'Teliyani Viluvalu' written by Muralidhara Sarma Pathi
రచన : పతి మురళీధర శర్మ
ఓ ఊళ్ళో ఓ మాస్టారు ఉండేవారు. ఆయన పిల్లలకు పాఠాలు బోధించడంతోపాటు నీతికథలు చెప్పడం,మంచి ప్రయోగాత్మక సందేశాలివ్వడం చేస్తుండేవారు.
ఓ రోజు ఓ విద్యార్థిని మాస్టారితో “ మాస్టారూ! నాకో చిన్న సందేహం అడగవచ్చునా?” అంది.
“ అడుగు తల్లీ! మీ సందేహాలు తీర్చడానికే కదా నేనున్నది.” అన్నారు మాస్టారు.
“పాఠాల్లో సందేహాలు కాదు మాస్టారూ!”
“ మరి?”
“ఏంలేదు.మీరేమీ అనుకోనంటే....
“ఏమీ అనుకోను చెప్పు.”
“ మీరింకా ఎప్పటిదో ఆ పాత పెన్ నే వాడతారెందుకు?”
“ఇది ఒకరు నాకు బహుమతిగా ఇచ్చిందమ్మా “
“ అయితే మాత్రం మార్కెట్లో మంచి మంచివి ఉన్నాయి కదా! ఇది వదిలేసి ఓ క్రొత్తది కొనుక్కోవచ్చుగా.”
“అయితే ఇది పాతదంటావు.”
“కాదా?”
“ నిజమే.కాని దీని విలువ తెలుసా నీకు?”
“అంత విలువైనదాండీ?”
“ సరే! ఓ పని చెయ్యి. ఈ పెన్ నీకిస్తాను.దీని విలువ నీకు తెలియకపోతే నీకు తెలిసినవాళ్లందర్నీ అడిగి తెలుసుకుని వచ్చి నాకు చెప్పు.”
మాస్టారు అలా అన్నారంటే అది ఎంతో విలువైనదై ఉంటుందని అనుకుని “ అలాగే మాస్టారూ!” అని ఆ పెన్ తీసుకుంది.
ఆ పెన్ ను తోటి విద్యార్థినీ విద్యార్ధులకందరికీ చూపించి అది ఎంతుంటుందని అడిగింది.దానికి వాళ్ళందరూ “ఓస్.ఇదా! డొక్కు పెన్ను. ఓ పది రూపాయలిస్తే వస్తుంది ఇలాంటిది.” అన్నారు.
ఓ పుస్తకాలషాపు వాడ్ని అడిగింది.వాడు మహా అయితే పాతిక రూపాయలుంటుంది.” అన్నాడు.
అలాగే తనకు తెలిసిన కూరగాయలకొట్టువాడినీ, కిరాణావర్తకుడినీ, ఫాన్సీ షాప్ వాడినీ, మందుల దుకాణం వాడినీ అడిగింది.వాళ్ళందరూ కూడా దీనికన్నా మేము పద్దులు వ్రాసుకునే పెన్నే నయం. ఇది ఓ ఇరవై రూపాయలు కూడా ఉండదు.”అన్నారు.
చివరికి తనకు తెలిసిన ఓ బంగారు నగల షాపు వాడిని అడిగింది.అతను ఆ పెన్ తీసుకుని నిశితంగా పరీక్షించి “ అమ్మా! దీని మూత బంగారం అమ్మా! చాలా ఖరీదు చేస్తుంది. నీకెక్కడిది?” అని అడిగేడు. అంతా తర్వాత చెప్తాను” అని వెంటనే మాస్టారుగారి దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పింది.
అప్పుడు మాస్టారన్నారు.” చూసేవా అమ్మా! నీ స్నేహితులకీ, కూరగాయలవాడికీ, కిరాణావాడికీ, ఫాన్సీషాపువాడికీ, మందులకొట్టువాడికీ ఈ పెన్ విలువ తెలియలేదు. బంగారు నగల వ్యాపారికి మాత్రమే దీని విలువ తెలిసింది. అంటే వాడికే ఏది బంగారమో, దాని విలువెంతో తెలుస్తుంది. మిగతా అందరి దృష్టిలో ఇది మామూలు పెన్. ఇప్పటికైనా తెలిసిందా దీని విలువ? అలాగే ఒక మంచి మనిషిని మంచివాడు మాత్రమే గుర్తించగలడు. మంచితనం విలువ తెలిసినవాడే అతని విలువ తెలుసుకోగలడు. తెలిసిందా? ఇదీ ఈ పెన్ నీకిచ్చే సందేశం.”
“ చాలా బాగా చెప్పేరు మాస్టారూ! ఇది ఈవేళ మీనుండి నేను తెలుసుకున్న ఓ మంచి విషయం.” అంది ఆ విద్యార్థిని.
చూసేరా! తెలియని విలువలు అంటే ఇవే.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి పరుగు తెచ్చిన ప్రమాదం ఎవరికెవరు ఏమవుతారో హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్ గురు దక్షిణ నేనూ మనిషినే అత్తారింట్లో దారేదీ ( హాస్య కథ ) యద్భావం తద్భవతి
రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం
Comentarios