'Rakhi' written by Muralidhara Sarma Pathi
రచన : పతి మురళీధర శర్మ
విశాఖపట్నం స్టేషన్ లో గోదావరి ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి సిద్దంగా ఉంది. బ్రీఫ్ కేసు సీట్లో పెట్టి బయట గాలి కోసం నిలబడ్డ నేను పెట్టెలోకి ఎక్కబోతుంటే ఒక అందమైన అమ్మాయి ఒక చేతిలో సూట్ కేస్ తో భుజాన ఎయిర్ బ్యేగ్ తో పరుగు లాంటి నడకతో నేనెక్కబోయే పెట్టెదగ్గరకే వస్తుండడం చూసేను. ఆమెతో సమానంగా నడుస్తూ ఆయాసపడుతూ చేతిలోని సంచిని అటూ ఇటూ మార్చుకొంటూ వస్తున్నారో బామ్మగారు. బహుశా ఆ అమ్మాయి ఆవిడ మనుమరాలు అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి అందమైనది అని చెప్పేను కాబట్టి వర్ణన చేయడం అనవసరం. శిరోజాలు మొదలుకొని స్లిప్పర్స్ వరకూ ఎంతమందో వర్ణిస్తూనే ఉంటారు. అంచేత, ఆ సుకుమారమైన చేతులు బరువైన ఆ సూట్ కేస్ మోస్తుంటే కందిపోయి ఎర్రబడడం చూడలేక " ఎక్స్‌క్యూజ్‌మి. మరేమీ అనుకోక పోతే ముందు మీరు ట్రెయిన్ ఎక్కండి. నేను సూట్ కేస్ అందిస్తాను" అంటూ ఆమె జవాబు కోసం చూడకుండా సూట్ కేస్ అందుకొన్నాను.
"బామ్మగారూ ముందు మీరెక్కండి" అంటూ ఆవిడ, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కనిచ్చి నేను ఫుట్ బోర్డు మీద కాలు పెట్టేసరికి ట్రెయిన్ కదిలిపోయింది.
" చాలా థాంక్సండీ మీకు శ్రమ యిచ్చేం. అసలు ఈ ట్రెయినుకు అందుతామనుకోలేదు" అంది ఆ అమ్మాయి.
'అయ్యో దానిదేముందండీ తోటి ప్రయాణీకుడిగా ఆ మాత్రం సాయం చెయ్యడమూ ఒక గొప్పేనా? ఇంతకీ మీ బెర్త్ నెంబర్లు?" అడిగేను నేను.
"లేదండీ. మేము విజయవాడలో దిగిపోతాం. అందుకని రిజర్వేషన్ చేయించలేదండి. ఏదో ఎక్కడో కాస్త సర్దుకొని కూచుని దిగిపోతాం" అంది.
"ఎక్కడో ఏం ఖర్మండీ నా సీట్లోనే కూర్చొండి నేనెలాగో అడ్జెస్ట్ అవుతాను " అన్నాను.
" నీలాంటి వాళ్ళు మా అదృష్టం కొద్దీ దొరుకుతారు నాయనా " అన్నారు బామ్మగారు. "ఎంతమాట బామ్మగారూ! మీ మనవరాలనుకుంటాను" అన్నాను మాట కలుపుతూ.
" మనవరాలేం ఖర్మ! అన్నీ ఈ అమ్మాయే" అన్నారు బామ్మగారు.
" అయితే ఇంకేమండీ ? రండి. ఈ సీట్లో కూర్చొండి మీరిద్దరూ" చెప్పేను.
" మరి నువ్వు బాబూ ? అడిగేరు బామ్మగారు.
" నాగురించేం ఆలోచించనక్కరేలేదు మీరు. ఆసూట్ కేస్, ఎయిర్ బేగ్ ఇలా తెండి. మీద పెడతాను. ఇదిగో బామ్మగారూ! సంచీ ఇక్కడ కొక్కేనికి తగిలిస్తున్నాను " .
" నాకు మగదిక్కు లేని లోటు తీరుస్తున్నావు నాయనా ! నీ పేరేంటన్నావు ?"
"సుందరమండీ"
"పేరు కూడా అందంగానే ఉంది" అన్నారు బామ్మగారు
" అంటే నేను అందంగా ఉన్నట్టేకదా ! " నేను అమాంతం పొంగిపోయేను. ఆ అమ్మాయి కిటికీ లోంచి బయటకు చూస్తుంది.
......x.................x..................x............
ట్రెయిను అనకాపల్లిలో ఆగింది. " బాబూ సుందరం ట్రెయిను ఎక్కే తొందరలో మంచినీళ్ళు పట్టుకోవడం మర్చి పోయేను. కాస్త పట్టిపడుదూ" అన్నారు బామ్మగారు.
