top of page

పాపం సుబ్బారావు


'Papam Subbarao' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

"ఏమోయ్ శంకర్రావ్! " ఆఫీస్ అసిస్టెంట్ శంకరరావుని పలకరించేడు సూపర్ వైజర్ సుబ్బారావు.


" గుడ్ మోర్నింగ్ సర్! " విష్ చేసేడు శంకరరావు.


"ఆ! గుడ్ మోర్నింగ్. కూర్చో ...కూర్చో " అంటూ, " ఏమిటి విశేషం? బర్త్ డే యా? మేరేజ్ డే యా? కొత్త డ్రస్ లా ఉంది." ఆరా తీసేడు అలవాటు ప్రకారం సుబ్బారావు.


"భర్త డే కాదు.భార్య డే కాదు.సాటర్ డే సర్. శనివారం. అంచేత తలకి స్నానం చేసేను. డ్రస్ కుట్టించుకుందామని క్లాత్ తీసి డజను నెలలైంది. ఈ రోజుకి దానికి నా వంటినలంకరించే అదృష్టం కలిగింది. అంతే సర్! " చెప్పేడు శంకరరావు.


"మరి సెలబ్రేషన్ ఏమీ లేదా? " ఆత్రుతగా అడిగేడు సుబ్బారావు.


"మీరడిగేక లేదని ఎలా అంటాను చెప్పండి? స్టిచ్చింగ్ ఛార్జెస్ లాగే ఇక్కడ స్టిక్కింగ్ ఛార్జెస్." అంటుండగానే “ఇలాంటి చిన్న విషయాలకే నువ్వలా బాధపడిపోతే ఎలాగోయ్ శంకర్రావ్! ఎంత ఆఫీస్ అయినా అడపా దడపా ఇలాంటి ఆఫరింగ్స్ లేకపోతే థ్రిల్ ఏముంటుందోయ్? డల్ గా ఉంటుంది. వెళ్ళు. ఆ ఏర్పాటేదో చూడు." పురమాయించేడు సుబ్బారావు.


"అలాగే సర్!" అన్నాడు శంకరరావు. "తప్పుతుందా?" అని మనసులో అనుకుంటూ, "ఈ ఛార్జెస్ కోసం చూసుకుంటే రేపు నా మీద ఎలాంటి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి బాస్ కి చెప్పేస్తాడో! " అని భయపడుతూ.


* * *


"గుడ్ మోర్నింగ్ సర్! " సుబ్బారావును విష్ చేసేడు క్లర్క్ సుబ్రహ్మణ్యం.


"వెరీ గుడ్ మోర్నింగ్. చూడవోయ్ సుబ్రహ్మణ్యం! మీ అందరూ నన్ను చూసి విష్ చేసి పలకరిస్తారా. ఆ ఆనందరావు చూడు మొక్కుబడిగా విష్ చేస్తాడు తప్ప ఓ పలకరింపూ ఉండదు, ఏమీ ఉండదు. అక్కడికి తనొక్కడే పని చేస్తున్నట్లు బుర్ర దించుకుని ఎప్పుడూ ఏదో ఫైలు లో తల దూర్చి ఉంటాడు. అడిగినదానికి "ఊ","ఆ" తప్పితే మరో మాట ఉండదు.


ఆఫీస్ టైమ్ కు ఒక్క క్షణం ముందు రాడు. టైమ్ అయిపోయేక ఒక్క క్షణం ఉండడు. ఇలాంటి వాళ్ళను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అవునూ! నువ్వు క్రొత్త జోడు కొన్నట్లుంది.రిబేట్ లోనా? " అనేసరికి " అప్పుడే వీడి దృష్టి నా జోడు మీద పడింది." అనుకుంటూ " అబ్బే! అదేం కాదు సర్! పాత జోడుకే పాలిష్ చేయించేను." అన్నాడు సుబ్రహ్మణ్యం.


"సరేలే! కంగారు పడకు." భుజం తట్టేడు సుబ్బారావు.


* * *


" మే ఐ కమిన్ సర్?" అన్నాడు సుబ్బారావు బాస్ ఛాంబర్లో అడుగు పెడుతూ.


" ఎస్. కమిన్." అని బాస్ అనగానే " గుడ్ మోర్నింగ్ సర్!" అని విష్ చేసేడు సుబ్బారావు.


" గుడ్ మార్నింగ్." ముక్తసరిగా బాస్ అనడంతో " బిజీగా ఉన్నారా సార్?" అని అడిగేడు.


" చెప్పండి పనేంటో" అన్నాడు బాస్.


" అదీ...అదే సార్!...


