక్కతో, ఆ పసి పాప ఎంతో ముద్దుగా ఉంది. ఆ పాపని చూస్తూనే అంజలి, దగ్గరకు తీసుకుంది.పేరేంటి అని అడగబోయింది. ఇంతలో "ముహూర్తం ముంచుకోస్తోంది. పిల్లల్ని తీసుకు వచ్చి, తల్లిదండ్రులు పీటల మీద కూర్చోండమ్మా" అన్న బ్రహ్మ గారి పిలుపుతో, ఎవరి పిల్లల్ని వాళ్లు ఎత్తుకుని, పీటల మీద కూర్చుని, పూజ చేశారు. పూజ అంత అయ్యాక, పసి పిల్లలిద్దర్ని కింద పడుకోబెట్టారు.

అన్నప్రాసన రోజు వారు పాకుతూ వెళ్లి, ఏది పట్టుకుంటారా అని ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు ఆత్రంగా చూస్తూ ఉంటే ఆ పిల్లలు ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా వచ్చి, బాగా పరిచయం ఉన్న వారిలా గట్టిగా ఒకరినొకరు పట్టుకుని, కిల కిలా బోసినవ్వులు నవ్వేస్తున్నారు. అది చూసి, బ్రహ్మ గారు. " ఆహా! బాగున్నారు ఇద్దరూ. వెళ్లి విడిపించండి. ఏమి పట్టుకుంటారో చూద్దాం!" అన్నారు.

" మార్తా .. మార్తా.." అంటూ అంజలి,

" మరియా.. మరియా.."అంటూ ఆ పిల్ల తల్లి, ఇద్దరినీ విడిపించడానికి ఆ పిల్లల్ని పట్టుకున్నారు.

అప్పుడు అంజలి, సంజయ్ లు మోహ మొహాలు చూసుకుని, "మీ అమ్మాయి పేరు మరియానా?" అని అడిగారు ఆ పిల్ల తల్లి తండ్రుల్ని.

అవును. అన్నట్టు తల ఊపారు ఆ పిల్ల తల్లి తండ్రులు.

సంజయ్ వాళ్లకి విషయం అర్ధం అయిపోయింది. ఇక వారిద్దరినీ విడదీయడం ఎవరి తరం కాదు అని.

"ఇదీ విషయం! మన అజయ్ మళ్ళీ పుట్టినట్టే, మరియా కూడా మళ్ళీ పుట్టింది. " అంటూ నవ్వింది సీత. మరణం లేని అమర ప్రేమ ఈ ప్రేమికులది. చావు పుట్టుకలు దేహానికి మాత్రమే కానీ ఆత్మకి కాదు. జన్మలుగా తన ప్రియుని కోసం ఎదురుచూసిన మరియాని తన ప్రేమే మళ్ళీ పుట్టించింది. మరణించి తన ప్రేమ కోసం మళ్ళీ పుట్టిన మార్తండ ప్రేమ గెలిచే తీరుతుంది. విధి ముందు ప్రేమ ఓడిపోయినట్టు కనిపిస్తూ ఉన్నా, మరణమే లేని ప్రేమను ఓడించేందుకు విధి చేసే ప్రయత్నం ఎప్పుడూ విఫలమే.

మరణమనేది లేని దానికి ఓటమా? అది అసాధ్యం!

ప్రేమతో విధిపై గెలుపు సుసాధ్యం.

ప్రేమ అమరం, అఖిలం, అజరామరం.

ఇక్కడితో కథ ( ఆరంభం ) సమాప్తం 🙏

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.


34 views0 comments
bottom of page