నమ్మదగిన నేస్తం
- Gorthi Vani

- Jun 30
- 6 min read
Telugu Stories, Emotional Telugu Story, Family Story Telugu, Atta Kodalu, Mother-in-Law Story, Life Lesson, Relationship Story, Heart-Touching Story, Mana Telugu Kathalu, Telugu Moral Stories, Family Emotions, Trust, Inspirational Story

Nammadagina Nestham - Telugu Emotional Family Story | Gorthi VaniSrinivas
నమ్మదగిన నేస్తం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | గొర్తి వాణిశ్రీనివాస్ | ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 30/06/2026
మన జీవితంలో మనసులోని ప్రతి మాట చెప్పాలనిపించే ఒక్క మనిషి ఉంటాడు...
ఆ వ్యక్తి ఒక్కసారిగా లేకపోతే?
అప్పుడు ఎవరిని నమ్మాలి...?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే హృదయాన్ని కదిలించే గొర్తి వాణి శ్రీనివాస్ గారి చక్కటి కథ "నమ్మదగిన నేస్తం" చదవండి.
సౌమ్య అత్తగారి ఖాళీ మంచంతో మాట్లాడుతుండటం చూసిన భాస్కర్ అదిరిపడ్డాడు. ఎనభై ఏళ్ళ తన తల్లి చనిపోతే కోడలు సౌమ్య ఎందుకింత బాధ పడుతోంది?!
అత్తగారు మంచంమీద ఉన్నప్పుడు సౌమ్య బెంగ పెట్టుకుంది. బతకాలని దేవుళ్ళకి మొక్కుకుంది. మందులు క్రమం తప్పకుండా వాడింది. అత్త మంచం పక్కనే పడుకుని లేచినప్పుడల్లా తనూ లేచేది. “ఎందుకు మాటిమాటికీ లేస్తావు. నాకేం కాదు.నువ్వు పడుకో” అనేది అత్తగారు.
వయసు ప్రభావం చేత ఆరోగ్యం క్షీణించి చనిపోయింది.
బాధలో మునిగిన సౌమ్యను ఓదార్చాడు భాస్కర్.
“నలభై పదులు దాటినా తత్వం బోధపడకపోతే ఎట్లా సౌమ్యా?! అమ్మ శారీరకంగా ఎన్నో బాధలు పడింది. ఆవిడ్ని అలా చూడలేక మనమెంత నలిగిపోయాం?!
పుట్టినవాళ్ళు గిట్టక తప్పదు. అయినా నాకు లేనిబాధ నీకెందుకు?!” భాస్కర్ భార్యను ఓదారుస్తూనే మందలించాడు.
అప్పటివరకూ చెంప కింద చేయ్యి పెట్టుకుని కూర్చుని వింటున్న సౌమ్యకు కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. గొంతు జీరబోయింది.
“ఇదే అనొద్దన్నాను. మీరు ఏరోజైనా ఆవిడకు ఒక్క టాబ్లెట్ చించి ఇచ్చారా? ఆవిడ అలవాట్లు ఆహార నిద్రాదుల్ని కనిపెట్టుకున్నది నేను. అంతెందుకు ఇన్నేళ్లలో ఆవిడ్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లానా? వెళితే వెంట తీసుకువెళ్ళేదాన్ని. వీపుకు కట్టుకుని తిరిగాను. ఈరోజు ఆవిడ నా కళ్ళముందు లేకపోతే నాకెలా ఉంటుంది?” సౌమ్య మాటలకి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు భాస్కర్ కి.
“ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు? పైకెళ్ళి ఆవిడ్ని కిందకి తీసుకురమ్మంటావా?! అసలు ఈ అర్జున విషాద యోగం దేనికి? మీ అక్కావాళ్ళింటికి వెళ్ళి నాలుగురోజులు వుండిరా? తీర్థయాత్రకు వెళదాం పద. టిక్కెట్లు బుక్ చేస్తాను” అన్నాడు భాస్కర్ కాస్త విసుగ్గా.