"అయ్యో అదెంత భాగ్యం బామ్మగారూ! ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి " అని వెళ్ళి నీళ్ళు పడుతుండేసరికి ట్రెయిన్ కదిలిపోయింది. ఉరుకులు,పరుగులతో ఎలాగైతేనేం కంపార్ట్ మెంట్ లోకి ఎక్కగలిగేను.
" సుందరం! వచ్చేవా నాయనా ! ట్రెయిను కదిలిపోయింది. ఎక్కేవో లేదో అనుకొన్నాను" అన్నారు బామ్మగారు.
" సారీ అండీ మీకు చాలా ట్రబుల్ ఇచ్చేం " అంది ఆ అమ్మాయి.
'మీ మాట వింటే చాలు నా ట్రబులంతా మర్చిపోతాను' అనుకొంటూ "ఈ మాత్రానికే మీరలా అనుకొంటే ఎలాగండీ ? అవునూ మీ భోజనం ? బామ్మగారు ఏమైనా తెచ్చేరా?" అడిగేను.
" లేదు నాయనా ! ఈ వేళ శనివారం . ఏవో పళ్ళు తిని కాలక్షేపం చేసేస్తానంతే"
" అలా అయితే ఉండండి . నా దగ్గర మా అమ్మగారు ఇచ్చిన టిఫిన్ చాలా ఎక్కువగా ఉంది. మీరు కాస్త రుచి చూద్దురుగాని "అన్నాను నేను.
" బాగుంది నాయనా! ఇంకా అది కూడానా ? ఇప్పటికి మేమిచ్చిన శ్రమ చాలు "
" ఏయ్ అరటి పళ్లబ్బీ! ఇలారా ! డజను ఎంత నాయనా? అని అడిగేరు.
" 30 రు. లు అండి " చెప్పేడు వాడు.
" 30 రూ.లకు మూడు డజన్లు కొంటున్నాను. ట్రైన్ లో అనేసరికి మరెక్కడా దొరకవని వాళ్ళు ఇష్టమొచ్చినట్లు ధర చెప్పేస్తుంటారు "
" చూడండి బామ్మగారూ మీకు కావలిస్తే 25 రూ. లకు ఇస్తాను. తీసుకొండి. లేకపోతే ఊరుకోండి. అంతేకాని నేను మిమ్మల్నేం అడగలేదు తీసుకోండి అని " అని వెళ్ళిపోబోతున్నాడు.
"చూసేవా.. చూసేవా సుందరం ఎంత తొందరపాటో?"
" బామ్మగారూ ఓ డజను తీసుకోమంటారా ? " అడిగేను.
" నువ్వెందుకులే నాయనా నేను తీసుకొంటాను" 'ఏదీ ఇలా తే. ఇదిగో ఇంద" అని చీర కొంగులోంచి మడత పెట్టిన 500 రూ. నోటు తీసి ఇచ్చింది.
"అంత చిల్లర ఎక్కడ నుంచి తెచ్చేదండీ? ఇప్పుడే బండి ఎక్కేను " అన్నాడు.
" మరి నా దగ్గర చిల్లర లేదే " అన్నారు బామ్మగారు.
" ఇదిగో ఇలా తీసుకో " అని పర్సులోంచి తీసి ఇచ్చేను.
" అదేంటి నాయనా నువ్వు ఇచ్చేస్తున్నావు? "
"పోనీ లెండి బామ్మగారూ ! నాకు తర్వాత ఇద్దురు గాని " అన్నాను.
" బాబూ సుందరం నువ్వు నిద్రపోవా " అడిగేరు బామ్మగారు.
" నా మాటకేం లెండి మీరు నడుం వాల్చండి. నా బెర్తే కదా నేను తర్వాత నిద్రపోతాను" అన్నాను.
" ముసలిదాన్ని నిన్ను ఇబ్బంది పెడుతున్నాను "
" లేదు లెండి .మీరు నిశ్చింతగా నిద్రపొండి".
" మరేం అనుకోకండి... మీ పేరు?" అడిగేనా అమ్మాయిని.
" భారతి " అంది.
(స్వ) "హారతి పట్టొచ్చు"
" నా పేరు వినే ఉంటారు."
" ఊ.." తలూపింది.
" మీరు నిద్రపోరా?.. ...."
"ఉహూ.." అడ్డంగా తలూపింది.
" నాకూ నిద్ర రావడం లేదండి " అన్నాను. మరి మాట్లాడలేదు. ఏదో పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టింది ఆ అమ్మాయి. ముఖానికి పుస్తకం అడ్డుగా ఉంది. ముఖం లోని భావమేమీ తెలియడం లేదు. కొంత సేపటికి నిద్ర వస్తున్నట్టుంది. చేతిలోని పుస్తకం జారిపోయింది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. చటుక్కున తెలివి తెచ్చుకొని పుస్తకం తీసుకొంది. వెంటనే నేను ""ఏమండీ మీకు నిద్ర వస్తున్నట్టుంది. కొంచెం టీ తీసుకొండి" అని ఫ్లాస్కులోంచి కప్పు లోకి పోసి అందించేను.
