top of page

పెదవి దాటని రహస్యం


'Pedavi Datani Rahasyam' written by Padmavathi Thalloju

రచన : పద్మావతి తల్లోజు

అప్పుడే సిటీ బస్సు దిగిన ఆదిత్య వడివడిగా తన గమ్యం వైపు అడుగులు వేశాడు. అది ఒక అనాధ శరణాలయం. లోపలికి అడుగు పెట్టగానే ఓ మూడేళ్ల బాబు "నాన్నా!"అంటూ అతని కాళ్ళని చుట్టేశాడు. బాబును ఎత్తుకొని ముఖమంతా ముద్దులతో నింపేసాడు ఆదిత్య. "ఇదేంటి!? కన్న కొడుకుని అనాధలా పెంచుతున్నాడు?"విచిత్రంగా చూస్తూ అంది కొత్తగా వచ్చిన ఆయా, పాత ఆయాతో.

"మూడేళ్ల కిందట ఈ పిల్లాడు ఒక కుప్ప తొట్టిలో ఈయనకు దొరికాడట. తీసుకొచ్చి ఇక్కడ చేర్చాడు. ఆ ప్రేమతో కావచ్చు లేదా తనకింకా పిల్లలు కాకపోవడం వల్ల కావచ్చు ప్రతి ఆదివారం వచ్చి ఇలా.., వాడితో కాసేపు గడిపి వెళతాడు. ట్రస్ట్ పర్మిషన్ తీసుకుని వాడితో 'నాన్నా ..' అని పిలిపించుకుంటాడు. ఆయనిచ్చే విరాళం కోసం ట్రస్ట్ అన్నిటికీ ఒప్పేసుకుంది." చెప్పింది పాత ఆయా.

"పిల్లలు లేరంటున్నావ్.. మరి తానే పిల్లాడిని తీసుకెళ్లి పెంచుకోవచ్చుగా!" అంది కొత్త ఆయా కాస్త నిష్టూరంగా. లీలగా వాళ్ళ మాటలు విన్న ఆదిత్య మాత్రం ఆలోచనలో పడ్డాడు. అప్పటికే తన మనసులో జరుగుతున్న సంఘర్షణకు తుది రూపం ఇవ్వాలని భావించాడు.ఇంకా ఆలస్యం చేస్తే ఇలాంటి దెప్పి పొడుపు మాటలు ఇంకా ఎన్నో, ఎందరితోనో వినాల్సి వస్తుందని భయపడ్డాడు. ఆ పిల్లాణ్ణి దత్తత తీసుకోవాలని తలచాడు. అందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి, బాబుని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో తన భార్యకి, బంధువులకీ ఏం సమాధానం చెప్పాలని విషయం కూడా తాను ఆలోచించలేదు. పెళ్లయి మూడేళ్లు కూడా కాలేదు, అప్పుడే పిల్లలెందుకని తనకి సర్దిచెప్పే ఆదిత్య, అకస్మాత్తుగా ఓ పిల్లాడిని దత్తతకు తేవడం కాసింత విస్మయానికి గురిచేసింది ఆదిత్య భార్య నీరజని.

"నా స్నేహితుడొకడికి పిల్లలు లేకపోతే ఒక పాపను దత్తత చేసుకున్నాడు. వెంటనే వారికో బాబు పుట్టాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. వాడు చెప్పిన ఆలోచనే ఇది నీరజ! వీడి పేరు పవన్" అంటూ బాబుని పరిచయం చేసి ఏదో తప్పు చేసిన వాడిలా తలదించుకుని లోపలి కెళ్ళిపోయాడు ఆదిత్య.

