top of page

ప్రేమ సాగరం

Writer's picture: Thalloju PadmavathiThalloju Padmavathi

'Prema Sagaram' written by Padmavathi Thalloju

రచన : పద్మావతి తల్లోజు

గేటు ముందు యాక్టివా ఆగిన శబ్దం. నా చెవులకు అది సుపరిచితం. అవును! ఆ వచ్చింది నా మేనకోడలు శ్రీనిధి. తాను వచ్చిన సంగతే నాకు తెలియనట్టుగా, వంట పనిలో నిమగ్నమైనట్టుగా, నటిస్తున్నాను తనను ఆటపట్టించడానికి. కానీ, రాగానే ‘అత్తయ్యా..’ అంటూ పిలిచే తన తియ్యని పిలుపు కోసం నా చెవులు, మెత్తగా చుట్టేసే తన చేతుల కోసం నా భుజాలు తపన పడసాగాయి. ఉహు.. అలికిడే లేదు. తల తిప్పి చూశా! ఎప్పుడు వచ్చిందో కానీ, శ్రీనిధి డైనింగ్ టేబుల్ దగ్గర దిగులుగా కూర్చుని కనిపించింది. ఒక్క క్షణం గుండె తరుక్కుపోయింది.

పేరుకు అది నా మేనకోడలే అయినా నా కూతురు లాంటిది. హైదరాబాదులో ఇంజనీరింగ్ సీటు వదులుకొని, మాతోపాటు శంషాబాద్ లో ఉంటూ ఇంజనీరింగ్ పూర్తి చేయడమే కాదు, క్యాంపస్ సెలక్షన్స్ లో మంచి జాబ్ సంపాదించుకుంది.

"అత్తా! జాబ్ హైటెక్ సిటీ లోనే కదా, శంషాబాద్ నుండి 40 మినిట్స్ జర్నీ. నేను ఇక్కడే ఉంటా.. ఒప్పుకో అత్తా!" అంటూ మారాం చేసింది. కానీ నేను ససేమిరా అన్నాను. దానికీ ఓ కారణం ఉంది.

తాను తన ఇంట్లో ఉండలేకపోవడానికి కారణం మా వదిన. తనలో అడ్జస్ట్ మెంట్ పాలు కాస్త తక్కువ. ప్రతి చిన్న విషయానికి మా అన్నయ్యతో వాదిస్తూ ఉంటుంది. తన చుట్టూ వాతావరణం సరదాగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకునే శ్రీనిధి తల్లిదండ్రుల మధ్య ఇమడలేక ఎక్కువ శాతం నా దగ్గరే పెరిగింది. కానీ, ఆడపిల్లలకు సమస్యల నుండి పారి పోకుండా వాటిని సాధించే ధైర్యం నేర్పితే, రేపు అత్తవారింట్లో కూడా చక్కగా అడ్జస్ట్ అవుతారనేది నా వాదన. నా నమ్మకం వమ్ముకాలేదు. శ్రీనిధి వల్ల అన్న వదినల మధ్య వాదనలు తగ్గాయి. తనకోసం వదిన కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. శ్రీనిధి గత్యంతరం లేక నాకు దూరంగా ఉన్నా, ఏ క్షణాన నేను గుర్తొచ్చినా, అది అర్థరాత్రి అయినా నా దగ్గరకి పరిగెత్తుకు వస్తుంది.

తన దగ్గరికి వెళ్లి తల పైన చేయి వేసి నిమురుతూ "ఏమైంది రా? ట్రాఫిక్ లో ఎవరితోనైనా గొడవ పడ్డావా?" అనునయంగా అడిగాను.

నా నడుమును తన చేతులతో చుట్టేసి, తలను నా కడుపుకు ఆనించి మెల్లగా నోరు విప్పింది. "లేదత్తా! డాడీ తోనే గొడవ"

"మళ్లీ పెళ్లి గురించేనా? ఎంత చెప్పినా వినరు కదా అన్నయ్య! సరే, నేను మాట్లాడతాను గానీ, ఫ్రెషప్ అవు. భోంచేస్తూ మాట్లాడుకుందాం" అన్నాను భరోసాగా.

"డాడీ కూడా నీలా ఇంత కూల్ గా ఆలోచిస్తే ఎంత బాగుండేది అత్తయ్య! జాబ్ వచ్చి మూడేళ్ళేగా అయ్యింది. అప్పుడే ముసలిదాన్ని అయిపోయినట్టు ఒకటే గొడవ" అంది విసుగ్గా.