" మీతో పాటు కేంటీన్ తెచ్చేసినట్టున్నారే?" అంది.
"అవునండి మీ లాంటి వారు తగుల్తారని " అన్నాను.
నవ్వింది. ఆ నవ్వులో కోటి పులకరింతలు. ఆ అమ్మాయి నిద్రపోకుండా ఉంటే కాలక్షేపం బాగానే అవును కానీ నిద్ర ఆపుకొనే స్థితిలో లేదు.
" మీరు ఏమనుకోకపోతే విజయవాడ స్టేషను వస్తే కాస్త చెప్తారా ? అంది.
" అలాగే నండి మీరు నిద్రపొండి .మీ సామాన్లు కూడా చూస్తుంటాను" అన్నాను. ఆ అమ్మాయి సేవే బాగ్యమన్నట్లు. ఆ అమ్మాయి నిద్రపోయింది. నాకూ నిద్ర వస్తుంది కాని ఎలా? వాళ్ల సామాన్లు చూస్తానని మాట ఇచ్చేను. పైగా స్టేషన్ వస్తే చెప్తానన్నాను.
మధ్యలో బామ్మగారొకసారి లేచి " అబ్బాయి సుందరం! సామాన్లు కాస్త చూస్తుండు నాయనా " అని ఓ ఆర్డరు పారేసి మళ్ళీ నిద్ర లోకి జారుకొంది. అలాగే ఓపిగ్గా విజయవాడ స్టేషను వచ్చే వరకూ నిద్ర పోలేదు. విజయవాడ రాగానే " భారతి గారూ, భారతి గారూ" అంటూ లేపేను. ఆ పిలుపుకి బామ్మగారు కూడా కంగారుగా లేచి కూచొని " విజయవాడ వచ్చేసిందా బాబూ! అని అడిగింది. "వచ్చేసిందండి " అన్నాను.
" మేము దిగుతాము. మా సామాన్లు కొంచెం అందించేయ్ బాబూ ! నీకు చాలా శ్రమ యిచ్చేం " అన్నారు. ఆ మాట ఆ అమ్మాయి అంటుందేమో నని చూస్తున్నాను.
నేనాశించిన దానికి భిన్నంగా " మీ ఎడ్రసు ఇస్తారా" అంది.
కలగానికనలేదు కదా అని గిల్లి చూసుకొని వెంటనే డైరీ లోని కాగితం చించి దానిమీద వ్రాసి ఇచ్చేను.
" మరి మీ ఎడ్రస్ ? " అన్నాను.
" నేను మీకు ఉత్తరం వ్రాసినప్పుడు తెలుస్తుంది" అంది.
ఇక నా ఆనందానికీ అవధుల్లేవు. సంతోషానికి సరిహద్దులు లేవు. అక్కడే దిగిపోదామనుకున్నాను. కాని హైదరాబాద్ లో ఆ మర్నాడు డ్యూటీకి హాజరు అవ్వాలని గుర్తొచ్చి ఆగిపోయేను. ఆ తర్వాత అసలు నిద్రపట్టలేదు హైదరాబాద్ చేరే వరకూ. .........x......................x....................x.....................
ఆఫీసుకు వచ్చేను. ఓ నాలుగు రోజులు సెలవులో వెళ్లి వచ్చే సరికి వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది. రెండ్రోజుల వరకూ ఏమీ ఆలోచించడానికి తీరుబడి లేకపోయింది. మూడో రోజున నాకో ఉత్తరం వచ్చింది. యధాలాపంగా కవరు చింపకుండా ఎక్కడి నుండి చెప్మా అని చూసేను. ఫ్రం ఎడ్రస్ లేదు. పోస్టల్ స్టాంప్ క్లియర్ గా లేదు. దస్తూరీ చూస్తే తెలిసిన దస్తూరిలా కనబడలేదు. ఎవరీ కలం స్నేహితులు అనుకొంటూ కవరు చింపేను.
" సుందరం గారికి... కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. నేనెవరా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. వారం రోజుల క్రితం విశాఖపట్నం స్టేషన్ లో ఓ ప్రయాణికురాలిగా ట్రెయిన్ దగ్గర పరిచయమైన బామ్మగారి మనుమరాలు భారతిని. నిజం చెప్పాలంటే మీరూహించిన ఒక సంగతి మాత్రం అబద్దం. ఆ బామ్మగారెవరో నాకు తెలియదు. నేనావిడ మనవరాల్ని కాదు. స్టేషన్ లో తారసిల్లేరు ఆవిడ. ట్రెయిను కదిలే టైము అయిపోవడంతో సామాన్లు తేవడానికి పోర్టర్ ను పిలుచుకోలేక తోడు ఎవరూ లేక " నువ్వెంతవరకు అమ్మాయీ? " అని అడిగేరు నన్ను.
