top of page

గుర్తుకొస్తున్నాయి


'Gurthukosthunnayi' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

ట్రైన్ లో ఎదురుగా ఉన్న సీట్లో కూచుని ఉన్న పెద్దావిడను చూసేసరికి చిన్నప్పుడు నేను చదువుకున్న కాన్వెంట్లో క్లాస్ టీచర్ కృష్ణవేణిగారు గుర్తుకొచ్చేరు. అచ్చం ఆవిడలాగే ఉన్నారు.

అంతే! నా మనసు గతంలోకి జారిపోయింది.

అవి నేను కాన్వెంట్లో క్రొత్తగా చేరిన రోజులు. ఇంటి వాతావరణంనుండి ఒక్కసారిగా స్కూల్ వాతావరణానికి అలవాటు పడేసరికి కొంచెం కష్టమే అయింది. కంటిముందు టీచరున్నా ధ్యాస మాత్రం ఇంటి మీదే ఉండేది. క్లాసులు ఎప్పుడయిపోతాయా అని చూసేదానిని. టీచరంటే భయమో, బెదురో తెలియని వయసు అది. ఓ రోజు లంచ్ బ్రేక్ ఇవ్వగానే లంచ్ చేద్దామని బాక్స్ తీస్తుండగా చెయ్యి జారి క్రింద పడిపోయింది. బాక్స్ లో ఉన్నదంతా నేలపాలయిపోయింది.

ఏం చెయ్యాలా అని చూస్తున్నంతలో అటుగా వస్తున్న మా క్లాస్ టీచర్ కృష్ణవేణి మేడమ్ చూసి అడిగేరు " రమ్యా ఏమైంది? " అని.

నా బిత్తర చూపులు చూసి జరిగింది తెలుసుకుని ఆయాను పిలిచి అక్కడ క్లీన్ చేయమని పురమాయించి " నువ్వు నాతో రా " అని నన్ను పిలిచేరు టీచర్. ఏమంటారో అని జంకుతూ వెళ్ళేను. తీరా చూస్తే అక్కడ స్టాఫ్ రూమ్ లోకి తీసుకెళ్లి టీచర్ తన ప్రక్కన నన్ను కూర్చోబెట్టుకుని తన లంచ్ బాక్స్ లో నుండి భోజనం నా కోసం తీసి నన్ను తినమని ఇచ్ఛేరు.

నేను ఆలోచిస్తుండగా " తిను. పరవాలేదు. నేను మీ అమ్మగారినే అనుకో. మీ అమ్మగారు పెడితే తినవా?" అని అడిగేరు. వెంటనే నేను తీసుకుని గబగబా తినేసేను అసలే ఆకలితో ఉన్నానేమో. అలా ప్రారంభమయింది టీచర్ కి నా మీద తొలి ప్రేమ, నాకు టీచర్ మీద అభిమానం, టీచర్ తో అనుబంధం. మరో రోజు స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకెళ్లే ఆటో రాలేదు. అందరూ వెళ్ళిపోయేరు.

టీచర్ కూడా వెళ్ళిపోతూ నా ఆటో రాలేదని తెలుసుకుని " ఆటో రాలేదు కదా మరి మీ డాడీ వస్తారా " అని అడిగేరు.

" డాడీ కేంప్ వెళ్ళేరు." అని చెప్పేను.

" మరి మీ మమ్మీ ? "

" మమ్మీ నా కోసం చూస్తుంటుంది టీచర్. " చెప్పేను.

"అలాగా అయితే పద " అని నన్ను తన స్కూటీ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేసేరు. ఇది ప్రేమకు రెండో మలుపు. ఇంకోసారి నేను స్కూల్లో మెట్టు దిగుతూ జారీ పడ్డాను. కాలికి దెబ్బ తగిలింది. కొద్దిగా రక్తం కారింది. అది చూసిన టీచర్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెప్పించి నా కాలికి బ్యాండేజ్ కడుతుంటే టీచర్ కు నా మీదున్న ప్రేమ చూసి మా అమ్మే గుర్తుకొచ్చింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగేయి. ఇలా ఒకటా! రెండా! ఇంట్లో నాకు అన్నీమా అమ్మయితే స్కూల్లో అన్నీఈ టీచరమ్మే ఆవిడకు ఎందుకో నేనంటే అంత ప్రేమ. అలాగే నాకూ ఆవిడంటే అంతే ప్రేమ కలిగింది.

ఎలాగంటే ఒకసారి నాకు జ్వరం వచ్చినప్పుడు "అమ్మా! అమ్మా!" అని కాకుండా "టీచర్! టీచర్!" అని మూలిగేనట. మరి అది ఏ జన్మ బంధమో. ఇలా ఆలోచిస్తూ ఒకవేళ ఎదురుగా ఉన్న ఆవిడ నిజంగా మా టీచరేమో ఆవిడ గాని నన్ను గుర్తుపట్టిందేమో తెలుసుకుందామని చూసేసరికి ఆవిడ లేరు ట్రైన్ దిగి వెళ్లి పోయినట్లున్నారు.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం


47 views0 comments
bottom of page