నాన్నకి ప్రేమతో...
- Pulletikurthi Nagesh

- May 19
- 4 min read
Telugu emotional father story, Telugu family emotional story, old age loneliness Telugu, father son story Telugu, Telugu heart touching story

Nannaki Prematho - Telugu Emotional Story | Pulletikurthi Nagesh
నాన్నకి ప్రేమతో... - తెలుగు భావోద్వేగ కథ | పుల్లేటికుర్తి నగేష్
Published In manatelugukathalu.com On 19/05/2026
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది పెద్ద పెద్ద కానుకలు కాదు… చిన్న చిన్న ఆప్యాయతలు మాత్రమే.
ఒక స్వెట్టర్ కోసం ఎదురు చూసిన తండ్రి, “తర్వాత చూద్దాం” అని వాయిదా వేసిన కొడుకు, చివరకు పశ్చాత్తాపంగా మారిన ప్రేమ… ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసే హృదయవిదారక తెలుగు కథ.
బాబూ.. రాఘవ.. ఒకసారి వచ్చి పోరా..
నీతో మాట్లాడి చాలా రోజులవుతుంది రా..
నాన్నకి మరీ చాదస్తం ఎక్కువ అయిపోతుంది..
ఒకే ఇంట్లో వుంటున్నాము కదా ..
అయినా మాట్లాడి చాలా రోజులవుతుంది.. అంటారు..
రోజూ మాట్లాడడానికి ఏముంటాయి విషయాలు..
వస్తున్నా నాన్నా.. చెప్పండి..
అదేరా .. చలి కాలం వస్తుంది కదా..
కొత్త స్వెట్టర్ ఈసారైనా కొంటావేమో అని..
అంటూ చిన్నగా నసిగారు నాన్న.. ఏదో తప్పు చేసినవాడిలా..
కొంటాలే నాన్న.. అయినా అంతా చలి కూడా లేదుకదా.. ఇప్పుడు కొత్త స్వెట్టర్ ఎందుకు చెప్పండి..
మీకు వుంది కదా ...
ఉంది గాని ఇది చాలా పాతది అయిపోయిందా రా.. చిరుగులు కూడా పడుతున్నాయి..
చలికి ఆగడం లేదు.. పైగా నాకు కొంచెం చలి ఎక్కువ కూడాను..
సరే లెండి చూద్దాం.. వీలుచేసుకుని కొంటాను.. కొంచెం టైట్ గా ఉంది...ఈ నెల కొంచెం కష్టం, పిల్లలకి టర్మ్ ఫీజు లు కట్టాలి..
ఇలానే ప్రతి సంవత్సరం దాట వేస్తున్నావు రా..
మర్చిపోయవేమో...నీకు చిన్నప్పుడు అడిగినవెంటనే కొనకపోతే ఊరుకొనే వాడివి కాదు అస్సలు..
అబ్బా మళ్ళీ స్టార్ట్ చేశారు.. అని విసుక్కుంటూ.. ఆఫీసు కి బయట పడ్డాడు రాఘవ..
కానీ పరంధామయ్య గారు ఆగలేదు.. అలా ఆలోచిస్తూ వెనక్కి వెళ్ళి పోయారు..
చిన్న ఉద్యోగం.. ఏమాత్రం సెటిల్ అవకముందే పెళ్లి.. సంవత్సరం తిరిగే సరికి రాఘవ.. ఇంకో రెండు సంవత్సరాలలో కూతురు సౌమ్య..
వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు,
రాఘవ మొండి పట్టుదల.. అడిగినవెంటనే కొనక పోతే చేసే మారాం.. అన్నీ గుర్తుకు వచ్చాయి..
శారద గుర్తుకు వచ్చింది.. ఉత్తర భారతదేశం లో పని చేయడమేమో.. అక్కడ స్వెట్టర్లు ఎక్కువ..
అలానే ఇళ్ళల్లో అల్లడం కూడా ఎక్కువ.. తను పిల్లలకి, తనకి స్వెట్టర్లు అల్లేది...
పిల్లలకైతే మరీనూ..
సరేలే వాడు మాత్రం ఎన్నని చేయగలడు.. సంసారం ఈదాలికదా ..
అని చిన్నగా నిట్టూర్చి పుస్తకం తీశారు...
లక్ష్మీ! నాన్న తిన్నారా.. రాత్రి భోజనం చేస్తూ రాఘవ....
లేదు.. ముసలాయన మళ్ళీ అలిగినట్లున్నారు..
ఈ మధ్యన ఈ అలకలు ఎక్కువైపోయాయి..