సౌమ్య భర్తకు కాఫీ ఇచ్చి తను తాగి కాస్త తెప్పరిల్లింది.
సావధానంగా కూర్చుని
“అది కాదండీ…! మీ అమ్మగారూ, నేనూ ఎలా ఉండేవాళ్ళం?! నా మనసులో మాటను ఆవిడకి చెప్పుకునేదాన్ని. నాకు అనుకూలంగా మాట్లాడేవారు. వీధి చివర వాళ్ళ దగ్గర్నుంచి, చుట్టాల వరకూ ఒకటేవిటి, అన్నీ చెప్పుకునేవాళ్ళం. సీరియల్స్ కలిసి చూస్తూ చర్చించుకునేవాళ్ళం. మా ఇద్దరికీ మరో మనిషి అవసరం ఉండేది కాదు. ఆవిడకి చెప్పిన మాట మరో మనిషికి తెలిసే అవకాశం లేదు. అంత నమ్మదగిన మనిషి కాబట్టే అన్ని విషయాలూ ఆవిడతో పంచుకునేదాన్ని. నాకిప్పుడెవరున్నారు? కడుపులో మాట కడుపులోనే ఉంచుకోవాలి. ఎవరికైనా చెబితే మూడోవ్యక్తికి చెప్పకుండా వుంటారా?” మళ్ళీ పొంగుకొస్తున్న కన్నీళ్లను చీరకొంగుతో అద్దుకుంది సౌమ్య.
ఈ మూడోవ్యక్తి గోలేవిటో అర్థంకాలేదు భాస్కర్ కి.
“నీ బాధంతా నీ మనసులో మాటలు వినేవాళ్ళు లేరనా? నేనున్నానుగా..! నాతో చెప్పరాదా” అన్నాడు అనునయంగా.
“మా ఆడవాళ్ళ విషయాలు మీకు నచ్చవు. పక్కింటి బేబమ్మ పీచు బేరాలు, ఎదురింటి విశాల కోడలితో తగాదాలు. బోలెడు విషయాలుంటాయి మాకు. మీరు పొద్దున వెళితే రాత్రికి వస్తారు. వినే టైమ్ ఎక్కడుంటుంది? ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి నేను” దిగులుగా మొహం పెట్టింది సౌమ్య.
“ఎవరితో ఒకళ్ళతో చెప్పుకోకపోతే పొద్దు గడవదా నీకు? అయినా అన్ని విషయాలూ తలకెక్కించుకుంటే పిచ్చెక్కుతుంది. బాగా రెస్ట్ తీసుకో సౌమ్యా. మనసు అదే కుదుట పడుతుంది” అని బోధపరిచాడు భాస్కర్.
తల్లి కూర్చునే ఖాళీ కుర్చీతో సౌమ్య కబుర్లు చెబుతోంది. ఇలాగే వదిలేస్తే మానసిక సమస్యకు దారి తీసే అవకాశముందని భయపడ్డాడు భాస్కర్.
సౌమ్య అక్క సునందకు ఫోన్ చేశాడు భాస్కర్. “మీ చెల్లితో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండండి. అది ఏం చెప్పినా మీ కడుపులో దాచుకోండి” అని ఆమె మానసిక స్థితి మొత్తం చెప్పుకొచ్చాడు.
“ దానితో నేను మాట్లాడతాను మరిదిగారూ. మీరేం కంగారు పడకండి” అని చెప్పి
చెల్లెలికి ఉదయం, సాయంత్రం ఫోన్ చేయడం మొదలుపెట్టింది సునంద.
కానీ, అక్కయ్య తన అత్తగారిలా గట్లు దాచుకుంటుందో, ఎవరికన్నా చెప్పేస్తుందో అనే అనుమానంతో, అక్క చెప్పింది వినడమేగానీ తన అంతరంగాన్ని పంచుకోలేకపోయింది సౌమ్య.
సౌమ్య ముభావంగా ఉండటం చూసిన భాస్కర్ ఒక ఉపాయం ఆలోచించాడు. ఇంట్లో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న పనిమనిషి సుబ్బమ్మను పిలిచాడు.
