పోరాడి చూడు
- Dr. C S G Krishnamacharyulu
- 32 minutes ago
- 4 min read

Poradi Chudu - Telugu Inspirational Story | Dr. C. S. G. Krishnamacharyulu
పోరాడి చూడు - తెలుగు ప్రేరణాత్మక కథ | Dr. C..S.G . కృష్ణమాచార్యులు
Published in manatelugukathalu.com on 29/04/2026
ఓటమి అనిపించిన క్షణమే…
మళ్లీ గెలిచే మార్గం మొదలవుతుంది.
“పోరాడి చూడు” ఒక స్త్రీ తన భయాన్ని బలంగా మార్చుకున్న కథ.
“అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం” అని వెంటబడే ఆరాధకులు…
అందమైన ప్రతిది ఆనందదాయకమే అంటూ కేవలం వనితల సొగసులు మాత్రమే వర్ణించే కవిగాయకులు…
నీ కోసమే నేనే జీవించునది అని మద్యం మత్తులో పాడే విరహ ప్రేమికులు…
అందమైన జీవితము అద్దాల సౌధము... ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును అని జాగ్రత్తలు చెప్పే అనుభవజ్ఞులు.
ఇలా ఎందరో భిన్న వ్యక్తులు, భిన్నభావాలు. అందమైన అన్విక తన పాతికేళ్ళ జీవితంలో వీరందరినీ చూసింది.
పెళ్ళికి ముందు పురుషుడి ప్రపంచం స్త్రీ చుట్టూ తిరుగుతుందని, ఆ తర్వాత స్త్రీ ప్రపంచం పురుషుడి చుట్టూ తిరుగుతుందని వాస్తవాన్ని గ్రహించింది. పురుషుల ప్రేమ మాయాజాలంలో చిక్కకూడదని గట్టిగా నిశ్చయించుకుంది. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుని వివాహం చేసుకుని హాయిగా జీవితం గడపాలని నిర్ణయించుకుంది.
ఆ ప్రకారమే చదువుకునే రోజుల్లో ఆకర్షణలకు దూరంగా ఉండి మంచి గ్రేడ్ సంపాదించింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఒక ప్రఖ్యాత ఐటీ కంపనీలో ఉద్యోగాన్ని సాధించింది.
ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం ఆమె జీవితం ఎంతో సరదాగా గడిచిపోయింది. కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, అనుభవజ్ఞులైన సీనియర్ల ప్రోత్సాహం, పనిలో సవాళ్లు... ఇవన్నీ ఆమె ఆనందానికి కారణమయ్యాయి. కానీ, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా!
@@@
రఘు రాకతో అంతా మారిపోయింది. కొత్తగా జాయిన్ అయిన రఘు మొదటి చూపులోనే అన్వికను మోహించాడు. ఆమె సాంప్రదాయ పద్ధతులను పాటించే యువతి అని అర్థం చేసుకున్న అతను గోముఖ వ్యాఘ్రంగా మారాడు. తన సంభాషణలలో నీతి, దైవ భక్తి, దానగుణం వంటి వాటిని ప్రస్తావిస్తూ బుద్ధిమంతునిలా ప్రవర్తించాడు. కేవలం పబ్బులకు, సినిమాలకే కాకుండా దేవాలయాలకు, అనాథాశ్రమాలకు కూడా తోడు వచ్చాడు. అతని ప్రేమ నటన అని తెలుసుకోలేని అన్విక ఒకరోజు ఇలా అనుకుంది.
"డేటింగ్‌లని, కమిట్‌మెంట్‌లని వెంటబడే యువకులకు భిన్నంగా రఘు సంసార పక్షంగా ఉన్నాడు. ఇలాంటి వాడిని పెళ్ళాడితే జీవితం నిశ్చింతగా సాగిపోతుంది.”