జరిగితే జ్వరం అంత సుఖం లేదని ఊరకనే అనలేదు..
కోడలి ఈసడింపు మాటలు వినబడుతూనే వున్నాయి..
వచ్చి తన తిండి గురించి అడుగుతాడేమో అనుకున్న పరంధమయ్య గారికి నిరాశే..
వాడు రాలేదు.. మెల్లగా టేబల్ పైన వున్న టిఫిన్ వైపు కదిలారు ఆకలికి ఆగలేక.
షరా మామూలే.. నెల.. రెండు నెలలు గడిచిపోయాయి...
నాన్న మీకు చెపితే అర్ధం కాదా.. కొంటాలే నాన్నా..
చలి అంత పెరగలేదు కూడా..
ఈ మాత్రం చలికి కూడా తట్టుకోలేక పోతే ఎలా..
ఈసారికి అడ్జస్ట్ కండి.. వచ్చే సీజన్ కి తప్పకుండా కొంటాను..
అయినా మీకు అంతా మొండి పట్టుదల ఏంటి..
ఏది పట్టుకుంటే ఆదేకదా..
ఇక్కడ నా కష్టం ఎవరికి అక్కరలేదు.. అని విసుక్కుంటూ..
విసురుగా బండి స్టార్ట్ చేసి ఆఫీసు కి బయలు దేరాడు రాఘవ.
ఆఫీసు పని చేస్తున్నాడన్న మాటే గాని.. రాఘవ మనసు మనసులో లేదు..
మనసంతా ఏదో తెలియని అలజడి.
తండ్రిని విసుక్కున్న మాటలు,
వెళ్తూ వెళ్తూ ఆయన ముఖంలో కనిపించిన నిరాశ పదే పదే గుర్తొస్తూనే ఉన్నాయి.
సముద్రంలో అల్ప పీడనం.. తుఫానుగా మారినట్లు వుంది..
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వాతావరణం లో మార్పు తెలుస్తుంది..
గాలిలో చలి బరువు పెరిగింది..
ఈదురుగాలులు.. చలి తీవ్రత గాలిలో స్పష్టంగా తెలుస్తోంది.
రాత్రి భోజనం టైమ్‌లో పరంధామయ్య గారు గదిలోంచి బయటకు రాలేదు.
"లక్ష్మీ.. నాన్నగారు భోజనానికి రాలేదేంటి?" అడిగాడు రాఘవ.
"ఆయనెప్పుడూ ఇంతేగా.. అలిగితే అన్నం తినరు.
టేబుల్ మీద పెట్టాను,
ఆకలేస్తే ఆయనే తింటారులెండి" అంది లక్ష్మి ఉదయం నుండి ఇంటి పనుల అలసటతో కొంచెం విసుగ్గా.
రాఘవ కూడా అలసట వల్ల గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
అయినా మన ఖర్చులు ఎప్పుడు వుండేవేగా ..
నిజానికి చలి కూడా బాగానే పెరిగింది..
మనకే ఇలా వుంటే, ఇక పెద్దాయన ఎలా తట్టుకుంటారు?
రేపయినా ఆ స్వెట్టర్ ఏదో కొనేయండి...
అంది లక్ష్మి నిద్రలోకి జారుకుంటూ..
ఆ రాత్రి చలి పులిలా విరుచుకుపడింది. కిటికీ రెక్కలు చలిగాలికి కొట్టుకుంటున్నాయి.
పరంధామయ్య గారు తన పాత, చిరిగిన దుప్పటిని ఒంటికి గట్టిగా చుట్టుకోవడానికి ప్రయత్నించారు.
కానీ ఆ చిరుగుల గుండా దూరిపోతున్న చలిగాలి ఆయన ప్రాణాలను పిండేస్తోంది.
చలికి ఆయన పళ్ళు కటకటలాడాయి, గుండె వేగం మందగించింది.
కొడుకు తన చిన్నప్పుడు అడిగినవన్నీ ఎలా కొనిచ్చాడో గుర్తు తెచ్చుకుంటూ...
తనని ప్రయాణం మధ్యలోనే వదిలి వెళ్ళిపోయిన అదృష్టవంతురాలైన శారద ని గుర్తు చేసుకుంటూ..
తాను వుంటే కనీసం ఈ దుప్పటాయినా సరిచేసేది.. అనుకుంటూ కాళ్ళని లోపలకి ముడుచుకున్నారు..