“ఇది మా అమ్మ చీర. దీన్ని కట్టుకుని మా అమ్మ రోజూ కూర్చునే కుర్చీలో కూర్చో. సౌమ్య ఏం చెప్పినా విను. విన్నది ఇక్కడే మర్చిపో. ఎవరికీ చెప్పకు. విన్నందుకు డబ్బులిస్తాను” భాస్కర్ సుబ్బమ్మకు అర్థయ్యేలా చెప్పాక సరే అని ఒప్పుకుంది.
“సౌమ్యా….నువ్వు మన సుబ్బమ్మతో ఏదైనా చెప్పుకోవచ్చు. తను నిన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నీ భారం తీరిపోతుంది” చెప్పాడు భాస్కర్.
అత్తగారి ప్లేస్ లో అత్తగారి చీరకట్టుకున్న సుబ్బమ్మను చూడగానే దుఃఖం ఆగలేదు.
అత్తగారితో ఎన్నో పంచుకున్న ఆ రోజులు గుర్తొచ్చాయి.
“అత్తమ్మా… మిమ్మల్ని ఇలా మళ్ళీ చూస్తాననుకోలేదు. మీతో కబుర్లు చెప్పి ఎన్నాళ్ళైందో. అనసూయమ్మ ఎన్ని పూజలు చేసేది. మనకి మడి ఆచారాలు లేవని ఎద్దేవా చేసేది. వాళ్ళ మనవరాళ్లు వేరే మతంలోకి మారిపోయారుట. వెనక సందులో వుండే మణిగారింట్లో వెండి సింహాసనం కనిపించకుండా పోయిందిట.
వాళ్ళింటి పనిమనిషి కాజేసివుంటుందనుకుంటున్నారు. అడిగితే ఒప్పుకుంటుందా ఏంటి? పనమ్మాయికి ఇల్లు వదిలేసి వెళితే, చేతివాటం చూపించకుండా ఊరుకుంటుందా?” సౌమ్య మాటలకు సుబ్బమ్మ మొహం ఎర్రబడింది.
సౌమ్య మీదకి ఒంటికాలుమీద లేచింది సుబ్బమ్మ.
“పోనీలే అని మీ ఆయన చెప్పాడని నీ మాటలు వినేందుకు ఒప్పుకున్నాను. మీ అత్త, నువ్వు కలిసి మాట్లాడుకునేవి ఇవా?” అంటూ అరిచింది.
భాస్కర్ కంగారుగా “ఏవైంది సుబ్బమ్మా?” అన్నాడు.
“ఏవైందేంటి బాబూ! ఆ అనసూయమ్మగారింటి పనిమనిషి నేనే. పదేళ్లుగా చేస్తున్నా ఏరోజూ పూచికపుల్ల పోలేదు. వాళ్ళకీ నామీద నమ్మకం ఉంది. మొన్న ఊరెళ్లేటప్పుడు వాళ్ళాయన వెండి సింహాసనం బీరువాలో పెట్టుకుని వెళ్ళాడు. ఆవిషయం అనసూయమ్మకు తెలీక కంగారు పడింది.
మాటలు వినమంటే వచ్చాను గానీ, ఇలా దొంగతనాలు అంటగతారనుకోలేదు. మీకో దణ్ణం” అని విసురుగా వెళ్ళిపోతున్న సుబ్బమ్మ వైపు అయోమయంగా చూసింది సౌమ్య. ఇక్కడ జరిగింది బయట చెప్పేస్తుందేమో అని భయపడింది.
కొన్నాళ్ళు ఎవరితోనూ మాట్లాడకుండా గడిపింది. ఓరోజు ఫోన్ చూస్తుంటే ఇంటర్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో తనని యాడ్ చేసినట్టు కనిపించింది. అందరూ తన సెక్షన్ వాళ్లే. ఒకర్నొకరు పలకరించుకుంటూ, కుటుంబ విషయాలు చర్చించుకుంటున్నారు.