నేను మెల్లగా నచ్చజెప్పే ధోరణిలో "వాళ్ళ మాటల్లో కూడా నిజం లేకపోలేదు నిధి! 60 ఏళ్లు దాటితే భరోసా లేని బతుకులు మనవి. నీవు 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకొని, 40 ఏళ్లు దాటాక పిల్లల్ని కంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? నన్ను చూడు! ఇరవై ఏళ్ల కిందట నా పెళ్లప్పుడు నా వయసు ఇరవై ఒకటి. లేట్ మ్యారేజ్ అంటూ చాలామంది నా వెనకే చెవులు కొరుక్కున్నారు.." ఇంకా నా మాటలు పూర్తికానేలేదు, నా వాక్ప్రవాహానికి అడ్డుతగులుతూ

"నువ్వు కాస్త ముందుగా పెళ్లి చేసుకొని, నీ పెద్ద కొడుకుని ముందుగా కని ఉంటే నేను మీ ఇంటి కోడలిని అయ్యేదాన్ని కదత్తా! వాడు నాకన్నా ఐదేళ్లు చిన్నవాడై బతికిపోయాడు వెధవ!" అంది అక్కసుగా.

అంత సీరియస్ టాపిక్ కాస్త శ్రీనిధి సిల్లీగా మార్చే సరికి నాకు నవ్వాగలేదు. ఫక్కున నవ్వేశాను.

"ఇప్పుడు మాత్రం ఏం కొంప మునిగింది? పెళ్లి కానిచ్చేద్దాం. ఇప్పటి ట్రెండ్ అదే కదా!" అని నవ్వుతూ అంటున్నారు అప్పుడే బెడ్ రూమ్ లో నుంచి బయటికి వస్తూ మా వారు.

"సరిపోయింది. ఈ కోడలికి ఆ మామ జతయితే ఇక పట్టపగ్గాలుంటాయా?" అంటూ ముగ్గురికి అన్నం వడ్డించే పనిలో పడ్డాను నేను.

కాస్త వాతావరణం తేలిక పడ్డది కాబట్టి ఇక సంభాషణ పొడిగించాను నేను.

"ఇంతకీ అన్నయ్య ఏమంటున్నాడు నిధి?" అని అడిగాను.

"సాగర్, రేవంత్.. ఇద్దరిలో ఎవరో ఒకరిని వీలైనంత తొందరగా సెలెక్ట్ చేసుకోమంటున్నారు" అంది దిగులుగా.

రేవంత్ శ్రీనిధి వాళ్ళ బాస్. దూరపు చుట్టం కూడా. సాగర్ స్వయానా మా వారి అన్న కొడుకు. రేవంత్ గురించి నాకు అంతగా తెలియదు కానీ, సాగర్ మాత్రం నా కళ్ళ ముందు పెరిగిన కుర్రాడే! చాలా బుద్ధిమంతుడు. ఈ కాలం పిల్లల్లో కనిపించని ఓర్పు, మంచితనం వాడిలో చూశాను నేను. ఇదే విషయం నేను శ్రీనిధికి చెప్పి తనను కన్విన్స్ చేయవచ్చు. కానీ, పెళ్లి అనేది రెండు మనసులకు సంబంధించిన విషయం. ఎవరికి వారే స్వయంగా తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి. ఆ విధానంలో మన అనుభవం వారికి సరైన మార్గనిర్దేశం చేయగలిగితే చాలు.

సాగర్ తల్లి ఒక డయాలసిస్ పేషంట్. వారంలో మూడుసార్లు డయాలసిస్ తప్పనిసరి. హాస్పిటల్లో తల్లిని వదిలేసి, తండ్రిని తోడుగా కూర్చోబెట్టి, చెల్లిని కాలేజీలో దింపేసి ఆఫీస్ కి వెళ్తాడు సాగర్. ఆదివారం పూట అయితే తల్లితో పాటు హాస్పిటల్ లోనే ఉంటాడు. వీకెండ్ పార్టీలు, పబ్బులు లాంటి అనవసరపు మలినాలు అంటని ఆణిముత్యం వాడు.

"డాడి సంగతి వదిలేయ్. నీ మనసులో ఎవరున్నారో అది చెప్పు" నా గొంతులో కొద్దిపాటి ఆతృత.

"నా ఫ్రెండ్స్ అయితే రేవంత్ బెటర్ చాయిస్ అంటున్నారు అత్తయ్య! మంచి సాలరీ, ఆల్రెడీ వెల్ సెటిల్డ్, ఒక్కడే కొడుకు, ఏ బాధ్యతలు లేవు. ఒకే ఆఫీసు కాబట్టి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అంటున్నారు" అంది.