ఈ చలి నుంచి తనను కాపాడటానికి ఒక కొత్త స్వెటర్ కి కూడా నోచుకోలేకపోయిన తన వృద్ధాప్యాన్ని తలచుకుని కన్నీరు మున్నీరయ్యారు.
మరుసటి రోజు ఉదయం.. ఎనిమిది దాటుతున్నా పరంధామయ్య గారి గది తలుపులు తెరుచుకోలేదు.
రాఘవ మెల్లగా తలుపు తోసుకుంటూ లోపలికి వెళ్లాడు.
తండ్రి ఇంకా పడుకునే ఉన్నారు.
"నాన్న.. లేవండి.. టీ త్రాగుదురు" సమాధానం లేదు.
ఈ తుఫాను చల్ల గాలులకి జ్వరం గానీ వచ్చిందేమో అని నుదురుపై చెయ్యవేసిన రాఘవ ....
అంతే! ఆ స్పర్శకు రాఘవ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
తండ్రి శరీరం మంచు గడ్డలా చల్లబడిపోయింది.
ఊపిరి ఆడటం లేదు.
"నాన్న! నాన్నా!!" అంటూ గట్టిగా ఊపాడు.
పరంధామయ్య గారిలో చలనం లేదు.
ఆయన చలి తీవ్రత తట్టుకోలేక రాత్రే కన్నుమూశారు.
రాఘవ గుండె పగిలిపోయేలా ఏడవడం మొదలుపెట్టాడు.
లక్ష్మి, పిల్లలు పరుగున వచ్చారు. ఇల్లంతా శోకసంద్రమైంది.
"ఈ ఒక్క నెల ఫీజుల కోసమని ఆపి ఎంత తప్పు చేశాను నాన్నా..
నీకు ఒక్క స్వెట్టర్ కూడా కొనలేకపోయానే" అంటూ రాఘవ తండ్రి కాళ్లపై పడి రోదించాడు.
శవాన్ని స్నానానికి సిద్ధం చేయడానికి తలగడ తీస్తుండగా..
పరంధామయ్య గారి తల క్రింద మడతపెట్టి ఉన్న ఒక చిన్న కాగితం ముక్క దొరికింది.
అది తండ్రి రాసిన చివరి ఉత్తరం.
వణుకుతున్న చేతులతో రాఘవ ఆ ఉత్తరాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు:
"ఒరేయ్ రాఘవ.. ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను రా..
ఈ కిటికీ సందులలో నుండి వస్తున్న గాలి మరీ రంపపు కోతలా వుందిలా..
ఎంతలా అంటే చలి అంటేనే ఒకరకమైన భయం వేస్తుంది నాకు..
నేను బహుశా ఈ చలి తట్టుకోలేకే పైకి పోతానేమో..
ఈ చలిని భరించడం నా వల్ల కావడం లేదురా..
రాఘవా.. ఒకవేళ ఈ చలికి తట్టుకోలేక నేను పోతే..
దయచేసి నన్ను భూమిలో మాత్రం పాతి పెట్టవద్దురా..
అక్కడ ఇంకా చలి ఎక్కువ ఉంటుంది బాబూ..
అందుకే నన్ను వేడి వేడి అగ్ని జ్వాలలో దహనం చేయి.. ఇదే నా చివరి కోరిక.. - నీ నాన్న"
ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరం రాఘవ గుండెల్లో శూలంలా గుచ్చుకుంది.
తండ్రి బ్రతికుండగా తను ఇవ్వలేకపోయిన వేడిని..
కనీసం
చితిపై అగ్ని జ్వాలల రూపంలోనైనా ఇవ్వమన్న తండ్రి కోరిక ముందు రాఘవ కుప్పకూలి పోయాడు.
పశ్చాత్తాపంతో కన్నీళ్లతో తండ్రి పార్థివ దేహాన్ని గట్టిగా హత్తుకుని ఏడవడం తప్ప రాఘవ ఇప్పుడు ఏమీ చేయలేకపోయాడు.
అసలు ఈ కధ స్వెట్టర్ గురించి కాదు..
వృద్ధాప్యపు ఒంటరితనం గురించి..
‘తర్వాత చూద్దాం’ అనే నిర్లక్ష్యం గురించి.. .
మిడిల్ క్లాస్ హెల్ప్లెస్ నెస్ గురిచి..
తల్లితండ్రుల చిన్న చిన్న కోరికలు ఎలా వాయిదా పడతాయో గురించి..
అంతే.. అంతే..
సమాప్తం
***
పుల్లేటికుర్తి నగేష్ గారి కొన్ని ఇతర రచనలు:
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం







Super