అన్విక చూపించే అభిమానాన్ని చూసి రఘు గెలుపుకు చేరువయ్యానని ఆనందించాడు. తెలివిగా ఆమెను పొందే పథకం అమలు చేశాడు. ఒకరోజు జ్వరంగా ఉందని సెలవు పెట్టాడు. సహజంగానే ఆందోళన వెలిబుచ్చిన అన్వికకు, “కొద్ది జ్వరమే, రెండు రోజుల్లో ఆఫీసుకు వస్తాను” అని ధైర్యం చెప్పాడు.
ఆ మరుసటి రోజు నుంచి ఏ రోజుకు రోజు అతని ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ, అతని రాక కోసం ఆమె ఎదురుచూసింది. కానీ అతడు రాలేదు. వారం రోజులు గడిచాక, "మొండి జ్వరం. తగ్గడం లేదు. బాగా నీరసంగా ఉంటోంది," అని మెసేజ్ పెట్టాడు.
అన్విక ఉండబట్టలేక అతని ఇంటికి వెళ్లింది. రఘు ఆమెను సంతోషంతో లోనికి ఆహ్వానించాడు. పెరిగిన గెడ్డంతో బలహీనంగా కనిపించిన రఘుని చూసి అన్విక బాధపడింది.
"నా దేవత రావడంతో నా జ్వరం మటుమాయమైంది" అని రఘు మంద్రస్వరంలో అంటూ ఆమె అరచేతులలో తన ముఖాన్ని దాచుకున్నాడు.
ఆ చర్యతో ఆమె హృదయంలో ప్రేమ వెల్లువై పొంగింది. ఆమె అతని పక్కన కూర్చుని, "తోడు లేకుండా ఒక్కడివే ఎందుకుంటున్నావు? నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయి. వస్తాను" అని ప్రేమతో భరోసా ఇచ్చింది.
"దిగులు పడకు. ఇంకో రెండు రోజుల తర్వాత నేను ఆఫీసుకు వస్తాను" అని కబుర్లు చెబుతూ అతను ఫ్రిజ్‌లో ఉన్న జ్యూస్‌ని ఒక గ్లాసులో పోసి ఆమెకు ఇచ్చాడు. జ్యూస్ తాగిన ఆమెను ఒక్కసారిగా మత్తు ఆవరించింది. ఆనాటి వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న అన్విక రఘు విషయంలో మోసపోయింది.
@@@
ఆ సంఘటన తర్వాత రఘు తాము కలిసి ఉన్న వీడియోను పంపిస్తూ బెదిరింపులకు దిగాడు.“ఎవరికైనా చెప్పావంటే ఈ వీడియోను అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి నీ పరువు తీస్తా” అని హెచ్చరించాడు. అక్కడితో ఆగలేదు. అసభ్యంగా మాట్లాడుతూ, తనకూ తన స్నేహితులకూ “ఆనందం పంచాలని” నీచమైన డిమాండ్లు చేస్తూ తరచూ ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించాడు.
మోసపోయానన్న బాధ, అవమానం, భయం... ఈ మూడూ కలిసి అన్వికను ఎంతగానో కుంగదీశాయి.
తప్పు తనదేనన్న భావనతో ఆమె ఆత్మనింద చేసుకుంది. మునుపటిలా నవ్వడం మానేసింది, మాట్లాడడం తగ్గించింది, ముడుచుకుపోయి మౌనంగా పనిలో నిమగ్నమైంది. ఆమెపై మౌనంగా మమకారం పెంచుకున్న రవితేజ ఆమెలో వచ్చిన మార్పును గమనించాడు. ఒకరోజు ఆఫీస్ ఫుడ్ కోర్టులో ఆమె ఒంటరిగా కూర్చొని అన్నం కెలుకుతుండటం చూసి అతను బాధపడ్డాడు. ఆమె దగ్గరకు వెళ్లి మృదువుగా అడిగాడు. “అన్వికా... ఏమైంది? ఈ మధ్య నవ్వడమే మానేశావు.నిన్నిలా చూస్తుంటే నిజంగా బాధగా ఉంది.”
"నా బాధ స్వయంకృతం. చెప్పేదీ కాదు, తీరేది కాదు" అంది అన్విక అతని వైపు కూడా చూడకుండా.