* * * * *

అనతి కాలంలోనే వాడితో "అమ్మా!" అని పిలిపించుకుని... నీరజ, తన ప్రేమతో క్రమంగా ఆదిత్యను కూడా మరిపించింది. ఆదిత్య మాటల్ని నిజం చేస్తూ పవన్ వచ్చిన వేళావిశేషం.., నీరజ నెల తప్పింది!. ఆదిత్య ఆనందానికి అంతులేకుండా పోయింది. సంతోషంతో అత్తమామలకి తానే ఆ విషయం ఫోన్ చేసి చెప్పాడు. నీరజని చూడడానికి వాళ్లు వెంటనే బయలుదేరి వచ్చారు మంచంపై పడుకొని ఉన్న కూతుర్ని, పక్కనే నిలబడి సేవలు చేస్తున్న అల్లున్ని చూసి ఆశ్చర్యపోయారు వాళ్లు. అతిథి మర్యాదలయ్యాక మామగారిని, పవన్ ని తీసుకొని పక్కనే ఉన్న పార్కు కు వెళ్లాడు ఆదిత్య. కూతురు పక్కనే కూర్చుని నీరజ తల్లి భాగ్య "ఫోన్లో చెబితే ఏమో అనుకున్నా కానీ, పవన్ రాకతో అల్లుడిలో చాలా మార్పు వచ్చింది. కన్న కొడుకులా వాడిని, కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటుంటే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా"అంది.

"కన్న కొడుకులా ఏంటమ్మా? కన్నకొడుకే..!" అన్న నీరజ మాటలకు ఉలిక్కిపడింది భాగ్య. "అంటే... అంటే.., తల్లితోపాటు ఆ పిల్లాడు చనిపోలేదా?"అడిగింది అయోమయంగా. ఒక్కసారిగా గతం ఆమె కళ్ళముందు గిర్రున కదలాడింది.

* * * * *

ఆదిత్య చిన్నతనంలో అతని తండ్రి పేకాటకు మరిగి ఆస్తి తగలడమే గాక, అందిన చోటల్లా అప్పులు చేసి గుండెపోటుతో చనిపోయాడు. ఊరి వాళ్లకు భయపడి ఆదిత్య తల్లి ఆదిత్యను, వాడి చెల్లిని తీసుకొని రాత్రికి రాత్రే ఊరు నుండి పారిపోయి పట్నం చేరుకుంది. పొట్ట గడవడానికి వారు ముగ్గురు చేయని పని అంటూ లేదు. ఒకవైపు పనిచేస్తూనే చదువుకున్న ఆదిత్య తన సంపాదనలో కొంత కూడబెట్టి, పదేళ్లలో తన ఊరివాళ్ల అప్పులన్నీ తీర్చి, తండ్రి కున్న చెడ్డపేరు తుడిచేసాడు. పట్నంలో ఒక షాపులో పనిచేసే సమయంలోనే వెనక ముందు ఎవరూలేని రమణి అనే అమ్మాయి ఆదిత్యకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, వారిద్దరిని ఒకటి చేసింది. తన ప్రేమ చెల్లి పెళ్లికి అడ్డు కాకూడదని గుళ్లో రమణినీ పెళ్లాడి రహస్యంగా కాపురం పెట్టాడు ఆదిత్య. నెల తప్పిన రమణిని తన ఇంటికి తీసుకెళ్లాలని ఉన్నా, చెల్లి పెళ్లి కాళ్లకు బంధనంగా మారింది. ఇంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. కాన్పు కష్టమై రమణి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ విషయాలన్నీ తెలిసిన ఆదిత్య తల్లి దిగులుతో మంచం పట్టడంతో గత్యంతరం లేని పరిస్థితిలో నీరజని పెళ్లి చేసుకుని, ఆ కట్నం డబ్బులతో తన చెల్లి పెళ్లి చేశాడు ఆదిత్య. వరసకి మరదలయ్యే నీరజ ఆదిత్య మీదే ప్రాణాలు పెట్టుకోవడం వల్ల, నీరజ తల్లిదండ్రులకి ఆదిత్య గతం తెలిసినప్పటికీ పెళ్లి చేయక తప్పలేదు. కాకపోతే పురిట్లోనే పిల్లాడు కూడా చనిపోయాడని ఆదిత్య చెబితే నమ్మేసారు.