" ఆ చెప్పేదేదో త్వరగా చెప్పండి." ఆర్డర్ వేసినట్లుగా అన్నాడు బాస్.


" చాలా రోజులనుండీ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను సార్! కానీ అవడం లేదు.ఎప్పటికప్పుడు కుదరడంలేదు."


" ఇప్పుడు కుదిరింది కదా చెప్పండి."

" మరేం లేదు సార్! మన బ్రాంచ్ లో ఆనందరావని ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నాడు కద సార్"


" అవునూ. అయితే అతనికేమయిందీ?" అడిగేడు బాస్.


" అతనికేమీ అవలేదు సార్! అయేది మనకే. ఎప్పుడూ నా దగ్గరకొచ్చి ఎవరిపైనో ఒకరిపైన చాడీలు చెప్తుంటాడు సార్! తను పని చేయడు. మిగతా వాళ్ళని చేయనివ్వడు. అలా వాళ్ళు పని ఎగ్గొడుతుంటే అది మన కంపెనీ అభివృద్ధికి గొడ్డలిపెట్టు సార్! అంచేత ఆ ఆనందరావుని పనిష్మెంట్ మీద మరో బ్రాంచ్ కి ట్రాన్సఫర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్! "చెప్పాలనుకున్నదంతా చెప్పేసేడు బాస్ కి సుబ్బారావు.


" మీ అభిప్రాయంతో నేనూ నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తున్నాను. చాడీలు చెప్తూ వాళ్ళ సమయాన్నీ,ఇంకొకరి సమయాన్నీ వృధా చేసేవాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వవలసిందే. ట్రాన్సఫర్ ఆర్డర్స్ రేపే పుట్ అప్ చేస్తున్నాను. "అని బాస్ అనేసరికి "థాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తా సార్." అన్నాడు సుబ్బారావు.


" మంచిది." వెళ్ళమని సలహా ఇచ్చేడు బాస్.


" ఆనందరావూ! రేపటితో నీ పోజులు బంద్. ఇప్పుడైనా తెలుస్తుంది నా తడాఖా ఏమిటో "అనుకుంటూ బాస్ చాంబర్ లోంచి బయటకు నడిచేడు సుబ్బారావు.

* * *

" సార్!...అయ్యగారు మీకీ కవరిమ్మన్నారు సార్! " అని అటెండర్ అప్పారావు సుబ్బారావు చేతికి ఓ కవరిచ్చేడు.


"అలాగా.అయితే అర్జంట్ దేదో అయిఉంటుంది." అనుకుంటూ కవరు విప్పి లోపల లెటర్ చదవడం మొదలుపెట్టేడు సుబ్బారావు.


సుబ్బారావు గారికి,


మీరన్నట్లు చాడీలు చెప్పేవాళ్లుంటే వినే వాళ్ళూ ఉంటారు. లేదా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళూ ఉంటారు. దానివల్ల చెప్పేవాళ్ళూ పని చేయరు. వినేవాళ్ళ పనీ చెడగొడతారు. అంచేత నాకు తెలిసిన అలాంటి మొదటి వ్యక్తిగా మిమ్మల్ని కడప బ్రాంచ్ కి ట్రాన్సఫర్ చేస్తూ ఆర్డర్స్ దీనితో పంపిస్తున్నాను. వెంటనే అక్కడ జాయినవండి. మళ్ళీ నన్ను కలిసే ప్రయత్నం చేయకండి."


అది చదివేసరికి సుబ్బారావుకు చురుక్కుమంది.


" హే భగవాన్! నా దృష్టిలో ఆనందరావు చాడీకోరయితే బాస్ దృష్టిలో నేనూ చాడీకోరునే." అనుకుంటుండగా అటెండర్ అప్పారావు వచ్చి " సార్! ఆనందరావుగారికి ప్రమోషన్ వచ్చిందట. పార్టీ ఇస్తారట." అని చెప్పేడు.


"ఆ!" ఆశ్చర్యపోవడం సుబ్బారావు వంతు అయింది.


" అవును సార్! రండి. మీరింకా ఇక్కడే ఉండిపోయేరేమిటి?" అడిగేడు సుబ్రహ్మణ్యం.


" అవును. నిజమే. నేనింకా ఇక్కడ ఉండవలసినవాడ్ని కాదు." అని గొణుక్కుంటుంటే, " సార్! ఆనందరావు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు " అని చెప్తున్న శంకరరావు మాటలు సుబ్బారావు చెవిన పడలేదు.


( సమాప్తం )

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం

52 views0 comments

Comentarios


bottom of page