భేషజాలు లేకుండా వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటున్నా సౌమ్య మాత్రం వాళ్ళలో కలవలేకపోయింది. అత్తగారు ఉండుంటే అన్నీ చెప్పుకునేదాన్ని. ఇప్పుడు ఎవరితో ఏం చెప్పినా వేరొకరికి చెప్పేస్తారు. అని ముభావంగా ఉంది.
భాస్కర్ ఆమెను స్నేహితురాళ్లతో చాట్ చేయమని, ఒంటరితనం తగ్గుతుందని చెప్పాడు. “ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింజ నానదు. వాళ్ళ విషయాలు నేనడిగితే నావి వాళ్ళడుగుతారు. నేను కలవలేను.” అంది సౌమ్య.
కొన్ని భయాలకు పేర్లుండవేమో?! అమ్మ సౌమ్యపై అంత బలమైన ముద్ర వేసిందన్నమాట అనుకుని నిట్టూర్చాడు భాస్కర్.
ఓరోజు సౌమ్యకు ఒక మెసేజ్ వచ్చింది. అది ఆమె ఇంటర్ క్లాస్ మేట్ రాఘవ నుంచి. అతను చాలా మంచివాడని కాలేజీలో పేరు ఉండేది. ఇద్దరి అభిప్రాయాలూ ఇంచుమించుగా ఒక్కటే అనిపించాయి.
కొన్నాళ్ల పరిచయం తర్వాత,
“సౌమ్యా…నా విషయాలు ఎవరితో చెప్పను. నీతోనే చెప్తున్నాను.” అంటూ తన వ్యక్తిగత విషయాలు చెప్పుకొచ్చాడు.
“ రెండేళ్ల క్రితం మా ఆఖరమ్మాయి పెళ్ళి చేశాం. ఆ పెళ్ళికి ముందు ఎన్నో గొడవలయ్యాయి.”
“ఏవైంది?” అడిగింది సౌమ్య ఆసక్తిగా.
“అది వేరే క్యాస్ట్ అబ్బాయిని ఇష్టపడుతోందని తెలిసింది. నేను ఎంకరేజ్ చేయలేదు. ఆ కుర్రాడు చెడు ప్రవర్తన కలవాడని మా అమ్మాయి నమ్మేలా సృష్టించాను. ఆమె మనసు మార్చి, మా కమ్యూనిటీ అబ్బాయితో పెళ్లిచేసి అమెరికా పంపించాను. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అన్నిటినీ జాగ్రత్తగా డీల్ చేసాను. అదిప్పుడు బానేవుంది. నీకూ ఏవన్నా సమస్యలుంటే చెప్పు. హెల్ప్ చేస్తాను” అని భరోసాగా చెప్పాడు రాఘవ.
సౌమ్య కాస్త ప్రశాంతంగా కనపడటాన్ని భాస్కర్ గమనించాడు.
మీ మిత్రులు ఏమంటున్నారని అడిగాడు.
రాఘవ కూతురి పెళ్లి విషయం భాస్కర్ తో చెప్పింది సౌమ్య. అంతా విన్న అతను కోపోద్రిక్తుడయ్యాడు.
కంగారుపడింది సౌమ్య.
“రాఘవ చెడుగా ముద్ర వేసి, తలెత్తుకోకుండా చేసిన వ్యక్తి ఎవరో కాదు. నా స్నేహితుడు కొడుకు ప్రీతమ్. అతనిపై వేసిన అభాండాలకు పాపం ఆ కుర్రాడు మనోవేదనతో పిచ్చివాడయ్యాడు.” అని చెప్పడంతో పాటు,
అతని స్నేహితుడికి ఫోన్ చేసి" మీ వాడి మానసిక హింసకి ఆ రాఘవే కారణయ్యాడు" అని జరిగింది చెప్పుకొచ్చాడు భాస్కర్.