* * * * *

"పిల్లాడిని తన నుండి ఎక్కడ దూరం చేస్తామనుకున్నాడేమో, తల్లితో పాటే పోయాడని మనకు అబద్ధం చెప్పాడు. మంచం పట్టిన తన తల్లి బ్రతికున్నా, తన మనసులో బాధను చెప్పుకునే వాడేమో పాపం!"అంది భాగ్య గత జ్ఞాపకాల నుండి బయటికి వస్తూ, ఒకింత జాలిగా. అంతలోనే తేరుకొని "అవునూ... పవన్ ను ఇన్ని రోజులు ఎక్కడ దాచాడు?"అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కూతుర్ని.

"బాబును ఒక అనాధ శరణాలయంలో చేర్పించి మూడేళ్ల నుండి బావే వాడి బాగోగులు చూసుకుంటున్నాడమ్మ! దాంట్లో పని చేసే ఆయా నాకు పరిచయస్తురాలు కావటంవల్ల ఈ విషయాలు నాకు ముందే తెలిసాయి. అడిగితే బావ నొచ్చుకుంటాడు అని... ఏమి తెలియనట్లే తన ముందు నటిస్తున్నాను. ఆ ఆయా సహాయంతోనే, తన మాటలతో బావకు పవన్ ను ఇంటికి తెచ్చే ఆలోచన వచ్చేలా చేయగలిగాను. బావను ఇంతగా ఇష్టపడే నాకు బావ రక్తం పంచుకు పుట్టిన పవన్ పైన అయిష్టత ఎందుకు ఉంటుంది చెప్పు!. ఇంకా చెప్పాలంటే వాడి రాకతోనే మా మధ్య దూరం కూడా తగ్గింది" అంది తృప్తిగా నీరజ. చిన్నతప్పును కూడా భూతద్దంలోంచి చూస్తూ కాపురాలు చెడగొట్టుకుంటున్న ఈ రోజుల్లో, భర్త సుఖం కోసం అన్ని విధాల సర్దుకు పోతున్న కూతుర్ని అపురూపంగా చూస్తూ ఉండిపోయింది భాగ్య.

"కానీ అమ్మా! బావ ఎంత సంతోషంగా ఉన్నా, తన కళ్ళలో ఏదో తప్పు చేశానన్న భావన తొంగి చూస్తుంది. అదే నాకు బాధగా ఉంది. పవన్ తన కొడుకన్న సంగతి నాకు తెలుసునని చెప్పి, దానివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదని నచ్చజెప్పి...." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న కూతుర్ని వారించింది భాగ్య.

"ఆ పొరపాటు మాత్రం చెయ్యకు నీరజ! నువ్వు చెప్పిన మరుక్షణం తాత్కాలికంగా తన గుండె బాధ తగ్గొచ్చు. కానీ, రేపు నీకు పిల్లలు పుట్టాక పరిస్థితులు మారిపోతాయి. పవన్ని నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆదిత్య నిన్ను క్షమించడు. కావాలనే చేసావంటాడు. ఆ రహస్యం నీ వద్ద ఉన్నంత వరకే అతను నీ మాట వినేదన్నది గుర్తుంచుకో! నీ దగ్గర ఆ నిజం దాచి నిన్ను మోసం చేస్తున్నాననే అపరాధ భావంతో తాను నీకు దగ్గరవుతున్నాడు. ఎవరికీ, ఏ హాని కలగనంత వరకు రహస్యాన్ని.. రహస్యంగా ఉంచడంలో తప్పులేదు. ఆ తండ్రి కొడుకుల పైన చెప్పలేనంత ప్రేమ ఉంది నీకు. వాళ్ళ బాగు కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావ్. ఇద్దరు పిల్లల ఆలనా పాలనలో పడి క్రమంగా ఆదిత్య ఇదంతా మర్చిపోతాడు. నువ్వు కూడా ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే మీ భవిష్యత్తుకు మంచిది" అంది సూటిగా భాగ్య. తల్లి మాటలకు మబ్బులు వీడిన ఆకాశంలా నీరజ మనసు తేలికయింది.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.

42 views0 comments

コメント


bottom of page