ఇప్పటి పిల్లల ఆలోచన విధానం ఒకింత ఆశ్చర్యానికి లోను చేసింది నన్ను. పెళ్లి చేసుకున్నాక భర్తకు ఆసరాగా మారి, అతని బాధ్యతలు పంచుకోవాలనే స్థాయి నుండి, ఏ బాధ్యతలు లేనివాడిని పెళ్లి చేసుకుంటే తమ జీవితం బాగుంటుందనే స్థాయికి ఎదిగారు వీళ్ళు. ఈ పరిణామం కూడా ఒకందుకు మంచిదే! కానీ, ఒకింత ప్రమాదకరం కూడా! అన్నిసార్లు వ్యాపార ధోరణిలో ఆలోచించలేం. సాప్ట్ వేర్ పడిపోయిన సందర్భంలో, ఉద్యోగాలు పోయిన భర్తలకు డివోర్స్ ఇచ్చిన భార్యలను చూశాను. అంత కాలం కలిసి జీవించిన ఆ బంధానికి ఏమైనా విలువుందా? ఆర్నెల్లు కలిసి ఉంటే వారు వీరవుతారనే నానుడి కల్లే కదా!

"మీ జీవితాన్ని డిసైడ్ చేయాల్సింది మీ అమ్మో, నాన్నో, ఫ్రెండ్సో కాదు. నువ్వెందుకు ఈ యాంగిల్ లో ఆలోచించడంలేదు శ్రీనిధి! రేవంత్ నీ బాస్ కాబట్టి ఇంటా బయటా తన డామినేషన్ నువ్వు భరించాల్సి రావచ్చు. పోనీ ఉద్యోగం వదులుకున్నా, నీ మనసులో ఏ మూలో ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ మొదలు కావచ్చు. బాధ్యతలు లేవు అనుకుంటున్నావు కానీ, ఒక్క కొడుకు కావడమే పెద్ద బాధ్యత. పని పంచుకోవటానికి నీ వాళ్ళంటూ ఎవరూ ఉండరు. (ఇక కన్విన్సు చేయక తప్పేటట్టు లేదనిపించి) ఒకసారి సాగర్ గురించి కూడా ఆలోచించు. తన ఉద్యోగం చిన్నదైనా, మనసు పెద్దది. నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. అన్నట్టు సాగర్ ని చేసుకుంటే నువ్వు కోరుకున్నట్టు మా ఇంటి కోడలివే అవుతావు. ఈ ఆఫర్ ఎలా ఉంది?"అన్నాను చిలిపిగా కన్ను గీటుతూ.

"మీరు చెప్పినవన్నీ నిజమే అత్తయ్య! కానీ సాగర్ మనసులో ఏముందో నాకు ఇంత వరకూ అంతుపట్టడం లేదు. అసలు నా పైన తనకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? ఎంత అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అవతల వారి మనసులో మనకూ కాస్త స్థానం ఉంటే సంతోషమే కదా!" అంది కన్విన్స్ డ్ గా శ్రీనిధి.

"సరే! సాగర్ నీ ముందు ఎప్పుడు ఓపెన్ కాలేదు అంటున్నావు కదా! మరి రేవంత్ తన మనసులో మాట ఎలా బయట పెట్టాడు?"అని అడిగా.

"రేవంత్ తన పర్సనల్ మొబైల్ కి వాల్ పేపర్ గా నా ఫోటో పెట్టుకున్నాడు అత్తయ్య! నా ఫ్రెండ్ ద్వారా విషయం తెలిసి బాస్ అని కూడా చూడకుండా, చెడామడా తిట్టేసాను. అప్పుడే తను నాకు ప్రపోజ్ చేశాడు. తను ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు కానీ, నా మీద తనకున్న ఫీలింగ్స్ ఎలాగో అలా బయట పెట్టాడు కదా!" అంది సూటిగా.

"ఆ రేవంత్ నీలో ధైర్యాన్ని చూశాడో లేక ఉద్యోగంలో ఓర్పు చూశాడో నాకు తెలియదు గానీ, సాగర్ మాత్రం నీలో ఒక దేవతను చూశాడు. నీ ఫోటో వాల్ పేపర్ గా చేసి రేవంత్ ప్రసాదంలా అందరి చూపులకు పంచితే, సాగర్ మాత్రం నీ ఫోటోని తన పర్సులో, అదీ తన కులదైవం చాటుగా దాచి గంటలో పదిసార్లు కళ్లకు అద్దుకుంటున్నాడు." అంటూ సాగర్ పర్సు నా బీరువాలో నుండి తీసుకొచ్చి శ్రీనిధి కందించాను.

యాంత్రికంగా పర్స్ అందుకున్న శ్రీనిధి అందులోకి చూసి స్థాణువైపోయింది. సాగర్ పర్సులో వెంకటేశ్వర స్వామి ఫోటో, దాని వెనక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో శ్రీనిధిది.

నిస్తేజంగా నా వైపు చూస్తున్న శ్రీనిధి చూపులను అనుమానపు చూపులుగా భావించి "మొన్న పండగకి ఊళ్లో కలుసుకున్నప్పుడు, అదేపనిగా పర్సులోకి చూడడం చూసి అనుమానంతో సాగర్ పర్స్ కాజేశాను" అంటూ వివరణ ఇవ్వబోయాను. కానీ నా మాట లేవీ తనకు వినిపించడం లేదు.