" విజయవాడ అండీ " అన్నాను.
"అయితే ట్రెయిను వెళ్ళిపోతుంది. ఈ సామాన్లు కాస్త సాయం పడుదూ తల్లీ నీకు పుణ్యం ఉంటుంది. నేనూ విజయవాడే వెళ్తున్నాను. నాకూ సాయంగా ఉంటావు" అన్నారు.
సరే ముసలావిడ కదా పాపం అనుకొని ఆ సూట్ కేసు, బేగూ నేను మోసుకొంటూ వచ్చేను. అవి నావనుకొని వాటిని మీరందుకొని మేము ట్రెయిన్ ఎక్కడంలో సహాయం చేసేరు. ట్రెయిను లో మంచినీళ్ళు తెచ్చిపెట్టడం,టిఫిన్ ఇవ్వడం, పళ్ళు కొనిపెట్టడం ,టీ ఇవ్వడం ఇత్యాది పనులన్నీ చేసేరు. ఇవన్నీ చూస్తే ప్రతి బామ్మగారూ ఓ అమ్మాయిని వెంటేసుకొని ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బందీ, ఏ కష్టమూ లేకుండా సుఖంగా ప్రయాణం చేయవచ్చుననిపిస్తుంది. మా సామాన్లు చూస్తూ మీరు నిద్రకూడా పోలేదు. మీరు మాకు (అదే నాకు) చేసిన సహాయాలన్నీ ఏ ఉద్దేశం తో చేసినా నేను మాత్రం మిమ్మల్ని ఒంటరిగా ప్రయాణం చేసే ఓ అమ్మాయికి తోడుగా నిలిచిన ఓ మంచి అన్నయ్యగా ఊహించుకొన్నాను. అందుకే మీ ఎడ్రసు అడిగేను. ఇలా తలంచినందుకు మీరు మరోలా భావించరని ఆశిస్తున్నాను. అందుకే నేను పంపుతున్న ఈ రాఖీని రేపు రాఖీ పండుగ రోజున ధరిస్తారని ముచ్చట పడుతూ స్వయంగా నేను మీకు రాఖీ కట్టే అవకాశం లేక పోస్ట్ లో పంపిస్తున్నాను. నేను మిమ్మల్ని ఏ రకంగానైనా నిరాశపరిస్తే క్షంతవ్యురాల్ని. నేను వ్రాసినది మీ మనసును నొప్పిస్తే క్షమించమని కోరుతున్నాను. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఈ దిగువ ఇచ్చిన ఎడ్రసుకు వచ్చి చూడగలరు. ఇట్లు బామ్మగారికి ఏమీ కాని భారతి ఎడ్రసు : భారతి సత్యసాయీ అనాధాశ్రమం ఏలూరు రోడ్,విజయవాడ. '
చేతి లోని కవరు జారిపోయింది. అందులోంచి రాఖీ జారి టేబిల్ మీద పడింది. రాఖీని చూడగానే నా మనసు గతం లోకి జారుకుంది. ఆవేళ సరిగ్గా అయిదేళ్ల క్రితం రాఖీ పండగ రోజు నా చెల్లెలు నాకు రాఖీ కడుతూ' అన్నయ్యా ఈ సంవత్సరమైనా నాకు వదినని తీసుకొస్తానని మాటయ్యి " అంది. అదే రోజు రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు రాఖీ కట్టేవాళ్ళు దొరకలేదు. ఈ రాఖీని చూడగానే నా చెల్లెలు గుర్తుకొచ్చింది. ఆ దుఃఖాన్ని మరచిపోవాలంటే విజయవాడ వెంటనే వెళ్ళి భారతిని తీసుకొచ్చి నా చెల్లెలు లేని లోటు భర్తీ చేసుకొంటాను. ఈ రాఖీ పండగ రోజు నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది అని. ఆలోచించడమేమిటి నా మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి కాజొచ్చింది.
.............x.............x.............x..................
( ఈ నా కథ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో తే.11.01.1990 దీని ప్రసారితమైంది. అమెరికా అంతర్జాల పత్రిక "వాస్తవం" లో తే.27.09.2016 దీని, "నెలవంక నెమలీక" సాహిత్య మాసపత్రిక జాలై 2018 సంచికలోనూ ప్రచురితమైంది. )
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
ఏది ధర్మం పరుగు తెచ్చిన ప్రమాదం ఎవరికెవరు ఏమవుతారో హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్ గురు దక్షిణ నేనూ మనిషినే అత్తారింట్లో దారేదీ ( హాస్య కథ ) యద్భావం తద్భవతి
రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం
Comentários