ఆ విషయం విని బాధపడ్డ ప్రీతమ్ తండ్రి, అమెరికాలో ఉన్న ప్రీతమ్ ప్రేమించిన అమ్మాయికి జరిగిన విషయాన్ని మెసేజ్ చేశాడు.
ఆమె తన తండ్రిని "ఇలా ఎందుకు చేశావు నాన్నా?" అంటూ నిలదీసింది.
రాఘవ కోపంగా సౌమ్యకు మెసేజ్ చేశాడు.
“నువ్వు నమ్మదగిన వ్యక్తివి అనుకుని ఎవరికీ తెలియని నిజాన్ని నీతో చెబితే ఇలా చేశావే సౌమ్యా?! నా విషయాలన్నీ మా మామగారు బతికుండగా ఆయనతో చెప్పుకునేవాడ్ని. నా నమ్మకాన్ని ఒమ్ముచేశావు. ఇక మనమధ్య మాటలుండవు. సెలవు” అని సౌమ్య నెంబర్ బ్లాక్ చేసాడు.
ఆ సంఘటనవల్ల సౌమ్య షాక్ తింది. అత్తగారుంటే ఈ సమస్యలు వచ్చేవా?! అని బాధపడుతూ కూర్చుంది.
“పనిమనిషి సుబ్బమ్మ, రాఘవ విషయాల్లో నా ప్రమేయం ఏముంది అత్తయ్యా?!” అంటూ సౌమ్య మంచం దగ్గర కూర్చుని బాధపడుతుంటే భాస్కర్ కి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు.
ఓరోజు దుర్గ పిన్ని సౌమ్యా వాళ్ళింటికి వచ్చింది.
“మీరు మా అబ్బాయి పెళ్ళికి రాలేదుగా. అందుకే స్వీట్లు, గిఫ్ట్ పట్టుకొచ్చాను” అంటూ సౌమ్య చేతికొచ్చింది. ఆరోజు వాళ్ళింట్లో ఉండి, మర్నాడు పిఠాపురం ఆలయాలు దర్శించి వెళదామనుకుంది. ఆ రాత్రి దుర్గపిన్ని సౌమ్య గదిలో పడుకుని కబుర్లు చెబుతూ…
“మీ అత్తగారికీ, నాకూ మధ్య దూరపు చుట్టరికం ఉందే. మేం రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లం. అది పోయాక మాట్లాడేవాళ్ళులేక ఏదో వెలితిగా వుంది.
అవునూ….!! మీ ఆయన మీ అత్తగారికోసం కొన్న నెమలికంఠం రంగు చీర నువ్వు తీసుకున్నావుటగా? జాకీటు కట్టించుకుని సంక్రాంతికి కట్టుకున్నావుట. దానికి ఆ రంగంటే ఇష్టమని నీతో చెప్పలేకపోయింది పాపం.
తక్కువ రేటుకి మినప్పప్పు కొని దాచిపెడితే పుచ్చుపట్టించావుట. మీ అక్కయ్యకు అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు నువ్వే చేసి పంపుతావుట. దానికి పెట్టుకోడం రాదా?”
పిన్ని బడబడా చెప్పుకుపోతుంటే సౌమ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
తనకెంతో నమ్మకస్తురాలైన అత్తగారు ఇలా చెబుతుందనుకోలేదు.
అత్తయ్య కూడా అందరిలాంటిదే. మినహాయింపు కాదన్నమాట! ఆ విషయాన్ని దుర్గపిన్ని నోటి ద్వారా సౌమ్యకు అర్థమయ్యేలా చేశాడు భాస్కర్.
అందరం మనుషులమేగా?!
ఎవరం దేనికీ అతీతులం కాదు.