“అన్వికా! సదా నవ్వుతూ, సమర్థవంతంగా పనిచేసే నువ్వు ఏదో కారణంతో ఇలా నీరసంగా, నిర్లిప్తంగా కూర్చోవడం సరి కాదు. దెబ్బతిన్న పక్షి నేల రాలుతుంది. అదే సింహమైతే ఎగిరి మీద పడి తినేస్తుంది. నీ సమస్య ఏదైనా నీవు సింహంలా ప్రతిస్పందించాలి.”
“మాటలు చెప్పడం తేలికే. నేను కోల్పోయింది నాపై నాకున్న నమ్మకాన్ని. ఎంతో దృఢమైన వ్యక్తిత్వం నాదని భ్రమించాను. ఓడిపోయాను.”
“కాలమహిమ వల్ల ఎంతటి వారైనా ఓటమి చవి చూడాల్సిందే. కానీ ఓటమి శాశ్వతం కాదు. ఓడిన చోటే గెలిచే మార్గం వెతకాలి. ఫీనిక్స్ పక్షిలా నిన్ను నువ్వు పునరుజ్జీవింపచేసుకో! గొంగళి పురుగు దశ దాటితేనే సీతాకోకచిలుక.”
అన్విక ముఖంలోకి వెలుగు వచ్చింది. రఘు చేసిన మోసం గురించి చెప్పింది.
రవితేజ ఆమె భుజం తట్టి, “ఇలా మోసపోయిన వ్యక్తి ఏం చేయాలి? మొదట తప్పు తనది కాదని గ్రహించి భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలి. తప్పు చేసిన వాడి నేరం రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలు, ఆధారాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత నేరుగా సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వాడికి శిక్ష పడేదాకా పట్టుదలగా ఆ కేసును ముందుకు నడిపించాలి. కమాన్! పోరాడి చూడు!” అని ప్రోత్సహించాడు.
ఆ మాటలు అన్వికలో మరుగున పడిన ధైర్యాన్ని వెలికి తెచ్చాయి. ఆమె రఘు పంపిన మెసేజ్‌లు, కాల్ రికార్డులు, వీడియో బెదిరింపులన్నీ సేవ్ చేసింది. అతనితో సాధారణంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ మరోసారి బెదిరించేలా ప్రేరేపించింది.
“నిన్ను నేనెప్పుడైనా నాశనం చేయగలను. ఆ వీడియో నా దగ్గర ఉంది” అని అన్న మాటలు రికార్డు చేసింది. అదే అతని చివరి తప్పు.
అన్విక నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది.
తన దగ్గర ఉన్న ప్రతి ఆధారాన్ని వారి ముందుంచింది. ఈసారి ఆమె కళ్లలో భయం లేదు. నేరస్థుడిని శిక్షించాలనే దృఢనిశ్చయం మాత్రమే ఉంది.
పోలీసులు ట్రాప్ వేసి రఘుని పట్టుకున్నారు. స్టేషన్‌లో రఘును ఆ స్థితిలో చూసిన క్షణం...
అన్విక హృదయంలో ఎన్నాళ్లుగానో పేరుకుపోయిన వేదన కరిగిపోయి దాని స్థానంలో ఆత్మవిశ్వాసం నెలకొంది.
రఘు ఆమె ముందుకు వచ్చి చేతులు జోడించి వేడుకున్నాడు.
“అన్వికా... ప్లీజ్... కేసు వెనక్కి తీసుకో…”
ఈసారి భయంతో వణికింది ఆమె కాదు. అతడే. అన్విక అతని కళ్లలోకి నేరుగా చూసి చెప్పింది.
“నన్ను భయపెట్టి నువ్వు గెలుస్తాననుకున్నావు. కానీ ఆ భయాన్నే నేను నా బలంగా మార్చుకున్నాను.”
ఆ రోజు అన్వికకు ఒక నిజం అర్థమైంది. స్త్రీని ఓడించేది భయం కాదు, భయానికి లొంగిపోయే ఆమె బలహీనతే. ఒక్కసారి ఎదురుతిరిగితే ఆమెను ఓడించగల శక్తి ఎవరికీ లేదు.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