"ఎవరు ఎవరినైనా ఇంతగా ప్రేమించడం ఎప్పుడైనా, ఎక్కడైనా చూసావా అత్తయ్య!" అని గద్గద స్వరంతో అడిగింది శ్రీనిధి.

నేను మా వారు ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం అర్థం కాక. "అత్తయ్యా! నేను మీ ఇంటి కోడలినే అవుతున్నానని డాడీతో చెప్పండి." అంటూ సిగ్గుపడుతూ పర్స్ నా చేతిలో పెట్టి అక్కడినుండి తుర్రుమంది.

నోరెళ్ళబెట్టి నా వైపే చూస్తున్న మా వారితో "మీకేమైంది? "అని అడిగా.

"అది కాదే! ఆ పర్స్ నిన్న నేను కూడా చూశాను. అప్పుడు అందులో శ్రీనిధి ఫోటో లేదు. మరి ఇప్పుడెలా వచ్చింది?" ని ఆత్రుతగా అడిగారు.

"నేనే పెట్టాను"అన్నా.

మావారికి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయింది.

. "ఇదేం ట్విస్టే బాబు! ఇలా తయారయ్యావ్వేంటి. పిల్లలు సరదాగా అబద్ధమాడితేనే కోప్పడతావు. అవ్వ! ఇంత పెద్ద అబద్దమా?" అంటూ నా మీద అరవడం మొదలు పెట్టారు.

"అబ్బా! ఊరికే కంగారు పడకండి. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఆడింది ఒక అబద్ధమే గా! సాగర్ కు శ్రీనిధి అంటే ప్రాణం. కానీ, వాడికున్న మొహమాటం వాడినా మాట బయట పెట్ట నివ్వదు. అటు చూస్తే రేవంత్! ఓవర్ ఫాస్ట్.. ఎన్ని ఎత్తులన్నా వేసి దాన్ని గద్దలా తన్నుకుపోతాడు. అందుకే ఈ స్టెప్ తీసుకున్నా. మన శ్రీనిధి అందరిలాంటి అమ్మాయి కాదండి. ప్రేమలేని చోట తాను బతకలేదు. రేవంత్ మనకు కొత్త. తనతో జీవితానికి శ్రీనిధికి మనం ఎలాంటి భరోసా ఇవ్వలేం. కానీ తల్లిని, చెల్లిని ప్రాణంగా చూసుకునే సాగర్ తో తన జీవితం సాఫీగా సాగుతుందని చెప్పగలం. తన భావాలను బయట పెట్టకున్నా, ఎదుటి వారి భావాలకు విలువనిచ్చే నైజం సాగర్ ది. అందుకే వారిద్దరిని కలపాలనుకున్నా. అందులోనూ.. ఈ ఫోటో ఒక్కటే అబద్ధం. సాగర్ ప్రేమ అక్షరాల నిజం" న్నాను.

"రేపు పెళ్లయ్యాక పర్సులో ఫోటో పెట్టింది తాను కాదని సాగర్, శ్రీనిధికి చెప్పేస్తే.. అప్పుడెలా?" కొత్త డౌటు లేవనెత్తారు మావారు.

"కేవలం పర్సులో ఫోటో చూసి పడిపోయే వీక్ మైండ్ కాదులేండి తనది. సాగర్ పైన ఎంత ఇష్టం లేకపోతే మాత్రం ఇంతగా ఆలోచిస్తుంది చెప్పండి! రేవంత్ ప్రపోజ్ చేసినప్పుడు కాస్త టైం కావాలంటూ తనను ఎందుకు పక్కన పెడుతుంది? శ్రీనిధికి గొడవలు లేని ప్రశాంతమైన జీవితం మాత్రమే కావాలి. సరదాలు కాదు. సాగర్ ఎప్పటినుండో తన మనసులో ఉన్నాడు. తన నిర్ణయం ఎందుకు సరైందో, తన మనసుకి నచ్చ జెప్పుకోవడానికి తనకో కారణం కావాలి. ఆ కారణాన్ని మాత్రమే నేను క్రియేట్ చేశాను. అందుకే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంది. ఏ పని చేసినా ఆచితూచి చేయడం మా రక్తంలోనే ఉంది. ఎవరనుకున్నారు మరి. తాను మా అన్న కూతురు!" అంటూ గర్వంగా కళ్ళెగరేసాను.

నా హావభావాలు చూస్తూ ఫక్కున నవ్వేసారు మా వారు. ఆయనతో శృతి కలిపాను నేను.

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :


నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.




89 views0 comments

コメント


bottom of page