రాఘవ విషయంలో నేను చేసిందేవిటి? నా విషయంలో అత్తగారు కూడా అదే చేశారు. ఆవిడ్ని తప్పు పట్టకూడదు. ఇన్నాళ్ళూ ఎవరితో కలవకుండా అత్తే లోకంగా ఉన్నాను. ఆమె లేకపోవడం లోటే కావచ్చు. కానీ ఏవి ఎవరితో షేర్ చేయాలి…? ఎంతవరకూ….? ఏదైనా సెలెక్టివ్‌గా మాత్రమే . పరిమితులకు లోబడి. మనసు పొరల్లోనివి, నిగూఢమైనవాటికి డైరీలో ఒక ఖాళీ పేజీ ఉంటే చాలు. పెదవి దాటిన మాట పృథివి దాటుతుంది. భర్త కూడా ఎన్నోసార్లు బాధల్ని తనతో చెప్పుకోమన్నాడు.
తనేం చెప్పినా పొగుడుతూ, తన పక్షం మాట్లాడే అత్తగారికన్నా, తప్పొప్పులు విశ్లేషించి చెప్పి మందలించే భర్త వ్యవహార శైలి మంచిది.
అవసరమైనవి, అనవసరమైనవి వేరు చేసి చూడటం, ఏది ఎవరితో చెప్పాలో తనే నిర్ణయం తీసుకోవాలి.పర్యవసానాలు కూడా తనే అనుభవించాలి.
ప్రపంచంలో నమ్మదగిన మనుషులు ఉంటారు. కానీ మన మనసంతా అప్పగించదగిన మనుషులు ఉండకపోవచ్చు. ప్రతి బంధానికీ ఒక హద్దు ఉంటుంది. ప్రతి మాటకీ ఒక పరిమితి ఉంటుంది. ఏది ఎవరితో చెప్పాలి, ఎంతవరకూ చెప్పాలి అన్న వివేకం కూడా జీవితం నేర్పే పాఠమే.
అత్తగారి జ్ఞాపకం తనకు ఓదార్పే గానీ, ఆధారం కాదని సౌమ్య గ్రహించింది. తన బాధలకు, తన ఆనందాలకు తానే బాధ్యురాలని అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి అత్తగారి ఖాళీ మంచం దగ్గర గుసగుసలు మానేసి, జీవితంతో మళ్లీ సంభాషించడం, స్నేహితుల గ్రూప్ లో సందడి చేయడం మొదలుపెట్టింది.
ఎందుకంటే... నమ్మదగిన నేస్తం కోసం మనిషి ప్రపంచమంతా వెతుకుతాడు. చివరికి తెలిసేది ఒక్కటే
అన్నిటికంటే నమ్మదగిన నేస్తం తనలోని వివేకమే.
………………. శుభం ………
గొర్తి వాణిశ్రీనివాస్ గారి మరికొన్ని రచనలు:
గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
నా పేరు గొర్తివాణి
మావారు గొర్తి శ్రీనివాస్
మాది విశాఖపట్నం
నాకు ఇద్దరు పిల్లలు
కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది
అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
రచనల మీద ఎంతో మక్కువతో
కవితలు, కథలు రాస్తున్నాను.
విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,
ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు
ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.
మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ
గొర్తివాణిశ్రీనివాస్
విశాఖపట్నం








@muralidharholla7699
• 1 hour ago
Good new subject story is good. Super. Thanks.Your tone is sweet.Good conclusion.
@srinivasgorty3375
• 2 hours ago
కథ, కథనం, చదివిన విధానం అన్నీ ఒకదానికి ఒకటి తీసిపోకుండా ఉన్నాయి వినటానికి, ఇలాంటి కుటుంబ బంధాలను మరింత పెంచుకునే విధంగా కథలు రాయాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.
@srinivasm308
•12 hours ago
Excellent Story 🙏🙏👍👏💐
@BhagavathulaBharathi-x5t
• 13 minutes ago
కథ చక్కగా ఉంది.అందరు అత్తా కోడళ్ళు ఇలాగేఉంటే సమాజం ఎంత బాగుంటుందో అనిపిస్తోంది.పైగా ఇది మా యింట్లోనే జరిగిన కథలా అనిపించి మా అత్తయ్య గుర్తుకువచ్చింది.వాణీగారూ
@ananthanirmala3499
•13 minutes ago
Chalabagundi