top of page

పీచు మిఠాయి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Pichu Mitayi' New Telugu Story Written By Venku Sanathani


రచన: వెంకు సనాతని

పీచు మిఠాయి బండి గంట శబ్దం చెవిన పడగానే ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా ఇళ్ళకు పరుగులు తీశారు. "అమ్మా.. త్వరగా డబ్బులు ఇవ్వమ్మా.. సుబ్బయ్య తాత పీచు మిఠాయి బండి వచ్చేస్తుంది." ఇంటి వెనుక అంట్లు కడుగుతున్న అమ్మ సుశీలను అడిగింది అమ్ములు.

*****

సాయంత్రం ఐదింటికి టంఛనుగా గంట మోగించుకుంటూ పీచు మిఠాయి బండితో ఊరి మధ్యలో ఉన్న చెట్టు వద్దకు వచ్చేస్తాడు సుబ్బయ్య తాత. పెద్దలు పనులు, పిల్లలు బడులు ముగించుకుని ఆ చెట్టు చుట్టూ చేరి అష్టాచెమ్మాలు, అచ్చంగిల్లాలు, పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసే సమయం అది. సుబ్బయ్య తాత తెచ్చే పీచు మిఠాయి అంటే అందరికీ ప్రీతే.


బండి చుట్టూ మూగి పోటీపడి మరీ గంటను మోగించటమంటే పిల్లలకు భలే సరదా. అలా మోగించటం ద్వారా తన వ్యాపారానికి మరికొంత గిరాకీ పెరుగుతుందని తాతకి తెలుసు. అయినా విసురుకునే మనస్తత్వం కాదు సుబ్బయ్య తాతది.

*****

పీచు మిఠాయి తినాలన్న ఆశతో అప్పటికే నాలుగు సార్లు ఇంటి ముందు వెనకలకు పరుగులు దీసింది అమ్ములు. ఇంటి వెనుక పని చేసుకుంటున్న అమ్మను డబ్బులు అడగటం, ఇంటి ముందు కొద్ది దూరంలో ఉన్న సుబ్బయ్య తాత పీచు మిఠాయి బండిని చూడటం, ఆ కొద్దిసేపు ఇదే పనైంది అమ్ములుకి.


పీచు మిఠాయి ఐదు రూపాయలు. ఈ క్షణం ఇంట్లో ఐదు పైసలు కూడా లేదని, ఆ మాట చెప్పి అమ్ములు చిట్టి మనసును గాయ పరచలేక "నాన్న కూలి డబ్బులు తెస్తాడు. రాగానే ఇస్తాను" అని అంటుంది సుశీల.


పక్కూరి పనికి వెళ్ళిన నాన్న వచ్చే సరికి పొద్దుగుముకుతుందని, అప్పటికి పీచు మిఠాయి బండి వెళ్ళిపోతుందని మూడవ తరగతి చదివే అమ్ములుకు తెలుసు. వారం రోజులుగా సుస్తీ చేసి నిన్ననే కోలుకుని ఈ రోజే తండ్రి పనికి వెళ్ళాడని కూడా తెలుసు. ఆశతో అడుగుతుందే కానీ అమ్మ, అయ్యను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు తన చిట్టి మనసుకి. ఆశను లోపలికి దిగమింగి, నిర్మాల్యమైన చిరునవ్వుతో బయటికి వచ్చి అరుగు మీద కూర్చుని, అలానే పీచు మిఠాయి బండి వైపు చూస్తుంది అమ్ములు.


"చాలీ చాలని కూలీతో ఇల్లు గడవటమే కష్టంగా ఉంటుంది. పనులుంటే పన్నీరు, లేకపోతే పున్నీరు. ఒక్కో రోజు కన్నీరు కూడా నేనున్నానంటూ గుర్తు చేస్తుంది." కూతురు చిరు కోరికను కూడా తీర్చలేని పేదరికాన్ని తల్చుకుని తనలో తానే బాధ పడుతుంది సుశీల. అల్మరాలు, సరుగులు, డబ్బాలు ఇలా మొత్తం వెతుకుతుంది కాసులు ఏమైనా కనపడతాయేమోనని.


ఇల్లంతా పరికిస్తే ఎట్టకేలకు మూడు రూపాయలు కనపడ్డాయి. "ఏరోజు కారోజు తెచ్చి వండి వార్చుకునే పేదింట అంతకన్నా ఏం కనపడతాయి." అని అంటూ అవే తీసుకుని వెళ్ళి అరుగు మీద కూర్చున్న అమ్ములు చేతిలో పెడుతుంది సుశీల.


చేతిలో డబ్బులు చూడగానే అమ్ములు ముఖంలో ఎక్కడలేని సంతోషం. తల్లి వారిస్తున్నా వినిపించుకోకుండా అవి తీసుకుని సుబ్బయ్య తాత పీచు మిఠాయి బండి వద్దకు పరుగుదీస్తుంది అమ్ములు.


ఆ డబ్బులు సుబ్బయ్య తాత చేతిలో పెట్టి, "తాతా.. పీచు మిఠాయి ఇవ్వు" అంటూ నవ్వుతూ చేయి చాపుతుంది అమ్ములు.


అమ్ములు తన చేతిలో పెట్టిన డబ్బుల వైపు, అమ్ములు వైపు చూసి తానూ చిన్న నవ్వు నవ్వి పీచు మిఠాయి పొట్లం అమ్ములుకు ఇస్తాడు సుబ్బయ్య తాత. ఆ ఇద్దరి నవ్వుల్లో ఎలాంటి కల్మషం లేదు. ఇద్దరివీ బోసి నవ్వులే. ఇద్దరి మనసులు మల్లె పువ్వులే. సుబ్బయ్య తాతది వ్యాపారమే అయినా పిన్న పెద్ద, పేద ధనిక అరమరికలు లేని వ్యవహారం. చూసి చూడనట్టుగా పోయే తత్వం. తాత చిన్న నాటి నుండి సజావుగా చేస్తున్న వ్యాపారానికి ఇదీ ఓ కారణం.


అక్కడ పిల్లల చేతుల్లో నుండి నోట్లోకి జారుతున్న పీచు మిఠాయి ఇప్పుడు తన దగ్గర కూడా. అమ్మలు ఆనందానికి అవధుల్లేవు. ఆ ఆనందంతోనే ఇంటి వైపు పరుగు దీస్తుంది.


అమ్ములు చేతిలో పీచు మిఠాయి చూడగానే తల్లి సుశీల కూడా ఆనందిస్తుంది. మిఠాయి లాగానే సుబ్బయ్య తాత మనసు కూడా తియ్యన అని అనుకుంటూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.


మొక్క వయసులోనే పరిస్థితులను చక్కగా అర్థం చేసుకునే మంచి మనసున్న అమ్ములు, పీచు మిఠాయిని అమ్మ నోటికి అందిస్తుంది. అమ్ములును అక్కున చేర్చుకుంటుంది సుశీల. ఇంతలో తండ్రి రాఘవ రాకను గమనించిన అమ్ములు పరుగున తండ్రి చంకనెక్కి పీచు మిఠాయి నోటికి అందిస్తుంది. నుదుటి మీద అంతే తియ్యని ముద్దు పెడతాడు రాఘవ.

సమాప్తం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

పేరు : వెంకు సనాతని

అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత

ఊరు : బాపట్ల

జిల్లా : గుంటూరు

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్


43 views0 comments

Commentaires


bottom of page